చిత్రాకళా జగత్తులో కవీ..రవీ!

  • 476 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఏవీబీఎస్ ఆనంద్‌

  • చిత్ర‌కారులు,
  • హైద‌రాబాదు
  • 9849655367
ఏవీబీఎస్ ఆనంద్‌

సాధారణ పొడవు వెడల్పుల అచ్చతెలుగువాడి ఆకారం.. తెల్లటి పంచె, లాల్చీ, నల్లటి చెప్పులతో నిరాడంబర ఆహార్యం.. విశేష చిత్రకళా నైపుణ్యం.. పరిమితి మించని సంభాషణం.. ఎంత తెలిసినా నేనింతేనన్న అతిసామాన్య జీవితం.. తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం.. అదే వడ్డాది పాపయ్య గొప్పదనం! ఎవరూ అనుకరించనిలేని రీతిలో ‘వపా’ సృష్టించిన చిత్రాలు.. రసరమ్య మనోకావ్యాలు! 
రేఖ,
వర్ణ, భావ చిత్రరచనలు మూడింటి రహస్యాల్ని తెలుసుకున్న చిత్రకళా మేధావి వడ్డాది పాపయ్య. అయిదు దశాబ్దాల పాటు తెలుగు పత్రికలకి అందించిన చిత్రలేఖనమే కాకుండా.. తన ఇంటి గోడల మీద మట్టి, సున్నం, బొగ్గు మిశ్రమాలతో విశాల కుడ్య  చిత్రాలు గీయడం, కాగితాన్ని ముడతలు చేసి- ముడతలు విప్పి, వాటి మీద బొగ్గుతో చిత్రాలు వేసి ప్రయోగాలు చేయడం ‘వపా’లోని మరో కోణం. అప్పుడప్పుడు కథలు, కవితలు రాయడం ఆయనకు సరదా. సంస్కృతాన్ని అభిమానించే వ్యక్తిగా తెలుగులో ‘జంభూలోక చరిత్ర, త్రికళ, జావళి, ఆషాఢమణీయం’ కథలను అద్భుతంగా మలిచారు.
      శ్రీకాకుళంలో 1921 సెప్టెంబరు పదిన ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు వడ్డాది పాపయ్య. తల్లిదండ్రులు మహాలక్ష్మి, రామ్మూర్తి. తండ్రి స్థానిక కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉంటూనే నలుపు తెలుపు చిత్రాలు గీయడం ద్వారా చిత్రకారుడిగా పేరొందారు. చిత్రలేఖనంలో పాపయ్యకు మొదటి గురువు ఆయనే. బాలలకు ఇష్టుడైన హనుమంతుడి బొమ్మను అయిదేళ్ల వయసులో చిత్రించి ఓ మెరుపు మెరిశారు ‘వపా’. 1938లో ఎస్సెస్సెల్సీ పూర్తి చేశాక, పదిహేడో ఏట నుంచే చిత్రకారుడిగా జీవితం ప్రారంభించారు. తొలినాళ్లలో భారతీయ పౌరాణిక చిత్రకళా బ్రహ్మ రాజా రవివర్మను ప్రేరణగానూ, ప్రముఖ ఆంధ్ర చిత్రకారులు దామెర్ల రామారావు, అడవి బాపిరాజులను గురువులుగా భావించారు. తనకు ఇష్టులైన చిత్రకారులకు గురువైన మహారాష్ట్రకు చెందిన చిత్రకళా ఆచార్యులు ధురంధర్‌ చిత్రాలూ పాపయ్యను ప్రభావితం చేశాయి. ఇలా వారందరి చిత్రాలను పరిశీలిస్తూ, తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగారు. ఆయనకు ఇద్దరు సతీమణులు.. నూకరాజమ్మ, లక్ష్మీదేవమ్మ. వీరికి ముగ్గురు కుమారులు రవిరామ్, వసంతరామ్, పావనాచారి; ఓ కుమార్తె అనూరాధ. 
తనదైన ‘సంతకం’
‘భారతి’ పత్రికలో వేసిన ‘నాగేశ్వరుడు’ బొమ్మ తన మొదటి చిత్రం కావొచ్చని, ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘రతీ మన్మథ’ చిత్రం సంచలనం సృష్టించి, అందరి దృష్టిని ఆకర్షించి విమర్శలకు గురయ్యిందని పాపయ్య ఓ సందర్భంలో చెప్పారు. తర్వాత ‘రేరాణి, అభిసారిక’ లాంటి పత్రికల్లో వచ్చిన ఆయన చిత్రాలను నాటి ప్రముఖ దర్శక నిర్మాత, పత్రికా సంపాదకులు చక్రపాణి చూశారు. ‘చందమామ, యువ’ మాసపత్రికలకు బొమ్మలు వేయడానికి మద్రాసుకాహ్వానించి, ‘వపా’ జీవితాన్ని మలుపు తిప్పారు. అక్కడ పాతికేళ్లు పనిచేసిన పాపయ్య, ఒక మేధావితో పనిచేసిన ఆనందాన్ని, తన ప్రగాఢమైన గౌరవాన్ని చక్రపాణి పట్ల వ్యక్తం చేశారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకారులుగా, వ్యంగ్య చిత్రకారులుగా, రచయితగా, ప్రయోగశీలిగా దశాబ్దాల పాటు తెలుగు చిత్రకళ, సాహితీ జగత్తులకు సేవలందించారు. చక్రపాణి తర్వాత అంతగా ‘వపా’ను ‘స్వాతి’ బలరాం అభిమానించారు. స్వాతి పత్రికతో పాపయ్యకు ఏర్పడిన ఆత్మీయతానుబంధం చివరి వరకూ నిలిచింది.
      గొప్పతనం బొమ్మకి- నిరాడంబరత తనకి నింపుకున్న ‘వపా’ తన సంతకాన్ని ప్రత్యేకం చేశారు. సాధారణంగా చిత్రకారుల సంతకాలన్నీ అక్షర రూపంలో ఉంటాయి. కానీ, పాపయ్య మాత్రం ‘వపా’ అన్న రెండక్షరాల సంతకంతో పాటు మానవ ముఖానికి సంకేతంగా రెండు కళ్లు, ఓ ముక్కును తలపించేలా ఉండే ఓ ప్రత్యేకమైన గుర్తుని తన బొమ్మల దిగువన పొదిగేవారు. గూఢంగా, విలక్షణంగా, తనదైన ముద్రను సూచించేదిగా ఉంటుంది ఆ గుర్తు. ‘‘అటు సున్నా! ఇటు సున్నా! మధ్యన నేనున్నా! నిలువు గీతనై ఒకటిగా నిల్చున్నా! ఇటు రజో వలయం అటు తమోవలయం సత్వమై, సత్యమై, నిత్యమై నేనున్నా!’’ అంటూ దానికి ప్రత్యేక వివరణ ఇచ్చారు పాపయ్య. 
ఏకైక చిత్రకారుడు
రంగుల్లోనూ, రేఖల్లోనూ ఏమీ ఉండదు.. వాటిని చిత్రించే పద్ధతిలోనే చిత్రకారుడి ప్రత్యేకత గోచరిస్తుందన్నది పాపయ్య అభిప్రాయం. ‘ఛాయా చిత్రానికీ, వాస్తవ చిత్రానికీ అందని దృశ్య చిత్రణ చేయడమే నా అభిమాన చిత్ర విన్యాస’మని అనేవారాయన. 17 సంవత్సరాలకే చిత్రకళా జీవనం ప్రారంభించి, అంకెలు తిరగబడిన వయసు, అనగా 71 ఏళ్ల వరకూ ఆ జీవితాన్ని కొనసాగించిన పాపయ్య.. అర్ధశతాబ్దానికి పైగా తన నిశ్శబ్ద చిత్రరాజ్యంలో నిర్విరామంగా కృషిచేసిన కర్మయోగి. పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొనకుండా.. ప్రచారానికి, ప్రశంసలకి దూరంగా.. పత్రికలకు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన మితభాషి, ఆ కాస్త మాట్లాడినవారితో అయినా అవసరానికి మించిన విషయాలు మాట్లాడేవారు కాదు. తన కచ్చితత్వాన్ని నిర్మొహమాటంగా తెలియజేసేవారు. అందుకే ఆయనకు భయపడి చాలామంది దూరంగా ఉండిపోయారంటారు. ఎలాంటి విమర్శలకూ చలించకుండా తన జీవితాన్ని సంపూర్ణంగా కళకు మాత్రమే అంకితం చేసి, కాలాన్ని సద్వినియోగం చేసుకుని, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చిన దృఢచిత్తుడాయన. వ్యక్తి కన్నా కళ, రాశికన్నా వాసి ముఖ్యమని భావించి వేసిన ప్రతి చిత్రాన్నీ అద్భుతంగా తీర్చిదిద్ది తెలుగు పాఠకులకు అందించారు. రేఖా చిత్రాలు, ఏకవర్ణ చిత్రాలు, బహువర్ణ చిత్రాలు సృజించిన ‘వపా’.. జీవితాంతం నీటిరంగు మాధ్యమంలోనే చిత్రాలు గీసిన ఏకైక చిత్రకారుడిగా పేరొందారు.
      తొలినాళ్లలో జానపద చిత్రాలు ఎక్కువగా వేసినా తర్వాత్తర్వాత పాశ్చాత్య బాణీల్లో చిత్రాలు గీశారు పాపయ్య. ఆధునిక విధానాల్లో కూడా చిత్రరచన చేశారు. పాశ్చాత్య శైలిలోని చిత్రాలకే ఎక్కువ ఆదరణ లభిస్తోందని తెలిసినా, తనదైన ఐచ్ఛిక దృక్పథాన్ని మార్చుకోకుండా ఓ భావజాలంతో వేసిన చిత్రాలతో కోట్లాది మందిని ‘వపా’ ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో పత్రికలకు ఆయన వేసిన ముఖచిత్రాలు ఇప్పటికీ చూపు తిప్పుకోనివ్వవు.  
పరిపక్వమైన గీతలు
ఏ చిత్రకారుడైనా తాను వేయాల్సిన చిత్రాన్ని ముందుగా తన ఊహలో విస్తృతంగా దర్శిస్తాడు. అలా చూసిన అనంత భావనా దృశ్యాలను కొలతలకు కట్టుబడి అడుగులు, అంగుళాల పరిధికి కుదించి చిత్రనిర్మాణం చేస్తాడు. అలా చేసి ప్రజలను అలరించడం ఒక ఎత్తు అయితే, దూరదృశ్యరూప చిత్రణా విలువలు (డైమెన్షనల్‌ వాల్యూస్‌) నింపడం, చిత్రానికి అవసరమైన పరిసరాలను విస్మరించకుండా (బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌) తన మనోభావ దృశ్యాలకు చిత్రరూపాన్నిచ్చి సౌందర్యభరితం చేయడం అదొక ప్రత్యేక ప్రతిభా విశేషం. నేటి వ్యాపారాత్మక ప్రపంచంలో ఈ లక్షణం అతి తక్కువ మంది చిత్రకారుల్లో కనపడుతుంది. కానీ, వడ్డాది చిత్రాల్లో మాత్రం ఇది ప్రతి చిత్రంలోనూ ద్యోతకమవుతుంది. 
      ‘వపా’ రేఖా విన్యాసం అనితరసాధ్యమైంది. నిసివర్ణ రేఖల్ని, పలువర్ణ రేఖల్ని తన తూలికావిన్యాసంతో సన్నగా, లావుగా గీస్తూ అవసరమైన వేగంతో సమతుల్యంగా నడిపించి, పాత్రోచితంగా చిత్రాన్ని రూప రంజితం చెయ్యడంలో ఆయన దిట్ట. భంగిమలు, భావ ప్రకటనలు, విశాలనేత్రాలు, శరీర నిర్మాణంలోని ఎత్తుపల్లాలను తన రసరేఖల్లో సున్నితంగా ఒదిగిపోయేలా చేసి చూపరుల్ని బ్రహ్మానందభరితం చేస్తారు ‘వపా’. కవుల వర్ణనలకు అనువుగా ఆయన చేసిన దృశ్యనిర్మాణం, పరిపక్వమైన గీతలతో ఓ ప్రత్యేకశైలికి దర్పణం పడుతుంది. అపారమైన అనుభవంతో కూడిన రంగుల మేళవింపు ‘నభూతో..’ అనిపిస్తుంది. రేఖలతో నిర్మితమైన ఆ పాత్రలు, సృజనాత్మకంగా చేసిన వస్త్రధారణ, ఆభరణాల అలంకారం, వాటి మెరుపులు, ధగధగలు, స్వర్గలోకాల అనుభూతిని అలవోకగా అందించే జలవర్ణ దృశ్యచిత్రణా చమత్కృతి చూపరులకు నేత్రానందం కలిగిస్తుంది. అనుకరణకు అందని వైవిధ్యమేదో అంతర్లీనంగా వీక్షకులను ఆహ్లాదపరుస్తుంది. ఇంతటి వర్ణమిశ్రమ మాయాజాలం ‘వపా’కే ప్రత్యేకం. తర్వాత ఎవరైనా అనుకరించినా, ఆయనంతటి పరిపక్వత మరెవ్వరిలోనూ కనిపించదు.
పాత్ర చిత్రణా వైవిధ్యం
పాపయ్య గీసిన వేల చిత్రాల్లో ఎక్కువగా స్త్రీ పాత్రలే ఉంటాయి. కొనదేరిన ముక్కులు, మృదువైన పెదవులు, దృఢమైన శరీరసౌష్టవాలు, సన్నని నడుము, నునుపైన బాహువులు, కలవరపరిచే కంటిచూపులు, పాత్రకు అనువైన భంగిమలతో నవరసాలను చిత్రాల్లో స్పష్టంగా తెలియచెప్పడం ఆయన ప్రత్యేకత. పల్లెపడుచులు, పౌరాణిక సుందరాంగులు, కావ్యకాంతలు, దేవతామూర్తులు.. ఇలా ఎవరిని చిత్రించినా వేటికవే వర్ణనాతీతంగా ఉండేలా తీర్చిదిద్దే కల్పనా చాతుర్యం ‘వపా’ది. సౌందర్యరాశులు సైతం తన బొమ్మలు చూసి అసూయపడేలా స్త్రీమూర్తులను తీర్చిదిద్దడం ఆయనకే సాధ్యం. ఆహ్లాద వర్ణసమ్మేళనం, పాత్రోచిత అలంకరణలతో ‘వపా’ అష్టనాయికల్ని చిత్రించిన విధానం ఊహాతీతం! లక్ష్మి, పార్వతి, సరస్వతి, మోహిని, రంభ, ఊర్వశి, తిలోత్తమ తదితర దివ్యలోకవాసులను ఎంత గొప్పగా తన భావనాపటిమతో చిత్రించి దర్శింపచేస్తారో.. జానపద నాయకామణులైన ఎంకి, నాగమల్లి లాంటి వారికి కూడా అంతే అందంగా దృశ్యరూపమిస్తారాయన. కరుణశ్రీ, ఉదయశ్రీల కవితలకు వేసిన చిత్రాలు ప్రజాదరణ పొందాయి. ఉమర్‌ ఖయ్యామ్‌ కావ్యంతో పాటు రుతువులు, సంవత్సరాలకు ‘వపా’ చేసిన చిత్రరూపణం, ఆయనలోని అంతఃసౌందర్య తత్వానికి అద్దంపడుతుంది. ‘శివరంజని, హిందోళ, కన్నడ, సహన, జయజయవంతి, అహిర, భైరవి’ రాగాలకు భావయుక్తంగా చిత్రాలు గీసి ఆకట్టుకున్న ఊహాచతురుడు, ఆధునికుడు పాపయ్య. ఇలాంటి చిత్రకళా విన్యాసాలకు ఆద్యుడూ ఆయనే.
      తొలినాళ్లలో ఇష్టమైన చిత్రకారుల్ని అనుసరించినా, భారతీయ యూరప్‌ చిత్రశైలుల గురించి తెలుసుకున్నా.. వేరెవ్వరి ప్రభావాన్నీ సోకనివ్వకుండా తన సొంత శైలికి వన్నెతెచ్చిన పదహారణాల తెలుగు చిత్రకారుడు వడ్డాది పాపయ్య. సౌందర్యతత్వం చిత్రానికి- సామాన్యతత్వం జీవితానికి అన్వయించుకుని పత్రికారంగానికే పరిమితమైన పాపయ్య సాధారణ గృహ జీవనం గడిపారు.
      తాత్విక చింతనతో కళనే పరమావధిగా భావించిన వపా.. ‘‘నేను ఆస్తికుణ్ని, ఆశావాదిని, అలాగని దేవుణ్ని ప్రార్థించి ఏ చిత్రమూ గీయను. అంతర్లీనంగా దేవునిపట్ల భక్తిభావం ఎప్పుడూ ఉంటుంది. ప్రశాంత నిశీధి సమయాల్లోనే నా ఆలోచనలకు చిత్రరూపం ఇస్తూ ఉంటాను’’ అని చెప్పారోసారి. వ్యంగ్య చిత్రాలు (కార్టూన్లు) హాస్యానికే పరిమితం కాకుండా, విమర్శకు అద్దంపట్టి సమాజ శ్రేయస్సుకి దోహదపడాలని కోరుకునే వారు. ప్రచారానికి, ప్రదర్శనలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానుల ద్వారా ఖరగ్‌పూర్, బాన్సువాడల్లో ‘వపా’ చిత్రప్రదర్శనలు జరిగాయి.
      ‘‘ఆంధ్ర దేశంలో ‘వపా’ తెలియని వారుండరు. ఉంటే!!? మన కళాకారుల గురించి మనం తెలుసుకోకపోవడం మన లోపమే. నేటి సమాజం ఆధునిక నైరూప్య కళావిధానంలో కొట్టుకుపోతున్న తరుణంలో, మన పాపయ్యగారి చిత్రాలు మన్నన పొందడం కష్టమే! ‘వపా’ ఆఖ్యాయిక చిత్రకారులు. ప్రధానంగా నిపుణ వర్ణకారులు, బలీయ రూపకారులు కూడా. నేటి కళాజగత్తులో చిత్రాలన్నీ ఉత్తమ కళాసృష్టి కాదు. ఆ కొన్ని ఉత్తమ కళాసృష్టిలో ‘వపా’ది ఒకటి’’ అంటారు ప్రముఖ కళావిమర్శకులు సంజీవదేవ్‌. అంతటి చిత్రకళా స్రష్ట అయిదు నెలల పాటు అస్వస్థతకు గురై, తన అంతిమ స్థితిని గుర్తెరిగి వైద్యాన్ని నిరాకరించారు! స్వగ్రామంలోని స్వగృహంలో 1992 డిసెంబర్‌ 30 ఉదయం ఆయన పరమపదించారు. తన చిత్రాలతో తెలుగువారికి దివ్య భావనా దృశ్యలోకాల్ని కళ్లకుకట్టి ‘వపా’ అమరులయ్యారు. కళాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం