తెలుగు మాటే వెలుగు బాట

  • 623 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా. ఉమ్మడిశెట్టి రాధేయ

  • అనంతపురం
  • 9985171411
డా. ఉమ్మడిశెట్టి రాధేయ

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడియెదవు సంగతేమిటిరా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా...
అమ్మభాష అవమానపడినప్పుడు కవి గుండె మండుతుంది. కవనయోధుడి కలం ఆవేదనాగ్నులను జ్వలిస్తుంది. కాస్త ఘాటుగానైనా సరే కర్తవ్య బోధ చేస్తుంది. కాళోజీ అదే పని చేశారు. ఆయన తర్వాత కూడా చాలామంది కవులు ఆ బాధ్యతను నిర్వర్తించారు. అక్షరాల్లో మాతృభాషాభిమానాన్ని రంగరించి కవితలల్లారు. తెలుగు మాటే జాతికి వెలుగుబాట అని నినదించారు.  
భాష
మన సజీవ సంస్కృతి. భాష మనిషి సృజన శక్తికి ఆలంబన. ప్రతి నాగరిక సమాజానికి తనదైన భాష ఉంటుంది. ఆ భాషవల్ల ఆ జాతికి గుర్తింపు వస్తుంది. ‘‘దైవములు లేరు తన కన్నతల్లి కంటె/ భాగ్యములు లేవు, తన తల్లిభాష కంటె/ స్వర్గములు లేవు, తన తల్లి దేశంబు కంటె...’’ అన్నది యథార్థం. కానీ, తెలుగువాళ్లే తెలుగును దూరం పెడుతున్నారు. ఈ పరిస్థితులను చూసిన కవిలోకంలో ఏదో ఆవేదన! జాతి అస్తిత్వానికి ఆయువు పట్టయిన అమ్మభాషకు ఇదేం దుస్థితన్న ఆక్రోశం!! ఒక్క తెలుగునాటనే కాదు యావత్‌ భారతమంతా ఇదే దౌర్భాగ్యం!! అందుకే ‘‘కూర్చున్న కొమ్మ నరుక్కునే/ ఉన్మత్త భారతీయుల/ ఇంగ్లిషు కేకల్లో/ మాతృభాష వల్లకాడు వెదుక్కుంటోంది/ మన సంస్కృతి మీద పగబట్టిన/ ఎలక్ట్రానిక్‌ తెరలమీద ప్రవహించే/ పాశ్చాత్య కాలువల ఒడ్డున/ దేశమాత బండల కేసి తలబాదుకుంటోంది’’! అంటారు అద్దేపల్లి రామ్మోహనరావు. అంతకు మించి మరేం చేయగలదు ఆ పిచ్చితల్లి!? 
      ‘తెలుగుతల్లీ! నేను నీ పిండాన్ని, మాతృగర్భంలోంచి మాట్లాడుతున్నాను. భాషాభారతంలో బాధాతప్త అక్షరాన్ని. ఉమ్మనీటి కన్నీటితో చెమ్మగిల్లే దుఃఖితురాల్ని. నా ఆకారమంతా ‘అ’ కారంలోనే కనపడుతుందమ్మా! నన్ను చెత్తకుండీలో వేయొద్దు... మురుగు కాలువలో తోయొద్దు నా భాషనూ, నా శ్వాసనూ నులిపేయకమ్మా! నన్ను వెలివేయకమ్మా...’ అంటూ తెలుగు భాషాభిమానాన్ని పురిటికందు రోదనగా వినిపించారు ఎండ్లూరి సుధాకర్‌. అక్షరాల్లోకి అనువాదమైన ఆయన ఆవేదన ఇది... ‘‘అమ్మా నన్ను జీవించనివ్వు/ నన్ను తెలుగులో భాషించనివ్వు/ ఆ విదేశీ పానీయాలు మానేయమ్మా/ ఆ విషజ్వాలలు నాదాకా రానీయకమ్మా/ పోతపాలు/ పోతభాష/ దేహానికీ చేటు/ దేశానికీ చేటు/ అమ్మా! రేపు నన్ను/ ఏ కాన్వెంటులో చదివిస్తావు/ ఎన్ని లక్షలు పోసి/ నాకో భాషా బలిపీఠం నిర్మిస్తావు?/ ఎన్ని జన్మలెత్తినా, ఎత్తకున్నా/ ఈ జన్మకు మాత్రం/ తెలుగు పాపాయినై పుడతాను/ తెలుగు తేజాన్నై పెరుగుతాను/ ఎవరైనా రేపు/ నా ప్రాచీనతని ప్రశ్నిస్తే/ అమ్మనీ/ అమృతాన్నీ/ ఆకాశాన్నీ చూపిస్తాను’’! బిడ్డ ఆరోగ్యానికి పోతపాలు భరోసానివ్వలేవు. జాతి అభివృద్ధికి పోతభాష పూచికత్తు కాలేదు. అలాంటి దానికోసం వెంపర్లాడాలా?  
ఆ బంధం బీటలు వారితే... 
తల్లివేరు తెగిపోతే ఆకుపచ్చ పాట ఎలా ఎదిగి వస్తుంది? అమ్మభాష చితికిపోతే బతుకుబాట పాట ఎలా ఎరుక వస్తుంది? ‘‘ఉగ్గుపాల సార మిగిరిపోతే/ నాల్కమీద మాట ఎలా నడిచివస్తుంది?/ ప్రజలభాష జాడ చెరిగి పోతే/ రక్తఘోష వికాసం/ ఎలా ఎదను తడుతుంది/ నేలచాళ్ల నడుమ వికసించే/ అక్షరాన్ని పొదువుకో/ కాలరేఖ తీరాన ఉదయించే/ తెలుగువెలుగు నింపుకో’’మని చెబుతూ, మట్టిలోని మూలాలను వెదికి చూసుకోమంటారు పీఎస్‌ నాగరాజు. దీన్నే రెంటాల శ్రీవేంకటేశ్వరరావు మరోలా చెబుతారిలా.. ‘‘పరువనుకొని, సిరికొరకని పరభాషకు పరుగు/ ఫలితం గమనించావా? ఒక పరాయి బతుకు/ భాషంటే మాట కాదయా సంస్కృతి మూట/ నిన్ను నిన్నుగా నిలిపే సొంతపలుకు పలుకు’’! అవును... అమ్మభాషను కాదనుకోవడమంటే మనదైన ఉనికిని మనమే చీదరించుకున్నట్లే!! మరో వైపు... ‘‘అమ్మని వృద్ధాశ్రమానికి పంపి/ అమ్మభాషను పడమటి కబేళాకి దింపి/ గుండె మువ్వల్లో దారాన్ని తెంపి/ సృజన గువ్వల రెక్కలు చింపి/ఈ భాషాబానిసత్వం ఎక్కడిది? ఈ భావదాస్య సంక్షోభం ఎప్పటిది?/ భాష కోసం జ్ఞానమా?/ జ్ఞానం కోసం భాషా?/ ప్రజల భాషలో విద్య నేరమెలా అవుతుంది?’’ అని ప్రశ్నించే నాగరాజు కలానికి బదులిచ్చే వాళ్లెవరు?
      ‘‘నానాటికీ చిక్కిపోతున్న మాతృభాష/ చిక్కనౌతున్న ఆంగ్లభాష/ పరస్పర పలకరింపుల్లోనూ/ పరాయి భాషే పరాకాష్ఠ నొందుతుందంటే/ పరాధీనంగా బతుకులు గడిపేందుకు/ సిద్ధమవట మంటే/ తాకట్టుకు తలొగ్గుటే కదా!’’ అంటూ 21వ శతాబ్దంలో కొత్తరూపం తీసుకున్న బానిసత్వాన్ని అక్షరీకరించారు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. చిన్నప్పుడు అమ్మమ్మ నూరిపోసిన వస మళ్లీ మళ్లీ నూరిపోయండి... నేను తెలుగువాణ్నని ధ్రువీకరించుకుంటాను... నా భాషే నా గుర్తింపని గర్వపడతాను... ఇది ఈతకోట సుబ్బారావు అంతరంగ ఆవిష్కరణ. ‘‘ఇంగ్లిషు పిలుపుల కృత్రిమ అనురాగ ధారలో/ దాహం తీరని ఎడారి గొంతుకని నేను/ ఇప్పటికీ పంజరంలోని మా రామచిలుక ముందు/ బానిసలా నిలబడి అచ్చులు హల్లులు/ అప్పగించు కుంటాను/ ఎన్ని ప్రపంచ భాషల అక్షరాలు నేర్చినా/ నా నరనరాల్లో ప్రవహించే విద్యుత్తు... తెలుగు/ నా అచ్చులూ, హల్లులూ తెలుగు కోకిలే’’ అంటూ అమ్మభాషాభిమానాన్ని చాటుకున్నారాయన. 
అమ్మానాన్నల్లారా...
ఎందుకీ తెలుగుతనం లేని బతుకు? బురదలో తామరలా... ముళ్ల మధ్య గులాబీలా తలెత్తుకుని బతకలేని భేషజం నిరర్థకం, నిర్వీర్యం కాదా? అని ఏటూరి నాగేంద్రరావు నిలదీశారు. ‘‘ఇక మాట్లాడకండి/ అమ్మను మర్చిపోయిన/ వృద్ధాశ్రమ నిర్మాతలం మనం/ అమ్మ నేర్చిన పలుకుబడుల్ని సైతం/ పరాయీకరణకు అంకితం చేశాం/ భూమ్మీద కాళ్లానించి/ ఆకాశపు కలలు కన్నంతకాలం/ తోటను మరిచి/ కేవలం పూలని ప్రేమించినంత కాలం/ మన కన్నతనానికి గుర్తుగా/ అమ్మానాన్నల నుంచి/ ‘మమ్మీడాడీ’లుగా మారిపోయిన మనం/ థూ... సిగ్గులేని వాళ్లం’’ అంటూ వాతలు పెట్టారు.
      అమ్మను ప్రేమిద్దాం రండి! మన మట్టితల్లి సాక్షిగా మన అమ్మభాషను కాపాడుకుందాం రండి! అంటూ మాతృభాషా ఉద్యమాన్ని మనసారా సమర్థించిన కవయిత్రి సి.వేదవతి. ‘‘తెలుగుబిడ్డ నోట తెలుగు పట్టకపోవడం/ పెద్దలకే తెలుగు పలకడం చిన్నతనమే అయిపోవడం/ అసలు తెలుగు తనకు నామర్దా అయిపోవడం/ ఎందుకింత విస్మృతి? ఎందుకీ తిరస్కృతి?/ ఎదురు దెబ్బలు తగిలినా, ఎదతూట్లు పడినా/ అప్రయత్నంగా నీనోట ఉరికే భాష/ ఆకటి వేళల, అలుపైన వేళల/ ఆదుకునే ఆర్తినితీర్చే సాంత్వననిచ్చే అమ్మభాష/ అసలైన నీ ఆత్మభాషను/ భవిష్యత్తరాలకు అందించే బాధ్యత నీది- నాది’’ అంటూ కర్తవ్యోపదేశం చేశారామె. బ్రౌను తదితర మహనీయులను గుర్తుచేస్తూ... ‘‘నీదికాని బతుకు నీది/ పరాయివాడు వచ్చి నీ భాషకు సేవ చేశాడు/ మరొకడు వచ్చి నీ సాంస్కృతిక వైభవాన్ని/ చూచి తలమునక లైపోయి తన గ్రంథంలో రాసుకున్నాడు/ నువ్వు నీ భాషను మాట్లాడవు/ నీ పిల్లలు నీ భాషను చదవరు/ భవిష్యత్తులో నీ భాష చచ్చిపోతుందంటే ఉలిక్కిపడతావేం!/ చంపేస్తోంది నువ్వే కదా!/ ఇప్పటికైనా తెలుసుకో/ అమ్మను కాపాడుకో’’మంటారు డా।। సీహెచ్‌ సుశీల.
మేమే సైనికులం...
ఈ పరిస్థితుల్లో ఆంగ్ల భాషాధిపత్యం మీద పోరాడటమే అక్షర ప్రేమికుల తక్షణ కర్తవ్యమంటారు సరికొండ నరసింహరాజు. ‘‘నిన్నటిదాకా/ దొరసాని ఇంట్లో/ దాసియైన అక్షరం అమ్మ/ నేడు తన ఇంట్లో తానే/ ఓ బానిస/ అక్షరాల్ని తెల్లగద్దలు తన్నుకపోతుంటే/ పహారా కాయాల్సిన బిడ్డలే/ పసందుగా నవ్వుకొంటున్నారు/ అక్షరానికి గాయమైతే/ నా గుండెకు రక్తం కారుతుంది/ నా అక్షరాల పొలాన్ని నేనే పహారాకాస్తా/ నా చివరి రక్తపుబొట్టు వరకు/ అక్షరానికి అంగరక్షకుడనై ఉంటా’’నని ప్రతిజ్ఞ చేశారాయన. 
      ‘‘జలజలజారే ముత్యాల మాతృభాష/ చీకటిగుహల్లో చిక్కుకున్న కుక్కపిల్లలా/ నిశిరాత్రి గుండెల్ని పిండేస్తుంది/ మమ్మీ, డాడీల ముఖమల్‌ ముసుగులో/ పాలపొదుగులాంటి తియ్యని తల్లి భాషకూ/ పాలడబ్బా వంటి పరాయి భాషకు/ పోలికలు వెతకడం/ నట్టడవిలో గుండుసూదిని దేవులాడటమే/ మా అమ్మ పొత్తికడుపు నుండి/ నేజారినప్పుడు నన్ను ముద్దాడిన భాషే/ నా ప్రాణవాయువు’’... అన్న షేక్‌ కరీముల్లా అక్షరాలు అందరికీ స్ఫూర్తి మంత్రాలే. ‘మధురమైన నా మాతృభాషను మసకబారనివ్వను... నా భాషను పరాయీకరణకు బానిసగా కానివ్వను... ఉగ్గుపాల సాక్షిగా ఉదరంలో పదిల పరుచుకుంటాను’ అంటారు సీహెచ్‌వీ బృందావనరావు. ‘‘అమ్మ కడుపులోంచే తెచ్చుకున్న/ కమ్మని ఆ పీయూష భాండాన్ని/ పరాయి ప్రభావాల వొత్తిళ్లకు లొంగి/ పగులగొట్టుకుంటానా ఇప్పుడు/ కర్ణుడి కవచకుండలాల్లాగా/ కాయంతోనే కలిసిపోయిందది/ మసక బారనిస్తానా ఎప్పటికైనా/ మధురమైన నా ‘మాతృభాష’ ను/ తేనెలాంటి తెలుగు బాసను’’... ఇదీ ఆయన ప్రతిజ్ఞ. నిజానికిది మొత్తం కవిలోకపు విస్పష్ట ప్రకటన. కవుల వాక్కులే భాషోద్యమ నినాదాలైనప్పుడు, వెలుగుకు తరుగుండదు. తెలుగుకు తిరుగుండదు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం