వచ్చెను ఉగాది... మధుగీతమ్ముల సంవత్సరాది

  • 836 Views
  • 34Likes
  • Like
  • Article Share

    కన్నీడి మనోహర్‌

  • పేకేరు, తూర్పు గోదావరి జిల్లా
  • 9494044429
కన్నీడి మనోహర్‌

ఉగాది అంటే కవుల పండుగ. ఒకప్పుడు ఉగాదికి ప్రత్యేక సంచికలొచ్చినట్టు ప్రతి ఊళ్లోనూ కవి మిత్రులంతా కలిసి సంఘాలు పెట్టుకునీ కవితా సంకలనాలు తీసుకువస్తున్నారిప్పుడు. అన్ని దాహాలలోకి ఉగాది కవితాదాహం వేరు కదా! ఓ పట్టాన చల్లారదది. ఇంటిముందు వేపచెట్టు పూసినట్టుగా గానీ, కొమ్మల్లో కోయిల కూసినట్టుగా గానీ, నెత్తావులలో విరుల గంధం సోకినట్టుగా గానీ అనిపించిందా! అలా అనిపించిన మరుక్షణం ఎవరు ఊరుకున్నా కవి ఊరుకోడు కదా! వచ్చెను కాబోలు ఉగాది.. నవ భావమ్ముల మధుగీతమ్ముల సంవత్సరాది... అంటూ పాడుకుంటూ పోతాడు.
ఉగాది
వస్తే కవి ఎందుకు చలిస్తాడు! పురి విప్పిన నెమలిలా ఎందుకు పులకించిపోతాడు! తిండీతిప్పలూ మాని తిమిరపు ఆకాశాన చుక్కల కోసం ఎందుకు గాలిస్తాడు! అంటే.. ఎవరు మాత్రం ఏం చెప్పగలరూ! రంగురంగుల పూలు పరిమళాన్ని మోసుకొస్తాయి. కోయిలలు స్వర మాధుర్యాన్ని పంచుతాయి. మరి కవి ఏం చేస్తాడు? 
      ఇదేమాట ఇరవై ఏళ్ల కిందట ఏ కవినైనా ఆపి అడిగితే నిల్చున్నపాటున వంద కవితలు ఆశువుగా చెప్పి వడదెబ్బ తగిలించిపోయేవాడు. ఎవరేమనుకుంటేనేం! ఒకరు రమ్మంటే వస్తుందా, వద్దంటే మాత్రం పోతుందా ఉగాది! మనసుపెట్టి చూడాలే గానీ కొమ్మ కొమ్మలోనూ మధుమాసపు గీతాన్ని సన్నాయిలా వినిపిస్తుంది. కాసింత పచ్చడి అంగిట్లోకి వేసుకుని, గడియపెట్టుకుని మాగన్నుగా నిదరోతే... ఉగాది వేడుక గుమ్మం అవతల నుంచే వెళ్లిపోతుంది. అన్ని పండగల మాదిరి ఉగాది కూడా ఇంతేనా అనిపిస్తుంది. 
      కాలంలో ఏటా బంగారు పూలు పూయనట్టే, బతుకులో కూడా అస్తమానూ వెన్నెల కుమ్మరించదు. మోడు వారిన పెదాల మీద  చిరునవ్వు మొలిచినట్టు వసంతం బతుకులోకి హాయిగా నడచి వస్తుంది. చేతులు చాచి ఎదురెళ్లేవాళ్లకి చీనాంబరం పరుస్తుంది. కొత్త కొత్త ఊహలకు రెక్కలు తొడుగుతుంది. ఎంత తోడినా ఎంతో కొంత మిగిలే ఉంటుందీ ప్రకృతిలో! ఎంత పాడినా ఏదో కొరత ఈ మధువనంలో! ఏమై ఉంటుందదీ! కవులకి సవాలక్ష సందేహాలు. ఉగాది అందించే సందేశాన్ని సరికొత్తగా నిర్వచించాలని... కవులందరిదీ ఒకటే ఆరాటం. 
ఈ పర్ణశాలలో ఏను కోయిలనోయి
నా పున్నెమీనాటికేని పండెగదోయి
ఒక్క కొమ్మ గవాయి ఒక్కకొమ్మ సన్నాయి
దిక్కు దిక్కులనేడు తోట ఒక్కటే హాయి..
(దేవులపల్లి) అని, వసంతపు గాలులకి రెండు చేతులను పక్షాల మాదిరిగా విచ్చి వసంతాగమనాన్ని ఆస్వాదించగలిగే సహృదయత ఒక్క కవికి మాత్రమే ఉంటుంది మరి! 
      ఉగాదొస్తుంది! వట్టి వేపపూలతోనే కడుపు నింపుకోమంటారా! ఉగాది పండగ అంటే ఊరకనే ఉపవాసంతో పవళించమంటారా! ఇంకేం లేదా! అని మూతి మూడుసార్లు తిప్పి మూలిగే కవి పత్నులు మాత్రం ఉగాదిని ఉన్నదున్నట్లుగా చూస్తారు. కళలు కాంతులు ఇంటిలోకి కొత్త హంగులు.. సొమ్ములు.. సోకులు ఇవేం లేకుండా ఉగాదేంటీ! అంటే చిన్నగా నవ్వుకుని అంటాడు కదా! అందుకేగా నేను కవిని. దారిద్య్రం అంటని రుషిని. అంతేనా! వాకిట్లో నిండుగా పూసిన వేపచెట్టుని చూడకుండా ఇంట్లో అమాంతంగా పెరిగే బాధల మర్రిని చూసి భయపడతావేం!? అని వేదాంతం చెప్పడం కవికి కొత్తకాదు కదా. 
      పండగంటే కవిత్వంలోనేనా! కవుల గొంతుల్లోనేనా! బతుకులో ఉండదా? మెతుకులో ఉండదా? అని ఎవరైనా అంటే మాత్రం కవి ఊరుకుంటాడా! ఉగాదంటే చెట్టు మీదనే కాదు ఇంటి మెట్ల మీద కూడా కుసుమించాలని దాశరథిలా ఆశగా పాడుకుంటాడు. 
అన్నమో రామచంద్ర అనే మనిషి లేనినాడు
అసలైన ఉగాది ఆనంద రథంమీద వస్తుంది
ఆ నవరథసారథిపై ప్రజాపథాలమీద
అనుగమించగల శక్తిని కోరుకుంటున్నాను. 

      అంతే కదా! ఉగాది హరిత కిరణం. అది ప్రసరించినచోట సస్యకేదారాలు పులకించి ఆడతాయి. ప్రజల కడుపులు చల్లబడతాయి 
      ఆ ఉగాది మళ్లీ వస్తే ఎంత బావుణ్ను! అని అందరికీ అనిపిస్తుంది. ఎలాంటి ఉగాదంట అది! పాతికేళ్లనాడు ఆరు యుగాల ఆంధ్రకవితను చదువుకుని పట్టు కుచ్చిళ్లు సవరించుకుంటున్న ప్రబంధ కన్యలకు ప్రేమలేఖలు చాలా చౌకగా రాసిపారేసిన దివ్యమైన రోజులవి. అప్పట్లో ఎందుకురా! కవిత్వం కూడుకొచ్చెనా! గుడ్డకొచ్చెనా! అని ఎవరెన్నిసార్లు విసుక్కున్నా విసిరికొట్టాడే తప్ప రాయడం మాన్లేదు. ఎందుకూ! రాయలేకుండా ఉండలేకపోయాడు కాబట్టి. ఉండలేకపోవడమేంటీ! అదేమన్నా వ్యసనమా! అనంటే... కాదు దివ్యౌషధం అంటాడు కవి.
సౌరభములేల చిమ్ము బుష్పవ్రజంబు
చంద్రికల నేల వెదజల్లు జందమామ
ఏల సలిలంబు పాఱు గాడ్పేల విసరు
ఏల నా హృదయంబు ప్రేమించునిన్ను...
అని అనలేదా దేవులపల్లి! అంటూ కవిత్వానికి ప్రకృతి ప్రేరణ ఆలంబన అనీ.. ఉగాది మీద కవిత్వం అంటే ప్రకృతిని ఉపాసించడమే అని అంటాడు కూడా. ఊహాసుందరుల మీద జావళీలు రాయడం మరీ వెగటనీ.. అదొక మత్తు అని; కన్నెపిల్లల కాటుక కళ్ల నీలాల్లోకి.. ఆ కాంతుల్లోకి సూటిగా చూసి రాస్తేనే మజా అని అలనాటి జాజిపూల అత్తరువాసనని అట్టే దాచిపెట్టుకుని ఇవే నా జీవితానికి మిగిలిన ఉగాదులూ.. ఉషస్సులూ... అంటూ సంతృప్తిపడతాడు కవి.
      ఉగాది రోజున ఓ కవిగారి భార్య ఎంత కంగారుపడిపోయిందో చూడండి! 
      ‘‘ఇంతకీ పొద్దుననగా పోయారు. ఏం తిన్నారో ఏంటో! పిల్లలేమో ఏదో రాసుకుంటూన్నారు. నేనేమో గుమ్మాలకు పసుపు రాసుకుంటున్నాను. మీరు ఏ కవితలో రాసుకుంటున్నారేమో అనుకున్నాను.. చెప్పాపెట్టకుండా దొడ్డిగుమ్మం నుంచి దాటేశారు! కవి సమ్మేళనానికి అంటే నేనేమన్నా కాదంటానా!’’ సాయంత్రం ఇంటికొచ్చిన భర్త ముందు చిరుకోపం నటించిందామె. కవి మాత్రం ఏం మాట్లాడలేదు. ‘‘ఇంతకీ ఆ కవి సమ్మేళనంలో ఏ కవిత చదివారండీ! ఇంత విలువైన శాలువా ఇచ్చారూ!’’ అందీ మళ్లీ ఇల్లాలు. నీరసమంతా పోయి ఉత్సాహమొచ్చేసింది కవికి. ‘‘శాలువాలో ఏముంది! నా కవితలో ఉంది రసమంతాను’’ అంటూ... ‘‘వికసిత ఘనసూనోద్వేల జాల ప్రవాళ ప్రకట కపట రూఢప్రౌఢకీర్తి ప్రతాప, ప్రకట జయ సమంచత్పంచ బాణస్తవుద్గాయక శుకపిక కాంతంబై వసంతంబు వచ్చెన్‌...’’ పాడుతున్నాడు కవి. అంతే! రెండు చెవులూ మూసుకుని వంటింట్లోకి పోయిందా ఇల్లాలు. ‘‘ఏంటీ! పారిపోయావ్‌! నీ ఉగాది పచ్చడి కంటే ఘోరంగా ఏడ్చిందా నా కవిత్వం!’’ అన్నాడాయన కళ్లెర్రచేసి. ‘‘అయ్యో! అది కాదండీ! మీ చక్కటి గొంతులోకి చల్లటి మజ్జిగ తీసుకువద్దామనీ!’’ అని చెప్పి మెల్లగా జారుకుందా ఇల్లాలు. 
      దేనికైనా లౌక్యం ఉండాలి. లేకపోతే ఈ ఉగాది కవులతో భార్యామణులకు శిరోభారమే కదా! ఇప్పుడు ఫర్వాలేదు... ఒకప్పుడు ఎవరైనా దారిలో కనిపించి ‘ఏం చేస్తుంటారు మీరు!’ అని అడిగితే ‘కవిత్వం రాస్తానండి!’ అని ఎవరైనా అంటే ఆమడదూరం పారిపోయేవారు. ఇప్పుడా! ‘‘నేనూ రాస్తాను. మీ కవిసంఘంలో చేర్చుకోరూ’’ అంటూ... రెండు తాటాకు ముక్కల్లాంటి కాగితాలు పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. అయ్యో! వాగ్దేవీ!! ఇలా రోడ్డునపడ్డావా తల్లీ! అని సహృదయులైన కవిపాఠకులు అనుకోకుండా ఉండగలరా!
      రాజ్యాలే పోయినా రాజులే కరువైనా కవులు మాత్రం కావ్యగోపురాలు కట్టుకుని కులాసాగా జీవించారనుకుంటాం. కానీ.. వాళ్లు ఎడారి కోయిలల మాదిరి గతకాలపు శిథిలాల మీద కవితాసుమాలు చల్లుతూనే ఉన్నారు. నాలుగు గోడల మధ్యనే కాదు నలుగురూ కొట్టే చప్పట్లలోనే కవితా మధురిమ మరింత రసభరితమవుతుందని కొత్తగా కలం పట్టిన కవి మాత్రమే కాదు కవికుల కురువృద్ధుడు కూడా ఉగాది కవిసమ్మేళనానికి పరుగుతీస్తాడు. పండిత గోష్ఠులూ, సన్మాన సభలూ.. ఊకదంపుడు ప్రసంగాలు కాదు కదా కవికి కావాల్సినవి! కవిగా ఎదగాలి. కవిత్వాన్ని సాధన చేయాలి. పదుగురు మెచ్చిన చోటనే కవిగా వేళ్లూనుకోవాలి. ఉగాది అంటే మనసు చిగురించడం కూడానూ. బతుకు పరిమళం తప్పి వాడిపోతే ఇన్నాళ్లకి నా మదిలోకి వసంతం ఆగమించింది అని వెర్రి ఉత్సాహంతో గంతులు వేసేది కోయిల మాత్రమే కాదు కవిపుంగవుడు కూడా. ఉగాదులు వస్తుంటాయీ... పోతుంటాయీ కేవలం కవితలు రాసి ఏం సాధిస్తాడు కవి అంటే! దానికీ ఒక కవి అంతటివాడే బదులిస్తాడు మరి! 
పక్షిరెక్కలు తగిలిస్తే పక్షి కాలేము 
మన ఊహ పక్షిలా రెక్కలు విప్పాలి
పూలరేకుల్లో మునిగితే పూవు కాలేము 
మన కల పూవులా వికసించాలి
అక్షరాలు కూర్చితే కవిత్వం కాలేము
కవిగా జీవించడం సాధన చేయాలి
(బి.వి.వి ప్రసాద్‌) 
ఒకరా ఇద్దరా ఉగాది వచ్చిందంటే చిలుకలు వాలిన చెట్టులాగా, చిగురులు తొడిగిన మావిలాగా, బరువుగా ఊగే కొమ్మలాగా కవి కోయిలలన్నీ ఒక్కచోటనే వాలిపోతాయి. రుతువులరాణి వసంతానికి అక్షరార్చనతో స్వాగతమిస్తాయి. ప్రకృతి వైపు మరలాలంటే ఉగాదికి ప్రణమిల్లాలి. ప్రకృతి కాంతకు ప్రణమిల్లడమంటే కవి కోయిలకు చెవి ఆన్చడం! అప్పుడే ఉగాది ఉపదేశం అందరికీ అందేది. కవే గనక లేకపోతే ఉగాది ఏం రుచిస్తుందీ! కొమ్మమీద పక్షిలాగా ఇంటికొక కవి కవితాగానం చేస్తేనే కదా.. ఉగాది వైభవం కనిపించేది! లోకానికి వినిపించేది! 


వెనక్కి ...

మీ అభిప్రాయం