అసురా! శ‌హ‌భాషురా!

  • 681 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

ఒక్కొక్కరి మొహం చూస్తే పెట్ట బుద్ధవుతుంది. ఒక్కొక్కరి మొహం చూస్తే కొట్టబుద్ధవుతుంది అంటారు. ఇది నిజమే. అదేంటో గానీ ఎన్నితప్పులు చేసినా దేవతలను పొగడాలని, ఎన్ని ఒప్పులు చేసినా రాక్షసుల్ని చెడ తిట్టాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ల మొహాన అలా రాసిపెట్టి ఉంది. వీళ్ల మొహాన ఇలా రాసిపెట్టి ఉంది. ఇవన్నీ రాసిపెట్టింది దేవుళ్లలో ఒకడైన బ్రహ్మదేవుడేగా! అందువల్ల అలాగాక ఇంక ఎలా రాస్తాడు. దేవుళ్లకో రూలు! ఇతరులకో రూలు! 
రాక్షసులో లేకపోతే ‘అధర్మపక్షం’గా ముద్రపడిన అలాంటివాళ్లో కనిపిస్తే వాళ్లకు మనకు పాతకక్షలో, ముఠాకక్షలో ఉన్నట్లు ఆవేశం వస్తుంది. రెండు చేతులతో వాళ్ల గొంతులు పట్టుకుని పిసికేయాలని అనిపిస్తుంది. ఆ దెబ్బకు క్షణాల్లో  పుణ్యమంతా ఆన్‌లైన్‌లో మన ఖాతాలో పడుతుందని నమ్ముతాం. అన్న శ్రీరాముణ్ని గుడ్డిగా అనుసరించిన లక్ష్మణుణ్ని మనం ఆరాధిస్తాం. తప్పేమీ లేదు. లక్ష్మణుణ్ని ఆదర్శప్రాయుడైన తమ్ముడని చెప్పుకుంటాం! రాక్షసుడు కాకపోతేనేం, పాపం దుశ్శాసనుడు గుడ్డిగా చేసింది కూడా తన అన్న చెప్పిన పనేగా! కానీ ద్రౌపది వస్త్రాపహరణం చేశాడని ఇతణ్నేమో తిట్టిపారేస్తాం! 
      శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపహరణం చేశాడని తలచుకుని పరవశించి పోతాం! పండగ చేసుకుంటాం. అదే ద్రౌపదీ వస్త్రాపహరణానికి ప్రయత్నం, అదీ విఫలయత్నం చేసిన దుశ్శాసనుడి మీద నిర్భయ కేసు పెడదామనిపిస్తుంది. కనిపిస్తే చావగొట్టి చెవులు మూసేయాలనిపిస్తుంది. ఇది ద్వంద్వ ప్రవృత్తి కాదా అధ్యక్షా! యుగయుగాలుగా ఇదే సాగుతోంది. కృతయుగం నుంచి మొదలుపెడితే ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడి మాట వినకపోవడం ఎంత తప్పు! పైగా హరితో కలిసి కుట్ర పన్ని తండ్రి చావుకు కారణమయ్యాడు. శ్రీరాముడికి పితృవాక్య పరిపాలకుడిగా ఎంత గొప్ప పేరొచ్చింది! హిరణ్యకశిపుడు చెప్పినట్టు ప్రహ్లాదుడు కూడా విని ఉంటే అతడికీ ఇంకెంత మంచి పేరొచ్చేదో! పైగా రాక్షస వంశంలో పుట్టినవాడు రాక్షస లక్షణాలు అలవరచుకోవడంలో తప్పేముంది? ఆ తర్వాత ద్వాపరయుగంలో వచ్చిన శ్రీకృష్ణపరమాత్ముడు ఏమన్నాడు? ‘స్వధర్మే నిధనంశ్రేయః పరధర్మో భయావహః’ అని చెప్పాడు. ఆ లెక్కన ప్రహ్లాదుడు స్వధర్మమైన రాక్షస ధర్మాన్ని తూ.చ తప్పకుండా పాటించాలి కదా!
      రాక్షసుడు అంటే అసలు అర్థం దేవతలు చేసే యజ్ఞాల బారి నుంచి జంతువులను రక్షించేవాడు అని! అలాంటి రక్షకులను తక్షకుల్లాగా చూస్తే ఎలా? త్రేతాయుగంలోనూ ఇదే పరిస్థితి కదా! విభీషణుడు స్వధర్మాన్ని పాటించకుండా అన్న రావణాసురుడికి ఎదురు తిరిగి, రాముడి పంచన చేరి, ఆయనకు బేషరతు మద్దతునివ్వడం ఏం న్యాయం? ఇది వెన్నుపోటు రాజకీయం కాదా అధ్యక్షా!
      ఇంతే కాదు... దేవతలు చేసిన ‘రాజకీయాలు’ అన్నీ ఇన్నీ కావు. రాక్షసులకు వరాలు ఇచ్చినట్టే ఇచ్చి వారిని నిలువునా ముంచేశారు. పిచ్చమొహాలైన రాక్షసులు నమ్మి నష్టపోయారు. నమ్మిచెడ్డ వాళ్లయ్యారు. రాక్షసులు నానా కష్టాలు పడి తపసు చేయడం, దేవతలు వాళ్లకు ప్రత్యక్షం కావడం, తమకు చావు రాకూడదంటూ వాళ్లు కోరడం, దేవుళ్లూ ఒప్పుకుని వరాలు ఇవ్వడం.. అంతా బాగుంటుంది! కానీ, చివరకు ‘సాంకేతిక కారణాలతో’ ఆ వరాలు ఉపయోగంలోకి రాకుండా చేశారు దేవతలు. చావగొట్టారు. దేవతలు రాక్షసులు అక్కచెల్లెళ్ల పిల్లలు. బంధుప్రీతి కూడా లేకుండా, జాలీ దయా కరుణా అనేవే లేకుండా రాక్షసుల్ని సంహరించారు దేవతలు. రాక్షసులకు శివుడు వరాలు ఇవ్వడం ఎందుకు? ఆ వరాల్ని ఉపయోగించుకున్న పాపానికే రాక్షసుల్ని విష్ణుమూర్తి వచ్చి మట్టుపెట్టడం ఎందుకు? భస్మాసురుడులాంటి వాళ్లు ఇలా బలిపశువులు అయిపోలేదా? దేవతలది దొంగభక్తి అయితే రాక్షసులదే అసలు సిసలు భక్తి. ఏం చేసినా వాళ్లు త్రికరణ శుద్ధిగా చేస్తారు. మాటలకు చేతలకు తేడా ఉండదు. కానీ దేవతలకు అలా కాదు. మూతిదారి మూతిదే. చేతిదారి చేతిదే. దేవతల మాటలకు, చేతలకు పొంతన ఉండదు. రాక్షసులకు ఉన్న సద్గుణాలు దేవతలకు ఎక్కడ ఏడ్చాయి? ఏ తప్పూ చేయనివాళ్లని ‘నిప్పు’తో పోల్చుతారు కానీ, రుషిపత్నులతో అగ్నిదేవుడు ఎలా ప్రవర్తించాడసలు? ఈయన నిర్వాకంతో పోల్చితే ‘మనసు పడ్డాను మహాప్రభో’ అన్న పాపానికే ముక్కూచెవులూ పోగొట్టుకున్న శూర్పణఖ మంచితనం ఎవరికీ తెలీదు! 
      ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పు అనీ, పరస్త్రీ వ్యామోహం తప్పు అనీ శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇదే నిజమైతే ఏ శ్రీరామచంద్రుడో తప్ప ఆయన పేరులో చంద్రుడితో సహా దేవతలు ఈ ఆరోపణల నుంచి తప్పించుకోలేరు! ఫలానా దేవుడి రెండో భార్య ఎవరు అంటే ఎవరైనా చెబుతారు. కానీ రాక్షసులకు ఆ అపప్రథ లేదు. హిరణ్యకశిపుడి రెండో భార్య ఎవరు? రావణాసురుడి ద్వితీయ కళత్రం ఎవరు? అంటే ఎవరూ చెప్పలేరు. వారికి లేరు కాబట్టి. ఇలాంటి విషయాలు ఎన్నింటినో తులనాత్మక పరిశీలన చేస్తే, చంద్రుడికైనా మచ్చ ఉంది గానీ రాక్షసులకు అలాంటిది కనిపించదు గాక కనిపించదు. ఇక దేవతలకు ఉన్న వివాహేతర సంబంధాలు కోకొల్లలు. ఎందెందు వెదకి చూసిన అందందే కనబడతాయి. దేవతలకు రాజు, స్వర్గాధిపతి ఇంద్రుడికి వెయ్యి కళ్ల సంగతేమిటి? తెలుసుకుంటే చాలు విషయం ‘కళ్లకు’ కట్టినట్టు అర్థమైపోతుంది.
      రాక్షసులకు అన్నింటిలోనూ అన్యాయమే జరిగింది. దేవతలతో సమానంగా కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయింది. క్షీరసాగర మథనంలో పుట్టినవన్నీ దేవతలే కొట్టేశారు. చివరకు విషాన్ని కూడా ఆ శివుడే తీసుకున్నాడు. రాక్షసులకు శ్రమదోపిడీ మాత్రమే మిగిలింది. దీనికి ఏ లేబరు కోర్టులోనూ న్యాయం జరగలేదు. రాక్షసుల కూటికి అడ్డంపడి కూడా అన్యాయం చేశారు దేవతలు. ఇందుకు బకాసురుడే ఉదాహరణ. అతగాడు ఏదో కడుపు నింపుకోవడానికి రోజుకో మనిషిని తినేవాడు. అయితే భీముడు అన్యాయంగా అతణ్ని పొట్టనబెట్టుకున్నాడు. మనిషిని చంపి తినడమే నేరమైతే కురుక్షేత్రంలో పంచపాండవులు చావగొట్టిన అసంఖ్యాక సైనికుల సంగతేమిటి? ఏది పుణ్యం? ఏది పాపం!
      గొప్పవాళ్లను ఇంద్రుడు చంద్రుడు అంటారే! అదే నిజమైతే తారాశశాంకం ఏం చెబుతోంది? దాన్ని ‘సీరియస్‌’గా తీసుకుంటే బృహస్పతి తాతల్లాంటి గురువైనా ఏ ‘శిష్యచంద్రుణ్నయినా’ చేరదీస్తాడా? ఇక సూర్యుడు, కుంతి సంగతేమిటి? అన్నింటికీ మించి రాక్షసులకున్న దానగుణం దేవతలకు ఎక్కడుంది? ఉదాహరణకు బలిచక్రవర్తికి ఉన్న దానగుణంలో సహస్రాంశం అయినా దేవతలకు ఉందా? లేనేలేదు. ‘వచ్చినవాడు విష్ణువు... తనను చంపడానికే వచ్చాడు’ అని బలిచక్రవర్తికి తెలిసినా భయపడలేదు వెనక్కుతగ్గలేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు.
ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై
పాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదె రాజ్యము గీజ్యమున్‌ సతతమున్‌ కాయంబు నాపాయమే

      అని బలిచక్రవర్తిని కళ్లారా చూసినట్టు, చెవులారా విన్నట్టు బమ్మెర పోతన భాగవతంలో చెప్పేశాడు. దీనికి అప్పీలు లేదు. ఇలాంటి వాడు దేవతల్లో ఒక్కరైనా దొరుకుతారా? 
      దేవతలను సురులు అంటారు. అంటే సురను తాగేవాళ్లు అని అర్థం. రాక్షసులను అసురులు అంటారు. అంటే సురాపానం చేయని వాళ్లు. దేవతలు మంచివాళ్లని, రాక్షసులు చెడ్డవాళ్లని భూనభోంతరాలు దద్దరిల్లేట్టు ప్రచారం చేశారు. ఇంతకీ తాగని వాళ్లు మంచివాళ్లా? తాగేవాళ్లు మంచివాళ్లా? తాగేవాళ్లే మంచివాళ్లయితే మందుబాబులను ఎందుకు చిన్నచూపు చూస్తారు? చెడ్డవాళ్లుగా ఎందుకు చిత్రిస్తారు?
      దేవతలు కఠినాత్ములు. రాక్షసుల్ని వారు నిర్దయగా చంపేశారు తప్ప వాళ్ల మనసుల్ని మార్చిన ఉదంతాలు లేవు. ఒక యుగం కథ కాదు ఇది. యుగయుగాల కథ! ఇవన్నీ చూసిన తర్వాత రాక్షసులూ జిందాబాద్, దేవతలూ ముర్దాబాద్‌ అంటే తప్పేముంది?


వెనక్కి ...

మీ అభిప్రాయం