సింగినాదం...అష్ట కష్టాలు

  • 1276 Views
  • 0Likes
  • Like
  • Article Share

కృష్ణార్పణం
కృష్ణుడికి అర్పించేది అనే మౌలిక అర్థం ఉన్న ఈ పదం కాస్తా అర్థవిపరిణామం చెంది పోగొట్టుకోవడం, కోల్పోవడం అనే అర్థాల్లో భాషలో భాగమైంది. దాసరులు తరచుగా వాడే ఈ మాట ఇప్పుడు నిందార్థంగా జనవ్యవహారంలో స్థిరపడింది. కావాల్సిన దాన్ని పోగొట్టుకున్నప్పుడు ‘సర్వం కృష్ణార్పణం’ అంటారు. ‘నిలువు దోపిడీ’ కూడా ఇలాంటిదే.


ఎగతాళి
‘వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు’ అనే మాట తరచూ వినేదే. గేలి, పరిహాసం అని నిఘంటువులు అర్థం చెబుతున్నప్పటికీ ‘ఎగతాళి’ అన్నది ఒక దేశీ రచనా ప్రబోధం. ఏకతాళ నుంచి పుట్టిందే ఎగతాళి అని పండితుల అభిప్రాయం. శాతవాహన కాలంనాటి బృహద్దేశి, సోమేశ్వర కవి రసోల్లాసం, చాళుక్య జగదేక మల్లుని సంగీత చూడామణి, జాయప సేనాని నృత్తరత్నావళి ఈ ఎగతాళి గురించి ప్రస్తావించాయి. ‘తాళాఖ్య తాళేనా గేయస్వా దేక తాళికా’ అని సంగీత చూడామణిలో ఓ ప్రయోగం. ఇదో సంగీత ప్రధానమైన పదమని, యక్షగానాల్లో కూడా ఇలాంటి ఏకతాళ రచనలు అనేకం ఉన్నాయని వేటూరి ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడ్డారు. ‘వాడు చిందులు తొక్కుతున్నాడు’ అన్న మాటలోని ‘చిందు’ కూడా ఓ జానపద కళ. ‘‘నడకతో చిందు పాడంగ నుబ్బి కోణంగియాటల గునిసెడివారు..’’ అని పాల్కురికి సోమన చిందు పాటలను పేర్కొన్నాడు.


సింగినాదం జీలకర్ర 
విశేషం ఏమీ లేదు అనే భావాన్ని తెలిపేటప్పుడు ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు. అప్పట్లో బిడారు వర్తకులు.. ముఖ్యంగా జీలకర్ర లాంటి సుగంధద్రవ్యాలను అమ్మేవారు ఊళ్ల సమీపంలోకి గుడారాలను దింపి, తమ రాకను సింగినాదంతో సూచించేవారు. ఇది ‘శృంగనాదం’కు వికృతి. అంటే కొమ్ముధ్వని. ఈ కొమ్ముబూర ద్వారా విషయం తెలుసుకున్న ప్రజలు కూడళ్లలో కలుసుకుని వస్తువినిమయం చేసుకునేవారు. చరిత్ర గమనంలో ఈ బిడారు వర్తకం తగ్గుముఖం పట్టింది. సింగినాదం వాడుక నుంచి పోయింది. ఆ ద్రవ్యాలు కూడా కిరాణా దుకాణాల్లో దొరుకుతున్నాయి. అలా క్రమంగా ‘విశేషమైందేమీ లేదు.. చెప్పుకోదగినవేవీ లేవు..’ అనే భావార్థ ప్రకటనకు ఉపకరించే హాస్యస్ఫోరక జాతీయంగా ఈ ‘సింగినాదం జీలకర్ర’ వ్యవహారంలోకి వచ్చింది. 


అష్ట కష్టాలు 
లెక్కలేనన్ని కష్టాలు అనే అర్థంలో దీన్ని ఇప్పుడు వాడుతున్నారు. నిజానికైతే ‘దేశాంతర గమనం, భార్యావియోగం, ఆపత్కాల బంధుదర్శనం, ఉచ్ఛిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ఠ, దారిద్య్రం’ అనేవే అష్టకష్టాలు.  కాలక్రమంలో సంఖ్యాపరిమితి లేని కష్టాల గురించి చెప్పేటప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా ఈ పదాన్ని వాడటం రివాజైంది. ‘నేనీ పని పూర్తిచేయడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది’ అనేది ఓ ప్రయోగం. 


కదిలే మెట్లు
ఆంగ్ల పదాలకు సరిపోయే తెలుగు మాటలను కల్పించుకునే కృషిని తెలుగు వారు పక్కనబెట్టేశారు. పరభాషా పదాలను యథాతథంగా వాడటానికి అలవాటు పడిపోయారు. తెలుగు పద కల్పనకి ప్రయత్నించేవారిని వెక్కిరించే వారూ తయారయ్యారు. అయితే.. గతకాలపు రచయితలు తమ రచనల్లో ఆంగ్లపదాలను వాడటానికి ఇష్టపడేవారు కాదు. వాటికి తగిన తెలుగు పదబంధాలను తయారుచేసేవారు. ఆరుద్ర తన ‘వ్యాసపీఠం’లో ‘ఎస్కులేటర్ల’ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ పదాన్ని వాడలేదు. దానికి మారుగా ‘కదిలే మెట్లు/ మర తివాసీ పట్టెడ మెట్లు/ కదిలే మెట్ల మర పట్టెడి తివాసీలు’ అనే మూడు మాటలను వాడారు. అలాగే, ‘బ్రోచర్‌’ని ‘మడతల కరపత్రం’ అన్నారు ఇదే వ్యాసాల్లో. వీటి సంగతి అలా ఉంచితే.. ఎస్కలేటర్‌ను మరమెట్లు అనవచ్చు చక్కగా. బ్రోచర్‌ను వివరణ పత్రంగా పిలుచుకోవచ్చు.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం