భాగ్యనగరంలో సాహితీ సంబరం

  • 623 Views
  • 16Likes
  • Like
  • Article Share

హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో 10వ హైదరాబాద్‌ సాహిత్య సంబరం ప్రారంభమైంది. ఇందులో భాగంగా కార్వి కనోపి వేదిక మీద సినిమా... సాహిత్యం... సమాజం అంశం మీద చర్చ ఏర్పాటు చేశారు. రచయిత, సినీ దర్శకులు ఆదుర్‌ గోపాలకృష్ణన్‌ మాట్లాడారు. సినీ నటులు, రచయిత అనిష్‌ కురువిళ్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలు సినిమాల్లోకి బాగా చొచ్చుకొచ్చాయని, ఒక మంచి సినిమా తీసే పరిస్థితి దేశంలో లేదని ఆదుర్‌ అన్నారు. మంచి సినిమాలు తియ్యడానికి ఇది అత్యంత కష్ట కాలమని ఆయన వ్యాఖ్యానించారు. మన నేతలు కనీసం మంచి సినిమాలు కూడా చూడరని ఎద్దేవా చేశారు. సినిమాల్లో ప్రస్తుతం పెరిగిపోతున్న హింస మంచిది కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు  మంచి సినిమాలు చూపించాలని, పిల్లల కోసమే ఏటా మంచి సినిమాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పాఠశాల రోజుల్లోనే సినిమా పాఠాలను పిల్లలకు చెప్పాలని, స్క్రిప్ట్‌ రచనలో వాళ్లని ప్రోత్సహించాలని సూచించారు. కేరళలో ఇలా చెయ్యడం వల్ల అక్కడ పిల్లలు చక్కని సినిమాలు తీస్తున్నారని చెప్పారు.
మూడు రోజుల పాటు ఈ సంబరం కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి ఎందరో రచయితలు భాగస్వామ్యం వహించనున్నారు.

      నేషనల్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో యంగిస్థాన్ నుక్కాడ్ పేరిట ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అకాపెల్లా శైలిలో సంగీత వాద్యాలు లేకుండా సినీగీతాలు ఆలపిస్తూ అందరినీ అలరిస్తున్నారు.

 

ఫుడ్ ఫర్ థాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్. ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటు, పిల్లల్లో పఠనాసక్తిని పెంచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ.

 

కాలివేళ్లతో కుంచెను కదిలిస్తూ అప్పటికప్పుడే పెయింటింగ్స్ వేస్తున్న ఆర్టిస్ట్ సునీల్ కుమార్.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     'ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా విలువైనది నీరు. నేను రాసిన 'క్యామల్స్ ఇన్ స్కై' పుస్తకం నీటి విలువను తెలియజేస్తుంది' అని ప్రముఖ మలయాళ రచయిత ముజాఫర్ అహ్మద్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు గోథీ హాల్‌లో ప్రముఖ మలయాళ రచయితలు ముజాఫర్ అహ్మద్, బెన్యామిన్‌లతో చర్చా వేదిక ప్రారంభమైంది. సభా పర్యవేక్షకులుగా జోషిల్ అబ్రహం వ్యవహరిస్తున్నారు. ముజాఫర్ అహ్మద్ప్రముఖ మలయాళ రచయితలు ముజాఫర్ అహ్మద్, బెన్యామిన్‌లతో చర్చా వేదిక ప్రారంభమైంది. సభా పర్యవేక్షకులుగా జోషిల్ అబ్రహం వ్యవహరిస్తున్నారు పాత్రికేయులుగా 13 సంవత్సరాలు పనిచేశారు. అక్కడి పరిస్థితులు, జీవన విధానం, కేరళ నుంచి అరేబియా వరకూ తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, అనుభూతులను పుస్తకంగా మలిచి 'క్యామల్స్ ఇన్ స్కై' పేరిట పుస్తకం ప్రచురించారు.  
హైదరాబాద్‌ సాహితీ సంబరం రెండో రోజు విశేషాలు...
హైదరాబాద్‌ సాహితీ సంబరం రెండో రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం కార్వి కనోపి వేదిక మీద ప్రముఖ రచయిత ఆసుతోష్ 'రైటింగ్ ద నేషన్' నేపథ్యంగా మాట్లాడారు. సమాజంలో అశాంతి నానాటికి పెరిగిపోతోందని, మానవ జీవితాలు వాళ్లకి తెలియకుండానే ఒక అభద్రతలోకి జారుకుంటున్నాయని చెప్పారు. ఆ తర్వాత పర్యావరణ పాత్రికేయురాలు బహర్ దత్ 'ప్రకృతి పరిరక్షణలో భారతదేశ ప్రయోగాలు' నేపథ్యంగా మాట్లాడారు. దేశంలో చాలా జీవ జాతులు మానవ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయని, వాటి పరిరక్షణకు గట్టి కృషి జరగాల్సి ఉందని చెప్పారు. రాబందుల సంఖ్యని పెంచడంలో దేశంలో మంచి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే పర్యావరణానికి సంబంధించి రాజకీయాలు అవరోధంగా మారుతున్నాయని, దానికి జరుగుతున్న నష్టాల మీద స్వేచ్ఛగా రాసే పరిస్థితులు అన్ని సందర్భాల్లో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల్లో ఇప్పుడు ప్రశ్నించే తత్వం పెరగడం హర్షణీయమని అన్నారు. తన అనుభవాల ఆధారంగా రాసిన రివైల్డింగ్ పుస్తకం నుంచి కొన్ని పంక్తులు చదివి వినిపించారు. పర్యావరణ వార్తల కోసం పత్రికలు, నిధులు కేటాయించి తమ ప్రతినిధులను అన్ని ప్రాంతాలకు పంపాలని కోరారు.
      'మీట్ మై బుక్' కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఆస్ట్రేలియా రచయిత్రి క్యాథరిన్ హమ్మల్ తన కవితా సంపుటి 'లామెంట్ విల్లీ' ప్రచురణకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పాఠకులతో పంచుకున్నారు. కవితలు మనసుల్ని నేరుగా తాకుతాయని, ఆ ప్రభావం ఎక్కువ కాలం వెంటాడుతూనే ఉంటుందని అన్నారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     

      కార్వి కనోపి వేదిక మీద 'ద లిగసి ఆఫ్ పార్టిషన్' మీద రచయిత, సినీ దర్శకులు హరిందర్ సింగ్ సిక్కా, నవలా రచయిత విక్రమ్ కపూర్ మాట్లాడారు. ఒక రచనని సినిమా కోసం తీసుకుంటే, అందులో ఇష్టారీతిగా మార్పుల్ని చేసుకుంటారని, తన విచ్చోడా నవలని సినిమాగా తీసేటప్పుడు అలాంటి మార్పులకి ఒప్పుకోలేదని సిక్కా చెప్పారు. రచనని సినిమాగా చూడటం కన్నా దాన్ని పుస్తకం రూపంలో చదివితేనే బలమైన ముద్ర చూపుతుందని సిక్కా పేర్కొన్నారు. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత దిల్లీలో జరిగిన ఊచకోత... దూరం పెంచిన మాట వాస్తవమని విక్రమ్ కపూర్ అన్నారు. పదో సిక్కు గురువు హిందూ అని, సిక్కు, హిందూ, ముస్లిం పేరుతో అంతరాలు పెరుగుతుండటం వల్ల మనందరం హిందూస్థాన్ అనే స్పృహ పోతోందని సిక్కా చెప్పారు. చరిత్రని ఒక్కసారి చూస్తే అందరూ స్వాతంత్ర్య పోరాటం చేశారని పేర్కొన్నారు.
      అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ సభ్యులు, రచయిత, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న చిన్మయ్ తుంబే తన మొదటి పుస్తకం 'ఇండియా మూవింగ్- ఎ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్' గురించి మాట్లాడారు. ఈ పుస్తకం రాయడంలో ఎదురైన సమస్యలను గురించి ప్రస్తావించారు. భారతదేశంలో వలసలు, సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల జీవనశైలి గురించి తన పుస్తకంలో చర్చించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న భిన్న సంస్కృతుల గురించి వివరించారు. దేశ విభజనకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను కూడా పొందుపరిచినట్లు తెలిపారు.
      హైదరాబాద్ రచయితలు చరిత్రని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారని అన్నారు రచయిత్రి ఎ.నజియా. గోథి హాల్లో 'హైదరాబాద్ ఇన్ హిస్టరీ అండ్ మెమరీ' మీద ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులు, నాన్నమ్మ తాతయ్యల అనుభవాల నేపథ్యంగా హైదరాబాద్లో యువ రచయితలు రచనలు చేశారని, పోలీస్ యాక్షన్, అధికార మార్పిడి నాటి పరిస్థితులు, అప్పటి జన జీవితాన్ని కళ్లకు కట్టారని పేర్కొన్నారు. రచయిత్రి జిలాని భానో రచనల గురించి తెలుపుతూ... కాల్పనిక సాహిత్యం, చరిత్ర మధ్య ఉండే సరిహద్దుల్ని ఆమె చెరిపేసారని వ్యాఖ్యానించారు.  ముస్లిం రచయితలు మహిళల జీవితాల్లోని నిశ్శబ్దాన్ని అక్షరాబద్ధం చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పాత్రికేయులు, రచయిత యునిస్ లసానియా మాట్లాడుతూ... హైదరాబాద్ సైనిక చర్య కేవలం నిజాం మీద కాదని, అప్పటికే జరుగుతున్న కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేయడం కూడా దాని ఉద్దేశమని చెప్పారు. భారతదేశ చరిత్రలో తొలి కమ్యూనిస్టు వ్యతిరేక చర్య ఇదేనని పేర్కొన్నారు.  
      జాతీయతను హిందుత్వానికి ముడిపెడుతూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ప్రముఖ మలయాళ రచయిత, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత పాల్ జకారియా అన్నారు. 'ఏ లైఫ్ ఇన్ స్టోరీస్' అంశంపై ప్రారంభమైన చర్చా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కథా రచనకు ప్రేరేపించిన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఏఏ అంశంపై ఆయన మాట్లాడారు. జాతీయత ముసుగులో తెలివిగా హిందుత్వాన్ని మాత్రమే తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. దేశ పౌరులు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులైనా సరే జాతీయత మారదని, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా హిందువులు కాకుండా మిగిలిన వారి గుర్తింపు ప్రశ్నార్థకంగా మారుతోందని, అనవసరమైన ఆందోళన, భయాలు కలుగుతున్నాయని అన్నారు. యువత బలంగా తమ వాదనను వినిపించాలని సూచించారు. తెలుగు, మలయాళ రచనల్లో శృంగారం వంటి కొన్నిటి గురించి రాయడంలో కాస్త ఇబ్బందిగానే ఉందని అన్నారు. పాఠకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారని, ఈ కారణంగా ఆంగ్లంలోనే ఎక్కువ రచనలు చేస్తున్నట్లు తెలిపారు.
      రీ ఇమాజినింగ్ సీతా... రిమెంబరింగ్ నవనీత' మీద చర్చలో ప్రముఖ రచయిత్రులు ఓల్గా, సంహిత ఆర్ని మాట్లాడారు. బెంగాలీ రచయిత్రి నవనీత్ దేవ్ సేన్ కు ఈ కార్యక్రమాన్ని అంకితం చేశారు. రామాయణం మీద ఆమె లోతైన రచనలు చేశారు. ఈ సందర్భంగా నవనీత్ రచనల్లోని గొప్పదనం గురించి వక్తలు వివరించారు. తన పుస్తకం 'విముక్త' (లిబరేషన్ ఆఫ్ సీతా.. ఆంగ్ల అనువాదం) గురించి ఓల్గా మాట్లాడుతూ... తాను సూర్పణఖ గురించి రాయాలనుకున్నానని తెలిపారు. ఆమెను అందమైన ద్రావిడ మహిళగా చూపించినట్లు చెప్పారు. తనకు జరిగిన అన్యాయం, ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. అహల్య, ఊర్మిళ, రేణుక లాంటి మరుగున పడిన మహిళల జీవితాల్ని పునర్నిర్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. వీళ్లందరూ చివర్లో సీతను కలిసి నువ్వు రాముడి నుంచి విముక్తి పొందితేనే నీకు శాంతి, రాముడితో ఉంటే నీకు జీవితాంతం బాధలు తప్పవు అంటారు. అలా ఆమె విముక్తం అవుతుందని వివరించారు ఓల్గా. సమకాలీన సమాజంలో ఎందరో సీతలు, సూర్పణఖలు, అహల్యాలు ఉన్నారని... వీళ్లంతా పితృస్వామ్య భావజాల ప్రభావం నుంచి విముక్తి పొందాలని ఓల్గా పేర్కొన్నారు.  
      క్రిమినల్ చట్టాలు కఠినంగా అమలు చేయడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తేనే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తీహార్ జైలర్‌గా విధులు నిర్వర్తించి, 'బ్లాక్ వారెంట్' పేరిట కథా సంకలనం తీసుకువచ్చిన సునీల్ గుప్త అన్నారు. 'టేల్స్ ఫ్రమ్ తీహార్' అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. 'బ్లాక్ వారెంట్' పుస్తక రచయితలు సునేత్ర చౌదరి, సునీల్ గుప్తలు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయులు ఉమా సుధీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సునీల్ గుప్త బిల్లా, రంగాల హత్య కేసు, నిర్భయ కేసు నిందితుడి ఆత్మహత్య, ఇతర పరిణామాల గురించి మాట్లాడారు. తీహార్ జైలర్‌గా తన అనుభవాలను పంచుకున్నారు.
      గోథె వేదిక మీద 'అనువాదంలో తెలంగాణ సాహిత్యం' అంశం మీద జరిగిన చర్చలో అనువాదకులు దామోదర్ రావ్, ఎలనాగ మాట్లాడారు. వక్తగా మామిడి హరికృష్ణ వ్యవహరించారు. కన్నడ ఆదికవి పంప తెలంగాణ వాడేనని, అనువాదానికి సంబంధించి తెలంగాణ నేల మూలాలు ఆనాడే కనిపిస్తాయని హరికృష్ణ పేర్కొన్నారు. ప్రాంతీయ రచయితలు సామాజిక నిర్మాణం, వేదనలు నేపథ్యంగా రాస్తుంటే, భారతీయ రచయితలు సూక్ష్మ అంశాలమీద దృష్టి సారిస్తున్నారని... అందుకే ఆంగ్లంలోకి ప్రాంతీయ రచనల అనువాదం అవసరమని దామోదర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడి ప్రజల ఆకాంక్షని అందరికి తెలియజెప్పేందుకు కొన్ని కవితల్ని సేకరించి సెంట్ ఆఫ్ సాయిల్, ఓడ్ టు ఫ్రంట్ లైన్ ఫార్మేషన్ పేరుతో అనువాదించినట్లు చెప్పారు. వీటిని చూసి చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని ప్రొఫెసర్లు అనువాదం చేస్తామని పేర్కొన్నట్లు తెలిపారు. వట్టికోట 'జైలు లోపల'ని ఇన్ జైల్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన ఎలనాగ మాట్లాడుతూ... వట్టికోట రచనని తొలిసారి అనువాదం చెయ్యడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇక్కడి రచనలు విస్తృతంగా ఇతర భాషల్లోకి వెళ్లే అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ సాహితీ సంబరం మూడో రోజు విశేషాలు...
      హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో భాగంగా మూడో రోజైన ఆదివారం కార్వి కనోపి వేదికపై 'ది మెనీ లైవ్స్ ఆఫ్ వి.కె.కృష్ణమీనన్' అంశంపై చర్చా కార్యక్రమం ప్రారంభమైంది.  రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వి.కె.కృష్ణ మీనన్ జీవితంలోని పలు కోణాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ, కృష్ణ మీనన్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల గురించి ప్రస్తావించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు, కీలకమైన సమయాల్లో కృష్ణ మీనన్ వ్యవహరించిన తీరు గురించి వివరించారు. ఇతిహాసాలను ఎలా అయితే ఉన్నది ఉన్నట్లు అన్ని భాషల్లో తర్జుమా చేసినట్లే, దేశంలోని రాజకీయ చరిత్ర పరిణామాలను అన్ని భాషల్లో వాస్తవాలను మాత్రమే ప్రస్తావిస్తూ తర్జుమా చేయాలని, విశ్లేషించుకునే బాధ్యత ప్రజలకే అప్పగించాలని అన్నారు. 1962 యుద్ధ సమయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి మాట్లాడారు. యుద్ధం ముందు వరకూ కూడా బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరగలేదని, యుద్ధం కారణంగా బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తుచేశారు.
      గోథె హాల్లో న్యూ ఏజ్ ఫిక్షన్ మీద జరిగిన చర్చలో పాశ్చాత్య రచయిత్రులు ఫిలిప మార్టిన్స్, లినెట్ లౌన్స్ బరి మాట్లాడుతూ... ఆధునిక తరం కాల్పనిక సాహిత్యం సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను సమగ్రంగా చిత్రిస్తోందని అన్నారు. రచయితలు తమదైన దృక్పథంతో బలమైన రచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
      గోథె హాల్లో 'తవైవ్స్ అండ్ సెక్స్ వర్కర్స్' అంశం మీద సినీ దర్శకులు, రచయిత్రి సబా దేవన్, రచయిత అశోక్ అలెగ్జాండర్ మాట్లాడారు. ఇద్దరి మధ్య వ్యత్యాసాల్ని సబ వివరిస్తూ... తవైవ్స్ (తెలుగులో సానులు అని అనుకోవచ్చేమో) సంగీత, నృత్య కళాకారులని, సమాజంలో వారికి కొంత గౌరవం ఉండేదని, జీవితాన్ని స్వేచ్ఛాపూరితంగా వాళ్లు  గడిపేవారని, కానీ సెక్స్ వర్కర్స్ జీవితాల్లో స్వేచ్ఛ ఉండదని, తీవ్ర విధ్వంసం ఉంటుందని పేర్కొన్నారు. తన తవైఫ్ నామా పుస్తకం గురించి వివరించారు. తాను కలిసిన కొందరు తవైవ్స్ జీవితాల గురించి చెప్పారు. అశోక్ మాట్లాడుతూ.. తన సెక్స్ వర్కర్స్ పుస్తకంలో వాళ్ల జీవితాల్లోని కల్లోలాల్ని, హెచ్ఐవి  విజృంభించిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాల్ని వివరించినట్లు చెప్పారు. ఈ రచన కోసం సెక్స్ వర్కర్లని కలిసినప్పుడు వాళ్లు చెప్పిన కష్టాలను ఆయన చదివి వినిపిస్తుంటే హాల్లో అందరి హృదయాలు భారమయ్యాయి. 
  'కావ్యధార' వేదికపై 'కావ్య సంజె' బృందం కవితలను చదివి వినిపిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబించే కవితలను, హిందీ, ఆంగ్ల, కన్నడ భాషల్లో కవితాగానం చేశారు. కావ్యసంజె వ్యవస్థాపకురాలు మమతా సాగర్, యువ కవులు, రచయితల బృంద సభ్యులు శశాంక్, నామానా బి‌.ఎన్, రేష్మా రమేష్, చాంద్ భాషా, దాదాపీర్ జైమన్ తమదైన శైలిలో కవితలు చెప్తూ ఆలోచింపజేస్తున్నారు. 
      గోథె హాల్లో మధ్యాహ్నం ఇమ్మిగ్రంట్ వాయిస్ అంశం మీద భారత సంతతి రచయిత్రులు రషీద మార్ఫీ, రొయాన గొంసాల్వేస్ మాట్లాడారు. భారత్ నుంచి వందల ఏళ్ల క్రితం ప్రజలు ఆస్ట్రేలియాకి వలస వెళ్లారని రొయాన చెప్పారు. ఇలా ఇతర దేశాల నుంచి వెళ్లినవాళ్లు కొందరు మాతృ దేశంతో తమ పేగు బంధాల్ని అక్షరాల్లోకి తెచ్చారని పేర్కొన్నారు. ఇద్దరూ తమ గ్రంథాల్లోని కొన్ని పంక్తులు చదివి వినిపించారు. ఇప్పుడు విదేశాలకు వలసలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో వలస రచయితల రచనలకు అవకాశం చాలా ఎక్కువగా ఉందని రషీద పేర్కొన్నారు. విదేశాల్లోని మైనారిటీలు తమ పుస్తకాల్ని ప్రచురింపజేసుకునే స్థాయికి చేరడం ఆనదించదగ్గ విషయమని రొయాన అన్నారు.
      కార్వీ కనోపి వేదికపై 'ప్రస్తుత మీడియా రంగం- వాస్తవీకరణ చిత్రణ' అంశంపై చర్చా కార్యక్రమం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి కరోలిన్, పాత్రికేయులు, స్క్రోల్.ఇన్ ఎడిటర్, రచయిత నరేష్ ఫెర్నాండేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో న్యూస్ ఛానల్స్, పత్రికలు చట్టబద్ధత కోల్పోతున్నాయని, ఇది విచారించదగిన అంశమని నరేష్ అన్నారు. ఆస్ట్రేలియాలో మీడియాపై ఆంక్షలు,‌ స్వేచ్ఛ, రాజకీయాలు లాంటి‌ అంశాల గురించి కరోలిన్ తెలిపారు. మాధ్యమాలు వాస్తవాలను ప్రజలకు తెలీకుండా చేసినా, వారు నిశ్చితమైన అభిప్రాయాలు కలిగి‌ ఉంటారని, తగిన సమయంలో స్పందిస్తారని అన్నారు. అభిప్రాయాలు, వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని యువత గుర్తించాల్సిన అవసరం ఉందని నరేష్ అన్నారు.
      గోథె హాల్లో 'గాంధీ, అంబేద్కర్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియా' మీద నిశికాంత్ కోల్గే మాట్లాడారు. తన గాంధీ ఎగైనెస్ట్ కాస్ట్ బుక్ రాయడానికి గల నేపథ్యాన్ని వివరించారు. గాంధీ రచనల్ని చూసి కొందరు ఆయన కులాన్ని సమర్థించారని కొందరు అన్నారని, కానీ గాంధీ ఆచరించిన విధానాల్ని పరిశీలిస్తే కులాన్ని సమర్థించినట్లు ఎక్కడా కనిపించదని, వాస్తవంగా ఆయన విప్లవాత్మక సంస్కరణవాది అని పేర్కొన్నారు. అంబేద్కర్ లాగా గాంధీ కూడా సామాజిక సంస్కరణ కోసం తపన పడ్డారని చెప్పారు.అంబేద్కర్ దళితుల్ని ఏకం చేసి వాళ్ల హక్కుల కోసం పోరాటం జరిపితే, గాంధీ అందరూ చదువుకుని వృద్ధిలోకి రావాలని, అన్ని అసమానతలు తొలగిపోవాలని పిలుపునిచ్చారని వివరించారు. చిన్నతనంలోనే గాంధీ కుల, లింగ అసమానత్వాల్ని అధిగమించారని విశ్లేషించారు. గాంధీ చెప్పిన కొన్ని మాటల అసలు, అంతర్యాల్ని వివరించే ప్రయత్నం చేశారు. అప్పట్లో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు విషయం గురించి కూడా లోతైన విశ్లేషణ చేశారు.
      హైదరాబాద్  లిటరరీ ఫెస్ట్ సమాపన సదస్సులో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ మాట్లాడుతూ... ఇలాంటి ఫెస్ట్ లని రాజకీయాలు ఆవాహన చేసుకున్నాయని, కానీ లిటరరీ ఫెస్ట్ లు వాటిలాగే ఉండాలని, బుక్స్, విమర్శకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. జ్ఞానం జోలికి రాజకీయాలు ఎప్పుడూ రాకూడదని పిలుపునిచ్చారు. ప్రశ్నించడం, పరిశీలించడం భారతీయ విధానమని, రాజకీయాలు అన్నింటిని శాసిస్తున్న తరుణంలో వాటిని మనం నిలుపుకోవాలని అన్నారు. రచయితలు తమ రచనల్లో వాస్తవాలు చెప్పాలని, తమ భావజాలాన్ని పాఠకుల మీద బలవంతంగా రుద్దకూడదని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాలు భిన్న కోణాల్లో ప్రభావం చూపుతున్న ప్రస్తుత సమయంలో కూడా మంచి రచనలు వచ్చే అవకాశం ఉందని నొక్కి వక్కాణించారు. రచయితలకు ఎలాంటి భావజాలం ఉన్నప్పటికీ జ్ఞానానికి దాన్ని అంకితం చెయ్యాలని, అప్పుడే తమ రచనకు ప్రయోజనమని పేర్కొన్నారు.  ఇంగ్లీషు బుక్స్ చదవడం మంచిదేగాని, తెలుగు సాహిత్యం, తెలుగులో వచ్చిన ఇతర రంగాల పుస్తకాలు, ఇతర భాషల పుస్తకాలు ఎందుకు చదవకూడదని, ఇలాంటి ఫెస్ట్ లలోకి అవి ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. రాబోయే ఫెస్టివల్ లో దీని గురించి ఆలోచిస్తామని ఫెస్ట్ కమిటీ చైర్మన్ జయేష్ రంజన్ చెప్పారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం