ప్రేమ మూర్తులకు పద్యాంజలి

  • 346 Views
  • 3Likes
  • Like
  • Article Share

అమ్మ లేకుంటే బతుకు లేదు. నాన్న లేకుంటే ప్రగతి లేదు. గురువు లేకుంటే భవిష్యత్తే లేదు. ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో వీరి ముగ్గురి పాత్ర ఎనలేనిది. కళ్లముందు కనిపించే దేవుళ్లు వీరు. నేటి తరం పిల్లలకు ఈ ముగ్గురి గొప్పదనాన్ని తెలియజెప్పేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జనవరి 6న ‘అమ్మ నాన్న గురువు... శతక పద్యార్చన’ కార్యక్రమం నిర్వహించింది. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా; ఫిలడెల్ఫియా, శాన్‌ఫ్రాన్సిస్కో, కొలంబస్‌ లాంటి ముప్పై నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒడిశాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. నూయార్క్‌లో తానా అధ్యక్షులు తాళ్లూరు జయశంకర్‌ ఈ పద్యార్చనను ప్రారంభించారు. ఇందులో భాగంగా దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు శత శతక రచయిత చిగురుమళ్ల శ్రీనివాస్‌ రచించిన అమ్మ, నాన్న, గురువు శతకాల్లోని పద్యాలను ఆలపించారు. శ్రీకాకుళం జిల్లా జాడుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి కరీంనగర్‌లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల వరకు, మహారాష్ట్ర భివండిలోని తెలుగు పాఠశాల నుంచి ఒడిశాలోని జైపూర్‌ బడి వరకూ దాదాపు వెయ్యి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ పద్య పండుగలో భాగస్వామ్యమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని భాష్యం, శ్రీచైతన్య టెక్నో, త్రివేణి, శ్రీవిద్య తదితర ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కూడా అమ్మభాష మీద తమ మమకారం చాటుకుంటూ పద్యగానాలు చేశారు.

 

‘అమ్మ శతకం’ నుంచి ‘‘పుట్టెనెవరు చెప్పు పురిటి నొప్పులు లేక?/ పెరిగె నెవరు చెప్పు పెంచకుండ?/ ఎదిగెనెవరు చెప్పు ఏ త్యాగములు లేక?/ అమ్మ మిన్న గుడిలొ అమ్మకన్న!’’; ‘నాన్న శతకం’ నుంచి ‘‘బాట వేసెనెవరు బాసటయ్యెనెవరు?/ కాసెనెవరు బరువు మోసె నెవరు?/ బాసచేసెనెవరు బలము బంధమెవరు?/ ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న’’; ‘గురువు శతకం’ నుంచి ‘‘అక్షరములు నేర్పి అజ్ఞాన తిమిరమ్ము/ పారద్రోలు నట్టి భానుడతడు/ దివ్య శక్తి పంచు దినకరుండతగాడు/ గురువుకన్న ఎవరు గొప్పవాడు’’ తదితర పద్యాలు ఆలపించారు. ప్రస్తుతం మరో అయిదు లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం పద్య సాధన చేస్తున్నారు. పిల్లలను సంస్కారవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే ఇలాంటి కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో మలేసియా, దక్షిణాఫ్రికా, మారిషస్‌ లాంటి దేశాలకు విస్తరించడంతో పాటు మన దేశంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని ‘తానా’ భావిస్తోంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం