విజయ ‘ఉల్లాసం’

  • 116 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। జడా సుబ్బారావు

  • తెలుగు అధ్యాపకుడు, నూజివీడు
  • 9849031587
డా।। జడా సుబ్బారావు

విశేషార్థాల పద్యవిన్యాసమే ‘విజయవిలాసం’. ఇందులో ప్రతి పద్యమూ చమత్కారాలమయమే. దీని రచనలో చేమకూర వేంకటకవి చూపిన ప్రజ్ఞ అనన్య సామాన్యం. అందుకే ‘ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉంది’ అని ఒక రసజ్ఞుడు అభిప్రాయపడితే; ‘ఈ చేమకూర చక్కెరమడిలో అమృతము పారించి పెంచిందిగాని మట్టిలో నీరు పారించి పెంచింది కాద’ని మరొకరు ప్రశంసించారు. 
‘ప్రతి పద్యాన్నీ
చమత్కారంతో భాసింపజేయగలవు’ అంటూ రఘునాథ నాయకుడి ప్రశంసలు అందుకున్న సరస్వతీపుత్రుడు చేమకూర వేంకటకవి. ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరు కదా’ అని వాపోయినా ‘విజయవిలాస’ ప్రబంధంతో తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు.
      విజయనగర సామ్రాజ్య వైభవం రాక్షసితంగడి యుద్ధంతో ముగిసిపోయింది. అలా చెదిరిపోయిన సామ్రాజ్యంలో తంజావూరు, మధుర, మైసూరు, చెంజి, పుదుక్కోట మొదలైన చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. తమిళ, కన్నడ నేలలకు తెలుగు సాహిత్యం, కళలు గత వైభవాన్ని వెతుక్కుంటూ వలసవెళ్లాయి. తెలుగునేలకు దక్షిణంగా సాహితీ సృజన జరిగింది కాబట్టి ఇది దక్షిణాంధ్ర యుగ సాహిత్యంగా నిలిచిపోయింది. 1600- 1630 ప్రాంతంలో తంజావూరును పాలించిన రఘునాథ నాయకుడు అపరరాయలుగా కీర్తి పొందాడు. ఆయన స్వయంగా కవి పండితుడు. అందుకే 1600- 1855 మధ్య కాలాన్ని ‘రఘునాథ యుగం’గా చెబుతారు. 
      కవిత్వం కర్పూరం కుప్పలు పోసినట్లు, విరిపొట్లాలు విప్పినట్లుగా ఉండాలన్నది రఘునాథుడి భావన. ‘రఘునాథ మేళ’ పేరుతో కొత్త మేళవింపు రాగాన్ని సృష్టించడం ఆ రాజు ప్రతిభకు, సంగీత నైపుణ్యానికి నిదర్శనం. కవయిత్రులను ప్రోత్సహించి, వారికి సాహిత్య మెలకువలను నేర్పించి అద్భుత కావ్యాలను రచించేలా చేసిన సహృదయమూర్తి రఘునాథుడు. మధురవాణి, రామభద్రాంబ తదితర కవయిత్రులను ఆదరించాడు. 
      కృష్ణదేవరాయల ‘భువన విజయం’లానే రఘునాథుడి ‘విజయ విలాస’ భవనంలో జరిగే పండిత చర్చల్లో పాల్గొంటూ, వాళ్ల పద్యాలను శ్రద్ధగా వింటూ తాను పద్యాలు అల్లడం, సన్నివేశాలు వర్ణించడం అలవరుచుకున్నాడు చేమకూర. అందుకేనేమో తన విజయవిలాసాన్ని రఘునాథ నాయకుడికే అంకితమిచ్చాడు. ఈ కావ్యంతో పాటు ‘సారంగధర చరిత్ర’ అనే మరో రచనా చేశాడు వేంకటకవి. సూర్యనారాయణ వరప్రసాదంతో చిన్ననాటి నుంచే తనకు కవిత్వం అబ్బిందంటాడాయన. 
పార్థుడి ప్రణయగాథ
ఒక నాయకుడు, ముగ్గురు నాయికలతో మూడు ఆశ్వాసాలలో కూర్చిన ముచ్చటైన ప్రబంధం ‘విజయవిలాసం’. ఇది వర్ణన ప్రధానమైన, శ్లేషతో కూడిన కావ్యం. తనను వలచిన ప్రౌఢ ఉలూచి, తాను వలచిన మధ్యనాయిక సుభద్ర, వీళ్లిద్దరి మధ్యలో ముగ్ధ చిత్రాంగదతో అర్జునుడి వివాహ ఘట్టాలే దీని ఇతివృత్తం. 
ద్వారక ముద్దు జెల్లెలట తన్నగరీమణి సృష్టి యన్నిటన్‌
దేరుగడైనచో నిదియ నేర్పుల మేరని యెంచి చేసే బో
ధారుణి విశ్వకర్మ, గురి దానికి నెక్కడ నీడులేని సిం
గారము గల్గు, టట్లు వెనుకన్‌ సృజియింపక యుండుటే సుమీ

అన్ని విషయాల్లోనూ ఆరితేరిన దేవశిల్పి, నగర నిర్మాణంలో దీన్ని మించింది లేదనేటట్లు ఇంద్రప్రస్థ పురాన్ని నిర్మించాడట. అందుకే సంపదకు, విలాసానికి, విద్యకు నిలయమైన ఇంద్రప్రస్థపురం ద్వారకకు ముద్దుచెల్లెలని చెబుతున్నాడు కవి. 
      గదుడి ద్వారా సుభద్రను గురించి విన్నాడు అర్జునుడు. ఎలాగైనా సుభద్రను పెళ్లాడాలన్న ఆరాటం పార్థుడి మనసులో నాటుకుపోయింది. అందువల్లే ఇంద్రప్రస్థాన్ని సూచిస్తూ ‘ద్వారక ముద్దుచెల్లెలు’ అనే మాట వాడాడు కవి. అంటే ద్వారకాధీశుడైన కృష్ణుని ముద్దుచెల్లెలు సుభద్ర. ఇంద్రప్రస్థం, ద్వారకానగరం రెండూ తోబుట్టువులే, అయినా ద్వారక కంటే శ్రేష్ఠంగా విశ్వకర్మ ఇంద్రప్రస్థాన్ని మలచాడన్న భావాన్ని స్ఫురణకు తెస్తున్నాడు. ప్రబంధ లక్షణాల్లో పురవర్ణన ఒకటి.
ఏకనాయకాశ్రయత్వం...
ఇది ప్రబంధాల మరో ప్రధాన లక్షణం. ‘విజయవిలాసం’ కథానాయకుడు అర్జునుడు. పాండవ మధ్యముడు. అటు అన్నలపట్లా, ఇటు తమ్ములపట్లా సమాన ఆదరం ఉన్నవాడు. మహావీరుడు. సత్యస్వభావం, ధర్మప్రవర్తనలో అతనికి అతనే సాటి.
అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముడు సోయగమ్మునన్‌
పతగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్‌
క్షితిధర కన్యాకాధిపతికిన్‌ ప్రతిజోదు సమిజ్జయము నం
దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్‌

      అర్జునుడు అందంలో ఇంద్రుడి కుమారుడు జయంతుని వంటివాడట. అర్జునుడు కూడా కుంతికి ఇంద్రుడి వరంగా పుట్టినవాడే. అంటే జయంతుడికి అర్జునుడు తమ్ముడేనన్న చమత్కారం ఈ పద్యంలో ఉంది. దయా స్వభావంలో విష్ణువుకు (శ్రీకృష్ణుడికి) ప్రాణస్నేహితుడట. యుద్ధ విజయంలో శివుణ్ని పోలినవాడట. ప్రతిజోదు అంటే పోల్చదగినవాడు. కిరాతుడి వేషంలో ఉన్న శివుణ్ని అర్జునుడు ఎదిరించి పాశుపతాస్త్రం పొందాడు. కనుకనే ‘ప్రతిజోదు’ ప్రయోగం. భూమండలం అంతటిలోనూ అర్జునుడికి సాటి మరెవరూ లేరట. అందుకే ‘అతనికతండె సాటి’ అంటూనే ‘అతని నుతింప శక్యమే?’ అని ప్రశ్నిస్తూ అర్జునుడి ప్రాధాన్యాన్ని తెలియజేస్తాడు కవి. 
విని వలచిన ఉలూచి
కావ్యంలోని ముగ్గురు నాయికలనూ ఒక్కక్క ప్రత్యేక లక్షణంగలవారిగా తీర్చిదిద్దాడు చేమకూర. సంభాషణలతోనే సరస సల్లాపాలను ఒలికించి కావ్యాన్ని రక్తి కట్టించడం వేంకటకవి ప్రత్యేకత. ప్రౌఢకన్య ఉలూచికి తానున్న భోగవతి నుంచి భాగీరథీ నదీ తీరానికి రావడం అలవాటు. ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లిన కామరూప భోగుల ద్వారా మత్స్యయంత్రాన్ని ఒక్క వేటుతో ఛేదించి గెలిచిన అర్జునుడి గురించి విన్నది. అప్పటినుంచి ఆమె హృదయంలో ప్రేమబీజం నాటుకుంది. తాను ఆరాధిస్తున్న ఆ అర్జునుడు తనకు కనిపించిన క్షణంలో ఒక్కసారిగా ఎంతో సంచలనానికి గురైంది ఉలూచి.
గుట్టసియాడ గబ్బిచను గుట్టలపై పుల కాంకురావళుల్‌
తెట్టువ గట్ట కోరికలు తేటలు వెట్టగ వేడుకల్‌ మదిన్‌
దొట్టికొనంగ నచ్చెరువు తొంగలి రెప్పల  వీగనొత్తగా
బెట్టిన దండతీయక విభీత మృగేక్షణ సూచె నాతనిన్‌

      పరిచారికల ద్వారా అర్జునుడి రూపవిలాసాన్నీ, గుణగణాల్నీ, పరాక్రమ విజయాల్నీ విని అతనితో పొందు కావాలనే ఆరాటంతో తానే అర్జునుణ్ని వలచింది. అందుకే తీర్థయాత్ర చేసే సమయంలో గంగాతీరంలో ఉన్నప్పుడు వేకువజామునే అతణ్ని చూసింది. ఇతరుల మాటల ద్వారా వినడమేగానీ అప్పటి వరకు అర్జునుణ్ని తాను చూడలేదు. ఒక్కసారిగా చూడటంతో తెలియని ఆరాటానికి గురై తాను అర్జునుణ్ని ప్రేమించిన విషయాన్ని చెప్పడమా, మానడమా అనే సందిగ్ధంలో ఉన్న ఉలూచి మానసిక పరిణామాల్ని కవి పైపద్యంలో వివరించాడు. అందుకే ఉలూచిని ‘విభీత మృగేక్షణ’ (బెదిరిన జింక చూపులను నింపుకున్న అతివ) అని వర్ణించాడు. హెచ్‌.జి.వెల్స్‌ తన ‘లవ్‌ అండ్‌ లూయిషామ్‌’ నవలలో ఇలాంటి వర్ణన చేసినట్లు తాపీ ధర్మారావు ‘హృదయోల్లాస వ్యాఖ్య’లో చెప్పారు.
అందానికే అందం
మరో నాయిక చిత్రాంగద మలయధ్వజుడి గారాలపట్టి. ఈమె ముగ్ధ. కనీసం అర్జునుడి గురించి అంతకుముందెన్నడూ వినలేదు. ఈమె అందాన్ని చూసి పెళ్లి చేసుకోవాలని అర్జునుడే తాపత్రయపడ్డాడు. విశారదుడు చిత్రాంగద అందాన్ని వర్ణించి చెప్తూ ‘ఆహా! ఆమె అందం గురించి ఏమనవచ్చు’ అని చెప్పిన తర్వాత ‘చిత్రాంగదపాటి బోటి గలదా’ అనుకుంటాడు అర్జునుడు. 
      చిత్రాంగదను చూసిన అర్జునుడు మన్మథుడి చేష్టలవల్ల ఆమెమీద మోహాన్ని నిగ్రహించుకోలేక పోయాడు. శృంగారవనం లో చిత్రాంగదను చూసి ఆమె శరీరకాంతి బంగారం కంటే కాంతిమంతమైందిగా, పలువరసను ప్రశస్తమైన ముత్యాల మాదిరిగా, నూగారును నల్లని కస్తూరి కాంతికి నిలయంగానూ భావిస్తాడు. 
అని, కన్గొంటె విశారదా యానిన, ‘నాహా! యేమనన్‌ వచ్చు’, నో
జననాథాగ్రణి యీ వినూతన తనూ సౌందర్య మీక్షించినన్‌
దను దా మెచ్చు విధాత చిత్తమున, నీ తన్వంగితో బోల్పగా
నెనలే దెచ్చట జూడ మా తుహిన భూభృత్‌ సేతు మధ్యంబునన్‌

      ‘ఆహా ఏమనవచ్చు’ అనే విశారదుని ఆశ్చర్యం చిత్రాంగద సౌందర్యాన్ని చెప్పకనే చెపుతుంది. చిత్రాంగదను చూసిన అర్జునుడు ‘చూశావా విశారదా’ అనేసరికి విశారదుడు ‘ఏమనవచ్చు మహారాజా, ఆ కాంత అందం చూస్తే బ్రహ్మ తన సృష్టికి తనను తానే మెచ్చుకుంటాడు. హిమాచలం మొదలుకొని రామేశ్వరం వరకూ చూసివచ్చిన వాళ్లమే కదా. అయినా చిత్రాంగదతో పోల్చదగిన కాంత ఇంకెక్కడా లేదని నిర్ధారణగా చెప్పవచ్చు’ అంటాడు. ఇక్కడ నూతన తనూ అనే పదాన్ని ఎటునుంచి చదివినా ఒకేలా ఉండి, చక్కని చమత్కారాన్ని సాధించే పదంగా ప్రయోగించాడు కవి. 
విజయుడు మెచ్చిన వనిత
విజయవిలాస కావ్యంలో ముఖ్యమైన, కీలకమైన పాత్ర సుభద్ర. గదుడి ద్వారా సుభద్ర అందచందాల్ని విన్న అర్జునుడు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. తీర్థయాత్రల పేరుతో బయల్దేరిన అర్జునుడు ద్వారకలో కపటయతి వేషంలో బలరాముడి ఇంట్లో ప్రవేశిస్తాడు. ఒకప్పుడు అర్జునుణ్ని పొందడానికి ఉలూచి ఎంత అవస్థపడిందో, ఇప్పుడు సుభద్ర విషయంలో అర్జునుడు కూడా అదే విరహస్థితి పొందుతున్నాడు. అతని శుశ్రూష కోసం సుభద్రను నియమిస్తాడు బలరాముడు. యతివేషంలో ఉన్నది అర్జునుడు అని తెలియక అనేక సపర్యలు చేస్తుంది సుభద్ర. చివరికి ఆ రూపం అర్జునుడిదే అని గుర్తించినా సరిగా మాట్లాడదు. స్త్రీ సహజమైన సిగ్గు ఆమెను బయటపడనివ్వదు. అర్జునుడి మాటలు వినీ విననట్లుగా, అతని పనులు చూసీ చూడనట్లుగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ‘నన్ను ఇంత విరహ సముద్రంలో ముంచి నువ్వు చిత్తరువులా ఎందుకు అలా ఉంటావు?’ అని సుభద్రతో అన్నప్పుడు అర్జునుడి స్థితిని ఇలా వర్ణిస్తాడు చేమకూర.
ఏలే యాలేఖ్యాకృతి?
యేలే ప్రాలేయకర ముఖీ చూడవయో?
యేలే శైలేయ స్తని?
యేలే బాలేందు నిటల! యే లాతినటే

      ‘ఏలే’ అనే పదాన్ని పలుమార్లు వాడి పద్యానికి అందాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు ఆలేఖ్యాకృతిగా (మాట్లాడకుండా) ఉంటున్నావు. నేను నీకు దగ్గరివాడను, మేనబావనే కదా. నా విరహాన్ని ఇంకా పెంచడం మంచిది కాదు, నన్ను ఏలుకో’ అని ప్రార్థిస్తాడు అర్జునుడు. కానీ అందుకు అంగీకరించని సుభద్ర ‘పెద్దలున్నారు, వాళ్లు మనసెరిగి మన పెళ్లి చేస్తారు. అప్పటి వరకూ నీ విరహాన్ని అదుపులో పెట్టుకో’ అంటూ అర్జునుడి కోరికను సున్నితంగా తిరస్కరిస్తుంది. కానీ అతడు ఆ మాటలు వినే స్థితిలో లేడు. ఆ సంఘర్షణను ‘యేలే’ అనే పదాన్ని ఎక్కువసార్లు ప్రయోగించడం ద్వారా చిత్రించాడు చేమకూర. దాంతో పాటు అనుప్రాస రమ్యతను కూడా సాధించాడు.
పదాల విరుపులు
ఒక పదాన్ని విరవడం ద్వారా కొత్త అర్థాన్ని సృజించే ప్రయోగాలు విస్తృతంగా చేశాడు వేంకటకవి. మాటల ప్రయోగంలోని మెలకువలను బాగా ఒంటబట్టించు కున్నవాడు కాబట్టే వాటిని లోకోక్తులు, పలుకుబడులు, జాతివార్తా చమత్కారాల్లోనూ ప్రయోగించి విలక్షణతను సంపాదించాడు. సన్నివేశానికి తగిన సంభాషణలను వాడటం, వాటిని కావ్యంలో చక్కని అర్థగౌరవంతో ప్రయోగించడంలో కావాల్సినంత నేర్పునూ ప్రదర్శించాడు. అనేక పాకరుచులను ఒకే కావ్యంలో పాఠకులకు అందించాడు.
      చిత్రాంగదను పెళ్లాడాలనుకున్న అర్జునుడు తన గురించి మలయధ్వజునికి విశారదునితో వర్తమానం పంపుతూ ‘‘అపుడు నృపుడు ప్రఫుల్ల ...’’ పద్యంలో వాడిన ‘మామకాగమన వార్త’ అనే పదాన్ని అనేక అర్థాలతో పరిపుష్టం చేశాడు చేమకూర. చిత్రాంగదతో అర్జునుడికి ఇంకా వివాహం జరగలేదు. అంటే మలయధ్వజుడు అర్జునుడికి ‘మామ’ అయ్యే అవకాశం లేదు. తాను వచ్చిన విషయం చెప్పమనే భావన తప్ప, తనకు ‘మామ’ అనే అర్థంలో ఆ ప్రయోగం జరగలేదంటారు తాపీ ధర్మారావు ‘హృదయోల్లాస’ వ్యాఖ్యలో. ఇంకా ‘మామ+ కాగ+ మనవార్త తెలుపుము- మామ అయ్యేలా మనవార్త తెలుపుము’ అనే అర్థ సమన్వయాన్ని సాధించి చేమకూర హృదయానికి దగ్గరగా పాఠకులను తీసుకెళ్తారు ధర్మారావు.
అలంకారాలతో అలంకరణ
కథను చెప్పడంలో ఒక్కో కవిది ఒక్కో ప్రత్యేకత. కావ్యాన్ని రక్తి కట్టించడానికి అలంకారాలను అమితంగా, అతిప్రియంగా వాడి తన శైలిలోనే అలంకారముందని నిరూపించాడు చేమకూర. ఏ పదాన్ని తీసుకున్నా ఏదో ఒక ప్రత్యేక అర్థమో, అలంకారమో లేకుండా ఉండదు. ఏ అర్థాన్నీ వ్యర్థంగా వాడకుండా, ఏ అలంకారాన్నీ నిరలంకారంగా వదిలేయకుండా వాటికి తన కావ్యంలో సార్థకతను సాధించాడు. ప్రత్యేకించి అనుప్రాస, యమకాలంకారాలను వాడటంలో అందెవేసిన చేయిగా ప్రసిద్ధిచెంది ‘యమక చక్రవర్తి’గా కీర్తి పొందాడు.
పాఱజూచిన, బరసేన పాఱజూచు,
వింటి కొరగిన రిపురాజి వింటి కొరగు,
వేయునేటికి? నల పాండవేయు సాటి
వీరుడిల లేడు ప్రతి రఘువీరుడొకడే

      ‘కొంచెం తీక్షణంగా చూశాడంటే చాలు శత్రుసేనలు తోక ముడుస్తాయి. విల్లు ఎత్తుకోవడానికి వంగితే శత్రువులు స్వర్గానికి దారి తీస్తారు. ఒక్క శ్రీరాముడు తప్ప అర్జునుడితో సరిపోల్చదగిన వీరుడు ఈ భూమిమీద లేడు’ అని యమక ప్రీతితో అర్జునుణ్ని వర్ణిస్తాడు. 
      విజయ విలాసంలో ఛేకానుప్రాసం ప్రయోగాలు ఎక్కువగానే కనిపిస్తాయి. సుభద్రను చూసి వచ్చిన గదుడు అర్జునుడి దగ్గర ఆమె అందాన్నిలా కొనియాడతాడు. 
కనన్‌ సుభద్రకున్‌ సమంబుగాగ నే మృగీ విలో
కనన్‌; నిజంబుగాగ నే జగంబు నందు జూచి కా
కనన్‌; దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః
కన న్మనోజ్ఞ రేఖ లెన్నగా దరంబే గ్రక్కనన్‌

      ‘ప్రపంచంలో ఎంతోమంది కన్యలను చూసి నేనీ మాట చెప్తున్నాను. అందంలో సుభద్రతో సాటిరాగల కన్యను ఎక్కడా చూడలేదు. ఆమె హావభావాలూ, బుద్ధి ప్రాయాలూ, సౌందర్య విశేషాలూ నాలుగు మాటల్లో వర్ణించి చెప్పడం సాధ్యం కాదు’ అంటాడు గదుడు. ఇంత అందమైన సుభద్రను వర్ణించాలంటే సుదీర్ఘమైన వర్ణనే చేయాలి. అందుకే దాదాపు పది పద్యాల్లో ఆమె అందాన్ని వర్ణించాడు చేమకూర.
మేలిమి మాటల మూట
తెలుగు సాహిత్యంలో విలాస కావ్యాలలో ప్రసిద్ధి చెందిన, సరస్వతికి అపూర్వ అలంకారంగా భాసించిన ప్రబంధం ‘విజయవిలాసం’. ఉపమావాచకాల, తిరస్కార పదాల ప్రయోగం, పలుకుబడుల్లోనూ, లోకోక్తుల్లోనూ చక్కటి చమత్కారాన్ని కనబరిచిన కావ్యమిది. సన్నివేశానికి తగిన పదాలను చక్కని అర్థ గౌరవంతో కవి ప్రయోగించాడు. జన సామాన్యంలో వాడుకలో ఉన్న ‘పిలువని పేరంటం’, ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’, ‘నడమంత్రపు సిరి’, ‘చేసినది జపము వేసినది గాలము’, ‘పలుకే బంగారం’, ‘చదువబెట్టగ ఉన్నమతి పోయినట్లు’, ‘ఈతకు మిక్కిలి లోతుగల్గునే’ లాంటి సామెతలు ‘విజయవిలాసం’లో కనిపిస్తాయి. ‘అచ్చికబుచ్చికలాడు’, ‘త్రాగు తలబోసుకొను’, ‘ఒడలెల్ల కనులు’, ‘ఊరంత బలగము’, ‘కడుపు చుమ్మలు చుట్టుట’, ‘కన్నులు కప్పుకొను’ తదితర జాతీయాలూ పాయసం జీడిపప్పుల్లా దర్శనమిస్తాయి. 
      ఈ ప్రబంధంలో చేమకూర లక్షణ విరుద్ధ ప్రయోగాలు కొన్ని చేశాడనే అపవాదు ఉంది. విమర్శల సంగతి అటుంచితే ప్రతీపాత్రనూ సజీవంగా చిత్రించి పాఠకుణ్ని కావ్యంలో లీనమయ్యేటట్లుగా చేయడంలో ఆయన ప్రతిభకు మాత్రం వంకపెట్టలేం. మొత్తమ్మీద మాట ఒడుపులు, పదాల విరుపులు, సందర్భానుసారంగా ప్రయోగించిన శబ్దాలంకారాలు, జాతివార్తా చమత్కారాలు... ఇంకా అనేక విశేషాలు రంగరించి సింగారించిన అద్భుత ప్రబంధం ‘విజయ విలాసం’. అందుకే, తెలుగు సాహితీవనాన్ని సుగంధభరితం చేసిన కావ్యాల్లో ఇదీ ఒకటైంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం