ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడును విన్పించుభాష/ విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరుభాష/ రసభావముల సమర్పణ శక్తి యందున నమరభాషకును దీటైన భాష/ జీవులలో నున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష/ భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి/ భాషయన నిద్దియని చెప్పబడిన భాష/ తనర ఛందస్సులోని యందమ్ము నడక/ తీర్చి చూపించినట్టిది తెలుగుభాష’’ అంటూ అమ్మభాష గొప్పదనాన్ని కీర్తించారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేద్దాం.
1. ‘‘సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమిలాగ ఆశయం చుట్టూ తిరుగుతోంది ఆవేశం’’ అన్నదెవరు?
అ. కుందుర్తి ఆ. కాళోజీ ఇ. శ్రీశ్రీ ఈ. గోపాల చక్రవర్తి
2. ఎవరి ప్రణయతత్త్వం ‘కులపాలికా ప్రణయం’గా ప్రసిద్ధి చెందింది?
అ. నాయని సుబ్బారావు ఆ. అడవి బాపిరాజు
ఇ. కవికొండల వెంకటరావు ఈ. మల్లవరపు విశ్వేశ్వరరావు
3. ఏ అచ్చుల ఉచ్చారణలో నాలుక ముందుకు సాగకుండా, వెనక్కి వెళ్లకుండా తటస్థంగా ఉంటుంది?
అ. ఇ, ఈ ఆ. అ, ఆ ఇ. ఎ, ఏ ఈ. ఉ, ఊ
4. ఒకే ఒక్కసారి కరణం స్థానాన్ని తేలికగా స్పృశించి వదలివేసినప్పుడు పుట్టే ధ్వని?
అ. తాడితం ఆ. కంపితం ఇ. మూర్ధన్యం ఈ. తాలవ్యం
5. విదూషకుడు ‘మైత్రేయుడు’ ఒక ప్రధాన పాత్రగా గల సంస్కృత నాటకం?
అ. ముద్రారాక్షసం ఆ. మృచ్ఛకటికం ఇ. అభిజ్ఞాన శాకుంతలం ఈ. దేవీచంద్రగుప్తం
6. ‘మాలతీ మాధవం’ ఏ దశరూపక భేదానికి చెందింది?
అ. ఢిమం ఆ. వ్యాయోగం ఇ. ప్రకరణం ఈ. సమవకారం
7. భవభూతి ‘ఉత్తర రామచరిత్ర’ ఎన్ని అంకాల నాటకం?
అ. 5 ఆ. 7 ఇ. 9 ఈ. 11
8. జయదేవుని గీతగోవిందానికి ‘సంస్కృత గ్రామ్యరూపకం’ అని పేరు పెట్టిందెవరు?
అ. ష్రాయిడర్ ఆ. పిశెల్ ఇ. లాస్సెన్ ఈ. అరిస్టాటిల్
9. సంస్కృత ‘చండీ’ శతక కర్త?
అ. భాసుడు ఆ. బాణుడు ఇ. అగస్త్యుడు ఈ. కాళిదాసు
10. మాఘుని శిశుపాలవధలోని సర్గలెన్ని?
అ. 16 ఆ. 18 ఇ. 20 ఈ. 24
11. కావ్యాలంకార చూడామణిలోని ఉల్లాసాల సంఖ్య?
అ. 7 ఆ. 9 ఇ. 11 ఈ. 15
12. ఎవరు దీపక రాగం ఆలపిస్తే వొత్తి తనంత తానే వెలిగిందని అంటారు?
అ. అన్నమయ్య ఆ. త్యాగయ్య ఇ. క్షేత్రయ్య ఈ. తాన్సేన్
13. ‘‘వాగంగ సత్త్వోపేతాన్ కావ్యార్థాన్ భావయంతీతి భావాః’’ అన్నదెవరు?
అ. భరతుడు ఆ. భామహుడు ఇ. దండి ఈ. మమ్మటుడు
14. నాటికల్లో నాయకుడు?
అ. ధీరోద్ధతుడు ఆ. ధీరోదాత్తుడు ఇ. ధీరలలితుడు ఈ. ధీరశాంతుడు
15. ‘‘శాస్త్రానికి విరుద్ధమైంది కవిత్వం’’ అన్న పాశ్చాత్యుడు?
అ. కోల్రిడ్జ్ ఆ. ప్లేటో ఇ. అరిస్టాటిల్ ఈ. షెల్లీ
16. ‘‘నాది వ్యవహార భాష మంధరము శైలి’’ అంటూ వ్యావహారికంలో రాస్తున్నానని చెప్పిందెవరు?
అ. రాయప్రోలు ఆ. గిడుగు ఇ. విశ్వనాథ ఈ. గురజాడ
17. ఆనందాంత కావ్యమని పేరొందింది?
అ. రఘువంశం ఆ. కుమారసంభవం ఇ. హర్షనైషధం ఈ. కిరాతార్జునీయం
18. ‘లక్ష్మ్యంత కావ్యం’ అని దేన్ని పేర్కొంటారు?
అ. శిశుపాలవధ ఆ. కిరాతార్జునీయం ఇ. హర్షనైషధం ఈ. రావణవధ
19. శ్య్రంత కావ్యమని కీర్తినొందింది?
అ. సహృదయానందం ఆ. పాండవ చరిత్ర ఇ. చంద్రప్రభ చరిత్ర ఈ. శిశుపాలవధ
20. ‘సౌగంధికాపహరణము’ వ్యాయోగ కర్త?
అ. విద్యానాథుడు ఆ. విశ్వనాథుడు ఇ. వామనభట్ట బాణుడు ఈ. భారవి
21. ఆంగ్లభాషలో వెలువడిన ప్రథమ ప్రామాణిక లక్షణ గ్రంథంగా పరిగణించే ‘యాన్ అపాలజీ ఫర్ పొయెట్రీ’ గ్రంథకర్త?
అ. అలెగ్జాండర్ పోప్ ఆ. జాన్డ్రైడెన్ ఇ. ఫిలిప్ సిడ్నీ ఈ. స్పెన్సర్
22. ‘శృంగార రసాలవాలము’ కర్త?
అ. వెణుతుర్ల ఒడ్డెయ్య ఆ. గౌరన ఇ. విన్నకోట పెద్దన ఈ. లింగమగుంట తిమ్మకవి
23. ‘నన్నయ్య భట్టారకుడు’ పేరుతో 1910లో ఆదికవిపై తొలి విమర్శ గ్రంథం వెలువరించిందెవరు?
అ. పుదుప్పాకం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆ. వింజమూరి రంగాచార్యులు
ఇ. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ఈ. వెన్నేటి రామచంద్రరావు
24. పనప్పాకం ఆనందాచార్యులు 1894లో ప్రారంభించిన మాసపత్రిక?
అ. వైజయంతి ఆ. శశిలేఖ ఇ. సరస్వతి ఈ. వాగ్వల్లి
25. ‘‘మానవుడు మహాకవి అయినపుడు అతీంద్రియ జ్ఞానంతో పనిచేస్తాడు. అప్పుడతని వాక్కు ఆది మధ్యాంత రహితమవుతుంది’’ అని అన్నదెవరు?
అ. వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఆ. కట్టమంచి
ఇ. శ్రీశ్రీ ఈ. కె.వి.రమణారెడ్డి
26. ‘ఆంధ్ర మహాభారతములో రసపోషణము’ మీద 1989లో పరిశోధన చేసిందెవరు?
అ. ఎల్లూరి శివారెడ్డి ఆ. ఓరుగంటి నీలకంఠశాస్త్రి
ఇ. పువ్వాడ శేషగిరిరావు ఈ. మరుపూరి కోదండరామిరెడ్డి
27. ‘తిక్కన - భారత దర్శనము’ ఎవరి సిద్ధాంత గ్రంథం?
అ. పి.సుమతీ నరేంద్ర ఆ. నండూరి రామకృష్ణమాచార్యులు
ఇ. డా।। పి.యశోదారెడ్డి ఈ. పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
28. ‘కవిత్రయ కవితా విమర్శనం’ పేరుతో కవిత్రయ భారతాన్ని మూలంతో పోల్చి పరిశోధించిందెవరు?
అ. గుఱ్ఱం వేంకటసుబ్బయ్య ఆ. కోరాడ రామకృష్ణయ్య
ఇ. అప్పజోడు వేంకట సుబ్బయ్య ఈ.శలాక రఘునాథ శర్మ
29. ‘ఆంధ్ర మహాభారతము - జౌపదేశిక ప్రతిపత్తి’ గ్రంథకర్త?
అ. డా।। నందుల గోపాలకృష్ణమూర్తి ఆ. పి.వేంకటరాజు
ఇ. పాటిబండ మాధవశర్మ ఈ. సర్రాజు లక్ష్మీనరసింహారావు
30. బాలవ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం వెలువడిన సంవత్సరాలు?
అ. 1858, 1885 ఆ. 1856, 1865
ఇ. 1875, 1885 ఈ. 1859, 1895
31. రాజరాజనరేంద్రుడు నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకు దానమిచ్చిన విషయం ఏ శాసనంలో ఉంది?
అ. మండ ఆ. నందంపూడి ఇ. రణస్థలపూడి ఈ.కందుకూరు
32. కుమారసంభవ కర్త నన్నెచోడుడు క్రీ.శ.1130 కాలం వాడని ఏ శాసనాన్నిబట్టి జయంతి రామయ్య, వేటూరి ప్రభాకర శాస్త్రి నిర్ధరించారు?
అ. ధర్మవరం ఆ. విప్పర్తి ఇ. పెదచెఱుకూరు ఈ. మండ
33. నాచన సోమన ‘సకలాగమవేది’ అని, అష్టాదశ పురాణార్థ విదుడని, అష్ట భాషాకవిత్వ శ్రీ విలసితుడని క్రీ.శ.1344 నాటి ఏ శాసనాన్ని బట్టి తెలుస్తుంది?
అ. పెంచుకల దిన్నె ఆ. తిప్పలూరు ఇ. గూడూరు ఈ. కందుకూరు
34. శ్రీనాథుడు తన ఏ గ్రంథంలోని ఆశ్వాసాంత గద్యల్లో మాత్రమే ‘కవి సార్వభౌముడు’ అనే బిరుదును పేర్కొన్నాడు?
అ. భీమఖండం ఆ. కాశీఖండం
ఇ. శృంగార నైషధం ఈ. హరవిలాసం
35. ‘కవి సంశయ విచ్ఛేదం’ లక్షణ గ్రంథ కర్త?
అ. అడిదము సూరకవి ఆ. వార్తాకవి రాఘవయ్య
ఇ. వెల్లంకి తాతంభట్టు ఈ. పొత్తడి వేంకటరమణ
36. తెలుగులో ముద్రణ ఎప్పుడు ప్రారంభమైంది?
అ. 1622 ఆ. 1654 ఇ. 1676 ఈ. 1747
37. అందుగల వెంకయ్య రచన ‘రామరాజీయం’కు నామాంతరం?
అ. నరపతి విజయం ఆ. కృష్ణరాయవిజయం
ఇ. బహుళాశ్వచరిత్ర ఈ. ఏదీకాదు
38. ‘ఆంధ్రవాఙ్మయ చరిత్ర సర్వస్వం’ కర్త?
అ. శిష్టా రామకృష్ణశాస్త్రి ఆ. ఖండవల్లి లక్ష్మీరంజనం
ఇ. కె.వి.నారాయణరావు ఈ. వంగూరి సుబ్బారావు
39. కవితా పోషకులను బట్టి యుగ విభజన చేసిందెవరు?
అ. గురజాడ శ్రీరామమూర్తి ఆ. వంగూరి సుబ్బారావు
ఇ. ఆరుద్ర ఈ. దివాకర్ల వేంకటావధాని
40. రేనాటి చోళుల గద్య శాసనాలు ఎన్ని లభ్యమవుతున్నాయి?
అ. 11 ఆ. 22 ఇ. 33 ఈ. 44
41. ‘శ్రీనిరవద్యుండు, చిత్తజాత సముడు, శివపదవర సేవితుడు’ అనే పదాలు గల కేవల పద్యమయ శాసనం?
అ. కొరవి ఆ. కందుకూరు ఇ. బెజవాడ ఈ. తిప్పలూరు
42. సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన కర్మణి ప్రయోగ వాక్యాలు ఏ శతాబ్దం నుంచి కనిపిస్తున్నాయి?
అ. 7 ఆ. 8 ఇ. 9 ఈ. 10