కరోనాపై కదనం - ఏప్రిల్‌ 1 పోటీ ఫలితాలు

  • 5774 Views
  • 335Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
గృహమే కదా స్వచ్ఛందసీమ
నిన్నటిదాకా బయటి ప్రపంచం ఇల్లును నడిపేది 
ఇవాళ ఇల్లే లోకాన్ని ధిక్కరిస్తోంది 
రోజూ నల్దిక్కులకు ఎగిరిపోయే పక్షులు 
గూట్లో కూచొని ముచ్చటించుకుంటున్నాయి. 
పిల్లల ముఖాల్లో ఇంతటి సుమనోహర కాంతి పుంజాలున్నాయా! 
ఇవాళ వారి సాన్నిధ్యం 
ఆత్మీయ సవ్వడుల లలిత వాయిద్యం. 
ఆమె వంటింటి చాకిరీ సర్వస్వాన్ని 
ఇవాళ అందరూ పంచుకుంటున్నారు. 
గృహం ఇప్పుడు గుహ కాదు 
అనురాగ సంగీత శృతుల తహతహ!
ఇంట్లో ఇంత దుమ్ము పేరుకుందా! 
ఇన్నాళ్లుగా చిన్నబుచ్చుకున్న వస్తుజాలం 
వన్నెచిన్నెలతో బయటపడుతోంది.
బుడ్డోడు గోడమీద ఫొటోలను తదేకంగా జల్లెడ పడుతున్నాడు 
బల్లమీద వజ్రవైఢూర్యాల్లాంటి పుస్తకాలున్నాయి. 
జ్ఞానాన్వయ నైపుణ్యంతో కాసేపయినా పుణుకులాడొచ్చు. 
ఇన్నాళ్లూ టైం దొరక్క పెరిగిపోయిన అపోహలు 
దూదిపింజల్లా తేలిపోతున్నాయి. 
పక్కవారు లేకుండా మనం లేమనే మౌలిక స్పృహ 
విశ్వచైతన్యానికి దారులు వేస్తోంది. 
ఇవాళ ఇంట్లో కూర్చుంటే 
ఇల్లులేనివాళ్లు గుర్తుకొస్తున్నారు. 
తిండికోసం కండలు కరిగించే కష్టజీవులు 
కళ్లలో మెదులుతున్నారు. 
వద్దంటేనే నిర్బంధం 
ఇష్టపడితే మేలుకున్న మధురానుబంధం 
రండి! ఇంటిని మరోప్రపంచంగా మార్చుకుందాం. 
తలుపులు తెరిస్తే ఏముంది భయం పిలుపులు తప్ప! 
కరోనా! అబ్‌ తూ మరోనా!
- డా।। ఎన్‌.గోపి, హైదరాబాదు, 93910 28496
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
మ‌ల‌చుకుంటే
అందరినీ వదిలేసుకొని ఇద్దరం కలిసుంటున్నాం 
పెనవేసుకున్న చెట్లలా బతుకుతున్నాం 
జాతీయ రహదారిలా నడుస్తుండగా 
కాలం వన్నెలు తిరిగి 
కాళ్లకు తగలాల్సిన పోటురాయి 
అహం తలకు తగిలింది 
గట్టిగా ఇచ్చుక పోయింది ప్రేమ కట్టెలమోపు 
ఇద్దరం కలిసే ఉంటున్నాం ఎవరి పనిలో వాళ్లం 
గెట్టు దాటకుండా ఎవరి మడిలో వాళ్లం 
నాటుతున్న మాటలు మొక్కలు 
తడంటుకోని పోస్టల్‌ స్టాంపులు 
లోపలున్న ప్రేమకు అడ్డుగా అహం 
రెండు చెట్ల ఆకులు కలుస్తున్నాయి విడిపోతున్నాయి 
గాలికి దగ్గరవుతున్నాయి దూరమై పోతున్నాయి 
రెండు నీడల మధ్య మొలిచిన విత్తనాలు 
దూరాల మధ్య మెసిలే రాయబారులు 
మార్పులు సహజాతి సహజం 
ఆకులు రాలే కాలాలు మెరుస్తాయి 
కొన్నాళ్లు బొక్కబోర్లా పడ్డ 
నడకలు చెబుతాయి పాఠాలు 
చైనాలో తగిలిన గత్తర కరోనా 
లోకాన్నంతా లాక్‌డౌన్‌ చేస్తే 
ఎవరి పనిలో వాళ్లం కాదిప్పుడు 
ఎవరింట్లో వాళ్లం 
నాలుగు మెతుకుల్లా అతుక్కొని 
నలుగురి భావాలు పంచుకొని 
పెరిగిన హద్దులు చెరుపుకొని 
అహం ఉప్పు నీళ్లు పారబోసుకొని 
ఆటలు, మాటలు, పాటలు నచ్చుతున్నాయి 
నైపుణ్యం లేకున్నా అక్షరాలు దిద్దుకున్నట్లు 
తప్పులు దిద్దుకోవడం 
అవునిప్పుడు రెండు చెట్లు పెరుగుతూనే ఉన్నాయి
పైన కొమ్మలు కింద వేర్లు కలుపుకొని 
మధ్యలో వీస్తున్న ప్రేమగాలులు 
కరోనాతో ఎన్నో నష్టాలు కష్టాలు ఉన్నా
దాంట్లో ఊపిరి ఆక్సిజన్‌గా మలచుకుంటే 
మనోళ్ల మధ్య పెరిగే మమతలు 
- కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట, 98480 05676

ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి    
షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ!
బయట ఎలా ఉందో ఏం చూస్తావు గానీ... 
షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ! 
ఏయే సందుల్లో... ఎన్ని వీధికుక్కలున్నాయో 
ఏం లెక్కపెడ్తావు గానీ షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ! 
నా మాట విను...  
ఇప్పుడు పొదుపుగా కొందాం... మితంగా తిందాం 
పాలకూర ఆకుకోసం గోధుమపిండి కోసం 
రోడ్లెమ్మిడి తిరిగింది చాలు గానీ 
షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ! 
ముఖానికి మాస్కు వేసుకోవు 
గంటకోసారి చేతులు సబ్బుతో కడుక్కోవు 
గాలికి తిరిగి తలనిండా ఎర్రటి దుమ్ము 
కరోనాకు భయపడి మేమంతా ఇంట్లో దాక్కుంటే 
నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నట్లుంది 
అదేమన్నా... నిన్ను విడిచిపోయిన 
నీ మాజీ ప్రియురాలు అనుకున్నావా? 
షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ! 
నిర్మానుష్యమైన గతుకుల రోడ్లు, 
మూసేసిన అంగళ్లు, బళ్లు, గుళ్లు,
నీళ్లు రాని కుళాయిలు 
పొంగిపొర్లుతున్న మురికి కాల్వలు 
ముసురుతున్న దోమలు 
ఎత్తకుండా వదిలేసిన చెత్త డబ్బాలు 
ఒక్క మాట చెప్పనా...  
నువ్వు పుట్టినప్పటి నుంచి  
మన ఊరు ఇలాగే ఉంది... ఏం మారలేదు... 
షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ! 
కరోనా కాలంలో క్వారంటైన్‌ బతుకులు మనవి. 
లాక్‌డౌన్‌ అప్పుడు సీజ్‌ అయితే 
నీ వాహనం ఎవరిడిపిస్తారు? 
పోలీసుల చేతిలోని లాఠీ పొడవు ఏం కొలుస్తావు గానీ 
అమ్మ నీకోసం ఆందోళన పడుతోంది... 
తాజా హెల్త్‌ బులెటిన్లో 
నువ్వు ఉండకుండా చూస్కో 
సమయం లేదు ఉమేషా... 
షికారు ఆపి, ఇంటికి రా తమ్ముడూ!     
- డా।। వేంపల్లి గంగాధర్, కడప, 94400 74893
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
అన్నీ ఆదివారాలే!
హమ్మయ్య! 
ఆదివారం వచ్చేసింది 
హడావుడి వంట అక్కరలేదు 
ఆహారపు పొట్లాలు కట్టక్కర లేదు 
ఇంటిల్లిపాదీ కలిసి 
కంచాల్లో భోజనాలు చేయచ్చు 
మధ్యాహ్నం హాయిగా కునుకు తీయచ్చు
రోజూ గడియారపు ముళ్లకు సలాం కొట్టినా, 
ఈరోజు వాటి పెద్దరికాన్ని చూసీచూడనట్టు ఉండచ్చు 
రిమోట్‌ అరిగేలా ఛానెల్స్‌ మారుస్తూ టీవీ చూడచ్చు 
పనిదినాల ఫలహారం కోసం పిండి రుబ్బుకోవచ్చు 
వచ్చే వారంరోజులకు పథక రచన చేయచ్చు 
సాయంత్రం స్నేహితులతో సరదా సంభాషణలు...
స్వగతం కోసం కొంత సమయం కేటాయింపులు... 
ఇలా... ఎన్నో పనులు , విశ్రాంతుల కలబోత... 
ఆదివారం కోసం ఆరు రోజుల నిరీక్షణ 
ఇలా అనుకున్నంతలో రావడం వెళ్లడం అయిపోతుంది 
చేసినవాటికీ తృప్తి పడి ,
అవ్వని వాటికి వచ్చే వారం ఆశ పెట్టి.... 
ఇలాంటి అనుభూతులను చిదిమేసి 
ప్రతిరోజూ ఆదివారాలను చేసేసి 
పోలీసులు, డాక్టర్లతో పాటు 
వంటింటికి, ఇల్లాలికి, టీవీకి విశ్రాంతి లేకుండా చేసేసి 
పిల్లల్ని పుస్తకాలు తీయమనడానికి లేకుండా పాసులు చేసేసి 
వారానికి ఒక ఆనంద ఆదివారానికి బదులు 
రోజూ పని లేని ఆదివారాలై పోతూ ఉంటే 
ఎక్కువ తిన్న పాయసం చేదైనట్లు.... 
భావి భారతాన్ని అతలాకుతలం చేస్తున్న 
కరోనాకు తలకొరివి పెడదాం 
మిగిలిన పని రోజులును తెచ్చుకొందాం. !
- ఈశ్వరి, గుంటూరు,    70134 60335


ప్రోత్సాహక బహుమతి (2)
భయం లేదు మిత్రమా..!!
మూసుకున్న తలుపుల వెనుక 
తెరచుకున్న హృదయాలన్నీ 
ఆత్మీయతా సమీరంతో ఆనందంగా సేదతీరుతున్నాయి.. 
నిత్య పూజలందుకునే ముక్కోటి దేవతాగణాలన్నీ 
నమ్మినవారి కోసం ప్రాణంపోసుకొని 
సజీవంగా సంచరిస్తూ 
ఆపద్బాంధవులై అమృతాన్ని
అందరికీ అవిరామంగా పంచుతున్నాయి... 
తప్పొప్పుల దండకాలతో 
ఉవ్వెత్తున ఎగసే రాజకీయాగ్నిహోత్రం 
చప్పగా చల్లారిపోయి 
గుప్పెడు బూడిదగా ఏ జీవితమూ మారకూడదని 
తలకిందులుగా తపస్సు చేస్తోంది.. 
మనుషుల్లో ఆకులు రాల్చుకున్న మనోధైర్యం 
లేలేత చిగుళ్లతో మళ్లీ పలకరిస్తోంది.. 
ప్రజాస్వామ్యంపై పలచబడిన నమ్మకం 
ఇపుడిపుడే మళ్లీ చిక్కబడుతోంది.. 
అందుకే అందరూ...
మృత్యుదేవత కరోనా రూపంలో 
ఏ ఇంటితలుపు తడుతుందోనని భయపడుతున్నా.. 
నాకు మాత్రం...
ఏదో అవుతుందనే భయం అంతరించింది.. 
ఏమీ కాదనే ధైర్యం అంకురించింది.. 
భయం లేదు మిత్రమా..!! మనకు భయం లేదు..!!!     
- చల్లా దేవిక, ఒంగోలు, ప్రకాశం జిల్లా,    98489 65188


ప్రోత్సాహక బహుమతి (3)
మరణం
ఏ మతం అంటించుకొచ్చిందో 
మరే మతం రుద్దుకుని హత్తుకుందో 
చర్చావేదికల నడుమ 
కొట్టుకుచచ్చే సమయంకాదిది 
చచ్చేవేళనయినా ఐకమత్యం పాటిద్దాం 
మరణానికి మతాన్ని రుద్దకండి 
అది సర్వాంతర్యామి 
తరతమ భేదాలెరగని పనిమంతురాలు 
మనుషుల తప్పిదాన్ని  
దూరంతో మనమైనా సరిచేద్దాం 
కంటిలో ఇంకిపోతున్న ఆశలన్నింటికీ 
మిగిలి ఉన్న స్వచ్ఛత చమురుపోయండి 
ఓ మరణమా ఇటురాకు 
ఇప్పుడే విచ్చుకుంటున్న పసిమొగ్గలున్నాయి 
సుగంధాల భవిష్యత్తుకై కలలెన్నో మొలుస్తున్నాయి 
ఓ మరణమా అటుచూడకు 
పసుపువన్నె తగ్గని లేత జంటలున్నాయి 
మౌనంగా కరుగుతున్న కాలంలో 
కాలకూటాన్ని గమనించలేకున్నాయి
నీ కనుగుడ్లను అటు తిప్పకు 
అటు సేదతీరుతున్న సంధ్యాకుసుమాలున్నాయి 
ముడేసుకున్న బంధాలమధ్య చిక్కి 
నివురుగప్పిన నీ నీడలో విలవిలలాడుతున్నాయి 
ప్రకృతి ఇచ్చిన శాపానికి ఇప్పటికైనా కళ్లు తెరుస్తామేమో 
ఒక్క అవకాశం ఇచ్చి తరలిపో 
పుడమికి చేసిన గాయాలకు 
మారుమనసుతో మందుపూస్తాం 
తోటిజీవుల ఆర్తనాదాలకు ఇకనైనా స్పందిస్తాం 
నిరంకుశంగా జరుగుతున్న 
మారణహోమానికి విరామమివ్వు 
పంజరంలో బందీలుగా మిగిలిన దేహాలకు 
మనిషిగా బతికే కాలాన్ని తిరిగి ఇవ్వు
- కె.త్రివేణి, గోకులపాడు, విశాఖ జిల్లా 81793 98079


ప్రోత్సాహక బహుమతి (4)
చేతులు కలిస్తే కరోనా చేతులు జోడిస్తే కుచ్‌ నై కరోనా
అవును మనం ఎన్ని గాయి గత్తర్లు చూడలేదు 
పోలియోలు, కలరాలు, ప్లేగులు, ఎయిడ్స్‌ 
ఒక్కటా రెండా సోయి కచ్చినప్పటి సంది ఎన్నెన్ని రోగాలు 
ఎక్కడెక్కడి నుంచో వచ్చి
మనమీదా మన ఆత్మబలం మీదా దాడిచేయలేదు
మా రాజుగానికి పోలియో వచ్చి కాళ్లు చేతులే పాయే 
కుంటుకుంట మెంటుకుంట వాడు పడుతున్న కష్టం 
మా ఇంట్ల పోలియోమీద పోరాటానికే జెండైంది 
రాజిరెడ్డి తాతకు టీబీరోగమొచ్చినప్పుడు 
దవాఖాన బెడ్డుకాడికి పోవాలంటేనే 
కాళ్లు చేతులు ఒకటే వణుకందుకునేది 
కానీ, ఆత్మస్థైర్యంతో ఆయన దాన్ని జయించిన తీరు
ఇప్పటికీ నా కండ్లముందు కదలాడుతుంది 
చెప్పుకుంటూ పోతే ఎన్ని కల్లోలిత కహానీలు 
అవ్వన్నీ గుర్తుకస్తే 
మనసు చివుక్కుమని శోకరాగమందుకుంటది 
కానీ, ఆ గెలుపెప్పుడూ 
నా కండ్లల్ల మెదులుతూనే ఉంటది 
ఒక గాలితో వడ్లు తూర్పార బట్టినట్లు 
ప్రాణాలు దీసిన కలరాను తరిమి కొట్టలేదా? 
నిండు జీవితానికి రెండు చుక్కలేసి 
నూరేండ్ల బతుకు పండిస్తలేమా? 
పుట్టుకతోనే యుద్ధగీతాలు పాడిన దేశం మనది 
అలుపెరుగని పోరాటాలకు ఆనవాళ్ల నేల ఇది 
యుద్ధమంటూ మొదలైతే 
కలరా అయినా కరోనా ఐనా తోకముడవాల్సిందే 
భౌతిక దూరాన్ని ఆయుధం చేసుకొని 
లాక్‌డౌన్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చుకొని 
మనుషులమంతా ఎవరికివారై 
మనసులుగా ఒక్కటై సాగించే సమరం 
సమయం లేదు మిత్రమా 
కరోనా వైరస్‌ను ఖతం చేయాలంటే 
ఒక్కటే మంత్రం అదే మన యుద్ధతంత్రం 
చేతులు కలిస్తే కరోనా చేతులు జోడిస్తే కుచ్‌ నై కరోనా
- మధుకర్‌ వైద్యుల, హైదరాబాదు, 80966 77409


ప్రోత్సాహక బహుమతి (5)
సమర పిడికిలి    
ప్రతిరోజూ కొత్త వేకువే 
ప్రతి వేకువా కొత్త పాఠమే 
అనుభవాలతో జీవితాలు వెలగాలిగానీ 
అసహనంతో బతుకులు తెల్లారిపోకూడదు 
సంకల్పంతో బిగుసుకున్న పిడికిళ్లు
ఎన్నెన్నో మైలురాళ్లను దాటించిన ఘన చరిత్రలు మనకున్నాయ్‌ 
ఇప్పుడు వేలికి వేలు విడదీసి 
స్వచ్ఛమైన ఆశయంతో బిగించికట్టి 
పరిశుభ్ర భారతాన్ని ఆవిష్కరించాల్సిన 
సమయం ఆసన్నమైంది 
విదేశీ పాలన కొత్తకానపుడు 
పరపీడన పరాయణత్వం తప్పని పరీక్షైనపుడు 
ఎదిరించే తెగువే నిరంతర సాధన 
కురుక్షేత్ర రణరంగమైనా కరోనా విజృంభణైనా 
ఆత్మవిశ్వాసమే నిరోధకశక్తైతే 
మానవాళి తలవంచే ప్రసక్తే లేదు 
తరతరాల మనుగడకు అంతమే రాదు 
అంతరం ప్రేమను పెంచుతుంది 
దూరం మనసుల్ని సంఘటితం చేస్తుంది 
కనిపించని మహమ్మారి అంతర్థానమౌతుంది 
సమాజాల ఔన్నత్యం జాగృతమై విస్తరిస్తుంది 
ముడుచుకున్న కాళ్లే ఉక్కుపాదాలై 
కడుగుతున్న చేతులే కర్కశహస్తాలై 
నిర్మించుకున్న ఖైదే నవ జీవనవేదమై 
పుడమి మళ్లీ పచ్చగా పురుడు పోసుకుంటుంది 
విజయఢంకా మోగిస్తూ కనులువిప్పి నవ్వుతుంది 
- డేగల అనితాసూరి, హైదరాబాదు, 92475 00819


 


వెనక్కి ...

మీ అభిప్రాయం