పల్లవించిన తెలుగు శిల్పం

  • 706 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శ్రీరామ

  • ఒంగోలు

చుట్టూ పర్వతాలు. మధ్యలో ఆరువందల అడుగుల ఎత్తునుంచి నేలకు జారుతున్న జలపాతం... ప్రకృతి పరవళ్లు తొక్కుతుంటే మనసు ఉరకలెత్తుతుంది. ఇలాంటి అపురూప దృశ్యాలకు నెలవు ప్రకాశం జిల్లాలోని భైరవకోన.
భైరవకోనలో
ఓంకారానికి ప్రతిరూపంగా నిలిచే ఎనిమిది శివాలయాలు ఉంటాయి. మధ్యగుహలో వెలసిన ‘త్రిముఖ దుర్గాదేవి’ ఆదిపరాశక్తిగా సృష్టి, స్థితికారులను ద్వారంలో నెలకొల్పుకుని ఆనంద వీక్షణం చేస్తుంది. ముందుభాగంలో శివలింగం ఉంటుంది. భైరవకోననే ‘సిద్ధులకోన అనీ అంటారు. 
పల్లవుల కాలానివి...
మనదేశంలో తొలినాటి ప్రార్థనా స్థలాలు కొండప్రాంతాల్లోనే మొదలయ్యాయి. అజంతా, ఎల్లోరా, ఉదయగిరి- ఖందగిరి, ఉండవల్లి, గుంటుపల్లి తదితర స్థలాలు కొండల్ని తొలిచి గుహలుగా మలిచి బుద్ధుడు, జైన గురువులు, హైందవ దేవతలకు అంకితంగా నిర్మించినవే. ఆ తర్వాతే ఇప్పుడు మనం చూస్తున్న స్వతంత్ర ఆలయాల నిర్మాణం ప్రారంభమైంది. క్రీ.శ. 4- 6 శతాబ్దాల మధ్య నిర్మించిన భైరవకోన గుహలు పల్లవ శిల్పకళకు అద్దం పడతాయి. మహేంద్రవర్మ కాలంలో వీటిని నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. మేరు పర్వతపంక్తిలోని రుద్రలింగం, అమరనాథ్‌లోని శశినాగలింగం తదితర 8 శివలింగాలను ఈ గుహల్లో చూడొచ్చు. సుద్దమట్టి రాయి కొండల్లో తొలిచిన ఈ గుహల నిర్మాణంలో శిల్పుల ప్రతిభ అత్యున్నత స్థాయిలో దర్శనమిస్తుంది. ద్వారబంధాల మీద పోట్లాడుకుంటున్న సింహాలు నిజమైనవే అన్నట్లుగా ఉంటాయి. ఈ గుహల నిర్మాణం వెనక స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది.
      అన్నదమ్ములైన ఇద్దరు శిల్పులు గుహలు తొలచడం మొదలుపెట్టారట. పని పూర్తయ్యే వరకు ఎవరూ తమను చూడకూడదని నియమం పెట్టుకున్నారట. అది తెలిసిన వాళ్ల తల్లి కూడా అన్నం మూటలు తెచ్చి దూరంగా పెట్టి వెళ్లిపోయేదట. కానీ, ఓ రోజు.. తన కొడుకుల శిల్ప నైపుణ్యాన్ని చూద్దామనుకుని గుహల దగ్గరికి వచ్చింది. దాంతో ఆ శిల్పుల నియమం భంగమైంది. కాబట్టి, ఇక తాము ఎవరి ముఖమూ చూడమని చెప్పి కొండమీదున్న సొరంగంలోకి వెళ్లిపోయారట. దానికి గుర్తుగా ఆ సొరంగం ఇప్పటికీ నిలిచి ఉంది. వారణాసిలాగే ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఇతని పేరుమీదుగానే ఇది భైరవకోన అయింది. గుహల్లో ప్రధాన దైవం భర్గేశ్వరుడు. ఈయనకి పక్కనే ఉన్న కాశీలింగం కింద ఎడతెరపి లేకుండా నీరు ఊరుతూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అరుదైన భైరవమూర్తి విగ్రహం... అష్టభుజాలతో నృత్యం చేసీ చేయనట్లుండే భంగిమలో... డ[మరుకం, త్రిశూలం, జింక, పరుశు, చిన్ముద్రలతో ఉంటాడు.
త్రిముఖ దుర్గాదేవి... 
కార్తీక పౌర్ణమినాడు (ఈసారి నవంబర్‌ 25న) వెన్నెల జలపాతం నుంచి పారుతున్న నీళ్లలో పడి త్రిముఖ దుర్గాదేవి ముఖం మీద ప్రతిఫలిస్తుంది. దాంతో అమ్మవారు చంద్రవదన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. కార్తీక పౌర్ణమినాడే ఇలా జరుగుతుందంటే శిల్పుల పనితనం ఎంత అద్భుతమో కదా! వాళ్లకు చంద్రగమనం గురించి అవగాహన ఉండి ఉంటుంది. త్రిముఖ దుర్గ పరాశక్తికి ప్రతీక. ముందుభాగంలో త్రినేత్రుడు ఉన్నాడు. మనసు స్థిరంగా ఉండాలంటే పౌర్ణమి వేళ శక్తిని దర్శించాలని దేవీ భాగవతం చెబుతోంది. ఇక్కడ నేరుగా శక్తిసహితంగా చంద్రుణ్ని ఆరాధించవచ్చు. కొంతమంది మహర్షులు తమ స్తోత్రాల్లో తెలిపిన అమ్మవారి వైభవాన్ని ఇక్కడి శిల్పులు గ్రహించగలిగారని ధార్మిక పరిశోధకుల విశ్లేషణ. 
      శక్తితోడులేని శివుడు నిర్వికారుడు. శివశక్తులు ఒకే దగ్గర కొలువైన దృశ్యం ఒక్క భైరవకోనలోనే కనపడుతుంది. ఆలయం వెలుపల ద్వారపాలకుల పక్కన బ్రహ్మ, విష్ణు శిల్పాలు కనిపిస్తాయి. ఇంకా కుడి పక్కకు వంపు తిరిగిన తొండం ఉన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది. కాకి కనపడక పోవడం, వేపచెట్టు మొలవక పోవడం ఇక్కడి మరో విశేషం.


కాస్త దృష్టి పెడితే...: అపురూపమైన భైరవకోన గుహాలయాల దగ్గర నిర్మాణాలు చేపట్టడానికి పురావస్తు శాఖ అనుమతించదు. కానీ.. వెలుపలి వైపు రాష్ట్ర పర్యాటకశాఖ కాటేజీలు నిర్మిస్తే పర్యటకులు మరింతగా పెరుగుతారు. నిధులు, వసతులు కల్పిస్తే ప్రాచీన వారసత్వాన్ని ఘనంగా భావితరాలకు అందించొచ్చు.
ఎలా వెళ్లాలి: ఒంగోలు నుంచి కనిగిరి మీదుగా కానీ; కందుకూరు, పామూరుల మీదుగా కానీ చంద్రశేఖరపురం వెళ్లొచ్చు. అక్కడి నుంచి అంబవరం- కొత్తపల్లి గ్రామం 12 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇది చంద్రశేఖరపురం- సీతారామపురం మార్గంలో ఉంది. ఇక్కడి దాకా బస్సులుంటాయి. ఇక్కడి నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భైరవకోన. అంబవరం నుంచి ఆటో సౌకర్యం ఉంది. నెల్లూరు వైపునుంచి వచ్చేవాళ్లు వింజమూరు మార్గంలో పామూరు చేరాలి. పౌర్ణమినాడు ప్రత్యేక బస్సులుంటాయి. భైరవకోనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతోంది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం