పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా...

  • 95 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

  • ఉపకులపతి, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం
  • గుంటూరు.
  • 9848123655
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

‘పరమ రక్షకుడి’ పుట్టినరోజు క్రైస్తవులకు పెద్ద పండగ. ‘లాలియని పాడరే బాలయేసునకు’ అంటూ ఆ రోజు క్రైస్తవ సమాజమంతా భక్తిపారవశ్యంతో ఆ ‘పరలోక తనయుడి’కి జోలపాడుతుంది. ఏసు జన్మవృత్తాంతాన్ని గానం చేస్తూ తన్మయభరితమవుతుంది. క్రైస్తవ ధర్మానుయాయులెందరో ప్రార్థనలు, పండగలు పర్వదినాల్లో పాడుకునేందుకు తెలుగులో కీర్తనలు రాశారు. వాటిలో క్రిస్మస్‌ కీర్తనలు ప్రత్యేకం. ఈ సాహిత్యం భిన్నత్వంలో ఏకత్వ భావనకు నిదర్శనం.
ప్రపంచమంతటా
డిసెంబరు 25ను క్రీస్తు పుట్టినరోజు(క్రిస్మస్‌)గా జరుపుకుంటారు. ఒక్క ఆర్మీనియా సంప్రదాయవాదులు మాత్రం ఏటా జనవరి ఆరు లేదా ఏడో తేదీల్లో ఈ పండగ సంబరాలు నిర్వహిస్తారు. క్రిస్మస్‌ వేడుకలు డిసెంబరు 24 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు జరుగుతాయి. నిజానికి క్రిస్మస్‌ పదం బైబిల్‌లో కనిపించదు. క్రైస్ట్‌ (క్రీస్తు), మాస్‌ అనే లాటిన్‌ పదం కలయికతో క్రిస్మస్‌ ఏర్పడింది. మాస్‌ అంటే ఆరాధన. క్రిస్మస్‌ అంటే క్రీస్తు జన్మదినంనాడు జరిపే ఆరాధన. క్రీ.శ.4వ శతాబ్ది నుంచి ఈ క్రిస్మస్‌ పదం కనిపిస్తుంది. 
      క్రైస్తవుల శుభాశుభ కార్యాల్లో కీర్తనలది ప్రముఖస్థానం. చర్చిల్లో, ఆదివారం ఆరాధనల్లో, సమావేశాల్లో, రాత్రివేళ భోజనాలు చేసేటప్పుడు ప్రార్థనలు చేయడం, గీతాలు ఆలపించడం ఓ ప్రధాన కార్యక్రమం. విశేష సమయాలైన పుట్టినరోజు, పెళ్లిరోజు, బారసాల, కృతజ్ఞతా సమావేశాల్లోనూ పాటలతో కార్యక్రమాలు ప్రారంభించడం సంప్రదాయం. ఇక క్రిస్మస్‌కైతే నెలరోజుల ముందునుంచే సందడి మొదలవుతుంది.
వేలల్లో కీర్తనలు
క్రిస్మస్‌ వేళ పాడే ఏసు జన్మవృత్తాంత గీతాలు తెలుగులో చాలానే ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్న 750 పాటల్లో క్రిస్మస్‌ పాటలు 35 దాకా కనిపిస్తాయి. ఇక సీడీలు, ఇతర ప్రసార మాధ్యమాలు, ఆయా క్రైస్తవ సంఘాలు ప్రత్యేకంగా ముద్రించుకున్న పాటలు అన్నీ కలిసి 86 వేలకు పైచిలుకు ఉంటాయి. వీటిలో తెలుగు క్రైస్తవులందరికీ తెలిసిన పాట ‘చింతలేదిక యేసు పుట్టెను’. ఎస్‌.డి.ఏబెల్‌ (1877-1945) రచించిన ఈ పాట ఇది... 
చింతలేదిక - యేసు పుట్టెను
వింతగను - బెత్లేహెమందున
చెంతచేరను - రండి సర్వజనాంగమా
సంతసమొందుమా।।
దూత తెల్పెను గొల్లలకు శుభ
వార్త నాదివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి     ।।చింతలేదిక।।
చుక్క గనుగొని జ్ఞానులెంతో
మక్కువతొ నాప్రభుని కనుగొన
చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి      ।।చింతలేదిక।।
కన్యగర్భము నందు బుట్టెను
కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమె దీనులై
సర్వమాన్యులై     ।।చింతలేదిక।।
పాపమెల్లను పరిహరింపను
పరమరక్షకు డవతరించెను
దాపుజేరిన వారి కిడు కడు భాగ్యము
మోక్ష భాగ్యము  ।।చింతలేదిక।।

      ఏసు జన్మించాడు... ప్రపంచానికి చింత అవసరం లేదు, అందరూ బెత్లహేముకు రండి అన్న సర్వజన ఆహ్వానంతో పాట ప్రారంభమవుతుంది. ఏసు జన్మవృత్తాంతం మొదట తెలుసుకున్నవాళ్లు గొర్రెల కాపరులు. వాళ్లకు దేవదూత శుభవార్త చెబుతాడు. ఏసు పుట్టినప్పుడు ఖగోళంలో ఓ నక్షత్రం ఉదయించింది. దాని ఆనవాళ్లు తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు మూడు దేశాలనుంచి బయలుదేరి బెత్లహేము చేరుకుంటారు. మరియ గర్భాన జన్మించిన ఏసు ప్రభువు సర్వ రక్షకుడు. ఆయనను శరణు వేడితే మనకు మోక్షం దొరుకుతుందంటూ సాగుతుందీ పాట.
బాలయేసుకు జోలాలి
తెలుగు క్రైస్తవ కీర్తనకారుల్లో పురుషోత్తం చౌదరి (1803-90) తొలితరం కవి. ఆయన రాసిన వాటిలో అచ్చయినవి 87 లభిస్తున్నాయి. వందకుపైగా కీర్తనలు అముద్రితం. ఆయన కీర్తనలు త్యాగరాజు కృతుల్లా ఉంటాయి. అయితే, వీటిలో క్రిస్మస్‌వి నాలుగే. ‘వచ్చి గబ్రియేలు పల్కెను’ కీర్తనకు ఏసు జననానికి ముందు దేవదూత మరియమ్మతో పలికిన పలుకులే ఇతివృత్తం. బాలయేసును కీర్తిస్తూ డిసెంబరు 24 రాత్రి ‘సాయంసంధ్య ఆరాధన’లో లాలిపాటలు పాడతారు. వీటిలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నది తిరుకోవళ్లూరి స్టీఫెన్‌ రాసిన ఈ పాట...
లాలి లాలి లాలి లాలమ్మ లాలి
లాలియని పాడరే బాలయేసునకు ।।లాలి।।
పరలోక తనయుడో యమ్మా
పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా ।।లాలి।।
ఇహపరాదుల కర్త యీతడోయమ్మా
మహిపాలనము చేయు మహితుడోయమ్మా 
ఆద్యంతములు లేని దేవుడోయమ్మా
ఆదాము దోషమున కడ్డు పడెనమ్మా ।।లాలి।।
యూదులకు రాజుగా పుట్టెనో యమ్మా 
యూదులాతని తోడ వాదించిరమ్మా ।।లాలి।।
నరగొర్రెల మంద కాపరోయమ్మా
గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ।।లాలి।।

      ఇందులోని తొలి రెండు చరణాలకు నేపథ్యం ఏసు అవతరణ. బైబిలు ప్రకారం తొలి మానవుడు ఆదాము, తొలి మహిళ హవ్వలకు దేవుడు ఏదేను వనాన్ని ఆశ్రయంగా ఇచ్చాడు. అందులో అన్ని రకాల చెట్లు, పశువులు, పక్షులు ఉంటాయి. దేవుడు వాళ్లను ఓ చెట్టు పండును తినొద్దని ఆజ్ఞాపిస్తాడు. ఓ పాము హవ్వ, ఆదాములకు ఆ పండు తినిపిస్తుంది. అంతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణంతో వాళ్లు ఏదేను నుంచి బహిష్కృతులవుతారు. తర్వాత లోకం పాప కార్యాలతో నిండిపోయింది. పాప పరిహారార్థం జంతువులు, పక్షుల బలితో భూమి రక్తంతో తడిసింది. పాపాన్ని పరిహరించేందుకు ఏసు ఈ లోకానికి వచ్చి, తన రక్తాన్ని అర్పించాడన్నది బైబిల్‌ సారాంశం. ఏసును యూదులు శిక్షించడం, ఆయన ప్రాణత్యాగం చేయడం... ఇలా ప్రభువు జీవిత చరిత్రను ఈ పాటలో కూర్చారు.
      క్రైస్తవ కీర్తనల్లో ఇంగ్లిష్, జర్మన్, లాటిన్, రష్యన్‌ భాషల నుంచి తెలుగులోకి అనువాదమైనవి వందకుపైగా ఉన్నాయి. వాటిలో క్రిస్మస్‌ కీర్తనలు పది దాకా దొరుకుతున్నాయి. అందులో జర్మన్‌ భాష నుంచి ఆంగ్లంలోకి ‘సైలెంట్‌ నైట్, హోలీ నైట్‌...’గా వచ్చి, తర్వాత ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువాదమైన కీర్తనది ప్రముఖస్థానం. దీన్ని 19వ శతాబ్దం తొలినాళ్లలో జర్మన్‌లో జోసఫ్‌ మోర్‌ రాశాడు. ఫ్రాన్జ్‌ గ్రూబర్‌ సంగీతం సమకూర్చాడు. ఆ కీర్తన తెలుగు అనువాదం, శుద్ధరాత్రి! సద్దణంగ/ అందరు నిద్రపోవ/ శుద్ధ దంపతుల్‌ మేల్కొనగా/ పరిశుద్ధుడౌ బాలకుడా/ దివ్య నిద్రపొమ్మా అని సాగుతుంది.
అందరిదీ ఈ పండగ
బేతాళ జాన్‌ (1840-95) రాసిన ‘సంతోషించుడి అందరు నాతో’ పాట తెలుగు క్రైస్తవలోకంలో ప్రాచుర్యం పొందిన కీర్తన. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అందరూ కలిసి ఐక్యంగా పండగ చేసుకుందామన్న సందేశం ఇందులో ప్రధానం. తెలుగులో మరో ప్రసిద్ధ కీర్తన... ‘రక్షకుడుదయించి నాడట’. దీన్ని రాసింది మోచర్ల రాఘవయ్య. 
      ఏసుని తొలుత దర్శించే భాగ్యం గొర్రెల కాపరులకు దక్కింది. దాన్ని వాళ్లు తమలో తాము చెప్పుకున్న విధానం, ఎక్కడికి వెళ్లి దర్శించాలనే ఆనవాలు లాంటి ఏసు జననానికి ముందు సంగతులతో కూడిన అయిదు చరణాల పాట ఇది. పాట పల్లవిలో నిరీక్షణ ఫలం అని ప్రయోగించారు రచయిత. క్రీస్తుకు పూర్వమే ప్రవక్తలు ఒక అభిషిక్తుడు వస్తాడు, ఆయనే సర్వ మానవాళిని రక్షిస్తాడు అని ప్రవచించారు. వారిలో క్రీ.పూ. 7వ శతాబ్ది నాటివాడైన యెషయా ముఖ్యుడు. తన గ్రంథంలో క్రీస్తు జననం, ఆయన సామాజిక బాధ్యత, ప్రపంచానికి ఆయనిచ్చే సందేశం గురించి చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘నిరీక్షణ ఫలం’ అని ప్రయోగించారు రాఘవయ్య. 
      బహుళ ప్రచారం పొందిన మరో కీర్తన పంతగాని పరదేశి రాసిన ‘కొనియాడ తరమె నిన్ను కోమల హృదయ/ కొనియాడ తరమె నిన్ను’. ఇది సీడీల రూపంలోనూ లభిస్తోంది. ఆరు చరణాల ఈ పాటలోనూ క్రీస్తు జనన ఘట్టమే ప్రధానం. ఆరో చరణంలో... ఏసుకు తన ఆత్మను పానుపుగ జేసుకొని పవళించుమంటారు రచయిత. ఇది ఎంతో కవితాత్మకంగా సాగిన వర్ణన. పరదేశి కీర్తనలు పాతికకు పైగా అచ్చయినా ప్రస్తుతం పది మాత్రమే లభిస్తున్నాయి. క్రైస్తవ సంకీర్తనలు రాసిన స్త్రీలు తక్కువ మందే. వారిలో కొమ్ము కృప ఒకరు. ఈమె రచన ఒకటే ఉంది. అదీ క్రిస్మస్‌ పాట కావడం విశేషం. ఆమె రాసిన ‘శ్రీయేసుండు జన్మించె రేయిలో’ కీర్తన కూడా ఏసు జననాన్ని ఉద్దేశించి రాసిందే. 
      జానపద బాణీలు, బుర్రకథలు, సత్కథాగానాలు, తోలుబొమ్మలు, చిందు కథల్లోనూ క్రీస్తు జన్మదినోత్సవ కీర్తనలు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం అముద్రితాలే. తల్లాపల్లి అలెగ్జాండర్‌ ప్రభుకిరణ్‌ గొల్లసుద్దుల బాణీలో రాసిన కీర్తన తెలంగాణలో ప్రాచుర్యం పొందింది. రోమన్‌ చక్రవర్తి ఆజ్ఞ మేరకు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు... మరియ, యేసేపులు బెత్లహేము చేరుకున్నారు. అప్పుడు మరియ నిండు చూలాలు. ఆ రాత్రి వాళ్లు తలదాచుకునేందుకు ఎక్కడా ఆశ్రయం దొరకలేదు. దీన్ని ఇతివృత్తంగా చేసుకుని ప్రభుకిరణ్, ‘నిండు చూలాలా ఓ మరియమ్మా/ నీ బాధను మేము చూడలేమమ్మా..’ అని అక్షరీకరించారు. 
      కీర్తనల్లో నేరుగా తెలుగులో రాసినవి సంకీర్తన సాహిత్యాన్ని అనుసరించి సాగుతాయి. అనువాదాల్లో కొంత కృత్రిమత్వం కనిపిస్తుంది. రాగయుక్తంగా ఉంటూ మూలభావం చెడకుండా ఉండాలన్నదే దీనికి కారణం. కీర్తనలు కూడా క్రీస్తు జీవితంలోని ముఖ్యమైన సంఘటనలతో ముడిపడి, పాడుకోదగినట్లుగా ఉంటాయి. సంప్రదాయ కీర్తనకారుల్లో పురుషోత్తం చౌదరి, పులిపాక జగన్నాథం, విలియం డాసన్, మోచర్ల రాఘవయ్య, బేతాళ జాన్, మురారి దావీదు, ముంగమూరి దేవదాసు, చెట్టి భానుమూర్తి, మల్లెల దావీదు, జాకబ్, చాంబర్లిన్, ఎన్‌.డి.ఏబెల్, సిరిపురపు కృపానందం, ఎ.బి.మాసిలామణి, రావూరి రత్నం, మిక్కిలి సముయేలు, చార్లెస్‌ కిన్సింగర్, పంతగాని పరదేశి, యెషయా వీర మార్టిన్‌ లాంటివాళ్లు ప్రముఖులు. సమకాలంలో క్రైస్తవ కీర్తనలు రాసిన, రాస్తున్న వాళ్లు వందల్లో ఉంటారు. 
      ఇక జానపద బాణీల్లో వచ్చిన కీర్తనలు అముద్రితంగా, అజ్ఞాతంగా కాలగర్భంలో కలిసిపోయినవి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి పరిశోధించి భద్రపరిస్తే తర్వాతి తరాలకు అపారమైన సాహితీ సంపద లభిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం