ఇరులే తుమ్మెదలుగా ఏవేళ పాడునో

  • 314 Views
  • 2Likes
  • Like
  • Article Share

    పాతపాటి రామమోహనరావు

  • సికింద్రాబాదు

జోజిబిని తుంజీ, టోనీ- ఆన్‌ సింగ్‌.. 2019లో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన పేర్లు! వర్ణ వివక్షను దాటుకుంటూ విశ్వసుందరి, ప్రపంచసుందరి కిరీటాలను గెలుచుకున్న నల్లకలువలు వీళ్లిద్దరూ! అదేంటో కానీ, నలుపు అనగానే చాలామంది ముఖాలు చిట్లించేస్తారు. కంటికి ఇంపుగా ఉండదనో.. మనసుకు హత్తుకునేట్టు ఉండదనో నల్లదనానికి మన్నన లేదు లోకంలో! కానీ, ‘నలుపు నారాయణుడు మెచ్చు’ అని తెలుగువారు ఎప్పుడో చెప్పారు. నలుపులో అందముంది.. మెరుపుందని తెలుగు కవులు కైతలు కట్టారు. నింగిలో నీలిరెక్కలు విచ్చుకున్నప్పుడే కదా మరి చుక్కల అందం ఇనుమడించేది! కీచురాళ్ల సడి, మిణుగురుల హడావుడి, కారుమేఘాల ఉరవడి... ఇవన్నీ పరుగిడి సందడి చేస్తున్నాయంటే నలుపు పులిమిన అందాల వల్లే!
భాగవతంలో
కృష్ణుణ్ని వెన్నదొంగగా పోతన భావిస్తే... ‘‘అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన’’ అని అన్నారు సినిమా కవి పింగళి. అంటే చాటుమాటుగా వచ్చే నల్లపిల్లి, నల్లనయ్య ఇద్దరూ దొందూదొందే అని చెప్పడానికి నలుపే ఆలంబన. ‘‘నల్లనివాడు పద్మనయనంబులవాడు..’’ అంటూ కృష్ణుడి రూపు ఇదీ అని పోతనామాత్యుడు చెప్పినప్పటికీ గోపికలు పొదలమాటున వెదకడం వృథాప్రయాసే కదా! అయినా వెతికారు దొరుకుతాడేమో అని. అసలే తిమిరాంధకారం.. ఆ చీకట్లో ‘నల్లనివాడు’ ఏం కనిపిస్తాడూ! ‘‘నీలమేఘచ్ఛాయబోలు దేహంవాడు’’ అంటూ కన్నయ్యే కాదు రామచంద్రుడూ నలుపు మైఛాయగా కలిగినవాడే అన్నారు మొల్ల. పొరపాటో.. ఏమరపాటో కానీ, ‘నీల’ అన్నమాటకు ‘బులుగు’ అనే అర్థాన్ని గ్రహించారు మనవాళ్లు! కృష్ణుడు, రాముడు పాత్రధారులకు బులుగు రంగు పులమడం పౌరాణిక నాటకాల కాలం నుంచి సినిమాల వరకూ నిరంతరంగా కొనసాగుతోంది.  
      శ్రీరామకృష్ణులు అందమైన వారు కాబట్టి నలుపు అందమైనదే, ఎవరు ఔనన్నా కాదన్నా! అయినాసరే, పెళ్లిపీటల మీద వధూవరులను చూసి ‘పిల్లాడు నల్లగా ఉన్నాడు.. కాకిముక్కుకు దొండపండు’ అనేవారు.. ‘అబ్బాయి అందగాడే- అమ్మాయే కారునలుపు’ అనేవారు కోకొల్లలు. కానీ, ఈ మాటలు సబబు కాదు. నలుపులోనే నాగరికత ఉందనే విషయాన్ని సగర్వంగా చెప్పుకునే సంస్కారమూ అందరికీ లేదు. ఇలాంటి వాళ్లందరికీ దేవ దంపతుల చిత్రాలు చూపించాలి. రుక్మిణి ఎరుపు అయినా కృష్ణుడు నలుపే కదా! నల్లటి రాముడి పక్కన పసిమి వన్నెల సీతమ్మ నవ్వుతూ లేదూ! నీలవర్ణ అర్జునుణ్ని మెరుపుతీగ సుభద్ర కోరి వరించలేదూ! అని గుర్తుచేయాలి. ఇదే విషయాన్ని చేమకూర వేంకటకవి కూడా చెప్పాడు.  
మృగమదముచెంత గుంకుమరేఖవోలె
నీలమణిచెంత నుదిరి పొన్రేకు వోలె
మేఘము కురుంగటను దీగమెఱపువోలె

      అంటూ సమ్మోహనపరిచే చిత్తరువును కళ్లముందుకు నెడతాడు చేమకూర. అర్జునుడు నల్లనివాడు కాబట్టే కస్తూరి, నీలమణి, మేఘాలతో పోలికపెట్టాడాయన. సుభద్రనేమో కుంకుమరేఖ, ఉదిరి పొన్రేకు, మెరుపుతీగెలతో సరిపోల్చాడు.
      నలుపు అంటే రాత్రి గుర్తొస్తుంది. రాత్రినీ చీకటినీ విడదీసి చూడలేం. అంత చీకట్లోనూ తారాడే గబ్బిలాలూ.. గుడ్లగూబలూ చీకటి సామ్రాజ్యాన్ని ఏలే రాజముద్రికల మాదిరి ఒకటి నల్లగానూ.. మరొకటి బూడిద రంగులోనూ ఉంటాయి. అంతమాత్రాన వాటిని తీసి పారేయనక్కర్లేదు. గబ్బిలాన్ని ‘‘నిద్దంపు లేత కస్తూరి ముద్ద’’ అనీ, ‘‘ముక్కూ మొగమున్న చీకటి ముద్ద’’ అనీ వర్ణించారు జాషువా. కారుచీకటి లేకపోతే లోకానికి అందమే లేదు. ఆకాశమంతా పొగలాగ కమ్మి, భువనమంతా ధూపంలా ఎగజిమ్మే చీకటి దిగంతాలనూ శోభాయమానం చేసే తీరును దాశరథి ఎంత రమణీయంగా చెప్పారో! 
ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
    అచ్చోట మధుమాస మవతరించు
ఇరులే తుమ్మెదలుగా ఏవేళపాడునో
    ఆవేళల వసంతమందగించు
ఇరులే మయూరమై ఎట నాట్యమాడునో
    అటనే నవాషాడ మావహించు
ఇరులే ఉత్పలములై ఏనాడు పూచునో
    ఆరోజు కార్తికమ్మాగమించు
ఇరులకన్న అందమెచట కానగరాదు
ఇరులే సౌఖ్యములకు దరులు సుమ్ము
ఇరులు లేనినాడు నరులు కానగరారు
నరులు లేనినాడు ధరణిలేదు

      కోకిలలు, తుమ్మెదలు, నెమళ్లు, నల్లకలువలు.. ఇవన్నీ నల్లగా ఉన్నా ప్రకృతి సౌందర్యానికి పరమోత్తమమైనవనీ.. ఇవే లోకానందానికి, ఆహ్లాదానికీ దిక్సూచీలంటారు దాశరథి. నవనవలాడే ఎంకి అందాన్ని చీకట్లోనే చూడాలంటాడు నాయుడు బావ! ‘‘జిమ్ముమంటాతోట/ సీకటైపోవాలి/ సీకట్లో చూడాలి/ నీ కళ్ల తళతళలు/ ఆరిపెయ్యవె దీపమూ...’’ అని పాడతాడు. నలుపు అందంగా ఉంటుంది కాబట్టే.. ఆ లావణ్యాన్ని స్పృశించాలనే ఆరాటంతో ‘‘చీకటికి చురకపెడుతుందిలే చిన్ని మిణుగురు పురుగు’’ అని చమత్కరించారు సినారె. ‘‘చిన్నారి బుగ్గపై చిరు దిష్టిచుక్క అమ్మ పెడుతుందింత చీకటిని గిల్లి’’ అంటూ అమ్మప్రేమను హృద్యంగా ఆవిష్కరించారు రెంటాల.
అసలు నలుపంటే ఏంటీ! ఎలా ఉంటుందీ! అని అడిగితే.. కటిక చీకటి వైపు వేలెత్తి చూపి ‘ఇదే కారునలుపు!’ అనడం మామూలు పద్ధతి. కానీ, అల్లసాని పెద్దన ముసిరిన చీకట్ల అందాన్ని మనసుతో చూడాలంటూ.. ఎక్కడెక్కడ ఎందెందులో నలుపుందో ఇలా చెప్పాడు.. 
మృగనాభి పంకంబు మెయినిండ నలదిన
మాయా కిరాతు మైఛాయదెగడి
నవపించమయభూష లవధరించు నటించు
పంకజాక్షుని చెల్వుసుంక మడిగి
కాదంబ నికురంబ కలితయై ప్రవహించు
కాళింది గర్వంబు గాకుసేసి
తాపింఛ విటపికాంతార సంవృతమైన
యంజనాచలరేఖ నవఘళించి
కవిసె మరియును గాకోలకాలకంఠ
కంఠకలకంఠక రిఘటాఖంజరీట
ఘనఘనాఘన, సంకాశ గాఢకాంతి
గటికచీకటి రోదసీ గహ్వరమున..

      కస్తూరిని ఒంటినిండా పులుముకున్న శివుడి కంటే.. నెమలి పింఛాన్ని సిగను దాల్చి నాట్యమాడే కన్నయ్య ఒంటి మెరుపుకంటే.. హంసలతో అలరారే నిండైన యమునా ప్రవాహం కంటే.. కొండలు, నెమళ్లు, కాకులూ, కాటుక పిట్టలు, ఏనుగుల గుంపు, వ్యాపించిన కారుమేఘాల కంటే దట్టంగా ఉందట రాత్రి! ఇలా వర్ణించి... ప్రకృతి దృశ్యాలెన్నో చీకటినీడల మాదిరి పాఠకుల కంటి ముందు బొమ్మకట్టించాడు ఆంధ్రకవితా పితామహుడు. ఇక కాటుక కళ్లల్లోనూ.. ముంగుర్ల మెరుపుల్లోనూ కనిపించే నలుపు ఆభరణాలకంటే గొప్పది అంటాడు చేమకూర. అసలు కురులను దులిపితే చాలు చీకటి రాలుతుందంటాడు తెనాలి రామకృష్ణుడు. చెంపకు చేరడేసి కళ్లుండటం ఆడవాళ్లకి అందమే. ఆ కళ్లకి ఎడం లేకుండా కాటుక పూసినప్పుడు ఆ అందమే వేరు. అలాంటి కాటుక కళ్లల్లో నీళ్లు తిరిగితే ఎలా ఉంటుందో! ‘‘కాటుక కంటినీరు చనుకట్టుపైంబడనేల ఏడ్చెదో..’’ అంటూ పోతన ఊరడించాడు కానీ కాటుక వల్ల ఆ కళ్లు తన కావ్యాన్ని రాజులకు అంకితమివ్వొద్దనే నిరసన భావాన్ని ప్రకటిస్తున్న భ్రమ కలిగిస్తాయి.
      లోకంలో ఎన్నో రంగులున్నా నలుపు ప్రత్యేకత వేరు. అందుకే, ఆ వర్ణంలో సకల వర్ణాలూ సమ్మిళితమైనట్టు.. నల్లనికాంతుల్లో నర్మగర్భితమైన జీవనసూత్రాలెన్నో నిబిడీకృతమై ఉన్నాయంటారు కవులు. నలుపు దేని ముందూ దిగదుడుపు కాదు. ప్రకృతి చైతన్యానికి మేలిమలుపు. చింతా దీక్షితులు చెప్పినట్టు ‘‘మేఘాలందం/ నీలాలందం/ కాంతల కాటుక కన్నుల అందం/ అందాలన్నీ జీవం దాలిచి/ నీలో నాట్యం చేసేనే..’’ అని గొంతెత్తి పల్లవించినప్పుడే లోకానికి కొత్త కాంతి.. మనశ్శాంతి దక్కేది.


వెనక్కి ...

మీ అభిప్రాయం