చరిత్ర తప్ప మరో మార్గం లేదు

  • 501 Views
  • 26Likes
  • Like
  • Article Share

విజయవాడకి సమీపంలోని గుంటూరు  హైవే రోడ్డుకి ఆనుకుని ఉన్న హ్యాపీ రిసోర్ట్స్లో 'కాల యంత్రం' -2020 (చారిత్రక కథా రచన కార్యశాల) మొదటిరోజు కార్యక్రమం 'నర్తనశాల' సభా వేదికపై  ప్రారంభమైంది. 
      సాయి పాపినేని సమన్యయ కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో చారిత్రక పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి రచయితలు కథా రచనలో ఏర్పరచుకోవాల్సిన అంశాలపై ప్రస్తావించారు.
      కళింగ ప్రాంత ప్రాచీనత... కళింగ రాజుల ప్రస్తావన... బౌద్ధ సాహిత్యంలో ఆధారాలు... వర్తక వాణిజ్యాల విస్తరణ... చారిత్రక పురా వైభవం గురించి  దీర్ఘాసి విజయ భాస్కర్  సుదీర్ఘ ప్రసంగం చేశారు.

      సమకాలీన తెలుగు కథారచయితలలో చరిత్ర పట్ల ఆసక్తి పెంచి, వారి దృష్టిని చారిత్రిక కథారచన వైపు మళ్లించే దిశలో చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ కార్యశాల అని నిర్వాహకులు తెలిపారు.

      చారిత్రక పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ... "మనం రాసే రచన ద్వారా మన జాతిని గురించి  నేటి తరానికి తెలియజేయాలంటే.. చరిత్ర తప్ప మరో మార్గం లేదు. 
      ఐదు లక్షల సంవత్సరాల క్రితమే మన తెలుగు నేలలో నాణేలు విరివిగా దొరికాయి. కర్నూలు దగ్గర కనిపించిన జ్వోలాపురం 75 వేల సంవత్సరాల చరిత్రకు ఆనవాలుగా ఉంది. పాఠ్యాంశాల చరిత్రకు కొన్ని పరిమితులుంటాయి. కాబట్టి వాటి వల్ల పూర్తి చరిత్ర తెలుసుకోవడానికి వీలు పడదు. వాటికి అతీతంగా ఘనమైన చరిత్ర మనకుంది. వర్తమాన అంశాలను అన్వయించుకుంటూ... విశేష పరిశోధనలు చేసిన చరిత్రను నేటి రచయితలు అధ్యయనం చేయాలి. అరుదుగా దొరికే చరిత్ర అవశేషాలను ఆధారంగా చేసుకుని సృజనాత్మక రచనకు ఉపక్రమించాలి. జానపదుల మౌఖిక సాహిత్యంపై దృష్టి పెట్టాలి. 
అశోకుని  కాలం ముందు నుంచే తెలుగులో  శాసనాలు  దొరకబట్టి భట్టిప్రోలులో తొలి తెలుగు పదాలు అనేకం ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో దొరికిన శాసనాల ఆధారంగా మౌర్యులతో శాతవాహనుల సంబంధాలపై ఒక స్పష్టత కనిపిస్తుంది.
      ఒక నాణెం పట్టుకొని అద్భుతమైన కథ రాయవచ్చు.  గతంలో  కుబేరక, నాగనిక, అడవి శాంతశ్రీ వంటి ప్రాచీన వ్యక్తులపై రచనలు వచ్చాయి తెలుగులో. మరిప్పుడు చారిత్రక రచనలు బాగా తగ్గిపోయాయి. మరో ముఖ్య విషయం.... ఔత్సాహికులు... చారిత్రక కథా రచయితలు పురావస్తు  ప్రదర్శన శాలలని దర్శించాలి. అప్పుడే సిసలైన చారిత్రక స్పృహ అందుతుంది"

      నాలుగు వందల సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన చారిత్రక తెలుగు ప్రాంతం నాగుల వంచ . గోల్కొండ నుంచి మచిలీపట్నం వెళ్లే దారిలో నాగులవంచ ప్రధాన వర్తక కేంద్రంగా డచ్ వాళ్ల వ్యాపార ప్రస్థానం ఎలా సాగిందీ... డచ్ వాళ్ల పాలనలో స్థానికుల పడే సమస్యలు ఎలాంటివీ!  ఈ నాగుల వంచ ప్రాంతంలో దొరికే.. వజ్రాలు, సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, సుర్యాకారం లక్క, చౌడు భూముల్లో దొరికే ఉప్పు వంటి వస్తువుల ఎగుమతుల వివరాలనూ... అప్పటి చారిత్రక కట్టడాల వివరాలను పరిశోధకులు కట్టా శ్రీనివాస్  పవర్ పాయింట్ సహాయంతో... విశ్లేషించారు. 
      కంపెనీ వర్తకులుగా నికోలస్ ఫాబర్, డేనియల్ ఆవార్డ్, అబ్రహం వాండర్ ఊర్ట్.. వర్తక ప్రయాణాన్ని గురించి మాట్లాడారు. ధంసా రాజవంశీయుల గురించి, బళ్లా పేరయ్య కవి భద్రగిరి శతకంలోని కొన్ని ప్రముఖ విశేషాలను ప్రస్తావించారు. 
      కాకతీయుల కాలపు శిల్పాల్లో... ఆహార్యం.. నాట్య రీతులు... ముఖ్యంగా... యుద్ధకాలంలో వీరులు చేసే పేరిణీ నృత్యం కాకతీయుల పతనానంతరం ఎలా కనుమరుగయ్యిందనే విషయాలపై లోతైన విశ్లేషణ చేశారు.

      ప్రముఖ కథా రచయిత, పరిశోధకులు వేంపల్లి గంగాధర్ రాయలసీమ ప్రాంతంలో ఆదివాసీల ఆనవాళ్లు అనే అంశం పై సుదీర్ఘ ప్రసంగం చేశారు. కడప జిల్లా లోని చింతకుంట రాతి గుళ్లు గురించి, రేనాటి చోళరాజు పుణ్య కుమారుడి భార్య రాణి వసంతపోరీ ని తెలిపే దొమ్మలి నంద్యాల తామ్ర శాసనాల గురించి... చెప్తూ... ఈ కాలంలో వచ్చిన శాసనాలన్నీ దాన శాసనాలే అనీ.. అశోకుడు వేయించిన శాసనాలు కొన్ని కర్నూలు జిల్లా జొన్నగిరి (దీనినే ఏనుగు నల్లకొండ అంటారట)లో దొరుకుతున్నాయనీ.. వీటిపై పరిశోధన చేయవలసి ఉందని తెలిపారు. 
      అనంతపురం జిల్లా గుంతకల్లుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనంది జైన క్షేత్రంలో కొండ కుంద అనే దిగంబర సన్యాసి గురుపీఠం గురించి ప్రస్తావించారు. అక్కడే ఒక రాతి మీద చెక్కి ఉన్న జంబూదీప చక్రం విశిష్టత గురించి మాట్లాడారు. కడప జిల్లా దానవులపాడులో ఉన్న పార్శ్వనాథుని విగ్రహంతో పాటు.. దాన్ని బిత్తలస్వామిగా స్థానికులు పిలవడం వెనుక కారణాలను విశ్లేషిస్తూ... ఒక చారిత్రక రచన చేయవచ్చని సూచించారు. 
      అప్పట్లో రాజులు విధించే 'కుక్కచ్చు' అనే ఒక విధమైన శిక్షను ప్రస్తావిస్తూ... మేనెల్ల కుక్కచ్చు లొత్తు అను ప్రయోగం ఒకటి గౌరన నవనాథ చరిత్రలో కనబడుతుందని గుర్తుచేశారు. మట్ల రాజుల చరిత్ర, కార్వేటి నగర సంస్థానంలో హజరం అనే ముద్రణాలయం గురించి... అప్పటి సాహిత్య సేవ గురించి.. లోతుగా శోధించి రచనలు చేసేందుకు సమాయత్త మవ్వాలని సూచించారు.

      మధ్యాహ్నం రెండున్నరకి... 'చారిత్రక కథా రచనలో ఇబ్బందులు- రచయితల సూచనలు' అనే అంశంపై బృంద చర్చలు జరిగాయి. హాజరైన  కథా రచయితలని వంశధార, మంజీర, గుండ్లకమ్మ, చెయ్యేరు, హంద్రీ...  పేరిట ఐదు బృందాలుగా ఏర్పరచి 'నేడు కథా రచయితలు చారిత్రక కథల విషయంలో ఎదురవుతున్న సమస్యల'ను గురించి సూచనలు చేయాల్సిందిగా సమన్యయ కర్త సాయి పాపినేని నిర్దేశించారు. ప్రతీ బృందంలోనూ ఆరుగురు సభ్యుల చొప్పున పాల్గొనేలా.. వారనుకున్న అభిప్రాయాలను వారి బృంద సభ్యుడు మాత్రమే వేదికపై వ్యక్తపరచేలా ఏర్పాటు చేశారు. ఇదీ అర గంటపాటు కొనసాగింది. 
      లోకంలో అసలైన చరిత్ర ఒకటుంటే..ప్రజల ఇష్టానుసారముగా వక్రీకరణకు గురైన చరిత్ర మరొకటుంటుంది... కాబట్టి చారిత్రక కథల రచనలో ప్రాంతీయాభిమానం పొడసూపకుండా.. అంటే నేను నాదీ అనేది లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాయడం అవసరం.. అందుకోసం రచయితలకి చారిత్రక దృష్టి అవసరం అన్నారు చెయ్యేరు బృంద నిర్వహకులు దగ్గుమాటి పద్మాకర్.
      బహుళ సంస్కృతుల కారణంగా భాష పట్ల. జాతి పట్ల మమకారం లేకపోవడం ఒక లోపం. రచయితలు దీన్ని అధిగమించాలన్నారు గుండ్లకమ్మ బృంద నిర్వహకులు పాపినేని శివశంకర్. చరిత్ర పాఠకులంటూ ప్రత్యేకంగా ఉండరు. గత చరిత్రలోకి వెళ్లి సత్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించాలి.. ఇది చాలా శ్రమతో కూడిన పని... అని వ్యాఖ్యానించారు. 
      ప్రాథమిక విద్యా స్థాయిలో చరిత్ర పాఠ్యాంశాలు సరిగా లేవు. స్థానిక చరిత్రలూ అందుబాటులో లేవు. రాసే సామర్థ్యం ఉన్నా... ఆనాడు ఎవరూ చరిత్ర రచనకు పూనుకోకపోవడం వల్ల ఈనాడు చారిత్రక అంశాలపై పరిజ్ఞానం లేకుండా పోయింది. 
      స్థానిక వ్యక్తులు, స్థల మాహాత్మ్యాలపై ఇప్పటికీ నిర్ధిష్టమైన సమాచారం దొరకడం లేదు. ఇప్పుడు చారిత్రక కథా రచన చేయడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే..  చరిత్రపై నిజ నిర్దారణ చేయగల పరిజ్ఞానం లేకపోవడమన్నారు ఆంధ్రీ బృంద నిర్వహకులు అరవింద్ ఆర్య పకిదె. 
      గత చరిత్ర అంతా రాజాస్థానాల్లో కుట్రలని రికార్డు చేయడమే సరిపోయింది కానీ... సామాన్యుల కష్టాలను గురించి ప్రస్తావించలేదనీ... ఆ శూన్యాన్ని భర్తీ చేయాలన్న కూనపరాజు కుమార్  ప్రతిపాదనని వంశధార బృంద నిర్వహకులు దాట్ల దేవదానం రాజు ప్రస్తావించారు. ఆనాటి రాజుల పరిపాలనా పద్ధతులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలనే బృంద సభ్యుల సూచనలు మరికొన్నింటిని ప్రస్తావించారు. 
      చరిత్ర అంటే  చీకట్లో నల్ల పిల్లి. దాన్ని పట్టుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదనే బండి నారాయణ స్వామి ప్రతిపాదనను మంజీర బృందం నుంచి మోహిత కౌండిన్య సూచించారు. 
      పది నిమిషాల విరామం తర్వాత... నిర్వాహకులు సాయి పాపినేని, ఈమని శివనాగిరెడ్డి, దీర్ఘాసి విజయ భాస్కర్ వివిధ బృందాల నుంచి నచ్చిన విజ్ఞాపనలకు సాధ్యమయ్యేంతలో పరిష్కార మార్గాలు, సూచనలు. తెలియజేశారు. 
      చరిత్ర పై సరైన అవగాహన పెంచుకోవాలంటే... స్వదేశీయుల రచనలతో పాటలు విదేశీ రచనలనూ అధ్యయనం చేయాలి. 
      చరిత్ర పరిశోధకులతో పరిచయాలు పెంచుకోవాలి. విషయ నిర్దారణ కోసం గ్రంథ సేకరణ చేసేటప్పుడు తేదీల విషయంలో లేటెస్ట్ ఎడిషన్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి
      తెలిసిన విషయాలలోనే తెలియని విషయాలను తెలిపే చారిత్రక దృష్టి కోణం రచయితకి ఉండాలి. 
ఒకానొక చారిత్రక పాత్రను తీసుకుని సమకాలీన పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ రాయడం గతంలో వుంది. అదీ మంచిదే! ఇదొక ప్రయోగం. దీని ద్వారా చరిత్ర తెలియకపోయినా.. చరిత్ర పై ఆసక్తి పెరగవచ్చు... అన్నారు సాయి పాపినేని. 
      స్థానిక చరిత్రలపై చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. క్రీడాభిరామం, కామసూత్ర వంటివి కూడా స్థానికంగా ఆనాటి జీవితాలను వివరించినవే వాటిని కూడా రచయితలు పరిశీలించాలి. 
      ముఖ్యంగా... కల్పన ఎంత! వాస్తవం ఎంత అనే భావన ఉంటుంది చరిత్ర రచనలో. వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని పాఠకులను మెప్పించేలా.. ఒప్పించే విధంగా కథా రచన చేయాలంటే, చరిత్ర పై లోతైన పరిశీలన అవసరం రచయితకి అంటూ... మరికొన్ని సూచనలు చేశారు. 
      సాయంత్రం నాలుగున్నరకి  శప్తభూమి రచన-  అనుభవాలు శీర్షికన బండి నారాయణ స్వామితో సుధాకర్ ఉణుదుర్తి, ప్రసూన బాలాంత్రపు... చేసిన మాటామంతిలో చరిత్ర రచనలో  తాను చేసిన ప్రయోగాలు... పాత్రల సృష్టి, సన్నివేశ కల్పన గురించి ముచ్చటించారు.

      రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా...."భారత అంతర్జాతీయ భాషల్లో  చారిత్రక సాహిత్యంలో పోకడలు, చరిత్ర రచనకు తగిన కథా రూపాలు" అనే అంశంపై  ఆదిత్య కొర్రపాటి పత్ర సమర్పణ చేశారు. చారిత్రక రచనకు నవల ఎంతవరకు సరిపోతుందీ! కథ కన్నా... అందులో చరిత్ర ప్రాధాన్యత ఎంత ఉంటుందీ!  అనే అంశాలను ప్రస్తావన చేస్తూ.. భారతీయ రచయితలందరూ.. వాల్టర్ స్కాట్ ని ప్రేరణగా తీసుకుని రాశారన్నారు. పశ్చిమ దేశాల ప్రభావం చారిత్రక నవలల తీరుని ప్రభావితం చేశాయి... అందుచేత రాసేదేదైనా అది చరిత్రే! అని భావన ఏర్పడిందన్నారు. 
      కేవలం కొన్ని దృశ్యాలను చూసి చరిత్ర రాయడం కాదు... తేదీలూ... పరిశోధకుల ప్రతిపాదనలు ప్రామాణికంగా తీసుకుని చరిత్ర రచనకు ఉపక్రమించాలన్నారు. ఒక క్షణంలో అంతరించబోయే స్థితిని పట్టుకుని ఒక యుగాన్ని సృష్టించేవాడే గొప్ప రచయిత అన్న బటర్ ఫీల్డ్ మాటకి తగినట్టుగా చరిత్ర రచనకి ఉపక్రమించాలన్నారు. భారతీయ భాషల్లో ప్రముఖమైన నవలలను పరిచయం చేస్తూ... కొన్ని మౌలికమైన సంగతులను తెలియపరచారు. 
      కన్నడంలో మాస్తి వేంకటేశ అయ్యంగర్... చిక్కవీర రాజేంద్ర, కుండ. వీరభద్రప్ప 'అరమనె', వసురేంద్ర రాసిన తేజో తుంగభద్ర  నవలల రచనా నేపథ్యాలను వివరించారు.  పొన్నియన్ సెల్వన్ శివగామిన్ శపథం,. వెంకటేశన్ 'కావల్ కొట్టం', 'పూమణి' 'అజ్ఞాడి' వంటి తమిళ నవలలనూ,  సి.వి.రామన్ పిళ్లై మార్తాండ వర్మ, మడంబు కున్యుకుట్టన్ భ్రష్టు వంటి మలయాళ నవలలనూ, శివాజీ సావంత్ ఛావా, రణజిత్ దేశాయ్ శ్రీమాన్ యోగీ, వంటి మరాఠీ నవలలనూ, అమితావ్ ఘోష్, హిల్లరీ మాంటేల్ వంటి ఆంగ్ల రచయితల రచనలను... వాటి నేపథ్యాలను గురించి వివరించారు.
      ఏదీ చరిత్ర అనే అంశాన్ని తీసికొని వాడ్రేవు చిన వీరభద్రుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. 
1910 నాటి గురజాడ మీ పేరేమిటీ కథను వినిపించి... వాటిలో చరిత్ర కోణాలను విపులంగా చర్చించారు. చరిత్ర, సాహిత్యం  వేర్వేరు రెండూ ఒకటి కాదు. రాజు మరణించాడు అనంటే అది చరిత్ర. రాణి శోకంతో మరణించింది అంటే అది సాహిత్యం... వీటి మధ్య తేడాను తెలుసుకోవాలి. భావ సంఘర్షణ లేకుండా చరిత్ర రచన సాధ్యం కాదు. మైథాలజీని అర్థం చేసుకుంటూ... చరిత్ర రచనకు పూనుకోవాలి. ఏదైనా వున్న విషయాన్ని రాసుకుంటూ పోతే అదే చరిత్ర అవుతుందంటూ... తన చిన్ననాట చదివిన 'తూర్పు కందకంలో మూడు గుబేళ్లు' అనే చందమామ కథతో  తన ప్రసంగాన్ని ముగించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం