భావకవితా మదువనిలో ఓ కోయిల

  • 341 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీ స్రవంతి

మా బంగారమ్మకు కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది; సాధన వల్ల వచ్చింది కాదు. అది మేలిమి బంగారమే. ఆమె గేయ కుసుమాలు సుమనోహరాలు. ఒక్కొక్క గేయం నెత్తావులు విరజిమ్మే ఒక చక్కని చిన్నారి జాజిపూవు; దివ్యపరిమళం వెదజల్లే మల్లిపూవు. ఈ పాటలన్నీ ప్రకృతి బంగారమ్మ చేత పాడించుకొంది. వీటిని ఆమె పాడుతూవుంటే ఎంత తీయగా తరితీపులు వెలారిస్తూ శ్రవణానందకరంగా ఉంటాయో, వాటిలోని భావాలూ అంత ఉన్నతంగా, రమ్యంగా, హృదయానంద కందళితంగా ఉంటాయి.  - మల్లంపల్లి సోమశేఖరశర్మ 
ప్రకృతి
ఆరాధన భావకవిత్వంలో ఓ భాగం. ఇందులో వస్తువు కన్నా భావానికీ, బుద్ధి కంటే మనసుకూ ప్రాధాన్యముంటుంది. ప్రకృతికి, ప్రణయానికీ, ఆత్మగతమైన అనుభూతులకు, ఆలోచనలకూ ఓ రూపమిచ్చేదే భావకవిత. సమకాలీన సంఘటనలకు స్పందిస్తూ కవితలల్లినట్టే రమణీయమైన ప్రాకృతిక సౌందర్యం మనసును తాకినప్పుడూ అప్రయత్నంగా కవిత పుడుతుంది. అది సహజమైందనీ.. భావకవిత్వంలో అదే కీలకమని కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, నాయని లాంటి వారు రాసిన కవితలు రుజువు చేస్తాయి. కలకూజితాలు, సెలయేటి నాదాలు, నెత్తావుల పరిమళాలు, నదీనదాలు, ఇలా అన్నింటిలోనూ భావసాంద్రతను కలిగి ఉండి రాసే కవిత భావకవితే అయినా అది ముమ్మాటికీ ప్రకృతి కవిత. 1910 నుంచి తెలుగులో చెదురుమదురుగా వస్తున్న ఈ కవితలన్నీ 1930లో ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ ద్వారా వెలుగులోకొచ్చాయి. అలా సాహితీ లోకానికి పరిచయమైన భావకవితా యుగానికి చెందిన కవయిత్రి చావలి బంగారమ్మ. ‘కాంచన విపంచి’గా వెలువడిన ఈవిడ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త చూపునీ, సరికొత్త భావవ్యక్తీకరణని తీసుకొచ్చాయి.
      ప్రముఖ కవి, శ్రీశ్రీ ఆప్తమిత్రుడు కొంపెల్ల జనార్దనరావు సోదరి బంగారమ్మ. తూర్పుగోదావరి జిల్లా కోనసీమకి సమీపంలో ఉన్న మోడేకుర్రులో 1897లో జన్మించారు. 1932-37 మధ్య బంగారమ్మ రాసిన కవితలని ‘భారతి, ఉదయిని’ తదితర పత్రికలు ప్రచురించాయి. అలతి అలతి పదాల్లో అనంతార్థాలను పొదగడం, గాఢమైన అనుభవాలను తేలికైన పదాలతో కవిత్వీకరించడం బంగారమ్మ కవితాగుణం. చిన్నవి.. సున్నితమైనవి.. భావదృష్టికి అందలేనివాటిని సైతం లలితమైన పదాల్లో పొదిగి కవితలల్లడంలోని విలక్షణత ఈవిడ కవితల్లో కనిపిస్తుంది. నిశ్చలమైన కొలనులో చంద్రబింబం నిలకడగా ఉండటం సహజం. వొలికిపోయిన నీటిలో చంద్రుడి ప్రతిబింబం కదులుతున్నట్టు అస్పష్టంగా ఉంటుంది. ఆ భావచిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఇలా అంటారు బంగారమ్మ తన ‘పాప’ కవితలో.. 
మాపాప చెంబులో
నీళ్లొలక బోసితే 
చెందురుడు జారిపడి 
చిందులాడేడు
చేయెత్తి మాపాప చెడమొత్తినాది

      ఇది కవయిత్రి భావనాబలాన్ని నిదర్శనంగా నిలిచేది మాత్రమే కాదు, మూస కవిత్వానికి భిన్నంగా వచ్చిన కొత్త అభివ్యక్తి. అలాగే, ‘నీడ’ కవితలో నిర్మలమైన మనస్థితి మనసును కుదుటపరుస్తుంది. కొలనుగట్టు, తాటిచెట్టు, మబ్బుల నీడలు కళ్లముందు తారాడతాయి. ‘ఎలుతురంతా మేసి యేరు నెమరేసింది... ఏటికడుపున దాగి తోట నిదరోయింది’ లాంటి ప్రసిద్ధకవుల భావచిత్రాలు గుర్తొస్తాయి. నీటిలో మందారం తన నీడని చూసుకుని మురిసిన తీరు విలక్షణమైన భావవ్యక్తీకరణను తేటపరుస్తుంది.
అందాలు తానే చూసింది 
నీటిలో 
చందాలు తానే చెప్పింది 
నాతోటి
ఒడ్డున మందార వంగి బొట్టెట్టుకుని 
అందాలు తానే చూసింది

      జానపద గేయాల్లో కనిపించే సరళత, స్పష్టత, లయాత్మకత బంగారమ్మ కవితల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. కేవలం చదవడం మాత్రమే కాక పాడుకోవడానికి అనువైన ఓ తూగు, పదాల ఒడుపు ఉంటాయి. ‘తుమ్మెదా!’ కవితలో కనిపించేది ఈ లక్షణమే..
ఆకాశయానంబు- తుమ్మెదా!
నీ ఝుంకారనాదంబు- తుమ్మెదా! 
అదె వింటు ఆ పూలు- తుమ్మెదా!
నిన్నట్టె ధ్యానముసేయు- తుమ్మెదా!
కళ్లు విప్పని ఆ పూలు - తుమ్మెదా! 
నీ కళ్లకెట్లగుపడునె - తుమ్మెదా! 

      అంటూ.. నేను ఈశ్వరుడి మెడలో ఉన్నాను నన్ను అంటుకోవద్దంటూ పువ్వు చేసే విజ్ఞాపనతో ముగిసే ఈ కవితలోని మెరుపు, తూగు స్మృతిపథంలో నిలిచిపోతాయి. ‘‘కొబ్బరాకు బూరాలు చుట్టుకుందామ/ తాటాకు బొమ్మలూ అల్లుకుందామ’’.. తాటాకు బొమ్మలకు పెళ్లిచేస్తూ కొత్త దంపతుల మధ్య ఉండే వ్యక్తావ్యక్త ప్రేమారాధననూ.. వారి సిగ్గరిచూపుల్లోని లాలనను బొమ్మకట్టిస్తారు బంగారమ్మ ‘బొమ్మపెళ్లిళ్లు’ కవితలో. ఇందులోని భావగాఢత తెలుగువారి జీవన మధురిమకు నిదర్శనం. రాధ విరహవేదనను రూపుకడుతూ ఇలా అంటారు కవయిత్రి..
గుండెలో ఉండేదో కొట్టుకుంటున్నదీ
ఊపిరాడగనీదు ఉడిగిపోనివ్వదె
సందుల సందుల దాగి తలలెత్తనుంకించు
భారమైన భావాల బరువుచే 
ప్రాణంబులుండునా...

      కృష్ణ సమాగమం కోసం రాధ ఎదురుచూడటంలోని ప్రేమతత్వం మధురభక్తిలోని మాధుర్యాన్ని స్మరణకి తెస్తుంది. ‘సిగ్గరి తలపులు, చెల్లాయి కట్నం, కార్తీక పౌర్ణమి, పుంతలో ముసలమ్మ’ అనే బంగారమ్మ కవితలూ తెలుగు జీవన సంస్కృతికి అద్దంపట్టేవే. ‘కాంచన విపంచి’లోని అత్యధికం కవితలను ఆవిడ తన సోదరుడితో కలిసి మద్రాసులోని మల్లంపల్లి వారింట్లో ఉంటున్నప్పుడు రచించారు. 
మెరుపులౌమాయన్న చురుకుచూపులను
మేనెల్లకంపింప నేనందుకొందు
పరితాపభారంబు తనకంపగానే
దన దుఃఖ భారము తానంపుతాడు
ఆనందమున దానినందుకొంటాను 

      సొదరుణ్ని స్మరిస్తూ... బంగారమ్మ రాసిన స్మృతికవిత ఇది. భావకవిత్వంలో స్మృతికవిత్వం అనేది ఒక ప్రత్యేకమైన శాఖ. ఆత్మీయులను స్మరిస్తూ.. వారితో ముడిపడిన జ్ఞాపకాలను ప్రస్తుతిస్తూ రాసే గాఢమైన భావతరంగమది. నాయని మాతృగీతాలు, విశ్వనాథ వరలక్ష్మీ త్రిశతి అనేవి ఈ కోవలోకే వస్తాయి. ‘మా అన్న మాట్లాడితే మల్లెపూల తావి మదినంతా నిండిపోతుంది. నావంక కన్నెత్తి చూస్తే అన్నలోన నేను ఐక్యమైపోతాను’ అంటూ.. మా అన్న ఎవరో కాదు ఆ ఆకాశమే నంటూ.. తన ప్రేమకు ఆకాశమే హద్దంటూ సోదరుని నిలువెత్తు రూపాన్ని కవిత్వంలో బొమ్మ కట్టిన తీరు బంగారమ్మ భావుకత్వానికి చక్కటి నిదర్శనం. భావకవితా యుగంలో లబ్ధప్రతిష్ఠులైన వారి కవిత్వానికి దీటుగా కవితలల్లి, చిక్కనైన కవితాత్మకి చక్కటి మార్గాన్ని పదిలపరచిన ఈ కవయిత్రి 1960లో కీర్తిశేషులయ్యారు.
      ‘‘తెలుగు పుట్టింటి నుడికారం, ఈమె గీతాలలో ప్రత్యేక కమ్మదనం. సంస్కృత ఇంగ్లీషు కోటరికాలలో వూపిరాడని తెనుగునకు ఈయమ పలుకురాక అలనాటి తీయటి తెనుగు ప్రాణవాయువు కాగలదు. తెనుగు కడుపున పుట్టి చేవదేరిన నుడికారం ఈమె భాష పోకడలలోనూ, తాటాకు బొమ్మలకు ప్రాణం పోసి కన్నబిడ్డనుగా చంకకు యెత్తగలిగిన పసినాటి తెలుగు భావన ఈమె ఊహ వీధిలోనూ... ఈమె ఊహా ప్రపంచంలో యెంత గారడీ ఉన్నదో ఆనందించవ లెనంటే ‘ఆ కొండ’ లోని చోద్యాన్ని బట్టి గ్రహించవచ్చును. పుట్టుకతోనే కవిత్వం, పాండిత్య ప్రకర్షతో దీనికి సంబంధంలేదు’’ అంటూ ‘వైతాళికులు’లో బంగారమ్మను పరిచయం చేస్తూ ముద్దుకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. తెలుగు కవితా యవనిక మీద ఇలా తనదైన సంతకం చేసిన బంగారమ్మకు తగిన గుర్తింపు లభించలేదు సరికదా! ఆమె చిత్రం కూడా ఏదీ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం విషాదకర వాస్తవం!


వెనక్కి ...

మీ అభిప్రాయం