ప్రకాశంలో సాహితీ సమీరం

  • 208 Views
  • 3Likes
  • Like
  • Article Share

    నెమ్మాని సీతారామమూర్తి

  • ఒంగోలు
  • 8008574071
నెమ్మాని సీతారామమూర్తి

ప్రకాశం జిల్లా రచయితల సంఘం (ప్రరసం) ఆధ్వర్యంలో ఒంగోలులో జరుగుతున్న మూడు రోజుల రాష్ట్ర స్థాయి మహాసభలు అక్షర హాలికులు, సాహితీ ప్రేమికులందరినీ ఒకచోటకి చేర్చాయి. జనవరి 17 నుంచి మొదలైన తొమ్మిదో రాష్ట్ర స్థాయి మహాసభలకు అంజయ్యరోడ్డులోని ఆంధ్రకేసరి విద్యాకేంద్రం వేదికయ్యింది. సాహిత్యంలో ఆయా అంశాలకు సంబంధించి వక్తలు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. సామాజిక సమస్యల మీద రచయితలు కలాలు ఝుళిపించాలని పిలుపునిచ్చారు. 
    ఈ సారి మహాసభల ప్రారంభంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. 1999 జనవరి నుంచి ప్రరసం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బి.హనుమారెడ్డి వయోభారం రీత్యా తాను ఇకనుంచి గౌరవాధ్యక్షునిగా కొనసాగుతానని చెప్పారు. ప్రస్తుత కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులను సభాముఖంగా అధ్యక్షుడిగా ప్రకటించారు. అనంతరం వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన సభాకార్యక్రమాలు కొనసాగాయి. పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎస్‌.వి.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వ్యాపారవేత్త సిద్దా వెంకటేశ్వరరావు తదితరులు ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రధానోపన్యాసం చేశారు. పెద్ద సంఖ్యలో కవులు, సాహితీ వేత్తలు ఈ సభలకు ప్రతినిధులుగా హాజరయ్యారు. 
అప్రమత్తంగా ఉండాలి
దశాబ్దాలుగా పాలకులు తెలుగు భాష గురించి సరిగా పట్టించుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా రచయితలు, సాహితీవేత్తలు మేలుకుని భాషాభివృద్ధికి నడుంబిగించాలని బి.హనుమారెడ్డి అన్నారు. గరికపాటి మాట్లాడుతూ... ప్రాచీన సాహిత్యంలో ఎన్నో విజ్ఞానదాయక విషయాలున్నాయని, అది మనలో సంస్కారం నింపుతుందని అన్నారు. మంత్రాంగం సరిగా లేపోతే యంత్రాంగం కుంటుపడుతుందని, సామాజిక అవకరాలన్నింటినీ సాహిత్యం వందల ఏళ్ల క్రితమే చర్చించిందని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వాలు కొత్త ఎత్తుగడలతో వస్తున్నాయని, రచయితలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలని ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అన్నారు. ప్రారంభ సభలో ఆయన కీలకోపన్యానం చేశారు. ప్రస్తుతం సమాజంలో సాహిత్యాధ్యయనం తగ్గిపోయిందని, సమస్యలపై స్పందించే లక్షణం సమాజంలో లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళలపై కూడా సాంస్కృతిక దాడి జరుగుతోందంటూ గతంలో వచ్చిన అభ్యుదయ, దిగంబర, దళిత, మైనార్టీ కవిత్వాలను స్ఫూర్తిగా తీసుకుని కవులు తమ కళాన్ని ఝళిపించాలని పిలుపునిచ్చారాయన. 
    మరో అతిథి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ హనుమారెడ్డి సారథ్యంలో ప్రరసం సాగించిన సాహితీ సేవను కొనియాడారు. 
ప్రరసం సభలు ఎప్పుడు జరిగినా వాటికి హాజరయ్యే ప్రతినిధులందరికీ భోజన ఆతిథ్యం ఇవ్వడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు బూచేపల్లి తెలిపారు. మార్కాపురం నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్‌ కందుల గౌతమ్‌రెడ్డి చక్కని తెలుగు పద్యాలు ఆలపించి అందరినీ అలరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రొద్దుటూరుకి చెందిన చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ కోడూరు ప్రభాకరరెడ్డిని ‘గీతపద్య విధాత బిరుదుతో’ సత్కరించడంతో పాటు సాహితీ పోషకులు ఉండాల రామిరెడ్డికి ఆత్మీయ సత్కారం చేశారు. 
అక్షర రక్షణ కవచం ఏర్పరచాలి
 రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కానీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం అన్నదాతలకు కడగండ్లే మిగులుతున్నాయి. రచయితలంతా హాలికులకు మద్దతుగా నిలిచి, వారి వ్యధల్ని అందరికీ తెలియజెప్పాలని అన్నారు వక్తలు. ప్రరసం 9వ రాష్ట్రస్థాయి మహాసభల్లో భాగంగా రెండోరోజు శనివారం పలు సదస్సులు నిర్వహించారు. ఉదయం సదస్సుకి అధ్యత వహించిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రసుత్తం రైతులు తీవ్రమైన రాజద్రోహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలుగులో రైతు కవిత్వం’ అనే అంశం మీద రాంకీ ఫౌండేషన్‌ ప్రతినిధి ఎం.వి.రామిరెడ్డి ప్రసంగిస్తూ అమరావతి రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టిన పాపం ఎవరిదని ప్రశ్నించారు. అమరావతిలో జరుగుతున్న విధ్వంసం గురించి రచయితలు బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలని సూచించారు. ‘‘1934లోనే ఆచార్య ఎన్‌.జి.రంగా రైతు భజనావళి పేరిట కవితా సంకలనం తెచ్చారు. కొండవీటి వెంకటకవి - కర్షక కావ్యం తెచ్చారు. మళ్లీ ఇప్పుడు అలాంటి కవిత్వం మరింతగా రావాలి. యువకవులు రైతుకు నలువైపులా అక్షర రక్షణ కవచం ఏర్పరచాలి’’ అన్నారు ఎం.వి.రామిరెడ్డి. ‘తెలుగు కథల్లో సాంఘిక జీవనం’ అంశం మీద ప్రముఖ కథా రచయిత విహారి మాట్లాడారు. సింగమేని నారాయణ ‘అడుసు’, అట్టాడ అప్పలనాయుడు ‘పనిముట్లు’ కథలు రైతుల జీవితాల్ని కళ్లకు కట్టినట్లు చూపించాయని అన్నారాయన. అతివృష్టి, అనావృష్టి, ధరల పతనం, అప్పులు రైతులని నిలువునా కుంగదీస్తున్నాయని చెప్పారు. విరసం నాయకులు వి.చెంచయ్య మాట్లాడుతూ చిన్నపిల్లల్లో తెలుగు భాష పట్ల ప్రేమని పెంచాలని పేర్కొన్నారు. గ్రామీణ తెలుగు భాషని అక్కున చేర్చుకున్ననాడు భాషకు ఎలాంటి ఢోకా ఉండదని విశ్లేషించారు చెంచయ్య. మధ్యాహ్నం జరిగిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌ విశిష్ట అతిథిగా మాట్లాడారు. ఆధునిక కవిత్వంలో చోటుచేసుకున్న పరిణామాలను వారిద్దరూ కూలంకషంగా వివరించారు. ‘పోతన కవిత్వంలోని స్త్రీ పాత్రలు’ మీద విశాఖపట్టణం ఏవీఎస్‌ కళాశాల అధ్యాపకులు అయ్యగారి సీతారత్నం విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. తిరుపతి ఎస్‌.వి.విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ ‘అభ్యుదయ కవిత్వం-అస్తిత్వం’ మీద మాట్లాడారు. మహాసభల్లో భాగంగా రెండోరోజు నళినీప్రియ కూచిపూడి నృత్యనికేతన్‌ బాలబాలికలు ప్రదర్శించిన ‘రుక్మిణీ కృష్ణ’ నృత్యరూపకం అలరించింది. నృత్యగురువు ఎస్‌.వి.శివకుమారి నృత్య దర్శకత్వంలో కృష్ణుడిగా ఎన్‌.లాస్య, రుక్మిణిగా కె.శ్రావ్య, రుక్మిగా ఎ.మణికంఠ, శిశుపాలుడిగా బి.సురేష్‌బాబు, జరాసంధుడిగా హర్షిత, అగ్నిద్యోతనుడుగా విఘ్నేశ్వర్, నారదుడిగా ప్రి.స్రవంతి, చిన్నికృష్ణులుగా వి.కేతన్‌శర్మ, పి.వి.యదువంశిక, తేజశ్రీరెడ్డి, గోపికలుగా శ్రీకృతి, గీతిక, ఉషస్విని, భావనలు చక్కగా రాణించారు. తెలుగు పద్యాలు, గేయాల ఆలపనలు వీనులవిందు చేశాయి. 
ఆదివారం సభల విశేషాలు 
ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సభకు అమ్మఒడి మాసపత్రిక సంపాదకుడు డాక్టర్‌ సామల రమేష్‌బాబు
అధ్యక్షత వహిస్తారు. బెంగళూరు సీపీ బ్రౌన్‌ సేవాసమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీరెడ్డి విశిష్ట అతిథి. ‘వర్ధమాన కవిత్వం మానవీయ సంబంధాలు‘ మీద ప్రముఖ కవి శిఖామణి, ‘వర్తమాన తెలుగు సాహిత్య విమర్శ’ మీద డాక్టర్‌ రాచపాళెం చంద్ర శేఖరరెడ్డి, ‘ఆధుని కవిత్వంలో స్త్రీ’ గురించి డాక్టర్‌ చిల్లర భవానీదేవి ప్రసంగిస్తారు. సాయంత్రం ముగింపు సభ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలూ ఏర్పాటు చేశారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం