పశుజన్మ దుర్లభం

  • 604 Views
  • 57Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. అన్ని ప్రాణుల్లోకి నరజన్మ పొందడం దుర్లభమట! ఎందుకయ్య నరజన్మ? పుడుతూనే ఏడవడం. మనిషి జన్మ మంచిదైతే కన్ను తెరవగానే కొంప మునిగినట్టు ఎందుకు ఏడుస్తాడు? నిజానికి పశుజన్మ దుర్లభమైంది. ‘పాపోహం... పాప కర్మణాం పాపాత్మా పాప సంభవా’ అని ఏనాడో చెప్పారు. మనిషి పుట్టుకతో పాపాత్ముడని ఎన్నో మతాలు నొక్కివక్కాణించాయి. అంతోటి దానికి పుట్టడమెందుకు? పాపాలను ప్రక్షాళనం చేసుకోవడానికి గుళ్లూ గోపురాలు ఇతర మతాల ప్రార్థనాలయాలను పనికట్టుకుని సందర్శించడం ఎందుకు? ఇది ఎంత హాస్యాస్పదం! సైన్సు మాత్రం ఏం చెప్పింది! నరజన్మకు మూలం వానరజన్మ అనేగా! పరమశివుడు సైతం పశుపతి అనే అనిపించుకుంటాడు.
      మనుషులు ఎంతో ఊడబొడిస్తేనే గానీ పుణ్యం రాదు. మోక్షం రాదు. మానవేతర జన్మలకు అంత ఆయాసపడక్కర్లేదు. ప్రయాసా అక్కర్లేదు. ‘ఏ వేదంబు బఠించె లూత, భుజంగం బేశాస్త్రముల్సూచెఁ దా/ నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి..’’ అన్న మహాకవి ధూర్జటి పద్యం ఇందుకు నిదర్శనం. నిజమేగా ఏవీ చదవకుండానే సాలె పురుగు, పాము, ఏనుగులకు మోక్షం ఎలా వచ్చిందంటారు?
      పుణ్యం సంగతి (ఉంటే గింటే) దేవుడె రుగు? నిత్యజీవితంలో మనిషి అనుభవించే నరకం పశుపక్ష్యాదులకు ఏదీ? మనిషి పుట్టిన కొన్నాళ్లకు బాలారిష్టాలు వస్తాయని భయపడతారు. మనిషిలా బడులకు, కళా శాలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి చదువు కోవాల్సిన ఖర్మ పశుపక్ష్యాదులకు పట్టలేదు ‘పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేట ప్పుడు అది వెంటరాద’ని మనిషి పద్యాలు పాడుతూనే ఉంటాడు. ఏ వేమన లాంటి వాడో తప్ప బట్టలు వదిలేసిన పుణ్యాన ఎవ్వరూ పోరు. జంతు సంతానం అలా కాదే! బట్టలు వేసుకోవు. నిజమైన వేదాం తానికి నిలువెత్తు రూపాల్లా ఉంటాయి.
      మనుషుల్లాగా జ్ఞానానికి బడుల చుట్టూ, పుణ్యానికి గుడుల చుట్టూ తిరగాల్సిన అవసరం జంతువులకు లేదు. అలాగే బతకడానికి కార్యాలయానికో, కార్ఖానాకో వెళ్లాల్సిన అవసరమూ లేదు. మనం బలవంతంగా తీసుకువెళ్లాల్సిందే తప్ప వాటికవి ఆసుపత్రికీ వెళ్లవు. రకరకాల పరీక్షలూ చేయించుకోవు.
      పెళ్లిళ్లు పేరంటాలనీ చెప్పి మనుషులు లక్షలు, కోట్ల రూపాయల్ని తగలబెడతారు. జంతువులు ఆ పని చెయ్యవు. కప్పల్లాంటి వాటికి మనుషులు తమ స్వార్థం కోసం బలవంతంగా పెళ్లి చేయిస్తే చేయించుకుంటాయి గానీ వాటికి ఆ బాదరబందీ లేదు. పెళ్లిళ్లే లేనప్పుడు విడాకులూ లేవు. జంతువులు తమకు చట్టాలు కావాలని కోరుకోవు. 
      దేవుళ్లు సైతం జంతువుల అవతారమెత్తారు. మనుషులను జంతువులతో పోలుస్తారు తప్ప. ఏ జంతువునూ మనిషితో పోల్చరు. ఇష్టమైతే సింహం లాంటివాడనో, పులిలాంటి వాడనో పోలుస్తారు. కష్టమైతే వాడు కుక్క అనో, గాడిద అనో పంది అనో తిడతారు. మనుషులకు అంత విలువ ఏదీ?
      జంతువుల విలువ తెలుసుకుంటే ఎంతో ఉంది. చెప్పాలంటే శానా ఉంది..
యముని మహిషపు లోహఘంటలు
మబ్బుచాటున ఖణేల్‌మన్నాయి
నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు ఉరికిపడ్డాయి
కనక దుర్గా చండ సింహం
జూలుదులిపి ఆవులించిందీ
ఆది సూర్యుని సప్తహయములు
నురుగలెత్తే పరువుపెట్టాయి

      ... అని మహాకవి శ్రీశ్రీ జంతువుల వైశిష్ట్యాన్ని ఎంతగొప్పగా చెప్పాడు. మనిషి పామును సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అని కొలుస్తాడు. కుక్కను కాలభైరవస్వామి అంటాడు. వినాయకుడిని ఏనుగుతో ముడిపెట్టి కొలుస్తాడు. ఎద్దును నందీశ్వరుడంటాడు. మరి ఏ జంతువుకూ మనిషిని కొలవాల్సిన ఖర్మపట్టలేదు గాక పట్టలేదు. అయినా మనిషికి అదోరకం చిన్నచూపు. కవులకు అదోరకం ఎగతాళి.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి 
శుభలగ్నమునన్‌
దొనరగ బట్టము గట్టిన
వెనకటి గుణమేల మాను? 
వినరా సుమతీ!  

      ...అన్న పద్యం ఉంది. ఇందులో కుక్కను ఎగతాళి చేశారు. ఇది కాదు. కుక్క గొప్పతనాన్ని గుర్తించాల్సిందే. కుక్క మనిషి లాంటిది కాదు. ఎంత పదవిలోకి వచ్చినా తన సహజధర్మాన్ని విస్మరించదు. చెప్పు తినెడు కుక్క చెరకు తీపి ఎరుగునా? అనే పద్యం కూడా ఉంది. కుక్క మనిషి మీద అభిమానంతో చెరకును వదిలేస్తుంది తప్ప చెరకు తీపి తెలీక కాదు. అలాగే, అత్యాచారం చేసినవాణ్ని ‘మృగాడు..’ అని అంటారు. మృగాలు ఎప్పుడైనా ఇలా నీచమైన పనులు చేస్తాయా? 
ఇన్ని విషయాలు తెలిశాక ‘జంతు జన్మ దుర్లభం’ అనకుండా ఎలా ఉండగలం? 


వెనక్కి ...

మీ అభిప్రాయం