సొంతభాషలకే పట్టం.. అదే నెహ్రూ స్వప్నం

  • 786 Views
  • 0Likes
  • Like
  • Article Share

గాంధి పుట్టిన దేశమా ఇది..
నెహ్రు కోరిన సంఘమా ఇది...
      దేశాభివృద్ధికి జాతినాయకులు వేసిన సామ్యవాద పునాదులు పెళుసు బారుతున్నాయన్న ఆవేదనలోంచి ఆరుద్ర కలం ఇలా ప్రశ్నించింది. 

      కానీ, భాష విషయంలో కూడా నెహ్రూ కోరిన సంఘం ఇది కాదు. ప్రభుత్వ కార్యకలాపాల నుంచి పాఠశాలల్లో విద్యాబోధన వరకు అన్నీ స్థానిక భాషల్లోనే జరగాలన్నది ఆయన అభిమతం. జాతి తన సొంతకాళ్ల మీద నిలబడాలంటే ఇది అత్యావశ్యకమన్నది ఆయన నమ్మకం. కానీ, కాలంతోపాటే ఆయన కలలూ కరిగిపోయాయి. ఆయన ఏదైతే మంచిది కాదన్నారో అదే ఇప్పుడు ఈ దేశంలో రాజ్యం చేస్తోంది... ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో!
      ‘‘భాష ఓ నిత్యసత్యం. సమాజ పరిణామ దశలో అదే అత్యంత ముఖ్యమైంది. భాష మనల్ని మనకు పరిచయం చేస్తుంది. తోటివారి గురించి తెలియజేస్తుంది. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది. ఇతర సమాజాల గురించి తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. వ్యాకరణం, లక్షణశాస్త్రాలకు మించిన ప్రత్యేకత ఏదో భాషలో ఉంది. ఓ జాతి బుద్ధికుశలతకు అది కవితాత్మక అభివ్యక్తి. ఆ జాతిని తీర్చిదిద్దిన ఆలోచనలు, భావనాశక్తుల సజీవరూపం’’... ఇదీ భాషకు భారత తొలి ప్రధాని నిర్వచనం. రాజ్యాంగ సభలో ప్రసంగంతో పాటు లోక్‌సభ తొలి స్పీకర్‌ గణేశ్‌ వాసుదేవ్‌ మావ్లాంకర్, ప్రముఖ హిందీ కవి రామ్‌ధారి సింగ్‌ ‘దినకర్‌’, తన కుమార్తె ఇందిరలకు రాసిన లేఖల్లో భాష మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు నెహ్రూ. ఆ రోజుల్లో జరిగిన పత్రికా సంపాదకులు, విద్యాశాఖ మంత్రుల సమావేశాల్లో సైతం ఈ విషయాలను నొక్కి చెప్పేవారాయన. హిందీ/ ప్రాంతీయ భాషలను తప్పనిసరిగా ప్రోత్సహించాలని, అవి బోధన, పరిపాలనా భాషలుగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలని ఆకాంక్షించేవారు. ఆయా భాషల అభివృద్ధి కూడా అర్థవంతంగా జరగాలి తప్ప పైపై మెరుగులకు పరిమితం కాకూడదనే వారు.

మన భాషల్లోనే బోధన
పదాలన్నవి చాలా చమత్కారమైనవి... చెప్పాల్సి వస్తే ప్రపంచంలో అతిముఖ్యమైంది పదమే.... ఈనాడు మనం సంపాదించుకున్న జ్ఞానమంతా మన ఆలోచనలను ప్రతిబింబించే పదాల కూర్పేనని చెప్పేవారు నెహ్రూ. భాషలోని ప్రతి పదమూ శక్తిమంతమైందేనన్నది ఆయన అభిప్రాయం. ‘‘ప్రతి పదానికీ పెద్ద చరిత్ర ఉంటుంది. మన మెదళ్లలో అది భావచిత్రంగా నిలిచిపోతుంది. ఒక భాషలోని ఏ పదాన్నీ దాని కచ్చితమైన అర్థంలో మరో భాషలోకి అనువదించలేం. ప్రయత్నిస్తే ఆ పదానికి సమానార్థకం దొరకవచ్చ’’ంటూ భాషల లోతులను తడిమారు జవహర్‌లాల్‌. భాషను ఇంతగా ‘అర్థం చేసుకున్నారు’ కాబట్టే దేశాభివృద్ధికి ఏ భాషలు ఉత్ప్రేరకాలు కాగలవో కచ్చితంగా చెప్పారు. ‘‘పూర్వకాలపు రాజాస్థాన భాషలు ఈనాటి ప్రజాస్వామ్య యుగానికి పనికిరావు. ముఖ్యంగా వీలైనంత ఎక్కువమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్న తరుణంలో అవి అసలు ఉపయోగపడవు. బోధనా భాష ముఖ్యంగా రెండు కర్తవ్యాలను నిర్వర్తించాలి. అది తన ప్రాచీన మూలాల మీద ఎదిగి వచ్చిందై ఉండాలి. అదే సమయంలో పెరుగుతున్న ఈనాటి అవసరాలకు అనుగుణంగా తనను తాను విస్తృతపరుచుకోగలిగిందై ఉండాలి. తప్పనిసరిగా అది ప్రజల భాష అయి ఉండాలి తప్ప ఏ కొద్దిమందికో సంబంధించింది మాత్రమే కాకూడదు’’ అన్న నెహ్రూ... హిందీ రాష్ట్రాల్లో హిందీలో, ప్రాంతీయ భాషలు చెలామణిలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా భాషల్లో విద్యాబోధన జరగాలని చెప్పారు. 
      భాష తనను తాను విస్తృతపరుచుకోవడమంటే ఏంటి? ‘‘శాస్త్ర సాంకేతిక పరిభాషకు సంబంధించి ఆ భాష గ్రహణశీలమైందిగా ఉండాలి. బయటి నుంచి వచ్చే ప్రతి పదమూ తన మౌలిక నిర్మాణానికి అనుగుణంగా ఉంటే చాలు స్వీకరించగలగాల’’న్నది ఆయన అభిప్రాయం. అంటే వైజ్ఞానిక పారిభాషిక పదాలను పనిగట్టుకుని అనువదించాల్సిన అవసరం లేదన్నది నెహ్రూ సూచన. ఆయన అభిప్రాయం ప్రకారమైతే, అంతర్జాతీయ వినియోగానికి తగ్గట్టుగా ఆ పదాలను ఉన్నవి ఉన్నట్టుగా వాడుతూనే విజ్ఞానశాస్త్ర పుస్తకాలను మన భాషల్లోకి అనువదించుకోవాలి. 
అభివృద్ధికి ఆలంబన
‘‘భారతీయుల సామూహిక అభివృద్ధి భారతీయ భాషల ద్వారానే జరుగుతుంది. విదేశీ భాషల ద్వారా కాదు. బ్రిటిష్‌ ఇండియాలో దురదృష్టవశాత్తూ ఓ కొత్త కులం పుట్టుకువచ్చింది. అదే... ఆంగ్లం తెలిసిన వర్గం. నాటి పరిస్థితుల్లో విద్య కొందరికే పరిమితమైంది. విద్యావ్యాప్తి విస్తృతమవుతున్న ఈ దశలో ఆంగ్లం ఇంకెంత మాత్రమూ బోధనా మాధ్యమంగా ఉండబోదు. కచ్చితంగా హిందీ/ ప్రాంతీయ భాషలే మాధ్యమాలవుతాయి. అలా ఎదిగి వచ్చిన తరాలతోనే సమతులాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే మన శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి మాత్రం ఆంగ్లం లేదా ఏదైనా విదేశీ భాషా పరిజ్ఞానం అవసరం’’ అంటూ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో చెప్పిన నెహ్రూ, నేడు వెర్రితలలు వేస్తున్న ఆంగ్ల మాధ్యమ అభిమానాన్ని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు! 
      ‘‘సమకాలీన ప్రపంచంలో ప్రచురితమవుతున్న వైజ్ఞానిక సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి కనీసం ఒక్క విదేశీ భాష అయినా వచ్చి ఉండాలి. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, చైనీస్‌... ఏ భాషైనా సరే. అయితే ఇప్పుడు రెండు వంతుల విజ్ఞానశాస్త్ర గ్రంథాలన్నీ ఆంగ్లంలోనే ప్రచురితమవుతున్నాయి కాబట్టి ఆ భాష నేర్చుకోవడమే మేలు’’ అని ఓ సందర్భంలో చెప్పారు నెహ్రూ. మరి ఆ నేర్చుకోవడం ఎలా సాగాలి? దానికీ ఆయనే చాలాసార్లు జవాబిచ్చారు. 
ఆంగ్లం అంతవరకే
ఆంగ్లం విషయంలో నెహ్రూకు స్పష్టమైన ఆలోచనలు ఉండేవి. ఆ భాషను పూర్తిగా విస్మరించమని ఆయన ఏనాడూ సూచించలేదు. ‘‘ఆంగ్లాన్ని పాఠశాలల్లో రెండో, మూడో భాషగా నేర్పాలి. ఆ భాషను నేర్చుకోవడంలో రెండు పద్ధతులు ఉన్నాయి. పూర్తిస్థాయి జ్ఞానాన్ని సంపాదించడం. ఆ భాషలోని విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగల నైపుణ్యాలను సొంతం చేసుకోవడం. అంటే ఆంగ్ల భాషలోని పుస్తకాలు, పత్రికలను సొంతంగా చదివి అర్థం చేసుకునే స్థాయి చాలు... అనర్గళంగా మాట్లాడటం రాకపోయినా ఫర్వాలేదు. పాఠశాలలో ఆంగ్ల ప్రాథమిక పరిజ్ఞానం నేర్పితే చాలు, ఆ భాషా పుస్తకాలను చదివి అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇష్టం ఉన్నవాళ్లు ఆంగ్లాన్ని పూర్తిస్థాయిలో నేర్చుకుంటార’’ని ఓ సందర్భంలో చెప్పారు. పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర బోధన కూడా హిందీ/ ప్రాంతీయ భాషల్లోనే జరగాలన్నది ఆయన అభిమతం. ‘‘కావాలంటే కళాశాల స్థాయిలో ఆంగ్లంలో బోధించవచ్చు... నిజానికి అప్పుడు కూడా ఆంగ్లం అవసరం పెద్దగా ఉండదు. విజ్ఞానశాస్త్ర సాహిత్యంతో విస్తృత అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలనుకునే వారికి మాత్రమే అది అవసరం’’ అన్నది నెహ్రూ విశ్వాసం. ఇది వాస్తవం కూడా!  
పుస్తకాలే ప్రాణదీపాలు 
పుస్తక పఠనమంటే నెహ్రూకు చాలా ఇష్టం. ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ తదితర పుస్తకాలు రాసిన ఆయన గొప్ప చదువరి. మన దేశంలో పుస్తకాలు చదివే అలవాటు అంతగా లేదని ఆయన ఆవేదన చెందుతుండేవారు. ‘‘మనం మొదట చేయాల్సిన పని ఆలోచించడం. ఈ ఆలోచనాశక్తి అనేది మనిషికి అప్రయత్నంగా రాదు. ఆలోచనలు పంచుకోవడం అంటే పక్కవాడితో బాతాఖానీ కాదు. ఇతరులు చెప్పిన విషయాలనే నువ్వు తిరిగి చెప్పడమూ కాదు. సొంతంగా ఆలోచించాలి. ఆలోచనాశక్తిని పెంచుకోవడానికి పుస్తక పఠనం కన్నా ప్రయోజనకరమైంది ఇంకోటి లేదు. చదవడం వల్ల ఇతరుల ఆలోచనలు మనకు తెలుస్తాయి. వాటితో సరిపోల్చుకుంటూ సొంత ఆలోచనలను పెంపొందించుకోవాలి. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో, ముఖ్యంగా మన దేశంలో ఆలోచించడం, చదవడం తగ్గిపోతున్నాయ’’ని ఓసారి అన్నారాయన. 
      పుస్తకాలు చదవడం వల్ల కలిగే ఉపయోగాలను తన కుమార్తె ఇందిరకు రాసిన లేఖల్లో విపులంగా చెప్పారు. ‘‘ఎవరైనా సరే పుస్తకాలు ఎందుకు చదువుతారు? తనకు తాను హితవు చెప్పుకోవడానికి, ఉల్లాసపరుచుకోవడానికి, తన మెదడుకు తగిన శిక్షణనిచ్చుకోవడానికి... ఇంకా చాలా వాటికోసం! అంతిమంగా సహస్రదశల జీవితాన్ని అర్థం చేసుకుంటూ... జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవడానికి! మన వ్యక్తిగత అనుభవాలు చాలా సంకుచితమైనవి, పరిమితమైనవి. వాటి మీద మాత్రమే ఆధారపడితే మనమూ అలాగే మిగిలిపోతాం. కానీ, పుస్తకాలు అసంఖ్యాకుల... చాలాసార్లు ఆయా తరాల మేధావివర్గ ఆలోచనలను, అనుభవాలను అందిస్తాయి. అవి మనల్ని సంకుచితత్వం నుంచి బయటపడేస్తాయి. వాటివల్ల మన ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. మనం క్రమంగా శిఖరాగ్రాలను అందుకుంటాం. అప్పుడు మనకు కొత్త కొత్త దృశ్యాలు కనిపిస్తాయి’’ అని రాశారు. అందుకే ఆయన నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తదితర సంస్థల ద్వారా దేశవాసుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రయత్నించారు. 
      సమాజంలో మార్పు సాధించాలంటే విద్యతోనే సాధ్యం. సరైన విద్య ద్వారా మాత్రమే చక్కటి సమాజాన్ని నిర్మించగలం. ఆకలి నుంచి విముక్తి సాధించడం ఎంత ముఖ్యమో, అజ్ఞానం నుంచి బయటపడటమూ అంతే ప్రధానం. తన విశ్వాసాలకు అనుగుణంగానే విధాన నిర్ణయాల ద్వారా నెహ్రూ దేశానికి దిశానిర్దేశం చేశారు. అధికార యంత్రాంగం కూడా ప్రజల భాషలో పనిచేసినప్పుడే సామాన్యుడికి మేలైన సేవలు అందుతాయని ఆయన నమ్మారు. తన హయాంలో ఆచరించి చూపించారు కూడా.  మరి నేటి పాలకులకు ఆయన మాటలు అర్థమవుతాయా? పాలన, విద్యావ్యవస్థల్లో తియ్యందనాల తెలుగుకు తగిన స్థానమివ్వడానికి కృషి చేస్తారా.


వెనక్కి ...

మీ అభిప్రాయం