అమ్మవారికి దండంబెట్టు... అయ్యగారికి దండంబెట్టు

  • 841 Views
  • 18Likes
  • Like
  • Article Share

    స్రవంతి

తెలతెల్లవారి వెలుగులో మూపురాన్ని ఊపుతూ గజ్జెలను అదిలిస్తూ కళా విన్యాసాలను చూపుతూ ఇట్టే ఆకర్షించే గంగిరెద్దులాట లేకుండా పెద్ద పండగ జరగదు. ఇదొక కళారూపం. వివిధ ప్రాంతాలు సంచరిస్తూ పొట్ట పోసుకునే గంగిరెద్దుల మేళంవారు పూర్వం చక్కగా జీవించేవారు. వీరి కళా ప్రదర్శనకి ఆదరణ ఉండేది. రాజులూ.. జమీందార్లు.. అంతో ఇంతో కలిగినోళ్లు మన్ననతో చూసేవారు. ఆ కళా వైభవం ఎలాంటిదీ! నేడు ఆ కళాకారుల జీవన పరిస్థితులెలాంటివో తడిమే ప్రయత్నమిది. 
ధనుర్మాసం
మొదలవగానే పల్లెల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంది. వరి కోతలూ.. పంట నూర్పిళ్లు.. ధాన్యాన్ని గాదులకెక్కిస్తుండటం ఇలా ఆ నెల మొత్తం పల్లెవాసులకి క్షణం తీరికుండదు. చేతికొచ్చిన కష్టంతో ఆనందంగా జరుపుకునే తెలుగువారి పెద్దపండగ సంక్రాంతి. ఏడాది కాలంలో ఎప్పుడూ కనిపించని హరిదాసులూ.. గాయక భిక్షువులు ఈ పండగ రోజుల్లోనే దర్శనమిస్తారు. బుడబుక్కలవాళ్లూ.. పగటివేషగాళ్లూ.. గంగిరెద్దులవాళ్లు ఇంకా ఎందరెందరో జానపద కళాకారులు ఈ పర్వదినాల్లోనే సందడి చేస్తారు. ముంగిట ముగ్గుల కాంతులతో, గుమ్మడిపూల అందాలతో.. ఇంట సిరి సంపదలతో సకల జనావళికీ ఈ పండగ నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది.
      ‘‘డూ డూ డూ బసవన్న.. రా రా బసవన్నా..’’ అనగానే ఎద్దులు పరుగున వస్తాయి. ‘‘అమ్మవారికి దండంబెట్టూ.. అయ్యగారికి దండంబెట్టు’’ అనగానే ముందటి కాలెత్తి సలాం చేస్తాయి. అంతేకాదు.. అయ్యగారికి శుభం కలుగుతుందా! తలపెట్టబోయే కార్యం సఫలమవుతుందా! అనగానే తలాడిస్తూ విధేయత చూపడం గంగిరెద్దు అందించే శుభ సూచకం. అదే ఆత్మీయ దీవెనగా గ్రామీణులు భావిస్తారు. బసవన్న అంటే సాక్షాత్తు నందీశ్వరుడే అనీ.. అలాంటి గంగిరెద్దు నడయాడిన చోట దేవతలు కొలువుంటారు, శుభాలు నెలకొంటాయనే విశ్వాసం పట్నవాసుల్లోనూ ఉంది.
ఆకట్టుకునే అలంకరణ
మామూలు ఎద్దులను గంగిరెద్దులుగా మలచడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కళాకారులు. వయసులో ఉన్న కోడె గిత్తలని తీసుకు వచ్చి, ముకుతాడు పొడిచి, మచ్చిక చేసుకుంటారు. శిక్షణతో వాటికి నృత్య విన్యాసాలు నేర్పుతారు. డోలూ సన్నాయీ లాంటి వాద్యాల లయకి అనుగుణంగా అడుగులు కదిపేలా, ముందటి కాలెత్తి సలాం చేసేలా చూడటం.. మాటలకు అనుగుణంగా తల ఊపడం ఇలా కొన్ని నెలలపాటూ శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఎద్దులను ఆటకి తీసుకువస్తారు.
      గంగిరెద్దుల అలంకరణ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. అందుబాటులో ఉన్నవాటితోనే అందంగా తీర్చిదిద్దుతారు. భిక్షగా వచ్చిన బట్టల్లో మేలైనవాటిని బొంతలుగా కుట్టి వాటికి అద్దాలు పొదుగుతారు. వీలైతే చెమ్కీదండలూ జతచేసి మూపురం నుంచి తోక వరకూ సరిపోయేంతగా కప్పుతారు. కొమ్ములకు ఇత్తడి పొన్నులను తొడుగుతారు. నొసట రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడతారు. తగరపు పూలతో ఉన్న తోలుపటాకాను పొట్టచుట్టూ చుడతారు. కాళ్లకి గజ్జెలు.. మెడలో గంటలూ కట్టి నందికేశ్వరుడి స్వరూపంగా బసవన్నని అలంకరిస్తారు. గడ్డి మేసే జీవులైనప్పటికీ వాటిని బుద్ధిగల జీవులుగా సాకుతారీ కళాకారులు. మనిషికీ పశువుకీ అభేదం చూపిస్తారు. మానవ సహజమైన పేర్లతో పిలుస్తారు తప్ప అదిలించడం, కించపరచడం చేయరు. కొందరేమో బసవన్న అనో, నందికేశుడనో పిలుచు కుంటారు. మరికొందరు రామలక్ష్మణులనీ అంటారు. ఇంకొందరు రాముడూ సీతగా ఎద్దులకు కల్యాణం జరిపే సందర్భాలూ ఉంటాయి. గంగిరెద్దు చనిపోయినప్పుడు మనిషికి చేసినట్టే అంత్యక్రియలు చేస్తారు. దినవారాలూ నిర్వహిస్తారు.
వురుకుతూ రారన్నా..
పూర్వం ఊరి మధ్యలోనో.. నాలుగు రోడ్ల కూడళ్లలోనో పెద్దల అనుమతితో ఈ కళాకారులు ప్రదర్శన ఏర్పాటు చేసుకునేవారు. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి వాళ్లిచ్చింది తీసుకునేవారు. గృహపతులను పొగడటం.. వారి విజయాలను కీర్తించడం కూడా వారి ప్రదర్శనలో ఓ భాగం.
డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా
వురుకుతూ రారన్నా రారన్నా బసవన్నా
అమ్మవారికి దండంబెట్టు 
అయ్యగారికి దండం బెట్టు
మునసబుగారికి దండం బెట్టూ
కరణంగారికి దండం బెట్టూ 
రారా బసవన్నా... రారా బసవన్నా

      అంటూ పాడుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ధాన్యమూ, బట్టలూ, డబ్బులూ సంపాదించుకుంటారు. ఎద్దులకు మేత కూడా అడిగి తెచ్చుకుంటారు. అలా ఆ జీవాల ద్వారా తమ జీవికను నిలబెట్టుకుంటూ, వాటిని సాకుతూ సంచార జీవులుగా మనుగడ సాగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దులకు అలంకరించే మువ్వల పట్టీలు, గంటల పట్టీలను విక్రయించి రైతులనుంచి డబ్బుకు మారుగా ధాన్యాన్ని తెచ్చుకుంటారు.
తరతరాల వారసత్వం
గ్రామీణ జీవితంతో ముడిపడిన ఈ గంగిరెద్దుల కళారూపం ఏనాటిదో తేల్చిచెప్పడం కష్టం. ‘‘గంగిరెద్దులవాడు కావరమణచి/ ముకుతాడు పొడిచి పోటెద్దు లట్లు’’ అని పల్నాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ప్రస్తావించడాన్ని బట్టి ప్రాచీన కాలం నుంచే ఈ కళ ఉందని తెలుస్తుంది. ఆటతోనే కాదు పాటతోనూ ఈ కళాకా రులు వినోదాన్ని పంచుతారు. సన్యాసమ్మ, రాములోరు, గంగరాజు, ఈశ్వరమ్మ, వీరగున్నమ్మ పాటల్లాంటివి పాడతారు. ఈ కళాకారులు ఎక్కడున్నా తెలుగుదనాన్ని, ప్రాంతీయ సంస్కృతిని కాపాడుకోవడంలో శ్రద్ధ తీసుకుంటారు. అడవి బాపిరాజు గంగిరెద్దును ఉద్దేశించి ‘వైతాళికులు’లో రాసిన ఈ గేయం వారి జీవన దృశ్యాన్ని కళ్లకు కడుతుంది.. ప్రభువుగారికి దణ్ణం పెట్టూ!/ పాదం వంచి భక్తినిపెట్టూ!/ పట్టు శాలువలు కప్పెదరంటా/ కాసులు మువ్వలు కప్పెదరంటా/ డూ డూ డూ డు యెంకన్న
      కోతులను ఆడించడం, పాములతోనే జీవనం నెరపడం మాదిరిగా ఈ గంగిరెద్దులను ఆడిస్తూ పొట్ట పోషించుకోవడాన్ని జీవహింసగా ఎంచుతారు కొందరు! కానీ, ఈ గంగిరెద్దు లాట లోకోత్తర విషయాన్ని తెలియ జేస్తుంది. ఈ విశిష్ట కళారూపం వెనుక గొప్ప జీవన రహస్యం ఉంది. సకల జీవులూ ఆ పశుపతి నీడలోనే విశ్రమి స్తున్నాయి. మనిషైనా పశువైనా పిడికెడు మెతుకుల కోసం వేషధారులుగా బతుకీ డ్చటం ఈ లోకంలో అనివార్యం అనుకున్న నాడు జీవుల పట్ల కారుణ్యభావం అనుభ వంలోకి వస్తుంది. జీవిక కోసం మనిషి పడే అవస్థ ఎంతో మూగజీవులూ అంతగా అపసోపాలు పడతాయని పల్లా దుర్గయ్య ‘గంగిరెదు’్ద కావ్యం ద్వారా చూపించారు.
గంతలను విప్పి దాని శృంగములమీద
చేతులిడి కాళ్లుమీదికి చేసి నిలిచె
వాని మోయుచు గొమ్ముల బసవడురికె
పదుగురదిచూడి మెచ్చి చప్పట్లు సర్ర గాను
పిదప గంగెడ్లవాడు డోలదిమిగొట్టి
వెల్లకిల పండుకొని నంత వెనుకవారు
వాని తొడపై ముంగాళ్ల వక్షమందు
నుంచి బసవన్న ఊపిరిలుగ్గబట్టె 

      ఎద్దులతో సహవాసం సేద్యమప్పుడు ఒకలా ఉంటుంది. అదే ఎద్దును మచ్చికతో దారికి తెచ్చుకుంటే వాటి ప్రవర్తన మరోలా ఉంటుంది. మామూలుగా అయితే ఎద్దు కాళ్లతో తొక్కినా, కొమ్ములతో కుమ్మినా ప్రాణాలు దక్కవు. ఓర్పు.. తపన ఉంటే గానీ గంగిరెద్దులతో సామీప్యం సాధ్యం కాదు. బరువైన శరీరాలను తేలిక పరచి నాట్య విన్యాసాలు ఈ గంగిరెద్దులకు అంతటి వ్యవహార జ్ఞానం ఎలా అలవడిందీ అంటే అది ‘ఎద్దుకెరక! మాకెరక!’ అని వినయంగా సమాధానమిస్తారు ఈ కళాకారులు. 
గతమెంతో ఘనమైనా..!
ఏటా సంక్రాంతికి గంగిరెద్దుల మేళం గడప గడపనా నాట్యమాడుతుంటే పండగ సందడి ఇనుమడిస్తుంది. ఆ పాటలూ.. డోలు సన్నాయి స్వరాలూ మంగళకరమై ఊరికి శోభనిస్తాయి. అందరి కోసం అందరు అనే భావన కనిపించే ఈ వేడుక ఎంత సంబరంగా ఉంటుందో ‘సూత్రధారులు’ చిత్రం కోసం సిరివెన్నెల రాసిన ఈ పాట బొమ్మకట్టిస్తుంది.
సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్న
చెన్నార చిందాడ కన్నారా కనులారా
సిరులిచ్చి దీవించే సిమ్మాదిరప్పన్న
చిరుగజ్జలల్లాడ చెవులార విన్నారా
ముంగిళ్ల బసవన్న మురిసీ ఆడే వేళ
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా..
కోదండ రావన్న.. గోవుల్ల గోపన్న
కోలాటమాడుతూ కొలువూ తీరాలా

      గంగిరెద్దులకు సంబంధించి తెలుగువారికి నమ్మకాలు ఎక్కువే. ప్రదర్శన సమయంలో గంగిరెద్దు కింద నుంచి దూరిన ఆడపిల్లలకి పెళ్లవుతుందని చెబుతారు. పెళ్లి సమయంలో వధూవరుల బాసికాలూ.. కర్పూర దండలను ఎద్దు మెడలో వేసే సంప్రదాయమూ ఉంది. దీనివల్ల వివాహ బంధం దృఢంగా ఉంటుందని విశ్వసిస్తారు. శుభకార్యాలప్పుడు గంగిరెద్దుల కళాకారుల దీవెనలు మంచి ఫలితాలిస్తాయన్నది మరో విశ్వాసం. 
      శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గంగిరెద్దులాట నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. దాని మీదే ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆద]రణలేక, ఇతర వృత్తులను ఆశ్రయించలేక భవిష్యత్తు మీద దిగులు చెందుతున్నాయి. చదువుకోవడానికి అవకాశం లభించని సంచార జీవితంతో ప్రభుత్వ పథకాలకీ, ఉద్యోగాలకి దూరమవుతున్నాయి. ‘‘గంగిరెద్దులాట అనేది వృత్తి కాదు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు పునాది. ఈ కళ బతకాలంటే ప్రస్తుతమున్న కళాకారులకి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించాలి. స్థిర నివాసాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. కళ గొప్పదనాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి’’ అంటారు తెలంగాణ రాష్ట్ర గంగిరెద్దుల సంఘం వ్యవస్థాపకులు జె.వెంకన్న. సమాజం తమను అంటరానివారుగా, భిక్షగాళ్లుగా చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తంజేస్తారు. ‘గంగిరెద్దుల వారు’ అనే మాటను తిట్టుపదంగా వాడుతున్నారని, దాన్ని మానుకోవాలని చెబుతారు. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ‘జిజ్ఞాస’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండకు చెందిన పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ‘అపురూప జానపద కళారూపం- గంగిరెద్దులాట’ పేరిట పరిశోధన చేసి ఈ కళాకారుల జీవితాల్లోని చీకటివెలుగులను ఇటీవల వెలుగులోకి తెచ్చారు. ‘గంగి’ అంటే పూజనీయమైందని అర్థం. వేమన చెప్పిన ‘గంగిగోవు’తో ‘గంగిరెద్దు (గంగెద్దు)’ కూడా తెలుగువారికి పవిత్రమైనదే. మంచి జరగాలని ఈ మూగజీవులకు మొక్కుకుంటూ.. వాటినే నమ్ముకున్న వారి బాగోగులను పట్టించుకోకపోవడం జాతికి శ్రేయస్కరం కాదు. తమ ఆటపాటలతో సంక్రాంతి శోభను ఇనుమడింపజేసే ఈ కళాకారుల జీవితాల్లోనూ పండగ వెలుగులు పరచుకోవాలి. అందుకు రెండు రాష్ట్రాల పాలకులూ చొరవ తీసుకోవాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం