మహిళానాం రోదనం బలం

  • 590 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

‘బాలానాం రోదనం బలం’ అన్నారు. పిల్లలకు ఏడుపే బలమట! ఎంత మాట!! పుట్టినప్పుడు ఏడ్చినంత మాత్రాన, పిల్లల్ని అలా అంటారా? వాళ్లకు భాష రానంత మాత్రాన అలా అంటారా? నిజం చెప్పాలంటే (అబద్ధం ఎందుకు చెప్పాలి?) మహిళానాం రోదనం బలం. ఏడిస్తే మహిళలకు ఎంత బలం! స్త్రీలకు ఏడుపునకు మించిన ఆయుధం ఏముంది? అణ్వాయుధం కన్నా ప్రమాదకరమైంది ఏదీ అంటే అదే! 
      ఏడ్చే మగాణ్ని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఓ సామెత. ఇది ఎందుకూ పనికిరానిది! వాడి మొహం ఏడవడం వాడికేం తెలుసు. దమ్ముంటే మగాణ్ని ఏడవమనండి చూద్దాం. ఏడిస్తే మహిళామణే ఏడవాలి. రసపట్టు చూసుకుని ఏడిస్తే చాలు ఏ నారికైనా వెయ్యి ఏనుగుల బలమొస్తుంది. ఏనుగు లాంటి మగాడైనా ‘పీనుగు’లాగా నిశ్చేతనుడైపోతాడు. ‘కలకంఠి కంట కన్నీరొలికిన...’ అన్న సామెత కూడా ఏ మహిళామణో తయారు చేసుంటారు.. మగవాళ్లని బెదరగొట్టడానికి. అయినా కలకంఠే కన్నీరొలికించక పోతే ఇళ్లల్లో ఇన్ని టీవీలూ ఇన్నన్ని వాషింగ్‌మిషన్లూ గట్రాలూ ఉండేవా?
      మహిళల రోదనల చరిత్ర యుగయుగాలది. తొలి ఆనవాళ్లు త్రేతాయుగంలో దొరుకుతాయి. కైకేయి ఏడవబట్టి కదూ దశరథుడి ‘దశ’ దెబ్బతిన్నది; శ్రీరాముడికి వనవాసం పట్టింది? ద్వాపరయుగంలో సత్యభామ ఏడవబట్టి కదూ శ్రీకృష్ణుడు గడగడ వణికిపోయాడు. ‘లావొక్కింతయు లేదు’ అని గజేంద్రుడు అన్నాడో లేదో జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణపరమాత్ముడు సత్యభామ దగ్గర చేతులెత్తేసి ‘నీవేతప్ప ఇతః పరంబెరుగ కావవే సత్య రక్షించు సత్యాత్మకీ’ అన్నంత పని చేశాడు. ఇదంతా ఇన్‌డోర్‌ షూటింగ్‌ కాబట్టి బయటి ప్రపంచానికి తెలియదు. మహిళల ఏడుపు తెలుగు సాహిత్యంలో కూడా విస్తరించింది. భార్యతో ‘పడక’ పోయిందంటే అర్థం అతగాడికి పడకపోయిందనే! భార్య ఆరున్నొక్క రాగం ఆలపిస్తుంటే అతడి బతుకు బస్టాండే. మహామహా నాయికలే విలాపంతో ప్రతాపం చూపించి విజయం సాధించిన తర్వాతనే పతిదేవుళ్లకు సల్లాపాలకు అనుమతినిచ్చారు. భార్య కాకపోతేనేం వరూధిని ప్రవరుణ్ని తన ఏడుపు చేత ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.
పాటున కింతులోర్తురె కృపారహితాత్మక నీవుద్రోయని 
చ్చోట భవన్నఖాంకురముసోకె కనుంగొనుమంచున 
ప్పాటలగంధి వేదననెపంబిడి ఏడ్చె కలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టల అశ్రులు చిందువందగన్‌

      ఈ పద్యం చదివితే చాలు వరూధిని ఏడుపు ఎంత చిచ్చుపెట్టిందో అర్థమవుతుంది. ఇది మనుచరిత్రలోది! అడపాదడపా మన చరిత్రలోనిది కూడా.
భట్టుమూర్తి నాయిక గిరిక ఏడుపు కూడా చిత్రమైందే. ఇది వసుచరిత్ర కావ్యంలోది. 
ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్‌లేక రాకానిశా
రాజశ్రీసఖమైన మోమున పటాగ్రంబొత్తి ఎల్గెత్తి ఆ
రాజీవానన ఏడ్చెకిన్నర వధూరాజత్కరాంభోజ కాం
భోజీరాగ విపంచికా రవసుధాపూరంబు తోరంబుగన్‌

      ఏం చేస్తాం! ఏడుపూ ఎంత అందంగా ఉంది! దానికీ ఓ రాగం. దాని పేరు కాంభోజీ!
      ఇక ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ చేత ఏడిపించాడు.
ఈసునబుట్టిడెందమున హెచ్చిన శోకదవానలంబుచే
గాసిలిఏడ్చె ప్రాణవిభుకట్టెదుటన్‌ లలితాంగి పంకజ
శ్రీసఖమైన మోముపయి చేలచెరంగిడి బాలపల్లవ
గ్రాస కాషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనిన్‌

      ప్రబంధకవులు ముగ్గురిలో ఎవరి ఏడుపు వారిది! అల్లసాని వారు అల్లిబిల్లిగా ఏడ్చాడని, ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడని, భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడని తెనాలి రామలింగడి వెక్కిరింపు! తరిగొండ ధర్మన్న కూడా చిత్ర భారతంలో నాయికను తనదైన శైలిలో ఏడిపించాడు. కవిత్వాల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ల ఏడుపులు బయటపడ్డాయి! లేకపోతే ఎవరికి తెలిసేవి! అయినా ‘అట్టడుగున పడి విన్పించని ఏడుపుల్ని’ ఎవరు బయటికి తీస్తారు? ఇంటింటా ఏడుపులు ఉంటాయి. మధ్యలో గోడలు ఉండటం వల్ల ఒక ఇంట్లో గొడవలు... అవే ఏడుపులు పక్కింటికి వినిపించవు కానీ విషయం ఒక్కటే.. శ్రుతిలోనే తేడా. ‘ఏడవకురా చెడేవు’ అంటారు కానీ, ఏడ్చి దెబ్బతిన్న అతివలు ఎవరైనా ఉన్నారా? అంతెందుకు.. ‘ఏడవకు ఏడవకు వెర్రినాగన్న’ అని అబ్బాయిలకు చెబుతారు కానీ, ఏ నాగమ్మకైనా ఇలా చెప్పిన చరిత్ర ఉందా? కాబట్టి తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. ఏడిస్తే ఆడవాళ్లే ఏడవాలి. ఏ టెంటులోనైనా దీనిమీద పేటెంటు వాళ్లదే! తిరుగులేదు!!


వెనక్కి ...

మీ అభిప్రాయం