మతాబులు.. అవుట్లు!

  • 500 Views
  • 2Likes
  • Like
  • Article Share

మతాబులు.. అవుట్లు!
‘‘బిరుసులు, చివ్వలు, బెడగు చంద్రజ్యోతులను నభంబెల్ల వెలుంగజేయు’’ అంటూ కూచిమంచి తిమ్మకవి (పద్దెనిమిదో శతాబ్దం) తన ‘కవిజన మనోరంజనం’లో దీపావళి టపాసుల గురించి చెప్పాడు. ఇందులో ‘చంద్రజ్యోతి’ అంటే ‘మతాబా’. దీన్నే ‘మతాబు’ అనీ అంటారు. ‘మహతాబ్‌’ అనే పార్సీ పదం దీనికి మూలం. ఆ భాషలో ‘మహతాబ్‌’ అంటే నీలపు రంగు కాంతి (అంటే చంద్రకాంతి). ‘అఫ్‌తాబ్‌’ అంటే సూర్యుడు. మతాబులు మొదట్లో నీలపు రంగు వెలుగులను విరజిమ్మేవి. తర్వాత వెన్నెల వర్ణపు కాంతులను అద్దుకున్నాయి. అన్నట్టూ, ఈ మతాబుకు ఓ అచ్చతెలుగు పేరు ఉంది.. అదేంటో తెలుసా! ‘పగలువత్తి’.
దీపావళి రాత్రి ‘అవ్వాయి చువ్వాయిల’ హడావుడి అంతా ఇంతా ఉండదు కదా. ‘అవాయీ చువాయీ’ అనే రెండు పదాల కలయిక ఇది. తర్వాత ‘సువా జువ్వ’గా మారింది. ఆపై ‘తార’ను చేర్చుకుని ‘తారా జువ్వ’గా నిలిచిపోయింది. ఇక ‘సిసింద్రీ’.. ఇది హిందీ ‘చుచుందర్‌’ నుంచి పుట్టి ఉండొచ్చు. చుచుందర్‌ అంటే చుంచు. చంచు మూతిలా పొడవుగా కట్టే టపాసును ‘చుచుంద్రి’ అంటారు. ఇది తెలుగు వాడుకలో ‘సిసింద్రి’గా స్థిరపడిపోయింది. ‘లక్ష్మీఅవుట్ల’లోని ‘అవుటు’.. ‘హోవిట్జర్‌’ (పొట్టి ఫిరంగి) నుంచి వచ్చిందని బ్రౌన్‌ నిఘంటువు చెబుతోంది. ఈ పదం కాస్తా మన దగ్గరికి వచ్చేసరికి ‘ఓవిట్, ఔవిట్‌’ తర్వాత ‘అవుటు’గా మారిపోయింది. దీన్ని నిర్ధరిస్తూ ‘హోవిట్జర్‌’కు తెలుగుమాటగా ‘పొట్టి ఫిరంగి’తో పాటు ‘అవుటుగుండు’నూ సూచించింది శంకరనారాయణ నిఘంటువు. ఈ ‘అవుటుగుండు’ ఆకారంలో తయారయ్యే టపాసులు కాబట్టి అవి ‘అవుట్ల’య్యాయి. ఇదండీ! దీపావళి బాణసంచాకు నామకరణాలు జరిగిన తీరు!! 


నూటిడి
ఇడి అంటే పిండి. ‘ఇడియుట’కు కొట్టుట అనే అర్థముంది. ‘ఇడియప్పం, ఇడియాప్పం, ఇడ్డిలి’ లాంటి తమిళ పదాలకి కూడా మూలం ఈ ‘ఇడి’నే. కన్నడిగుల కుడుముల్లోనూ, కజ్జికాయల్లోనూ పెట్టే పూర్ణానికీ ఈ ఇడి వ్యవహారముంది. నువ్వుల ఇడి- నువ్వుటిడి- నూటిడి అంటే నువ్వుల పిండితో చేసిన పదార్థమన్న మాట. నువ్వులకు, ఇడికి మధ్యన టకారం చేరి నువ్వుటిడి అయ్యింది. శ్రీనాథుడు హరవిలాసంలో పెళ్లిళ్లలో వడ్డించే వంటకాలను ప్రస్తావిస్తూ.. ‘‘ఉండ్రాళ్లు నూటిడి పుండ్రేక్షులుం తేనె/ యనటిపండ్లుం బూరియలు ఘృతంబు’’ అని, ‘నూటిడి’ని భక్ష్యాలతో కలిపి చెప్పాడు. పదకవితా పితామహుడు అన్నమయ్య కూడా ‘‘నువ్వులు చిటిబెల్లాలు/ నువుటిడియును జన్ని మరుగులను/ ఎవ్వరు వేంకటపతి కెరిగించ నారగించి/ కివ్వ కివ్వ నవ్వ నాకించీజుండీ!’’ అని పాడుకున్నాడు. నువ్వులు, చిటిబెల్లాలు తర్వాత ‘నువ్వుటిడియు’ అని చెప్పడం వల్ల ఇది నువ్వులను దంచి బెల్లం, నెయ్యి కలిపి ‘చిమ్మిలి’లాగా చేసే భక్ష్యమేమో మరి! 


గుంట ఓనమాలు
మీరు చిన్నప్పుడు గుంట ఓనమాలు దిద్దుకున్నారా! అని అంటే ఎవరికీ అర్థం కాదు. ఓనమాలు విన్నాం కాని గుంట ఓనమాలేంటని ముఖం చిట్లిస్తారు. బెంచీల మీద కూర్చుని పలక మీదనో, నోటుబుక్కుల మీదనో రాసుకునే ఈ తరం పిల్లలకి దీని గురించి అసలు తెలియకపోవచ్చు. పూర్వం ఇప్పటిలాగా బడి అంటే భవనాలూ, నల్లబల్లలూ, అక్షరాలు దిద్దుకునేందుకు పలకలూ బలపాలూ ఉండేవి కావుగా! అందుకని ఇంత ఇసుక తెచ్చుకుని నేలమీద పోసుకుంటే పంతులు వచ్చి అక్షరాలు రాసిపోతే వాటిని దిద్దడమే పని. ఇప్పటి కాలానికి ఇది గమ్మత్తుగా అనిపిస్తుంది కదా. పిల్లలు తమముందు ఇసుక పరుచుకుంటారు! కాళ్ల దగ్గర కొంచెంగాను, పోను పోను వెడల్పుగాను ఇసక పరుస్తారన్న మాట. అక్షరాలు దిద్దుకోవడానికీ, లెక్కలు వేయడానికి వంగినప్పుడు అక్షరాలు చేయో, కాలో, కడుపో తగిలి తుడుచుకుని పోవచ్చు. కనుక కాళ్ల దగ్గర ఇసక వెడల్పుగా పరచరు. పోనుపోను చేయి అందే మేరకు వెడల్పుగా పరుస్తారు. అక్షరాలన్నీ దిద్దుకున్న తర్వాత అవన్నీ పంతులుగారికి రాసి చూపాలి. రాసేటప్పుడు వాటంతట అవే అయిదు బరులవుతాయి... ఇదిగో ఇలా...
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ - ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం ఆః
   క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ
      త థ ద ధ న ప ఫ బ భ మ
         య ర ల వ శ ష స హ
              ళ క్షా ఱై తి
ఇవే ఆ అయిదు బరులు.. అంటే వరుసలు. చేయి అందేమేర ఇసక వెడల్పుగా ఉంటుంది. కనుక అచ్చులన్నీ ఒక వరుసలో రాసుకోవచ్చు. రెండోవరుస కొంచెం చిన్నదవుతుంది. కాళ్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇసుక కొద్దిగా ఉంటుంది. నాలుగే నాలుగు రాస్తారు. అన్నట్టూ చివర్లోని ఆ ‘ఱైతి’ అంటే తెలుసా? ‘‘ఱ+ఇతి= ఱైతి’’.. అ మొదలు ఱ వరకూ వర్ణ సమామ్నాయం అని అర్థం. ఇప్పుడు దీన్నే సులభంగా వర్ణమాల అంటున్నారు.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం