ఏది ఆంధ్రం? ఏది తెలుగు?

  • 2250 Views
  • 11Likes
  • Like
  • Article Share

సివిల్‌ సర్వీసులు, డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, నెట్, సెట్‌ లాంటి పోటీ పరీక్షల్లో తెలుగు, దానికి ప్రత్యామ్నాయంగా వాడే ఆంధ్రం, తెనుగు గురించి వ్యాసరూప, బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఈ పదాల పుట్టు పూర్వోత్తరాల గురించి వివిధ వాదనలు ఉన్నాయి.
అంధ,
అంధ్రక, అంధ్ర, ఆంధ్ర రూపాంతరాలని టి.బరో అన్నాడు. సంస్కృతంలో అంధ్ర, ఆంధ్ర పదాలు రూపాంతరాలు. ఆంధ్ర శబ్దానికి చీకటిని తరిమేసేవారు, నీటిమీద ప్రయాణం చేసేవారు (నావికులు), అన్నం పెట్టేవాడు (అన్నదాత) అని అంధ+ రః అన్న దానికి వ్యుత్పత్తుల్ని సూచించారు వడ్లమూడి గోపాలకృష్ణయ్య. అయితే అంధ (అంధకారం, చీకటి) అనే సంస్కృత ధాతువు మీద రన్‌ అనే ప్రత్యయం చేరి అంధ్ర పదం వచ్చిందంటారు. దీనికి కారణం... వింధ్య పర్వతాలకు ఇవతల ఉన్న ప్రాంతం గురించి ఆర్యులకు తెలియదు. తమకు తెలియని ప్రాంతాన్ని చీకటిలో ఉన్నట్లు పేర్కొనడం సహజం. ఆఫ్రికాను చీకటి ఖండం అంటారు కదా! అలాగే ఈ ఆంధ్ర పదాన్నీ ఆర్యులూ ప్రయోగించి ఉంటారు.
జాతి - దేశం - భాష
అంధ, ఆంధ్ర పదాలు అతిప్రాచీన కాలంనుంచే జాతివాచకంగా వ్యాప్తిలో ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణంలో మొదటిసారిగా ఆంధ్ర పదాన్ని జాతివాచకంగా ప్రయోగించారు. శునశ్శేఫుణ్ని తమ అన్నగా అంగీకరించాల్సిందిగా విశ్వామిత్రుడు తన నూరుగురు కుమారుల్ని ఆదేశిస్తాడు. దీనికి మొదటి యాభై మంది ఒప్పుకోరు. దాంతో వాళ్లను ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబ మొదలైన దస్యజాతుల్లో కలిసిపోవాలని శపిస్తాడు. వీళ్లు ద్రావిడులు కావచ్చు. అలా క్రీ.పూ. ఆరో శతాబ్ది నాటికి ఆంధ్ర పదం వాడుకలో ఉంది. ఇక మహాభారతంలో మయసభలో ధర్మరాజును కొలిచినవారిలో ఆంధ్రులు ఉన్నారు. మనుస్మృతిలో కారావర స్త్రీకి, వైదేహునికి పుట్టిన వాళ్లే ఆంధ్రులని ఉంది. పురాణాల్లో ఆంధ్రభృత్యుల (శాతవాహనులు) గురించి ప్రస్తావించారు. మెగస్తనీసు, అశోకుని 13వ శాసనం, ఉద్యోతనుని కువలయమాలలో జాతివాచకంగా ఆంధ్రుల్ని పేర్కొన్నారు. ఆంధ్రులు అంటే సంస్కృతంలో వేటగాళ్లు అని అర్థం. 
      దేశవాచకంగా ఆంధ్రపదం రామాయణ మహాభారతాల్లో కనిపిస్తుంది. రామాయణంలో సీతాన్వేషణ, భారతంలో సహదేవుడి దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భాల్లో ఆంధ్ర దేశం ప్రస్తావన ఉంది. బలి కుమారుల్లో ఆంధ్రుడనేవాడు రాజ్యాన్ని స్థాపించినట్లు భాగవతం పేర్కొంది. ఇక బౌద్ధ గ్రంథాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సమానంగా అంధరట్ట అని ప్రయోగించారు. శివస్కంధవర్మ మైదవోలు శాసనంలో అంధాపథం, మల్లిదేవనందవర్మ దానశాసనంలో ఆంధ్రమండలం, వరాహమిహిరుని బృహత్సంహితలోనూ ఆంధ్ర పదాన్ని దేశవాచకంగా ప్రయోగించారు. 
      భరతముని నాట్యశాస్త్రంలో నాటకంలో ఉపయోగించదగిన భాషల్లో ఆంధ్రం ఒకటి అని చెప్పాడు. 11వ శతాబ్దినుంచి ఆంధ్ర పదం భాషా వాచకంగా కనిపిస్తోంది. నన్నయ నందంపూడి దానశాసనంలో నారాయణభట్టును అష్టభాషా విశారదుడిగా పేర్కొన్నాడు. అందులో ఆంధ్ర భాష ఒకటి. నన్నయ ఆంధ్ర శబ్ద చింతామణి, కేతన ఆంధ్ర భాషా భూషణంలో ఆంధ్ర పదం భాషావాచకమే. 
త్రినగమే తెనుగా?
తెలుగు, తెనుగు పదాలకు తేలివాహ నది తీరం వాళ్లు, తెల్లనివారు, తేనెలాంటి భాష కలిగినవారు అని వివిధ వ్యుత్పత్తులు ఉన్నాయి. కానీ అవేవీ అంగీకారాలు కావు. తెనుగు పదాన్ని మొదటిసారిగా నన్నయ మహాభారతంలో, సారమతింగవీంద్రుల పద్యంలో తెనుంగునన్‌ మహాభారత సంహితారచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్‌; జననుత కృష్ణద్వైపాయన పద్యంలో తెనుఁగున రచియింపు మధిక ధీయుక్తిమెయిన్‌ అని తెనుంగు, తెనుఁగు పదాలను భాషావాచకంగా ప్రయోగించాడు. తర్వాతి కాలానికి చెందిన నన్నెచోడుడు కుమారసంభవంలో తెనుంగు పదాన్ని రెండుసార్లు ప్రయోగించాడు. అందులో జానుతెనుంగు ఒకటి. పాల్కురికి సోమనాథుడు, తిక్కనలు తెలుంగు, తెలుఁగు, తెనుఁగు అని తమ రచనల్లో ప్రయోగించారు.
      తెనుగు త్రినగ శబ్దానికి తద్భవమని చిలుకూరి నారాయణరావు ప్రతిపాదించారు. శ్రీశైలం, మహేంద్రగిరి, శ్రీకాళహస్తిలను త్రినగాలని పేర్కొంటారు. ఇది ఊహ మాత్రమే. గంటిజోగి సోమయాజి తెనుగు అంటే దక్షిణదిక్కును సూచించేదిగా పేర్కొన్నారు. ఇది దేశ్యపదం. తెనుంగు, తెనుగులో ‘గు’ ప్రత్యయం. తెన్‌ మీద ఇది చేరుతుంది. తెన్‌ అంటే దక్షిణ దిక్కు. ఇప్పటికీ తీరూ తెన్నూ, టెంకాయ (తెంకాయ) లాంటి వాటిల్లో ఈ తెన్‌ అనే మూలద్రావిడ ధాతువు మిగిలే ఉంది. తమిళ గ్రంథాల్లో తెలుగువారిని ఉత్తరం దిక్కువారు అన్న అర్థంలో ‘వడుగర్‌’ అని సంబోధించారు.
      ఇక తెలుగును సంస్కృత త్రిలింగ శబ్దానికి తద్భవంగా భావించారు. వాయు, బ్రహ్మాండ, స్కాంద పురాణాల్లో త్రిలింగ పదం కనిపిస్తుంది. విద్యానాథుని ప్రతాపరుద్రీయంలో తొలిసారిగా శ్రీశైలం, దాక్షారామం, కాళేశ్వరం మూడు శైవక్షేత్రాలను కలిగిన నేల కనుక ఈ నేలకు, భాషకు త్రిలింగం అనే పేరొచ్చిందన్నాడు. విన్నకోట పెద్దన కావ్యాలంకార సంగ్రహంలో కూడా త్రిలింగ శబ్దాన్ని శైవక్షేత్రాల పరంగానే చెబుతూ, తెలుగు త్రిలింగకు తద్భవం అన్నాడు. అప్పకవి కూడా ఇదే పేర్కొన్నాడు. రాజశేఖరుని విద్ధసాలభంజికలో ‘త్రిలింగాధిప’ ప్రయోగం ఉంది. ఇది వీరశైవ మత ప్రభావం వల్ల వచ్చి ఉండవచ్చు.
      మరోవైపు తెలుగుకు సంస్కృతీకరణే త్రిలింగం అని కొమర్రాజు లక్ష్మణరావు అంటే, ఇది త్రికళింగం నుంచి పుట్టిందన్నారు గంటిజోగి సోమయాజి. ఇక చిలుకూరి నారాయణరావు త్రికళింగ శబ్దం నుంచి పుట్టింది తెలుగు అన్నారు. వీటిని పక్కనపెడుతూ తెనుగు, తెలుగు పదాలు రూపాంతరాలని ప్రతిపాదించారు భాషావేత్తలు. 
      తెలుగులో ణ, ళ, న, ల ల వినిమయం సాధారణం. మునగను ములగ, ములుకోలను మునుకోల, లేదును నేదు, లచ్చిని నచ్చి అనడం సహజం. అలా న, లల వినిమయం వల్ల తెనుగు, తెలుగు అనే రెండు రూపాలూ వాడుకలో ఉన్నాయి. సాహిత్యం పరంగా చూస్తే మొదట తెనుగు, తర్వాత తెలుగు పుస్తకాల్లోకెక్కాయి. 
      మొత్తానికి ఆంధ్ర పదం తొలుత జాతివాచకంగా, తర్వాత దేశ, భాషా వాచకంగా వాడుకలోకి వచ్చింది. తెలుగు, తెనుగు పదాలు దక్షిణ దిక్కును సూచించేవి. అలా తెలుగు భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు మూడు పదాలూ వ్యవహారంలో ఉన్నాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం