విశ్వనాథుడు...సమసమాజ స్వాప్నికుడు!

  • 174 Views
  • 0Likes
  • Like
  • Article Share

    హెచ్‌వీఎల్‌ ప్రసాద్‌బాబు

  • ఉపాధ్యాయుడు, ఎర్రుపాలెం ఖమ్మం.
  • 94400 8311
హెచ్‌వీఎల్‌ ప్రసాద్‌బాబు

ఇరవయ్యో శతాబ్ది సాహితీవేత్తల్లో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు. మహాకావ్యాలు, ఖండకావ్యాలు, నవలలు, కథలు, నాటకాలు, విమర్శ, గేయం ఇలా తెలుగులో ఎన్ని సాహితీ ప్రక్రియలు ఉన్నాయో అన్నింటినీ చేపట్టిన విశారదుడు ఆయన. అయితే విశ్వనాథ సాహిత్యాన్ని సవిమర్శకంగా చదవకుండానే... ‘‘ఆయన రచనలు సామాన్యుణ్ని పట్టించుకోలేదు. పేదల బతుకులకు ఆయన రచనలు అద్దంపట్టవు. ఏవో పుక్కిటి పురాణగాథలు, మత విషయాలను నవలలుగా అల్లుతాడు’’ అని విమర్శిస్తారు 
చాలామంది. కానీ సమాజం మీద ఆయన దృష్టికోణం విస్తృతమైంది.
విశ్వనాథ
వ్యక్తిని గురించి కాకుండా సమాజం మొత్తాన్ని గురించి ఆలోచించారు. వ్యష్టి కంటే సమష్టి శ్రేయస్సు మిన్న అంటారు కదా! అందుకే అక్కడక్కడా వ్యక్తులను గురించి చెప్పినా, సంస్కరణలు విజయవంతం కావాలంటే సమాజంలో మార్పు రావాలన్నది ఆయన ఆకాంక్ష. రుషి కానివాడు కావ్యం రాయలేడంటారు. ఆ దృష్టితో చూస్తే విశ్వనాథ సత్యనారాయణ నిజంగా రుషే. ఆయన సాహితీ తపస్వి. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తే... సమాజం సాహిత్యాన్ని పరివర్తనం చెందిస్తుంది. ఈ రెండింటి సంబంధం అన్యోన్యం- అవిభాజ్యం, సార్వదేశికం- సార్వకాలికం అని నమ్మినవాడు కనుకనే, ‘నా కవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాల మయం. లోకవ్యక్తిని కావ్య వ్యక్తిని అయ్యాను’ అనగలిగారు విశ్వనాథ. ఇంకా ‘విశ్వశ్రేయః కావ్యమ్‌’ అన్న ఆర్యోక్తిని విశ్వసించారు కనుకనే ‘నేను ఏ గ్రంథం రాసినా బుద్ధిమంతుడైన వాడికి కొంత ఉపయోగపడే విషయమే రాశాను’ అనీ చెప్పుకున్నారు.
      భారత స్వాతంత్య్రోద్యమం ఊపిరి తీసుకుంటున్న రోజుల్లో జన్మించారు విశ్వనాథ సత్యనారాయణ. జాతి క్లిష్టస్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి- సమష్టి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ధర్మోద్దీపనకు ఉద్యమాలు తలెత్తడం సహజమైన పరిణామం. మరి ఉద్యమం ఒంటరిగా సాగిపోదు.. సమకాలపు సాహిత్యాన్నీ ప్రభావితం చేస్తుంది. దీనికి విశ్వనాథ రచనలూ మినహాయింపు కాదు. జాతీయోద్యమం పట్ల ఆయన తాదాత్మ్యం ఎంతటిదంటే ఆయన తొలి నవల ‘అంతరాత్మ’ గాంధీజీ ప్రబోధానికి సంబంధించిందే. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమ పిలుపునందుకొని 1921లోనే చదువుకు స్వస్తి పలికారు విశ్వనాథ. ఉద్యమంలో పాల్గొనేవాళ్ల రక్తాన్ని ఉరకలెత్తించటం లక్ష్యంగా సాహిత్యం సాగాలి. దీనికి అనుకూలమైనవి వీరగాథలు. విశ్వనాథ కూడా ఆంధ్రప్రశస్తి, ఝాన్సీరాణి తదితర కావ్యాల ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. 
      ఝాన్సీరాణిలో భారతీయుల హస్తకళా నైపుణ్యాన్ని, ఆంగ్లేయుల పాశవిక మనస్తత్వాన్ని ఇంత బరిణలోన నిమిడెడు, సన్నని/ యారుబార చీర దారములను/ బట్టి తీయునట్టి పనివాండ్ర బొట్టన/ వ్రేళ్లు నరికినారు... అంటూ ఒక్క ఆటవెలదిలో ఇమిడ్చి అగ్నిపర్వతంలా పేల్చారు విశ్వనాథ. ఆంగ్లేయుల రాజ్యం ఎల్లకాలం ఉండదంటూ నిర్మొహమాటంగా ‘నావసుధ వందయేండ్లు నిండవు ఫరంగి’ అని శపించారు. అంతేకాదు భారతీయులు పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహంలో పడిపోవడాన్ని నిరసించారాయన. వేయిపడగలు, నీలపెండ్లి మొదలైన రచనల్లో స్వరాజ్య సమరాన్ని సమర్థిస్తూ జాతిని చైతన్యపరిచారు. ఈ దేశం తగలబడిపోతోంది. దీనిని ఉద్ధరించాలి అన్న కసి ఆయనలో ఉండటం వల్లే ఇలాంటి కావ్యాలు రాయగలిగారు. శ్రీశ్రీది ప్రజా వీరావేశం... విశ్వనాథది ధర్మ వీరావేశం.
      జాతీయోద్యమం ప్రభావంతో తెలుగునాడులో ఆంధ్రోద్యమం వెలుగు చూసింది. తెలుగువారి గత వైభవాన్ని గుర్తుచేయడంతో పాటు... సమకాలీన దుస్థితినీ కళ్లకుకడుతూ ఎందరో కవులు రచనలు చేశారు. ‘ఒకనాడు గలదాంధ్ర యువకులు తూరుపుకనుమ దుర్గముల నేలిన దినంబు...’ పద్యంతో శ్రీకారం చుట్టిన ‘ఆంధ్ర పౌరుషం’ ఆకృతిలో చిన్నదైనా గుణంలో గొప్పరచన. ఎంతో గొప్పగా బతికిన తెలుగు వారు దురదృష్టవశాత్తు దుస్థితికి లోనుకావడం విశ్వనాథకు దుర్భరంగా తోచింది. గత వైభవాన్ని స్మరిస్తూనే ‘అస్మదున్నతి తలకిందులయ్యె’ అని వాపోయారు. ‘మమ్మెటుల గాచెదో నీవిక నాంధ్రమాతృకా!’ అని సంశయాన్నీ వెలిబుచ్చారు. తెలుగువారు పువ్వులమ్మినచోట కట్టెలమ్మడం ఆ(త్మా)ంధ్రాభిమానం కల విశ్వనాథ హృదయాన్ని రంపపుకోతకు గురిచేసింది. అందుకే తెలుగువారిలో ఆత్మగౌరవ స్ఫూర్తిని రగుల్కొల్పుతూ ‘ఆంధ్రప్రశస్తి’ని రచించారు.
అంతా సమానమే
నిజాం ప్రేరిత రజాకార్ల వెనకున్న రాజకీయ శక్తుల ఎత్తుగడలను వ్యంగ్యంగా చిత్రిస్తూ రాసిన నవల ‘పులుల సత్యాగ్రహం’. ఇక ‘స్వర్గానికి నిచ్చెనలు’ నవలలో దేశంలో వర్ణ వ్యవస్థ ఏర్పడిన క్రమం, దాని వెనక ఉన్న తత్త్వాన్ని వివరించి, వర్ణవ్యవస్థ మీదున్న దురభిప్రాయాన్ని పారదోలేందుకు ప్రయత్నించారు విశ్వనాథ. వర్ణాధిక్యం, అల్పత్వం అనే భేదం అప్పటి సంఘంలో లేవు. కేవలం సంఘ నిర్మాణ సౌకర్యార్థం వారివారి వృత్తులను అనుసరించి వర్ణాలు ఏర్పడ్డాయి అంటారాయన. ఇంకా ఆనాడు సంఘంలో గౌరవం పొందేందుకు, అధికారం చేపట్టేందుకు మనిషి ధర్మబుద్ధే తప్ప, సంఖ్యాధిక్యం గాని, వర్ణాధిక్యం గాని అర్హతలు కావని తెలియజేశారు ఆయన. వ్యక్తి ప్రవర్తనలో లోపమే సంఘంలో తారతమ్యాలకు కారణంగా నిలుస్తుందని సింగరవేలు అనే పాత్ర స్పష్టం చేస్తుంది.
      మనుషులంతా సమానమే అన్న ఆధునిక భావనకు ‘నీలపెండ్లి’ నవల తార్కాణం. నీల తన వదిన నాంచారుకు మనుషులంతా సమానమని చెబుతుంది. మనసు నిష్కల్మషంగా ఉన్నప్పుడు బయటికి కనిపించే ఆచారాలు పాటించడం అంత ముఖ్యం కాదని భావిస్తుంది నీల. అంతేకాక ఏ దోషమైనా మనసుకు సంబంధించిందే. అస్పృశ్యులైనంత మాత్రాన, వాళ్లకు వడ్డించటం, ఏకపంక్తి భోజనం మొదలైనవి దోషంగా భావించవద్దని చెప్పింది. దీన్నిబట్టి విశ్వనాథ వైదిక మతాభిమానం ప్రదర్శించినా, సర్వమానవ సమానత్వం ఆయనకు సుముఖమేనని తెలుస్తుంది. రాతలోనే కాక చేతలలో కూడా తన హృదయాన్ని చూపించారు విశ్వనాథ. ఎస్‌.టి.జ్ఞానానందకవి వంటి వారెందరినో ప్రోత్సహించారు.
      మతం పేరిట జరిగే అన్యాయాలతో కూడిన వ్యవస్థకు విశ్వనాథ భాష్యమే ‘స్వర్గానికి నిచ్చెనలు’ నవల. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘ఇది ఒక విచిత్రమైన నవల. మతము పేర కూడాను దుర్జనులు ఇతరులను వంచింతురు. ఇతరులను వంచించుట ఈ లోకమునందొక మహావిద్య. అదొక శిల్పము. ఈ శిల్పవేత్తల సంఖ్య అనంతము. దేవుడు లేడని వంచింతురు. ఉన్నాడని వంచింతురు. ఈ వంచకులలో ప్రధానముగా రెండు రకాలు. మొదటి రకము అది వంచన అని తెలిసి దోషము కాని దానిని దోషము చెప్పును. రెండవ రకము దీని తలలో జేజెమ్మ. ఆ రకమునకది యథార్థమని తెలియదు. అది యథార్థము కాదు అని చెప్పుచుండును. మఱి వంచన ఏమియున్నది. మూలవస్తువే వంచన. వంచన యొక్క సగము దోషము చేసెడి పద్ధతిలో యుండును. ప్రచారములలో నుండును. పదిమందిని కూడగట్టుకొని లోకమును ప్రతారించుటలో నుండును. ఈ స్వర్గానికి నిచ్చెనలన్న నవల దైవము అన్న విషయములో ఆస్తికులము అనువారు చేసెడి వంచన సర్వస్వము ఉన్నది’’ అంటారాయన. ఆస్తిక నాస్తిక వాదాలపై ఎంత చక్కని అభిప్రాయమిది? క్షుద్రవిద్యలు నేర్చి దైవభావం నెపంతో లోకాన్ని వంచించే వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటివాళ్లను గమనించి జాగ్రత్తలో ఉండటం మంచిదని ‘స్వర్గానికి నిచ్చెనలు’లో వామదేవుని పాత్ర ద్వారా హెచ్చరించారు విశ్వనాథ. దేనినీ మూఢంగా విశ్వసించకూడదు. యుక్తా యుక్త విచక్షణతో ఆలోచించాలి అని చాటి చెప్పిన విశ్వనాథ మూఢాచార పరాయణులు ఎంతమాత్రం కాదు.
అలసత్వం మీద చురకలు
ప్రభుత్వ యంత్రాంగం లోతుపాతులను, దుర్నీతిని వ్యంగ్యంగా ఎత్తిచూపిన నవల ‘దమయంతీ స్వయంవరం’. ‘మీరు ఇరవై ఒకటవ తారీకు లోపుగా బిల్లు కట్టమన్నారు. మీ బిల్లు నాకు 20న వచ్చె. ఇరవై ఒకటి ఆదివారమాయె’ అని వాపోతాడో గృహస్థు. దానికి ‘అవన్నీ మాకేం తెలుస్తాయండీ! ఆ బిల్లిచ్చిన వాళ్లను కనుక్కోండి’ అంటూ కరెంటు కత్తిరించిపోతారు కరెంటువాళ్లు. విద్యుత్‌ శాఖ అవకతవకలకు చక్కని చురక. ఓ బంట్రోతు జీతం పెంచమని దరఖాస్తు పెట్టుకొంటే... అది అతని ఉద్యోగ విరమణ అనంతరం మంజూరైందట. ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఆ అట్ట కింది నుంచి మరొక అట్ట కిందికి ఇలా రాముడు బాణం వేస్తే కాకాసురుడిలా, అంబరీషోపాఖ్యానంలో దుర్వాసుడి వెంబడి చక్రంలా- అని చక్కటి ఉపమానంతో అలసత్వాన్ని (రెడ్‌ టేపిజం) ఎత్తి పొడిచారు విశ్వనాథ. అధికార వ్యవస్థలో అలసత్వాన్ని ఎత్తిచూపుతూ ‘ఈ బ్రిటిష్‌ పద్ధతి మారాలి. ఒక కాగితం పది ఆఫీసులు తిరిగే దుస్థితి పోవాలి. బ్రిటిష్‌ సూత్రాలనే అనుసరిస్తే మన స్వరాజ్యానికి అర్థం ఏమిటి?’ అని ప్రశ్నిస్తారు ఆయన. అంతటితో ఆగక ‘ఉద్యోగంలో అధికారం లంచం ప్రమాణాలది అనులోమ సంబంధం’ (హోదా పెరిగిన కొద్దీ, తీసుకొనే లంచం కూడా పెరుగుతుంది) అని లంచగొండితనాన్ని వెక్కిరించారు.
విద్యావ్యవస్థ లోపాల చిత్రణ
‘తెలుగు వ్యాకరణంలో ఫస్టు ఫారమ్‌ వాడికి ఏం ఉంటాయో, ఎంఏ వాడికీ అవే ఉంటాయి. అలాగే కాలేజీ ఎన్నికలలో నెగ్గినవాడికీ అసెంబ్లీ లేదా పార్లమెంటుకు ఎన్నికైన వాడికి సన్మానం, ఊరేగింపులు ఒక్కలాగే ఉంటాయి’ అని మన చదువుల్లోని లోపాలపై చమత్కరించారు. ‘మన చదువులు ఏ ఏడాదికి ఆ ఏడాది మరచిపోయేవే’ అని నిర్ద్వంద్వంగా చెపుతారు. ఇక ‘దేశంలో నాయకులు, రైతుబిడ్డ పేరుమీద చెలామణీ అవుతున్నారు’ అన్నదీ ఆయన మాటే.
      ఉద్యోగాల మౌఖిక పరీక్షలు జరిగే విధానంలో ప్రహసనాన్ని ‘దమయంతీ స్వయంవరం’లో చిత్రించారు. ‘‘దమయంతిని అసలు కలి మంత్రి వాంఛించాడు. కాని మంత్రి కదా ఆమెను చేపట్టడానికి వీలులేదు. కనుక తనమాట వినేవాడికి ఆ ఉద్యోగం ఇస్తాడు. అంటే ఏమిటన్నమాట. ఎవరికో ఖాయపరచిన ఉద్యోగానికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. కొంత తతంగం జరుగుతుంది. లాభం ఏమిటంటే, డాకు కచేరీలకు (పోస్ట్‌ ఆఫీస్‌) లాభం, రైళ్లకి లాభం, పట్టణాలలో హాళ్లకు లాభం, సినిమాలకు లాభం’’ అంటూ నిరుద్యోగులను ఎందరు, ఎలా దోచుకుంటున్నారో కళ్లకుకడతారాయన.
తిరుగుబాటుతోనే మార్పు
విశ్వనాథ రాసిన ప్రతి కథలోనూ ఏదో ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. బ్రహ్మసమాజం ద్వారా ఆ రోజులలో వితంతు పునర్వివాహాలను గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ‘తిరోధానము’ కథలో విధవా వివాహాన్ని సమర్థించారాయన. మహాశ్వేత అనే అమ్మాయి పద్దెనిమిదేళ్లకే విధవ అయింది. భర్త బతికి ఉన్నప్పుడు కూడా వారి అభిరుచులు వేరవడం వల్ల సంసారం అంత బాగా సాగలేదు. ఆమెకు తన అన్నయ్య స్నేహితుడైన రాధారాంతో పరిచయం ఏర్పడుతుంది. చివరికి అది ప్రణయంగా మారి పెళ్లికి దారితీస్తుంది. కేవలం ఛాందస భావాలనే పట్టుకు వేలాడి ఉంటే విశ్వనాథ ఈ కథ రాయలేరు కదా!
      ‘ముగ్గురు బిచ్చగాళ్లు’లో సామాజిక వ్యవస్థ స్వరూపాన్ని, పరిపాలనా యంత్రాంగపు ఆయువుపట్లను, మానవ సంబంధాల ఆనుపానులను తాత్విక చింతనతో విశ్లేషించారు. సునిశితమైన వ్యంగ్యం, సున్నితమైన హాస్యంతో ఇలా చురకలు వేస్తారు ఈ కథలో.
      ‘‘రాజ్యం చేసే వాడంటే మొదట బిచ్చగాడు, తరువాత దొంగ’’
      ‘‘ఆ రోజుల్లో నా కనుమానంగా ఉండేది. ఇంతమంది పోలీసులుంటే ఎంతమంది దొంగలున్నారు? పెద్దయ్యాక తెలిసింది, లోకమంతా దొంగతనమేనని’’ అంటారు. సమాజం మారాలంటే, ప్రజాజీవనం సుఖమయం కావాలంటే తిరుగుబాటు తప్పదంటారు విశ్వనాథ. వర్ణ వైషమ్యాలను చిత్రించిన ఆయన ప్రసిద్ధ కథ ‘మాక్లీ దుర్గంలో కుక్క’. రైల్వేస్టేషన్‌లో విద్యార్థుల సంభాషణ,
      ఒకడు: మన దేశంలో భూతదయ అన్నది లేదు. పెద్ద వాళ్లందరూ పిన్నవాళ్ల మీద అధికారం చేస్తారు. నేను బీఏ ప్యాసైనాను. ఉద్యోగమిచ్చే దిక్కులేదు. పేదవాళ్లు మలమలా మాడిపోతున్నారు. గొప్పవాళ్లు సోఫాలమీద గానీ ఒరగరు.
      రెండవవాడు: మనవాళ్లు అందరూ స్వార్థపరులే. పిడికెడు బిచ్చం పెట్టరు. చివరకు కుక్కకు వేసినట్లైనా పేదవాళ్లకింత వెయ్యరు... అంటూ సాగుతుంది. అందుకే విశ్వనాథ ‘య్యోపర్హిణీథియో’ కథను ఒక పెద్ద తటాకంలో ఉన్న భయంకరమైన నీటి గుర్రాన్ని నీగ్రోలు పగ్గాలు వేసి బంధించి పారేస్తారు అని ముగించారు. దీని అర్థం తిరుగుబాటే. ఇలా తాను చేపట్టిన ప్రతి సాహితీ ప్రక్రియలో సమాజాన్ని గురించి ఆలోచించి, మార్పుకోసం పరితపించిన కవితా సనాథుడు విశ్వనాథ. ఆయన సారస్వతంలో ఎన్నో అందాలున్నాయి. ఎంతో శిల్ప వైలక్షణ్యం ఉంది. కథాకథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశ నిర్మాణంలో, సంభాషణా చాతుర్యంలో... ఒక ప్రత్యేకత ఉంది. అన్నింటికన్నా గొప్ప ప్రత్యేకత సహజత్వానికి భిన్నంగా ఉండకపోవడం, కాల పరిస్థితులకు, జీవితాలకు దగ్గరగా ఉండటం.
      గతించిన వైభవాన్ని సంప్రదాయ బద్ధంగా చెపుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటం ద్వారా జాతి పురోభివృద్ధి సాధించాలని కోరుకున్నారు విశ్వనాథ. ప్రభుత్వం తనకు ‘పద్మభూషణ్‌’ ప్రకటించగానే ‘నాకు పద్మభూషణ్‌ ఇచ్చేకన్నా మిరపకాయల ధర తగ్గిస్తే ఎక్కువ సంతోషించేవాడిని’ అన్న సామాన్యులలో మాన్యుడు ఆయన.


వెనక్కి ...

మీ అభిప్రాయం