ప్రజా సాహితీ క్రాంతి

  • 149 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పి.వరలక్ష్మి

  • హైదరాబాద్
  • 8179913123
పి.వరలక్ష్మి

విప్లవ రచయితల సంఘం ఒక చారిత్రక సందర్భంలో ఏర్పడి, చరిత్రతో కలిసి నడుస్తోంది. 50 ఏళ్లుగా అది చరిత్రలోని మానవ చైతన్యాన్ని సంఘర్షణాయుతంగా తీర్చిదిద్దుతోంది. ప్రజల వైపు ఉన్నవారే రచయితలనే తిరుగులేని తీర్మానం చేసి లోకంతో ఒప్పించింది. దీని కోసం అంతు లేని నిర్బంధాన్ని అనుభవించింది.  పాండిత్య భారం, ఛాందసం తెలుగు సాహిత్య సీమ నుంచి తరలిపోయాయి. ఈ 50 ఏళ్లలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అన్ని ప్రజాస్వామిక ధోరణుల ముందు, వెనుక విరసం ఉంది. విరసం సృష్టించిన భావజాల ఆవరణ ఉంది.
పీడిత
ప్రజల ఆకాంక్షలు, చైతన్యాలు మొదలు భావజాల రూపంలోనే వ్యక్తం అవుతాయి. ఆ తర్వాతనే పునాది అంశాల దగ్గరికి వెళ్తాయి. అందుకే ప్రతి సమాజంలో పాలకశక్తులు వ్యవస్థను అట్లాగే పట్టి ఉంచడానికి భావజాల రంగాన్ని వాడుకుంటారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకునే వాళ్లు కూడా భావజాలాన్ని ఆయుధంగా తయారుచేసు కుంటారు. ఆధునిక చరిత్రలో మార్పు కోసం ప్రయత్నించిన శక్తులన్నీ ఈ ప్రయత్నం చేశాయి. మనలాంటి దేశాల్లో ఈ అవసరం ఇంకా ఎక్కువ. ఆధునిక భారత దేశ చరిత్రలో ఎన్నో రాజకీయ పోరాటాలు జరిగాయి. సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాలు చోటుచేసుకు న్నాయి. అవి అద్భుతమైన మార్పులకు కారణమయ్యాయి. అయితే సమాజాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో బయల్దేరిన ఉద్యమం నక్సల్బరీ. ఇది ఏక కాలంలో రాజకీయ, భావజాల రంగంలో ఆరంభమైంది. నక్సల్బరీ తన తొలి రోజుల్లోనే సాంఘిక సాంస్కృతిక ఉద్యమంగా కూడా వ్యక్తమైంది. అది గత కాలపు నిలువనీటి సంస్కృతిని తిరస్కరిం చాలని పిలుపునిచ్చింది. ప్రతి దాన్నీ ప్రశ్నించి, ఏటికి ఎదురీదే ఆచరణను తీసుకొచ్చింది. విరసం నక్సల్బరీ శిశువు. 
      విరసం స్థాపకులు లబ్ధప్రతిష్ఠులైన రచయితలు. సాహిత్యంలోని లోతుపాతులు, మానవ జీవితంలోని ప్రత్యేకతలు, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యాలు బాగా అర్థం చేసుకున్నవాళ్లు. 1960లో అంతర్జాతీయంగా వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమాలు, శ్రామిక వర్గ సాంస్కృతిక ఉద్యమం, తెలుగునాట కవిత్వంలో యువధిక్కార స్వరాల ప్రజ్వల నం- ఈ నేపథ్యంలో సమాజం పట్ల ఆర్తి ఉన్న రచయితలు కరడుగట్టిన భూస్వామ్య విలువను, కాసులకు దాసోహమన్న కళాసాహిత్యాలను ప్రశ్నిస్తూ నూతన సమాజాన్ని, ప్రజాస్వామిక సంస్కృతిని స్థాపించే లక్ష్యంతో ముందుకొచ్చారు. మొట్టమొదట వాళ్లు చేసింది సాహిత్యానికి, రాజకీయాలకు మధ్య సంబంధాన్ని గుర్తించి ఒక మహత్తర సాహిత్య సాంస్కృతికో ద్యమాన్ని ప్రారంభించడం. 
సంస్కృతీ చర్చ
సంస్కృతికి ఎందరో ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. వాస్తవానికి సంస్కృతి ఉపరితల అంశాల సమ్మేళనం. వాటి పరస్పర సంబంధాల్లోంచి మానవుల రోజువారి సాంస్కృతిక జీవితం రూపొందుతుంది. దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, విద్యారంగంలోని సంక్షోభాలు మొదలైనవన్నీ సంస్కృతిగా వ్యాపిస్తాయి. వాటిలోంచి సాంస్కృతిక కోణాలు మనుషుల జీవితాన్ని ఆవరిస్తుంటాయి. రాజకీయార్థిక పునాది, పాలనా విధానం, న్యాయ ప్రక్రియలు, చట్టాలు అన్నీ తమ తమ పని తీరులోంచి మూకుమ్మడిగా సంస్కృతిని పోగేస్తుంటాయి. రాజకీయార్థిక అంశంతో సంబంధం లేకుండా సంస్కృతి గురించి మాట్లాడితే శుష్క ప్రేలాపనగా మారిపోతుంది. నీడల జాడల కోసం వెతుక్కున్నట్లవుతుంది. విరసం వేర్వేరు రంగాల్లోని పరిణామాలను విశ్లేషిస్తూ ఆర్థిక వ్యవస్థతో ముడిపెట్టి అందులోంచి సంస్కృతీ విశ్లేషణ చేస్తూ వచ్చింది. భూస్వామ్యంలోంచి, సనాతన ధర్మంలోంచి, సామ్రాజ్యవాద విధానాల్లోంచి దాన్ని పసిగడుతూ వచ్చింది.
      కాబట్టి సంస్కృతీ చర్చ అంటే - సకల ఆధిపత్య ఆచరణ రూపాలూ ప్రశ్నించడం. వాటి వెనుక పని చేస్తున్న భావజాలంపై విమర్శ పెట్టడం. ఆధిపత్య ఆచరణను కేవలం భావజాలానికి పరిమితం చెయ్యలేదు. ఆధిపత్యం అనేది ఒక సామాజిక భౌతిక రూపం. సాంఘిక సంబంధాల్లోని ఆధిపత్య ఆచరణ కొనసాగుతుంటుంది. దీనికి భావజాల సమర్థన దొరుకుతుంది. ఆధిపత్య వ్యవస్థలు, వాటికి ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు అనే చట్రంలో దీన్ని పరిశీలించాలని విప్లవ సాహిత్యోద్యమం వాదించింది.
సాహిత్యంలో తీక్షణత
కళా సాహిత్యాలను రాజకీయ శక్తిగా మలచడం విరసం సాధించిన ముఖ్యమైన విజయం. సాహిత్యాన్ని రాజకీయాలకు సమన్వయం చేయడం విరసమే ఆరంభించలేదు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ పని ఎందరో చేశారు. ఎన్నో సంస్థలు చేశాయి. విరసం అదనంగా చేసిందేమిటంటే- వర్గపోరాట రాజకీయాల్లో తీక్షణతను సాహిత్యంలోకి తీసుకొచ్చింది. ప్రజల నుంచి ప్రజలకు అనే సామాజిక సాహిత్యాచరణను తెచ్చింది. వచన కవిత్వం జనపదాలను, ప్రజాజీవితం నుంచి నుడికారాలను స్వీకరించింది. భాష, వ్యక్తీకరణ సహజత్వాన్ని సంతరించుకోవ డంతో పాటు అద్భుతమైన శక్తిని సంలీనం చేసుకుంది. ఈ క్రమంలో సాహిత్యం మరింతగా జనంలోకి వెళ్లేలా పాట పుట్టింది. అద్భుతమైన ప్రజావాగ్గేయకారులు తయారయ్యేలా విప్లవ సాంస్కృతికోద్యమం విస్తరించింది. సాహిత్యం తన కళా సౌందర్యం వల్ల, మానవానుభవంలోని ఉద్వేగాల, సాంస్కృతిక పర్యావరణ చిత్రణ వల్ల పాఠకులపై ప్రభావం వేస్తుంది. ఈ మొత్తాన్ని రచయిత తన దృక్పథం వల్ల, సామాజిక కార్యాచరణ వల్ల, లక్ష్యం వల్ల రాజకీయ శక్తిగా మలిచినప్పుడు అనేక రెట్ల ప్రభావం ఉంటుంది. సాహిత్య ప్రయోజనం గొప్పగా నెరవేరుతుంది. 
      ఇతర ప్రక్రియల్లోనూ సామాజికతను విరసం అభివృద్ధి చేసింది. విప్లవ రచయితలు సాహిత్య విమర్శ, సామాజిక విశ్లేషణ, లిఖిత సాహిత్య ప్రక్రియలు, ప్రసంగం మొదలైన వాటిని ప్రజారాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. ఈ ఆచరణ గత యాభై ఏళ్లలో వచ్చిన మొత్తం ప్రగతిశీల సాహిత్యం శక్తిని, ప్రభావాన్ని పెంచింది. అందుకే తెలుగులో సాహిత్య రచనలతో పాటు, సాహిత్య వాద వివాదాలు, విశ్లేషణలు, విమర్శలు అన్నీ చాలా తీవ్ర స్వరంతో సాగుతాయి. చాలా శక్తిమంతంగా ఆ వాదనలు ఉంటాయి. వాటివల్ల పాఠకుల అవగాహన పెరుగుతుంది. అంతేగాక సాహిత్య రంగంతో క్రియాశీల అనుబంధంలోకి వస్తారు. ఈ ఒరవడి స్త్రీవాదం, దళితవాదం, ముస్లిం మైనారిటీ వాదంలో కూడా చూడవచ్చు. 
      అలాగే తెలుగు సాహిత్య రంగం మొత్తం మేధో రంగంలో ప్రధాన విభాగమైంది. సామాజిక శాస్త్రాలు, వేర్వేరు ఉద్యమాలు, భిన్న ప్రజా ఆకాంక్షలు, మేధో చర్చల కూడలిలో సాహిత్యానికి విశాలమైన చోటు దొరికింది. అంటే సుమారుగా ఉపరితలాంశాల సాధారణ విభాగంగా కళా సాహిత్యాలు ఉంటున్నాయి. ఇందులో విరసం కృషి చాలా ఉంది. ఎప్పటికప్పుడు సామాజిక పరిణామాల మీద సృజనాత్మత ప్రతిస్పందన వ్యక్తం చేసి ఊరుకోలేదు. శాస్త్రీయ విశ్లేషణను అందించింది. ప్రపంచంలో ఏ మూల ఏ కీలక పరిణామం చోటుచేసుకున్నా దాని మీద విరసం విశ్లేషణ వస్తుంది. సాహిత్య పాఠకులతోపాటు ఫలానా దానిమీద విరసం ఏం చెబుతుంది అని ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు ఉంటారు కాబట్టి విప్లవ రచయిత సంఘానికి విశాల సామాజిక ఆవరణ ఉంటుంది.
నిర్బంధకాండను ఎదిరించి..
ప్రజల తరపున మాట్లాడే వాళ్ల మీద రాజ్య నిర్బంధం సహజమే. యాభై ఏళ్లుగా విరసంపై అమలవుతున్న నిర్బంధం కూడా ఇందులో భాగమే. సామాజిక అణచివేతకైనా, రాజ్య నిర్బంధానికైనా అనేక అర్థాలు ఉంటాయి. సమాజమే మొత్తంగా మొదట భయాందోళనలోకి, ఆ తర్వాత స్తబ్దతలోకి, నిష్క్రియలోకి జారిపోయేలా చేయడం రాజ్యహింస ఉద్దేశం. దీనివల్ల మనుషుల ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్‌ స్వప్నాలు కొడిగట్టిపోతాయి. సమాజంలోని ప్రగతిదాయక పరివర్తన క్రమాలన్నీ సంక్షోభంలో పడతాయి. మానవీయతను ప్రేరేపించే సహజాతాలు, నైతికవర్తనలు మొద్దుబారుతాయి. విరసం తన విశ్లేషణ ద్వారా, ఆచరణ ద్వారా రాజ్యహింసా వ్యతిరేకశక్తిగా నిలబడింది. ఈ సమాజాన్ని క్రియాశీలం చేయడంలో విరసం నిర్వహించిన రాజ్యవ్యతిరేక పాత్ర నిరుపమానమైంది.
      విరసంలో చేరడమంటే రచయితకు, బుద్ధిజీవికి రాజ్య నిర్బంధం ఒక అగ్ని పరీక్ష. అది ఒకసారితో జరిగిపోయేదీ కాదు. ముగిసిపోయేదీ కాదు. నిత్య ఆచరణలో రాజ్యహింస పొంచి ఉంటుంది. అనుభవంలోకి వస్తుంది. సున్నితమైన భావుకులు, ఆలోచనాపరులు దీన్ని ఎలా స్వీకరించారు? ఎలా ఎదుర్కొన్నారు? ఇది ప్రగతిశీల పరివర్తనా క్రమాలకు ఉండే అవరోధం అనే అవగాహన లేకుండా గుండెనిబ్బరం కలగదు. చేతి వేళ్లు విరిచేస్తూ, కరెంట్‌ షాకు ఇస్తూ మళ్లీ రాస్తావా? అని బెదిరిస్తున్నప్పుడు.. ఆ మునివేళ్ల నుంచి జాలువారిన మానవ జాతి భవిష్యత్‌ ఆశా స్వప్నాలను కాపాడుకోవాలా? ఆ క్షణం సొంత జీవితాన్ని కాపాడుకోవాలా? అనే ప్రశ్న తలెత్తుతుంది. విప్లవం గురించిన ఆలోచనను జీవితంలోని సాంస్కృతిక ఆచరణగా గుర్తిస్తాం. దృక్పథం వల్ల రూపొందే జీవన విలువ అది. విరసంకు ఈ చారిత్రక, సాంస్కృతిక, తాత్విక పునాది ఉంది. అందువల్లనే సభ్యులు వ్యక్తిగత స్థాయిలో కూడా రాజ్య నిర్బంధాన్ని సరిగా స్వీకరించగలుగుతున్నారు. అర్థం చేసుకోగలుగుతున్నారు. 
      తన విశ్వాసం కొద్దీ ప్రకటించే భావాల ప్రాసంగికతే కవికి, రచయితకు రాజ్యహింస నుంచి కవచం. ప్రజలు ఆ భావాలను భౌతికశక్తిగా మార్చే ఆచరణ క్రమంలో ఉండటం ఒక్కటే బయటి నుంచి దొరికే రక్షణ. అందుకే నిర్బంధ కాలంలో విప్లవ కళా సాహిత్య సృజన ప్రపంచ చరిత్రలో లాగా మన దగ్గరా చాలా శక్తిమంతమైంది. అనేక రూప సారాల వైవిధ్యాన్ని, విస్తృతిని సంతరించుకుంది దీన్నుంచే విప్లవ సాహి త్యోద్యమానికి గొప్ప ప్రభావశీలత వచ్చింది.
      మనుషులను ప్రేమించే ఆశావహ సాహిత్యం ఈ పని మొదటి నుంచి చేస్తోంది. ప్రజా పోరాటాల నేపథ్యం నుంచి వచ్చే కమ్యూనిస్టు విప్లవ సాహిత్యం మరింత ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా చేస్తోంది. ఈ కర్తవ్యం పట్ల స్పష్టత, ఈ పాత్ర పట్ల ఎరుక విప్లవ కవికి నిండుగా ఉంది. విరసం ఒక సాహిత్య సంస్థగా రాజ్య నిర్బంధాలను అధిగమించడానికి ఈ ఎరుక చుక్కానిలాగా పని చేస్తోంది. ఆరంభంలో ప్రకటించుకున్న చారిత్రక సామాజిక సాంస్కృతిక కర్తవ్యాల నుంచి విరసం పక్కకు జరగకపోవడానికి ఇదే కారణం. ఏదైనా ఒక సంఘం యాభై ఏళ్లే కాదు. ఇంకెన్నేండ్లైనా ఉనికిలో ఉండవచ్చు. తోచిన మంచి పనులేవో చేస్తూ ఉండవచ్చు. కానీ పదునైన కత్తి అంచుమీద కొనసాగడం వెనుక అనేక ప్రేరణలు, స్పష్టతలు ఉండాలి. ఒక చారిత్రక యుగావధిలోని సాహిత్య సాంస్కృతిక కర్తవ్యాలకు బాధ్యత పడాలి. 
విరసం ప్రభావాలు
చారిత్రక అవసరాన్ని వర్తమానంలో తీరుస్తూ, భవిష్యత్‌ దిశగా సాగిపోయే అంతర్గత శక్తి ఉన్నప్పుడే ప్రాసంగికత ఉంటుంది. రోజూ ఏ రోజుకా పని చేస్తున్నందు వల్ల ప్రాసంగికత కలగదు. చరిత్రలోని వర్తమానం భవిష్యత్‌ అవసరాలు తీర్చగలగడమే ప్రాసంగికత. అట్లా విరసం ప్రభావాల గురించి ఆలోచిస్తున్నామంటే ప్రాసంగికత అనే గీటురాయి మీద పరీక్షిస్తున్నామని అర్థం. తెలుగు సమాజం మీద - అందులోని సాహిత్య సాంస్కృతిక మేధోరంగాల మీద విరసం ప్రభావాల్లో కొన్ని..
      తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ, ప్రగతి, సమానత్వం లాంటి భావనలు అంతకు ముందు కూడా ఉన్నాయి. సమూల విప్లవం అనే భావనను విరసమే ప్రవేశపెట్టింది. వ్యవస్థను సమూలంగా మార్చవచ్చు అని, అది ప్రజలకు సాధ్యమే అనే ఆలోచనను తిరుగులేని విధంగా తీసుకొచ్చింది. కొత్త వ్యవస్థ గురించిన కల రచయితల, బుద్ధిజీవుల ఆలోచనా వ్యక్తిత్వంలో భాగమైపోయింది. ఇది అపారమైన సృజనాత్మక అన్వేషణలకు ప్రేరేపించింది.
      రాజకీయాలకు సాహిత్యానికి విడదీయలేని సంబంధాన్ని విప్లవ సాహిత్యోద్యమం నిర్మించింది. రాజకీయ ఉద్యమాల్లో కళా సాహిత్యాల్ని అంతర్భాగం చేసింది. ఇది తెలుగు సాహిత్య రంగాన్ని సమూలంగా మార్చి వేసింది. ప్రజా దృక్పథంతో చేసే రచనే సాహిత్యంగా గుర్తింపు పొందటం వెనుక విరసం ప్రభావం ఉంది. 
      విరసం ప్రభావంతో కళా సాహిత్యాలు ఉద్యమ సాధనాలయ్యాయి. జానపదాలు, మాండలికాలు, మౌఖిక కళారూపాలు అన్నీ ప్రజాస్వామిక ఉద్యమాలకు ప్రచార వాహికగా మారాయి. 
      ప్రగతిశీల రచయితకు కులం, మతం, జండర్, సామ్రాజ్యవాదం, రాజ్యహింస, యుద్ధం, కశ్మీర్‌ మొదలైన విషయాల్లో ప్రజా దృక్పథం గీటురాయిగా మారిపోయింది. రచయితలు- పాఠకులు అనే సంబంధాన్ని ద్విముఖంగా మార్చివేసింది. పాఠకులు, ఉద్యమ కార్యకర్తలు రచయితలను ప్రభావితం చేసే స్థాయిలో గతిశీలత పెరిగింది. అందుకే గతానికంటే- ఈ యాభైఏళ్లలో రచయితలు, కళాకారులు- వాళ్ల రచనలకు, కళలకు సమాజంలో ఎక్కువ చోటు లభిస్తోంది.
      ఈ యాభై ఏళ్లలో సీరియస్‌ సాహిత్యానికి, కళలకు పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు అసంఖ్యాకంగా పెరిగారు. ఒకప్పుడు సాహిత్య పాఠకులు శిష్టవర్గాల వాళ్లే ఉండేవారు. ఆ తర్వాత మధ్య తరగతి నుంచి పాఠకులు ఉండేవాళ్లు. ఇప్పుడు అట్టడుగు స్థాయి నుంచి సాహిత్య పాఠకులుగా తయారు కావడంలో విరసం ప్రభావం ముఖ్యమైంది.
      తెలుగు మేధో ప్రపంచం విరసం ప్రభావం వల్ల తిరుగుబాటు లక్షణాలను సంతరించుకున్నది. విద్య, న్యాయ, పత్రికా, పరిశోధన రంగాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది.
      విరసం వచ్చాక భాషలు సంప్రదాయ ఛాయలు తొలిగిపోయాయి. రాత భాషలో మాండలికం చోటు సంపాదంచుకుంది. అభ్యుదయం, ఆదర్శం లాంటి వాటిని కూడా విమర్శనాత్మకంగా చూడగల ప్రభావాన్ని విరసం వేసింది.
రచయితలు, కళాకారులు, మేధావులు సంఘటితం కావడం, సంఘాల్లో చేరడం అనే ఒరవడి విరసం ప్రవేశపెట్టింది. ఈ ప్రభావంతో ఎన్నో సాహిత్య కళా సంస్థలు ఏర్పడ్డాయి. మేధో బృందాల్లో కలిసి పని చేసే అలవాటు పెరిగింది. 
      రచయితలు, కళాకారులు ప్రజలకు రుణపడి ఉంటారని, దాన్ని తీర్చుకోడానికి రాజీలేని పోరాటంలో భాగమైతే జైలు జీవితాలు, శిక్షలు అనుభవించాల్సి ఉంటుందనే అంశం విరసం ఆచరణ వల్ల సాహిత్య రంగంలోకి వచ్చింది. 
      ప్రజాస్వామికీకరణ అనే విలువకు గుర్తింపు విప్లవ సాహిత్యోద్యమం వల్లనే వచ్చింది. ప్రజాస్వామికీకరణ చైతన్యవం తమైన ఆలోచనలు- ఆచరణ వల్లనే సాధ్యం. అది జటిలమైన, సంక్లిష్ట ప్రక్రియ అనే అనుభవం, సాహిత్య రంగంలో కలగడానికి విరసం దోహదం చేసింది. విరసం ఏర్పర్చిన వర్గపోరాట భూమిక వల్ల సాహిత్య రంగంలో ప్రజాస్వామిక ఆవరణ ఏర్పడింది. అప్పటి దాకా వ్యక్తీకరణ పొందని గొంతుకలు, అనుభ వాలు, జీవిత నేపథ్యం రంగం మీదికి వచ్చాయి. దీనికి ఇతరేతర సామాజిక క్రమాలు, సంఘర్షణలు కూడా దోహద పడ్డాయి. మొత్తం మీద కొత్త సమూహాలు, వాటి ఆకాంక్షలకు చోటు దక్కడం వల్ల ప్రజాస్వామికీకరణ ఆచరణలోకి వచ్చింది. ఈ క్రమం విరసం ప్రజాస్వామికీకరణకు కూడా ప్రేరేపించింది. వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు, భావజాలాలు నిరంతరాయంగా ప్రజాస్వామికీకరణకు గురి కావాల్సిందే. అనేక దశల్లో సమాజ చైతన్యీకరణ క్రమంపై విరసం వేసే ప్రభావం తిరిగి తన చైతన్యంలో, ఆలోచనారీతుల్లో ప్రతిఫలించింది. 
నేర్చుకోవడం.. నేర్పడం
వినయంగా నేర్చుకోవడం, స్వీకరించడం అనే ఒరవడి విరసం ఆవిర్భావం నుంచీ ఉంది. మొదటి నుంచి అట్టడుగు పోరాట ప్రజల నుంచి విరసం ఎంతో నేర్చుకున్నది. తద్వారా సంక్రమించిన శక్తి లేకుంటే ప్రతిఘాతుక శక్తులతో తలపడటం అయ్యే పని కాదు. రెండో దశ ఆరంభమయ్యాక మిత్రశక్తులు రంగం మీదికి వచ్చాక వినే సుగుణం, నేర్చుకునే ధోరణి ఇంకో దశకు చేరుకుంది. వివిధ అస్తిత్వవాదాలతో సంభాషణలో ప్రజాస్వామిక చర్చా పద్ధతిని ఆచరిస్తోంది. నేర్పించడం ద్వారానే కాక తను నేర్చుకోవడం ద్వారా కూడా సమాజం, సాహిత్య రంగాల ప్రజాస్వామి కీకరణపై విరసం ప్రభావం చూపిస్తోంది. తన స్వభావం వల్ల, పాత్ర వల్ల విరసం సమాజ సాహిత్య మేధో రంగాలను ప్రభావితం చేయడమేగాక విజయాలుగా చెప్పకోదగినవి ఎన్నో సాధించింది. వాటిలో ముఖ్యమైనవి..
      విరసం మూడు తరాల్లో అద్భుతమైన సృజనాత్మక రచయితలను, కళాకారులను, బుద్ధిజీవులను సమాజానికి అందించింది. ఇవాళ తెలుగు సమాజాల్లోని వేర్వేరు రంగాల్లో, భిన్న భావజాలతో పని చేస్తున్న వాళ్లెందరో వ్యక్తులుగా, సృజనకారులుగా రూపొందిన తమ తొలి దశను విరసంలోనే పూర్తి చేస్తున్నారు. అట్లాగే ఈ యాభైఏళ్లలో చివరంటా విరసంలో ఉండిన, కొనసాగుతున్న మూడు తరాల నాయకత్వాన్ని ప్రభావశీలమైన రచయితలను, మేధావులను కూడా విరసం తయారు చేసుకుంటోంది. 
      వ్యవస్థను బద్ధలు కొట్టే ప్రజాపోరాటాల వెనువెంట నడుస్తూ సాహిత్య సాంస్కృతిక వర్గపోరాట శక్తిగా రుజువుకావడం విరసం సాధించిన ఓ పెద్ద విజయం. జైళ్లు, నిర్బంధాలు, నిషేధాలు, హత్యాయత్నాల లాంటి ఎన్నో దాడులను ఎదుర్కోవడం కేవలం తన అంతర్గత శక్తి వల్లనే కాదు.. ప్రజా పోరాటాల వల్ల, తను వేసిన ప్రభావం వల్ల, తన చుట్టూ ఈ సమాజంలో ఓ ప్రజాస్వామిక క్షేత్రాన్ని రక్షణ వలయంగా రూపొందించుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది. తనలాంటి నమూనా మరేదీ గత చరిత్రలో లేకపోయినా తానే ఒక ఉదాహరణగా నిత్య ప్రయోగాలతో యాభైఏళ్లుగా కొనసాగడం గుర్తించాల్సిన విజయం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం