మనకూ కావాలి ఉగాదులూ... ఉషస్సులూ!

  • 567 Views
  • 19Likes
  • Like
  • Article Share

    కన్నీడి మనోహర్‌

  • పేకేరు, తూర్పు గోదావరి జిల్లా
  • 9494044429
కన్నీడి మనోహర్‌

ఉగాది అంటే ప్రకృతితో రససిద్ధిని పొందడం. రుతువుల రాణి వసంతరాణి ఆగమనాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించడం. తలవూచే కొమ్మల్లో కుంకుమ చిందే పూల సరాగాలకి తన్మయం చెందడం. ఎప్పుడూ చూసే తరువుల్లోనే ఎవరికీ తెలియని రహస్యాల్ని వశపరచుకోవచ్చనే ఆలోచనను ఉగాది మాత్రమే మనకందిస్తుంది. వెన్నెలాకాశం, కోకిల సునాదం, నెత్తావుల పరిమళం, విరబూసిన చెట్లతోపుల్లో తుమ్మెదల ఝుంకారం ఒకటేమిటీ.. ఒకానొక చైతన్యపరిధిని దాటి మనసు విహరిస్తోందంటే అది వసంతాగమనం కాక మరేంటి! కుసుమలతా పతాక! కోకిల బాకా! వహవ్వా! ఎన్నాళ్లకు రాకా! అంటూ సుమవనాలు చిందించే పుప్పొడికి పరవశిస్తూ కృష్ణశాస్త్రిలా పాడుకోవడం అంటే ప్రకృతికి కృతజ్ఞత తెలపడం!
      ఆరు రుతువుల కాలచక్రం విరామం లేకుండా తిరుగుతుంటుంది. కాలమహిమేంటో! ఈ ప్రకృతితో మమేకమై బతుకుసాగించడమెలాగో! ఈ ఉగాది వత్సరాలకు అర్థమేంటోనని అవలోకిస్తే బోలెడు సంగతులు చిగురుటాకుల్లా తాకుతాయి. 
      ఇంతకీ ఏం చెప్తోందీ ఉగాది! పంచాంగ ప్రవచనాలు.. దినవారఫలాల సంగతులు... జాతక మహిమల భోగట్టా... ఎప్పుడూ ఇవేనా! ఉగాది అంటే విశేషించి చెప్పుకోవడానికి ఏం లేదా! అని నిట్టూర్చనక్కర్లేదు. ఇరగకాస్తేనే మొక్క అనీ, ఈసురోమంటూ ఉండేదాన్ని మోడని స్వార్థబుద్ధితో చూసేవాళ్లు చెట్టంత మనుషులైతే మాత్రం ప్రయోజనమేముందీ! బతుకివ్వాలి.. బతకనివ్వాలి.. మానైనా మనిషైనా కాస్త నీడ చూసి.. నీ బతుకునువ్వు బతకరా అనేంత మానవత్వం ఉండాలి. వినిపించుకునే మనసుండాలే గానీ ఉగాది చెప్పేదీ అదే!   
చెట్టంత మనిషి యనుచో
వట్టి పొడవు పేర్మిగాదు, పదుగురు బ్రతుకం
గట్టి యుపాధులు గూర్పగ
లట్టి మనిషియన్న సముచితార్థము సుమ్మీ!

      అన్న గెడ్డాపు సత్యం మాట సత్యదూరం కాదు. చెట్టు ఎప్పుడూ అంతే! మంచి చెప్పేటప్పుడు ఒక మెట్టు పైనుండే మాట్లాడుతుంది. ఎన్ని ఉగాదులు వచ్చివెళ్లాయి! ఏనాడన్నా ఫలసాయం కోసమే పరితపిస్తారు కానీ పచ్చనిచెట్టుని పలకరించిన పాపాన పోయారా! చెట్లు పెంచేదెందుకురా! కాయలు కాసేటందుకురా! అని ఉదాసీనంగా ఉండబట్టే ఇప్పుడు ఉగాదంటే పచ్చడొక్కటే చప్పరించి ఇంతకుమించి ఏముందీ! అనే దురవస్థకి వచ్చేశాం. పండగలంటే వండుకు తినడమే కాదు. ఒక ఆశయమూ ఆదర్శమూ ఉంటుంది. పూచే పూతలోనూ.. కాసే కాయలోనూ, కలకూజితాలలోనూ అనాదిగా ప్రవహిస్తూ వస్తున్న ప్రకృతి సంగీతం లీలగా వినిపిస్తూ ఉంటుంది. 
      చెట్టులో ఔషధగుణాలే కాదు జీవితసత్యాలు బోలెడంటూ ఇస్మాయిల్‌ ఇలా చెబుతారు..
చిగిర్చే చెట్టుకి 
ఎగిరే పిట్ట ఆదర్శం
పత్రాల్ని విదిల్చి
పైకెగరాలని ప్రయత్నం
కదలక మెదలక
కప్పులు మూసుకుని
నిద్రపోయే 
క్షుద్ర గృహాలకు అతీతంగా ఎదుగుతుంది
 
      రోజులు గతించినట్టే చెట్టుకున్న ఆకులన్నీ ఒకొక్కటే రాలిపోతాయి. మళ్లీ చిగురించాలనే దృఢమైన కాంక్ష ఏదో లోలోపల వేళ్లూనుకుంటూ ఉంటుంది. మంచుపొరల్లో మోడువారిన ఆ దృశ్యం దుర్భరమనిపించినా ఎదగాలనే కోరిక జీవితానికి అందాన్నీ ఆనందాన్నీ తీసుకొస్తుంది. నిండుగా ఎదగాలనుకునేవాళ్లకీ, మెండుగా వొదగాలనుకునే వాళ్లకీ ఉగాది సంకేతాలు ప్రేరణశక్తులై ఊపిరిపోస్తాయి. ఊనిక కలిగిస్తాయి. చీకటివెలుగులనేవి సృష్టిలోనేకాదు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాన తర్వాత ఎండ కాసినట్టు.. కటిక చీకటికి ఆవల వెన్నెలదీపం ఉన్నట్టు, దిగులు పరదాలు తెంచుకుంటే ఇక లోగిలంతా వెలుతురే అని తెలిసీ.. కష్టాలొస్తే పాతాళంలో కూరుకు పోతారెందుకనీ! బాధగా ఆకులు రాల్చేసిన బాదంచెట్టు ఉగాదికి రెండురోజుల ముందు చిగురులతో నవ్వుతున్నప్పుడైనా తత్త్వం బోధపడాలి కదా! 
      కొత్త ఏడాదులు వస్తున్నాయి పోతున్నాయే కానీ బతుకులు మారట్లేదు. ఈ ఉగాది కొత్తగా తెచ్చిందేమీ లేదు. పేరుకి కొత్తేమోగానీ ఎందులో కొత్తదనముందనీ! కాలచక్రం ప్రకారం రుతువులు వాటిమానాన అవి వస్తూ పోతుంటాయి. మనిషిలో చైతన్యం మాత్రం ఉత్తినే ఏ ప్రయత్నమూ లేకుండా రాదు. కాలమహిమనూ.. దాని స్వభావాన్నీ అవగాహనకి తెచ్చుకుని జీవించాల్సిందేనంటూ ఆరుద్ర చెప్పిన కాలజ్ఞానాన్ని కూడా చెవినపెట్టుకోవాల్సిందే.
ఈ కొత్త ఏడాది మారువేషం వేసుకుని
వస్తున్న పాత ఏడాదే అన్న భయం లేకపోలేదు
ఎన్ని ఉగాదుల్ని చూడలేదు ఆ కన్నులు
ఎన్ని ఉగాదులపై పాడలేదు మన పెన్నులు
పేరు మార్పే గానీ తీరుమార్పు 
గోరంతయినా ఉంటే ఒట్టు 
నానాటికి తీసికట్టు
కాలప్రవాహంలో యే యేడాదైనా ఒక నీటిబొట్టు

      అనేకానేక మానసికావస్థలు గడుసుదెయ్యాల్లా మనిషిని భయపెడుతుంటాయి. వాటిని సంకల్పబలంతో ప్రతిఘటించాలే కానీ ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోకూడదు. వికారి.. వికృతి... విరోధి... శార్వరి... ఇలా ఉగాదులకి పేర్లు పెట్టడంలో పరమార్థం ఏంటంటే ఒక్కో ఉగాది ఒక్కో మానసిక చైతన్యానికి ప్రతీక. శార్వరి నామ ఉగాది అంటే చీకటి ఉగాది అని అన్వయించుకోకూడదు. నీలాల దుప్పటి మీద ముత్యాలు ఒలికినట్టు ఆకాశంలో అనంతకోటి నక్షత్రాల ముందు నిలబడి తననుతాను శోధించుకునే అందమైన స్థితి ఈ ‘శార్వరి’. చీకటి కూడా జీవితంలో భాగమే. ‘‘చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు’’ అని దాశరథి ఊరకనే అనలేదు!
ఎన్ని ఉగాదులను పీల్చుకున్నాను
ఈ కళ్లతో! 
ఏటా ఓసారి కాదు ప్రతిరోజూ!
పొద్దును పొడుస్తూ లేస్తానా
ఓ గంటసేపూ నేలనూ గాలినీ
దున్నేస్తానా!
నడిచేటప్పుడు నా జేబులోంచి
రాలిపడే ‘నిన్న’లు 
వసంతం దాడితో విరిగిన 
పండుటాకుల వెన్నులు  

      ఉగాదంటే ఏడాదికోసారి వచ్చేది కాదు. కొత్త ఊహావర్ణార్ణవాల మీద వికసించే ఉషస్సుతోనూ... తేజస్సుతోనూ ప్రతిరోజునీ ఆహ్వానించాల్సిందే అంటారు సినారె. గతానుభవాలన్నింటినీ చెత్తకుప్పలో విడిచేసి నవకల్పనలకు చోటు కల్పించాలి. కొత్తరెక్కలు అతికించుకుని సరికొత్త ప్రతిపాదనలతో కొత్తఏడాదికి స్వాగతం పలకాలి. గతం ఘనమైనదైనా ముందున్న కాలం మంచిదో చెడ్డదో పంచాంగంలో లేదు.. మనచేతిలో ఉందనే సహేతుక భావజాలంతో తోవ సరిచేసుకుని సాగాలి. జీవితంలో కోల్పోయిన వాటిని తలచుకుంటూ.. పదేపదే పాత సంగతులు నెమరేసుకుంటే ఏం బాగుంటుందీ! కలతలన్నీ విడిచిపెట్టి కొత్త పరిచయాల కోసం.. కొత్త శక్తికోసం యోచన చేయాలి. నన్ను నేను నాలో నీలో గతంలో/ మనని మనం పోగొట్టుకున్న దినం మహాలయ అమావాస్య/ ప్రతి ఉగాదికీ మెరుస్తూ పిలుస్తోంది ఆశావేశ్యా!  అంటూ నిరాశా నిస్పృహల కుబుసాన్ని విడిచిపెట్టి కొత్త ఆకాశం వంక కళ్లెత్తి చూడమంటాడు తిలక్‌.
      ఉగాది అంటే ప్రకృతితో సమాగమం. ప్రకృతి శక్తులన్నింటినీ తనలో లయించుకుని లోకోపకారిగా జీవించడం. సకలజీవుల కామితాలనూ తీర్చే తరువు తన కోసం తపన పడదు. అలాంటి చెట్ల మీద వసంతం కుసుమించినప్పుడు ఎవరికైనా బోధపడేదేంటీ! నాగరికంగా నానావస్థలు పడేకంటే అడవిలో మానుమాదిరి ఏటేటా చిగుర్చుతూ కొత్తదనాన్ని నింపుకుంటూ జీవించాలనే కదా! ప్రకృతినుంచి తీసుకున్నదాన్ని తిరిగి ప్రకృతికే ఇవ్వడమంటే పదుగురికీ సాయపడమని! ఇదేదో గొప్ప త్యాగమని అనుకుంటారు కానీ ఈ లోకంలోని ఉపకారులందరి సహజ గుణమిది. 
తరువులతిరస ఫలభారగురుతగాంచు
నింగివ్రేలుచు నమృతమొసంగుమేఘు
డుద్ధతులుగారు బుధులు సమృద్ధిచేత
జగతినుపకర్తలకు నిది సహజగుణము

      రుచికరమైన ఫలాలతో చెట్లు నేలమీదకి వంగి ఉంటాయి.. అమృతధారలతో మేఘాలన్నీ నేలవైపే ఒరుగుతాయి. అలాగే, సంపద ఉన్నప్పుడు గర్వపడకూడదు. దాన్ని పరుల కోసం వినియోగించాలనేది ప్రకృతి ద్వారా అబ్బే సహజగుణం. ఇక్కడ వంగి ఉండటం అనేది వినయాన్నే కాదు, ఉదారతనూ.. దాతృత్వాన్ని సూచిస్తుంది. 
      నాకు ఉగాదులు లేవు... ఉషస్సులు లేవు అని చింతించకుండా బతుకుబతుకున ఒక ఉగాది ఎప్పుడూ ఉదయించాలను కుంటే చాలు అలసత్వం ఆమడదూరం పారిపోతుంది. ప్రకృతి ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. ఆరు రుతువుల ఇంద్రచాపం కాంతులు చిందుతూ లోకాన్ని వర్ణరంజితం చేస్తుంది. నిన్నటిని తోసుకుంటూ రేపు మరింత మెరుగ్గా.. హుందాగా బతకాలనే భరోసా కలిగిస్తుంది. ఉగాది పచ్చడొకటే పండగ అని సరిపెట్టుకోకూడదు. పచ్చటిచెట్లలో కుసుమించు అందాలూ.. తెలతెల్లారి వెలుగులో కిలకిలారావాలు.. ఎక్కడికక్కడ పలకరించే హరితవనాలను మనవంతు బాధ్యతగా సమకూర్చుకున్నప్పుడే ఉగాది అంటే ‘జగతి ఉన్నతికి గొడుగుపట్టేది. జనుల సంస్కారానికి మెరుగు పెట్టేది’ అని స్పష్టమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం