పేద విద్యార్థులకు పెనుముప్పు

  • 182 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టబోయే నిర్బంధ ఆంగ్ల మాధ్యమం రద్దు గురించి పోరాటం చేసేందుకు 39 సంస్థల భాగస్వామ్యంతో మాతృభాషా మాధ్యమ వేదిక ఏర్పాటైంది. ఏడుగురు ఎమ్మెల్సీలు, సాంస్కృతిక సంస్థలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో ఇది ఏర్పాటైంది. అమ్మభాషా మాధ్యమంలో ప్రాథమిక విద్య బోధన ఆవశ్యకత గురించి విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ వేదిక ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం గురించి  వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, పాఠశాలల్లో ప్రచార కార్యక్రమాలు, సంతకాల సేకరణ, ర్యాలీలు లాంటివి నిర్వహించనున్నారు. నిర్బంధ ఆంగ్లమాధ్యమం వల్ల తలెత్తే పరిణామాల గురించి మాతృభాషా మాధ్యమ వేదిక సారథ్య సంఘ సభ్యులు ‘తెలుగువెలుగు’తో మాట్లాడారు.


తీవ్ర నష్టం
తెలుగు భాషలో విద్యాబోధనకి సంబంధించి రెండు విషయాల్ని ప్రధానంగా మనం గుర్తించాలి. మాతృభాష మీద పట్టుంటే ఇతర భాషల్ని నేర్చుకోవడం చాలా తేలికవుతుంది. అమ్మభాషతో నిమిత్తం లేకుండా నేరుగా ఇంగ్లీషు నేర్చుకోవడం అయ్యేపని కాదు. ఆంగ్ల మాధ్యమం లేకపోతే పేదలు, వెనుకబడిన వర్గాలు ఎక్కువ నష్టపోతారని చాలామంది వాదిస్తున్నారు. అది నిజం కాదు. ఆంగ్ల మాధ్యమంలో చదివితే ఎక్కడికో వెళ్లిపోవచ్చని ఇప్పుడు అందులో చేరే పిల్లలు తర్వాత కాలంలో తీవ్రంగా నష్టపోతారు. తెలుగులో పాఠాలు వినడం ద్వారా తమ పరిసరాల్లో ఏముందో చదువులోనూ అదే ఉందనే ఆత్మవిశ్వాసం పిల్లల్లో కలుగుతుంది. తద్వారా వారు చదువులో మరింత ప్రతిభావంతంగా రాణించగలుగుతారు. వారి మేధ వికసిస్తుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. పరాయి భాషలో విద్యాబోధన వల్ల బడికీ ఇంటికీ సంబంధం లేని వాతావరణంలోకి విద్యార్థిని నెట్టినట్లవుతుంది. దానివల్ల బిడ్డ పరాయీకరణ చెందుతాడు. అటు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు అర్థం కాక, ఇటు తెలుగులోనూ కొనసాగలేక చదువును మధ్యలోనే నిలిపేసే పరిస్థితి కలగవచ్చు. గతంలో సక్సెస్‌ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరముంది. 


అందరికీ ఇబ్బందే!
తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళతారనే అపోహలో ఇప్పుడు దేశంలోని తల్లిదండ్రులందరూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే అప్పటిదాకా తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్న పిల్లల్ని అకస్మాత్తుగా ఆంగ్ల మాధ్యంలోకి నెట్టేస్తే చాలా ఇబ్బందిపడిపోతారు. ఆంగ్ల మాధ్యమం వల్ల ఇప్పటికే ప్రైవేటు బడుల పిల్లలూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారి పరిస్థితీ ఇంతే. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటూ మాతృభాషలో కూడా బోధన కొనసాగించాలని మా మాతృభాషా మాధ్యమ వేదిక గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. ఏ మాధ్యమంలో చదువుకోవాలనేది పిల్లలు, తల్లిదండ్రుల ఇష్టానికి అనుగుణంగా ఉండాలి.  ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అంతేగానీ, నిర్బంధంగా పిల్లల్ని ఆంగ్లంలోకి నెట్టడం సమంజసం కాదు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా మాతృభాష మాధ్యమాన్ని అమలుచేయాలన్నది మా మరో ప్రధాన డిమాండ్‌. లేకపోతే మీ పిల్లలకి ఇంగ్లీషు మాధ్యమం.. మా పిల్లలకి తెలుగు మాధ్యమమా! అనే భిన్నవాదాలు వినబడే అవకాశం ఉంది. ఆంగ్ల మాధ్యమం కారణంగా ప్రైవేటు బడుల్లో చదివే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అమ్మభాషలో విషయావగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది. తెలియని భాషలో విన్నది సగం సగమే మదిలో ముద్రితమవుతుంది.  


ఒకే విద్య ఉండాలి
సంపన్నులకో విద్య... పేదవాళ్లకో విద్య... అగ్రవర్ణాలకో విద్య...  నిమ్న వర్గాలకోవిద్య ఇలా రకరకాల చదువులు ఉండకూడదు. ఆంగ్లంలో కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌ అంటారుగా... అలా అందరికీ ఒకే విద్యని అమలు చేయాలి. ఇప్పుడు అమలు జరుగుతున్నది రెండు గ్లాసుల విద్య. దీనికి కొనసాగింపుగా వచ్చిందే ఆంగ్ల మాధ్యమంలో బోధన. తెలుగు మాధ్యమాన్ని చాలామంది నిరుద్యోగ సమస్యకు ముడిపెడుతున్నారు. నిజానికి నిరుద్యోగ సమస్యకి కారణం అన్నిచోట్లా వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం. భాషవల్ల నిరుద్యోగం రాలేదు. మాధ్యమం అనేది బోధన శాస్త్రానికి సంబంధించిన విషయం. అది తెలుగా.. హిందీనా... ఇంగ్లీషా అని కాదు. ఏ పరాయి భాషనైనా సరే మాతృభాష సాయంతోనే చక్కగా నేర్చుకోగలం. అందుకని ముందు అమ్మభాష మీద మనకి సరైన పట్టు ఉండాలి. ప్రపంచమంతా మాతృభాష ద్వారానే పరాయి భాషను నేర్పుతున్నారు. ఇప్పుడు ప్రైవేటు బడులన్నీ ఆంగ్ల మాధ్యమాన్నే అమలు చేస్తున్నాయి. ఏళ్ల తరబడి పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. దీని వల్ల పిల్లలకెంత భాషా జ్ఞానం అలవడిందో, అలవడుతోందో మదింపు వేస్తే నిజాలు బయటికొస్తాయి. పదిహేడు సంవత్సరాలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకున్న పిల్లలు సైతం పట్టుమని పది వాక్యాలు కూడా ఇంగ్లీషులో సరిగా రాయలేని పరిస్థితి నేడు అంతటా కనిపిస్తోంది. 


పిల్లలకు పెను సవాలే!
ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేస్తాయనేది ఒట్టి అపోహ మాత్రమే. మొదటి నుంచి ఆంగ్లం మాధ్యమంలోనే చదువుకుని ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన చాలామంది ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే అక్కడి భాషమీద కనీస అవగాహన ఉంటేగానీ ఆ దేశంలోకి ప్రవేశం కల్పించరు. భాష నేర్చుకోవడం వేరు. మాధ్యమం వేరు. ఇప్పుడు సమస్యంతా మాధ్యమం అనే విషయం గురించే. ఏ భాష ద్వారా ఏ భాష నేర్చుకోవాలి! తెలిసిన భాషనుంచి తెలియని భాష నేర్చుకుంటేనే ఉపయోగం. ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే తమ పిల్లలు జీవితాలు మెరుగవుతాయని బడుగు బలహీన వర్గాలవారు  అనుకుంటున్నారు. వాళ్లకి నేను చెప్పేదేమంటే ఇంగ్లీషును తప్పని సరిగా నేర్చుకుందాం. కానీ, ఆ భాషను బాగా నేర్చుకోవాలంటే ముందు మాతృభాష మీద పట్టు ఉండాలి. ఇతర సబ్జెక్టులను తెలుగు మాధ్యమంలో చదువుకుంటూనే ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా నేర్చుకోవడం మేలు. అంటే తెలుగు మీడియం- ఇంగ్లీషు సబ్జెక్టు. అయితే ప్రభుత్వం తెలుగును ఒక సబ్టెక్టుగా నేర్పుతానంటోంది. దీని వల్ల మాతృభాష మీద నిర్లక్ష్యం ఏర్పడుతుంది. తెలుగు మన జీవితంలో భాగం. అన్యభాషలో విద్యాబోధన పిల్లలకు పెనుసవాలుగా మారుతుంది. 


ఆ ప్రమాదం ఎక్కువ!
మాతృభాష మాధ్యమంలోనే ప్రాథమిక విద్యాబోధన జరగడం ఉత్తమమని, దానివల్ల పిల్లల మేధో వికాసానికి అవకాశం ఉంటుందని ప్రపంచంలోని చాలా దేశాలు నిరూపించాయి. పిల్లలు చక్కగా చదువుకొని సంపూర్ణ వికాసం పొందాలన్నదే మాతృభాషా మాధ్యమ వేదిక లక్ష్యం. ధనిక, పేద లాంటి వాటిని పక్కనపెడితే మాతృభాషలో చదువుకునే అవకాశం పిల్లలందరికీ ఉండాలి. ప్రభుత్వం కూడా ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలను నిర్వహిస్తోంది కదా! నిజం చెప్పాలంటే ధనికులైనా, పేదలైనా ఆంగ్ల మాధ్యమంలో చదువుల వల్ల ఇబ్బందులు పడుతున్న పిల్లలే ఎక్కువ. తెలుగులో చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు సరిగా ఉండవు అనటం ఎంతమాత్రం నిజం కాదు. తెలుగులో చదువుకుంటే ఎందుకూ పనికిరారనే భావనని ప్రభుత్వాలు పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. ఇది ఎంతమాత్రం సరికాదు. తెలుగు మాధ్యమాన్ని పిల్లలకు దూరం చేయడం చాలా అశాస్త్రీయం. దీనివల్ల పిల్లలు మేధో పరంగా నష్టపోవడంతోపాటు వారు అమ్మభాషకి దూరమైపోతారు. మన సంస్కృతి సంప్రదాయాలకు దూరమైపోతారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఇంతకు ముందు వేరే కారణాల వల్ల మధ్యలోనే బడి మానేసేవారు. ఇప్పుడీ ఆంగ్ల మాధ్యమం వల్ల, అలవాటు లేని భాషలో విద్యాబోధన వల్ల, ఏదీ అర్థంకాక, ఏం చెయ్యాలో దిక్కుతోచక,  మధ్యలోనే పిల్లలు చదువు నిలిపివేసే ప్రమాదం ఉంది. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం