రోగమొక చోట, ఓట్ల రొచ్చు వేట

  • 176 Views
  • 1Likes
  • Like
  • Article Share

    గుర్రం విక్టర్‌ ప్రభురాజ్

  • కడప

భాషమీద ప్రేమ ఉంటే ఫలానా ఫలానా ప్రముఖులు వాళ్ల పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో ఎందుకు చదివిస్తున్నారని పాలకులే ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు వేయాల్సింది అమ్మానాన్నలకు కాదు. ఉద్దరిస్తామంటూ పీఠాలెక్కిన ముఖ్యమంత్రులకు, విద్యాశాఖ మంత్రులకు, అధికారులకు, ప్రభుత్వ విద్యావేత్తలకు. లక్షల ప్రజాధనాన్ని జీతాలుగా పొందుతూ ఇలా ప్రశ్నించే ముందు కాస్తయినా ఆలోచించాలి కదా!! మరి ఆర్టీసీ బస్సులు, రైల్వేలు ఉండగా వీళ్లంతా లక్షలు, కోట్లు ఖరీదు చేసే కారుల్లో ఎందుకు తిరుగుతున్నారు? ఎక్కడికక్కడ ప్రభుత్వాసుపత్రులు ఉండగా వీళ్లంతా ఎందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు? అందుకు వీళ్లనేం చేయాలి?
      చైనా, జపాన్, జర్మనీ, రష్యా తదితర దేశాల్లో ఇప్పటికీ అమ్మ భాషలోనే చదివి చక్కటి ఉపాధి సంపాదించుకుంటున్నారు, అత్యున్నత స్థానాలకూ వెళ్తున్నారు. మన పాలనలో ఇలా ఎందుకు అఘోరించింది అని పాలకులు ఏనాడైనా తమని తాము ప్రశ్నించుకున్నారా? సమూహానికి ఒక ప్రశ్న పడేసి చెవులు, కళ్లూ మూసుకుని, తమకెవరూ సమాధానం చెప్పలేదని మభ్యపెట్టుకుని, తమ కుట్రల్ని తాము చాపకింద నీరులా అమలు చేసుకోవడం అధికార వర్గాలకు తేలిక! డబ్బున్న వాళ్ల సంగతి సరే, లేని వాళ్లుకూడా పుస్తెలమ్మి, అప్పులు చేసి మరీ ప్రవేటు బళ్లలో చదివించడానికి కారణం ఎవరు? పాలకులు, అధికారులు ఈ కోణంలో ఆలోచించరా? చిన్న భవనంలో దారీ తెన్నూ లేని గదుల్లో పెట్టిన ప్రైవేటు బడులే అమ్మానాన్నల్ని ఆకర్షించగలుగుతున్నప్పుడు ఇంతేసి ప్రభుత్వాలు వేల కోట్ల బడ్జెట్లతో, లక్షలాది మంది సిబ్బందితో నడిపే బడులకు పిల్లలకు రాకపోవడంలో లోపం ఎవరిది? దానికి కారణం మాధ్యమమొక్కటేనా? ఇంకేమీ లేవా? ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారు? తెలుగు మాధ్యమం రద్దు చేయడం ద్వారా అమ్మభాషలో చదువు చెప్పి పిల్లలను ప్రయోజకుల్ని చేయలేకపోతున్నామన్న చేతకానితనాన్ని పాలకులు ఒప్పుకుంటున్నట్టేనా? 
      కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఏనాడో ప్రవేశపెట్టారు కదా? అక్కడి విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను, స్థానిక ప్రైవేటు పాఠశాలలతో పోల్చి చూసే సాహసాన్ని చేయగలరా? బ్రిడ్జిల్యాబ్స్‌ సంస్థ ఏటా 0.4 శాతం మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు మాత్రమే నేరుగా ఉద్యోగాలు దొరుకుతున్నాయని సర్వే చేసి తేల్చింది. మరి వాళ్లందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారేకదా!! సమస్య ఎక్కడ ఉంది? మందెక్కడ వేస్తున్నారు. అనాలోచిత నిర్ణయాల వల్ల సంక్షోభాలకు గురయ్యే లక్షలాది మంది పిల్లల భవితకు, చితికిపోయే అమ్మానాన్నల ఆశలకు జవాబుదారీ ఎవరు?


వెనక్కి ...

మీ అభిప్రాయం