మంచి పుస్తకంలాంటి మనిషి

  • 90 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బి.వి.రమణ

  • తిరుపతి
  • 9704567641

వృత్తిరీత్యా న్యాయవాది అయినా సాహితీ పఠనం, పర్యావరణం మీద అవగాహన కల్పించడం, వ్యాస రచన లాంటి ప్రవృత్తులతో అర్థవంతమైన జీవితాన్ని గడిపారు గోగుల విజయకుమార్‌. తిరుపతికి చెందిన ఆయన 1945 ఆగస్టు 30న జన్మించారు. తండ్రి కమ్యూనిస్టు కావడంతో విజయకుమార్‌కూ వామపక్ష భావజాలం అబ్బింది. రష్యన్, తెలుగు సాహిత్య పుస్తకాల అధ్యయనంలో ఆయన జీవితం సాగింది. ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశాక పలు ఉద్యోగాలు చేశారు. తండ్రి మరణం, ఇద్దరు తమ్ముళ్లు చిన్నవాళ్లు కావడంతో భార్య రాగిణితో మళ్లీ తిరుపతి వచ్చేశారు. న్యాయ విద్య చదివి తిరుపతి కోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు. న్యాయశాస్త్ర అంశాలను చక్కటి తెలుగులో అందరికీ వివరించి చెప్పేవారు. 1992లో సాఫ్‌ట్రెక్‌ (సేవ్‌ అవర్‌ ఫారెస్ట్స్‌ అండ్‌ ట్రెక్కింగ్‌ సొసైటీ)ని ప్రారంభించి యువత కోసం తిరుమల, తలకోన అడవుల్లో పర్వతారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. వారికి పర్యావరణం పట్ల అవగాహన కల్పించారు. 1995లో యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తిరుపతి శాఖ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యటకులు, విద్యార్థులకు నామమాత్రపు రుసముతో బస, భోజన వసతి కల్పించే యూత్‌ హాస్టల్‌ భవన నిర్మాణంలో ఆయన కృషి ఎనలేనిది. యూత్‌ హాస్టల్‌ అధ్యక్షులుగానూ పనిచేశారు. వివిధ పత్రికల్లో పర్యావరణం, పర్వతారోహణ మీద ఎన్నో వ్యాసాలు రాశారు. రష్యన్, తెలుగు సాహిత్యాల గురించి ఎస్వీ, పద్మావతి విశ్వవిద్యాలయాల్లో, బయటా అనేక ఉపన్యాసాలిచ్చారు. ప్రపంచభాష ఎస్పెరాంతో నేర్చుకుని తిరుపతి ఎస్పెరాంతో అసోసియేషన్‌ (టీఈఏ) స్థాపించారు. తెలుగులో మొదటి ఎస్పెరాంతో బోధినిని ప్రచురించారు. 2010లో శేషాచలం పర్వతారోహణలో జరిగిన ప్రమాదంలో తుంటి ఎముక విరిగి మంచానికే పరిమితమయ్యారు. భార్య మరణం మరింత కుంగదీసింది. అలాంటి పరిస్థితుల్లో సాహిత్యం ఆయనకు సాంత్వననిచ్చింది. ఆ సమయంలోనే రష్యన్‌ సాహిత్య చరిత్ర, అనేక ప్రేమకథలు, సామాజికాంశాలతో కూడిన రచనలు చేశారు. చివరి వరకూ మంచి పుస్తకం లాంటి జీవితం గడిపిన ఆయన 2020 జనవరి 4న తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్లుగా విజయకుమార్‌ సేకరించిన 450 పుస్తకాలను ఆయన తమ్ముడు రాజా, మరదలు పార్వతి రామోజీ ఫౌండేషన్‌కు బహూకరించారు. ఆయన రచనలన్నింటినీ వెలుగులోకి తెచ్చేందుకు మిత్రబృందం నడుంబిగించింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం