బాల సాహితీ సూరీడు!

  • 175 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అమ్మిన శ్రీనివాసరాజు

  • తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
  • ఖమ్మం జిల్లా
  • 9441317694
అమ్మిన శ్రీనివాసరాజు

ప్రపంచానికి వాల్డ్‌ డిస్నీ, భారతదేశానికి శంకరపిళ్లై, అదే తెలుగునాడుకైతే న్యాయపతి రాఘవరావు. ఇంతకీ ఎవరీ ముగ్గురు అంటే... పిల్లల విజ్ఞాన, వికాస, వినోదాల కోసం విశేష కృషి చేసిన మహనీయులు. తెలుగు చిన్నారిలోకాన్ని చేయిపట్టుకుని నడిపించిన న్యాయపతి రాఘవరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, రచయిత, సంపాదకుడు, గాయకుడు, ధ్వన్యనుకరణ కర్త, నటుడు, వక్త, ప్రయోక్త, దర్శక నిర్మాత, సినీనటుడు... ఇలా అన్నింటా తానై బాలసాహిత్యం అంటే న్యాయపతి, న్యాయపతి అంటేనే బాలసాహిత్యం అన్నట్లుగా శ్రమించారాయన. 
న్యాయపతి రాఘవరావు
జీవన భృతికోసం పత్రికా రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. కానీ, ఆ తర్వాత బాలల సర్వతోముఖాభివృద్ధి కోసమే యావజ్జీవితాన్నీ వినియోగించారు. పిల్లల్లో నిగూఢంగా ఉండే ప్రతిభా పాటవాలను గుర్తించి వాటిని సరైన సమయంలో, సరైన రీతిలో వెలికి తీయడం కోసం ఆయన అహరహం శ్రమించారు. బాలల వికాసం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆయన ప్రయత్నాల ఫలితంగానే తెలుగుజాతికి బాపు-రమణ, బుచ్చిబాబు, ఆరుద్ర లాంటి వాళ్లతోపాటు రావికొండలరావు, షావుకారు జానకి, కాంచన, చిట్టిబాబు లాంటి కళాకారులు దొరికారు. ఈ ప్రముఖులందరూ వాళ్ల బాల్యంలో న్యాయపతి శిష్యులే! ఆయన వన్నెపెట్టిన శిల్పాలే!!
      ఆబాలగోపాలానికి ‘రేడియో అన్నయ్య’గా సుపరిచితుడైన రాఘవరావు స్వస్థలం అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం(నేటి ఒడిశా). తల్లిదండ్రులు అనంతలక్ష్మి, రామానుజస్వామి. ఏప్రిల్‌ 13, 1905న శ్రీరామనవమి నాడు జన్మించిన తమ బిడ్డకు రాఘవరావు అని పేరు పెట్టుకున్నారు. వీరి పూర్వికులు ‘గోల్కొండ వ్యాపారులు’గా ప్రసిద్ధులు. పూర్వం రాజుల దగ్గర వివిధ బాధ్యతలు నిర్వర్తించే అధికారులు ఉండేవారు. వాళ్లని ‘పతి’ పేరుతో పిలిచేవారు. రాఘవరావు వంశీకులు గోల్కొండ నవాబుల దగ్గర న్యాయాధికారులు (పతులు)గా పనిచేశారు. దాంతో వాళ్ల ఇంటిపేరు ‘న్యాయపతి’గా స్థిరపడింది.  

పదహారేళ్లప్పుడే...
రాఘవరావు తండ్రి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. తాత్వికుడు, మంచి రచయిత. ఇతర కుటుంబసభ్యులూ వివిధ రంగాల్లో ప్రతిభామూర్తులే. అలా అందరి సుగుణాలూ అలవర్చుకుని, చిన్నతనంలోనే ఉన్నత వ్యక్తిత్వాన్ని పొందారు రాఘవరావు. ఆయన కౌమారంలోకి వచ్చేటప్పటికి భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీయుగం ప్రారంభమైంది. మెట్రిక్‌ చదువుతున్న రాఘవరావును గాంధీజీ ప్రసంగాలు ఆకర్షించాయి. దాంతో పదహారేళ్ల వయసులోనే 1921లో స్వరాజ్య ఉద్యమంలో దుమికారు. సహాయ నిరాకరణ సమరంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1926లో తిరిగి చదువు ప్రారంభించారు. విజయనగరం మహారాజా కళాశాలలో తెలుగు సాహిత్యం ప్రత్యేక అంశంగా డిగ్రీ పూర్తి చేశారు. ఆ రోజుల్లోనే ఆయనకు కామేశ్వరితో పరిచయం! 1934లో వాళ్లిద్దరూ జీవిత భాగస్వాములయ్యారు. అనంతరం బతుకుదెరువు కోసం బరంపురం నుంచి చెన్నపట్టణానికి చేరారు. చిన్నతనంలో అన్నయ్య నారాయణమూర్తి ప్రేరణతో అలవడిన పత్రికా రచన వ్యాపకం ఇప్పుడు రాఘవరావు ఉపాధికి ఆసరా అయింది. 
      ‘హిందూ’ ఆంగ్ల దినపత్రికలో విలేకరిగా ప్రవేశించిన న్యాయపతి రాఘవరావు రచనా ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. అదే పత్రికకు సహ సంపాదకునిగా సేవలందించారు. పదేళ్ల పాటు పత్రికా రంగంలో ఉన్న ఆయన తర్వాత ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగిగా ప్రవేశించారు. అప్పటి నుంచి పిల్లలే ఆయన లోకమైపోయారు. 
‘బాలానందమే’ ఆశయం
దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాల్లో మొదట పిల్లల కార్యక్రమాలకు అంకురారోపణ జరిగింది మద్రాసులోనే! దీనికి గుమ్మడిదల దుర్గాబాయమ్మ (దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌) శ్రీకారం చుడితే, పెంచి పోషించింది మాత్రం రాఘవరావు. ఆయన రేడియో ఉద్యోగం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. అయినా ఆ విధి నిర్వహణను లాంఛనప్రాయంగా చేయలేదు. దీక్షాదక్షతలతో తన శక్తియుక్తులు కూడగట్టుకుని బాలల్లో పరకాయ ప్రవేశం చేసి కార్యక్రమాలు రూపొందించేవారు. పిల్లల్లాగా ముద్దుముద్దుగా మాట్లాడేవారు, మాట్లాడించేవారు, కమ్మగా పాడించేవారు. చిన్నారులతో గడిపినంతసేపూ తానూ ఓ పిల్లాడిలా మారిపోయేవారు.  
      పిల్లల మనోభవనపు కిటికీలు తెరిచి, వాళ్లలో సృజనాత్మక శక్తులు పెంచి, కొత్త ఉత్సాహాన్ని అందించేవి ఆయన నిర్వహించిన ‘బాలానందం’ లాంటి కార్యక్రమాలు. మద్రాసు ఆకాశవాణిలో రాఘవరావు చేరినప్పటి నుంచి అక్కడి పిల్లల కార్యక్రమాల రూపురేఖలే మారిపోయాయి. ఎంతగా అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా రేడియోల్లో పిల్లల కార్యక్రమాలు ప్రారంభించుకునేంతగా!
      డిసెంబర్‌ 15, 1948న విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో తొలిసారిగా పిల్లల కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు రాఘవరావే మద్రాసు నుంచి తన శిక్షణలోని పిల్లలను విజయవాడ తీసుకెళ్లారు. ఆ రోజుల్లో పిల్లల కార్యక్రమం నిర్వహణకు 25- 35 రూపాయల పారితోషికం ఇచ్చేవారు. ఆ డబ్బును ఆయన పిల్లల చిరుతిళ్లకే ఖర్చు చేసేవారు. అప్పుడప్పుడు ఆ సొమ్ము సరిపోకపోతే సొంత సొమ్మూ ఖర్చు పెట్టేవారు. పిల్లలే పాత్రధారులుగా ఆయన ‘బాలానందం’ చిత్రాన్నీ నిర్మించారు. 
రారండోయ్‌! రారండోయ్‌!
మద్రాసు ఎగ్మూరులోని ఆకాశవాణి కేంద్రం శనివారం వచ్చిందంటే చాలు పిల్లలతో కళకళలాడిపోయేది. రాఘవరావు చుట్టూ చేరిన పిల్లలంతా ఒకటే కేరింతలు... ఆయనా వాళ్లతో కలిసిపోయేవారు. మొదట్లో బాలల కార్యక్రమాల్లో పాల్గొనడానికి పిల్లలను పంపడానికి పెద్దవారు ఇష్టపడేవారు కాదు. చదువుల్లో వెనకపడతారేమోనని భయపడేవారు. కానీ రాఘవరావు అందించే ఉత్సాహంతో వాళ్ల అనుమానాలు తీరిపోయేవి. ‘‘బాలానందం బడి కాదు. పిల్లల మానసిక శారీరక శక్తులకు పదునుపెట్టే ఒక క్రమశిక్షణాలయం. ఇక్కడ కలివిడితనం, నలుగురితో కలవడం, రకరకాల పోటీల్లో పాల్గొనడం, అందరితో చలాకీగా ఉండటం ఇవన్నీ సాధ్యపడతాయి’’ అంటూ పిల్లల్ని ఆయనే స్వయంగా ఆహ్వానించేవారు. ‘రేడియో అక్కయ్య’గా కామేశ్వరి కూడా భర్తతో కలిసి చిన్నారుల మేధోవికాసానికి శ్రమించారు. ఆకాశవాణి కార్యక్రమాల నిర్వహణతో పాటు కథారచనా చేశారు. మహిళా కార్యక్రమాల నిర్వహణలోనూ ఆవిడ చురుకైన పాత్ర పోషించారు.  
      ‘రారండోయ్‌! రారండోయ్‌! పిల్లల్లారా రారండోయ్‌’ అన్న పాటతో మొదలై... ‘పోదామా ఇక పోదామా ఇళ్లకు మన ఇళ్లకు... అనే చివరి పాట దాకా ఈ రేడియో బాలల కార్యక్రమాలు ఎంతో ఆకర్షణీయంగా ఆనందంగా సాగిపోయేవి. దాదాపు మూడు దశాబ్దాల పాటు (1939- 69) నిరంతరంగా కేవలం పిల్లల కోసమే అనేక సాంస్కృతిక కళాకదంబాలు నిర్వహించడం సాధారణ విషయం కాదు. తన అభిరుచినే ఉద్యోగంగా మార్చుకుని, చివరకు తన పూర్తి జీవితాన్నే బాలసాహిత్యం కోసం అంకితం చేసిన నిజమైన బాలసాహితీవేత్త న్యాయపతి రాఘవరావు. అయితే, ఆయన రూపొందించిన అనేక గేయ నాటికలు, చిట్టి పొట్టి గేయాలు, రూపకాలు, ధారావాహికలు, హాస్య నాటికలు, ఏక పాత్రలు అన్నీ ఆకాశవాణి ద్వారా ‘వాయు విలీనం’ అయిపోయాయి. ప్రస్తుతం రెండు మూడు పాటల సీడీలు తప్ప ఏమీ లభ్యం కావట్లేదు. ఆనాటి తరాన్ని అలరించిన ఆ ‘రేడియో అన్నయ్య’ బాల సాహితీ కృషి నేటితరం వారికి ఓ మధుర స్మృతిగానే మిగిలింది.
గత కాలపు గుర్తులు
రాఘవరావు ‘బాల’ మాసపత్రిక, ‘బాలానందం’ వారపత్రికలనూ నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆయన నడిపిన ఈ పత్రికల ద్వారా భావితరం రచయితలెందరో ఎదిగి వచ్చారు. అంతేనా! బాలల పత్రికా రంగాన్ని ఉర్రూతలూపిన ‘చందమామ’ లాంటివి వెలువడటానికి ఇవి ప్రేరణగా నిలిచాయి. రాఘవరావు బాల సాహితీసేవకు అక్షర గుర్తులుగా మిగిలిన ‘బాల’ మాసపత్రికల పాత ప్రతులు ప్రస్తుతం హైదరాబాదు నారాయణగూడలోని ‘ఆంధ్ర బాలానంద సంఘం’ గ్రంథాలయానికే పరిమితమైపోయాయి. ఆయన రాసిన కథల్లో సుమారు 44 మాత్రమే ‘బాల’ పత్రికల రూపంలో లభ్యమవుతున్నాయి. రాఘవరావు రచించిన ఏకైక పిల్లల నవల ‘పిల్లల దొంగ’తో పాటు కొన్ని నాటికలూ ఆ సంస్థ గ్రంథాలయ ప్రతులుగానే ఉన్నాయి. 
      పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి, దాన్ని పెంపొందించడానికి రాఘవరావు, ఆయన భార్య కామేశ్వరి 1940లో మద్రాసులో ‘ఆంధ్ర బాలానంద సంఘం’ స్థాపించారు. అక్టోబరు 23, 1956 నుంచి హైదరాబాదులోని ప్రస్తుత భవనం దానికి వేదిక అయింది. ఈ సంఘానికి తెలుగునాడంతా శాఖలు ఏర్పాటు చేయించి, పిల్లలతోనే వాటిని నిర్వహింపజేసేవారు. ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో బాలనంద సంఘం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాఘవరావు దంపతులు ఎడ్లబళ్ల మీద వెళ్లేవారు. బాలల వికాసం పట్ల వాళ్ల అంకితభావానికి ఇదే నిదర్శనం. యావజ్జీవితం బాలల అభివృద్ధి కోసమే తపించిన ఈ దంపతులకు పిల్లలు లేరు. వారి తోబుట్టువుల పిల్లలనే సొంత సంతానంగా తీర్చిదిద్దారు. 
      బాలల్లో ఆసక్తిని పెంపొందించేలా, వినోదంతో కూడిన విజ్ఞానాన్ని పంచేలా రచనల్లోని వివిధ ప్రక్రియలను రాఘవరావు ప్రభావవంతంగా ప్రయోగించారు. ప్రక్రియ ఏదైనా కావచ్చు లక్ష్యం మాత్రం ఒక్కటే! పిల్లల మనసుల్లో చెరగని ముద్ర వేయడం. ఆ తరం మీద ఆయన అలాంటి ముద్రే వేశారు. అందుకే ‘బాలల రాజ్యం బావుటా ఎగరేసిందెవరయ్యా/ బాలవాణి ఇంటింటా వినిపించిందె వరయ్యా?/ మా అన్నయ్యా- మా అక్కయ్యా/ ఎన్నో ఏళ్ల వెనక- అప్పుడు నాటిన మొలక/ అందరి హృదయానందమై - ఆంధ్ర బాలానందమై/ ఏభై ఏళ్లు నిండగా- జరుపుతోంది ఈ పండగ/ నోటి మద్దెల వాయిస్తూ- మాతో పాటలు పాడిస్తూ/ నాటికలెన్నో రాసేస్తూ- మాతో వేషాలేయిస్తూ/ మాలో మంచిని పెంచీ- మాలో మమతలు పెంచీ/ మాలో ఒక్కడై అన్నయ్యా- మము నడిపించాడయ్యా.... ...భావి పౌరులే బాలలనీ- బాలవాక్కులే బ్రహ్మవాక్కులనీ/ నిజముగ నమ్మిందెవరయ్యా- నిజమని చెప్పిందెవరయ్యా/ బాలల కోసం జీవితమంతా- ధారపోసినది ఎవరయ్యా/ మరువలేని మా అన్నయ్య- మరపురాని మా అక్కయ్య ’ అన్నారు పాలగుమ్మి విశ్వనాథం. 
      భావిభారత పౌరులను విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి నిస్వార్థంగా కృషిచేసిన రాఘవరావు ఫిబ్రవరి 24, 1984న స్వర్గస్థులయ్యారు. ఆయనకు నాలుగేళ్ల ముందే కామేశ్వరి కాలంచేశారు. న్యాయపతి దంపతుల మానసపుత్రిక అయిన బాలానంద సంఘం ఇప్పటికీ వాళ్ల ఆశయాల సాధన కోసం కృషిచేస్తోంది.
      నేటితరం తెలుగు సాహితీ విలువలు ఇంకా మెరుగుపడాలంటే న్యాయపతి బాటలో నడవటమే మార్గం. ఎందుకంటే, ప్రౌఢ సాహిత్యానికి పునాది బాలసాహిత్యమే. నాణ్యమైన బాలసాహితీ వెలుగులో తమ వ్యక్తిత్వాలకు మెరుగుపెట్టుకున్న నవతరం మాత్రమే తమ రచనల్లో మానవీయతకు పట్టం కట్టగలుగుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం