ప్రేమలోకపు మహారాజు

  • 295 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.ఎల్‌.వి.ప్రసాద్‌

  • యాడికి, అనంతపురం జిల్లా
  • 9493559074

ప్రేమ గురించి కవిత్వం రాయకుండా కవి, ప్రేమగీతిక ఆలపించకుండా గాయకుడు కాలేరేమో ఎవరూ! ఈ రెండక్షరాల పదాన్ని లోతుగా పరిశీలించి.. ప్రేమలోకపు తలుపులు తెరచి అందులోని అందాలను అక్షరాలతో చిత్రించిన తెలుగు కవులు ఎందరో! వారిలో బసవరాజు అప్పారావు ప్రముఖులు. ప్రకృతిలోని ప్రతీ అంశంలో ప్రేమతత్త్వాన్ని చూసిన ఆయన గొప్ప ప్రేమికుడు. 
      బసవరాజు ప్రేమగీతాల్లో పారవశ్యం ఉంటుంది. చదివినంతసేపూ పాఠకుడు తన సొంత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మురిసిపోతాడు. ప్రతీ అక్షరంలో సమ్మోహనం, సౌకుమార్యం, ఆరాధన నిండిన గేయాలు బసవరాజువి. ‘ప్రేమతత్వమ’నే గేయంలో ఆయన ఇలా అంటారు...
వలపెరుంగక బ్రతికి/ కులికి మురిసేకన్న/ 
వలచి విఫలమ్మొంది/ విలపింప మేలురా!

      ప్రేమకు దూరంగా బతికే కన్నా.. ప్రేమించి విఫలమై దుఃఖంలో మునిగిపోవటం మేలన్నది బసవరాజు అభిప్రాయం. ప్రేమంటే తోడు. ఓ ఆసరా. అందుకే ఆ అనుభూతికి అంతటి ఔన్నత్యాన్ని ఆపాదించారు కవి. 
ప్రేమ కన్నను యెక్కు
వేముందిరా యెల్ల 
కామ్యపదవుల కన్న
ప్రేమ యెక్కువరా!

      వలపు విలువకట్టలేనిదంటూ.. దానికి అగ్రతాంబూలమిస్తూ బసవరాజు పలికిన మాటలివి. ఈ లోకంలో ప్రేమకు సాటి రాగలిగేదేముంది? నువ్వు ఆశించే ఎన్నో భౌతిక విషయాల కన్నా ప్రేమ చాలా ఉన్నతమైందంటూ అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని అందించారు. ఆయనే రాసిన ‘పలవరింతలు’ అనే గీతంలో ‘‘చిట్టి నాచెక్కిళ్లు చేతితో నిమిరీ/ తియ్యగా ప్రేమమ్ము దెల్పేటివేళా/ చిరునవ్వు నవ్వేటి చంద్రుణ్ణి గాంచి/ స్వర్గ మింకేటికని పలువరించేను!’’ అని చెబుతూ మైమరచిపోతారు.  
కల్లగాదిది నమ్మగా దగు సఖియ!
వంగెడు బంగారు వరిపైరువోలె
జలజల ప్రవహించు జలములవోలె
వనిత నా హృదయమ్ము పడిలేచుచుండె

      వంగిన బంగారు వరిపైరులా.. అందమైన జలపాతంలా తన గుండెల్లో పడిపడిలేస్తూ గిలిగింతలు పెడుతోందట చెలియ! ప్రేయసి ఊహలు ప్రేమికుడికి ఎంతగా చక్కిలిగింతలు పెడతాయో ‘ప్రేమమాయ’ అనే గీతంలో ఇలా చెప్పుకొచ్చారు బసవరాజు.  ‘ప్రణయాంజలి, ప్రణయగీతం, ప్రణయ పారవశ్యం, ప్రణయగానం, ప్రేమ ప్రయాణం, ప్రియ నిరీక్షణం, వలపుల జోల, ఐక్యమౌదామె?’.. ఇలాంటి పాటలెన్నో రచించారు బసవరాజు. అన్నింట్లోనూ ప్రేమకు తనదైన ఊహాచిత్రాలతో పట్టంకట్టారు.  
      కాలం మారినా, సంస్కృతీ సంప్రదాయాలు మారుతున్నా ప్రతి జీవిలో ప్రేమ శాశ్వతం, ప్రేమ కోసం తపన అనివార్యం. ప్రాణం పోసుకున్న ప్రతి ప్రాణీ ప్రేమ తాలూకు ఆనవాలే. జీవిత సాగరంలో అలసిపోతూ ఈదుతున్న ప్రతి జీవపదార్థానికి తోడు నిలిచి, అండగా ఉన్నానని హామీ ఇచ్చి హాయిని పంచేది ప్రేమ. ప్రేమలోని మాధుర్యాన్ని తేనెటీగలా సేకరించి తియ్యనైన కవిత్వాన్నందించిన బసవరాజు అప్పారావు చెప్పినట్టు.. ‘‘నిశ్చల సత్యముతో జతగూర్చిన/ నెంతో శక్తివంతంబౌ ప్రేమము,
దేవతలైనన్‌ దాని ధాటికిని
లోబడి పోవలసినవారే’’!
 


వెనక్కి ...

మీ అభిప్రాయం