కరోనాపై కదనం -  ఏప్రిల్‌, 2 ఫలితాలు

  • 4224 Views
  • 59Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి 
మనిషిని నేను
విశ్వం నాకోసమే విస్తరించి ఉందని, 
పుడమి నా కోసమే పుట్టిందని 
సమస్త జీవరాశులూ నా బానిసలని 
నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను
అవనిని అమ్మంటాను నేను. 
ఆదిత్యుణ్ని నాన్నంటాను నేను 
నడక వచ్చేదాకే అణిగిమణిగి ఉంటాను 
నేను ఎగిరితే మేఘం అడ్డురాకూడదన్నాను. 
అడుగేస్తే అడవి దారి విడవాలన్నాను. 
పడవెక్కితే అలలు తలొంచాలన్నాను.
అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను 
సాగరగర్భంలో చమురుందని చిలికేశాను 
మరి రేపటికో అంటే, నేనుండనుగా అని నవ్వేశాను 
నేల మీద గీతలు గీసి నీదీ నాదని పంచేసుకున్నాను 
నా ముందూ నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను 
నేనే రాజునన్నాను తక్కినదంతా నా రాజ్యమన్నాను 
నా కొట్లాటలు చరిత్రన్నాను, రుజువు కోసం రాళ్లు పాతాను
నేను చెప్పినట్టు నడిచే, 
నేను చెక్కినట్టు కనిపించే 
నాలాగే ఉండే దేవుణ్ని సృష్టించుకున్నాను 
నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను 
ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను
దాన్ని చంపి దీన్ని చంపి కూరొండుకు తిన్నాను 
వింతరోగమంటించుకుని ఊరంతా యేగాను 
గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను, గుమ్మం దాటనన్నాను
నే స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా 
నా స్వగతం వినబడకపోతే ఆమని పాటాపిందా 
నే చతికిలపడగానే భూభ్రమణమాగిందా 
నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా
రాజు కాదు బూజు కాదు, కిరాయికి నేనుంటున్నాను 
బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను 
నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను 
బుద్ధేదో వచ్చినట్టు వినయమొలకబోశాను
మందో మాకో దొరకంగానే మళ్లీ గద్దెనెక్కుతాను 
ఒళ్లు చక్కబడంగానే నువ్వెంతని అంటాను 
నాకేదీ సాటిరాదంటూ మళ్లీ మొదటికొస్తాను
మనిషిని నేను మాయదారి మనిషిని నేను...
- తంగెళ్ల రాజగోపాల్, అమలాపురం, 86395 36092

ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి 
అసుంట జరుగున్రి
జనాలల్ల భయం సొచ్చినట్టె సొచ్చి పరాశికమాడుతాంది. 
ఇల్లంటే స్వర్గమే. 
ఐనా కాలుబైటబెట్టకుంటె పానం గాయిగాయి అయితది. 
నట్టడివిల సిమ్మసీకట్ల చిక్కుకున్నట్టు అయేపాయే అనిపిత్తది. 
నిమ్మలంగ నట్టింట్ల కూసోని 
ఇంటిల్లురాజులు ఒగల మొకం ఒగలు సూసుకుంట 
నీడపట్టునుండమంటె బేజారు బేజారైతది. 
బొందిలపానం పోకుంటె 
బంతాకో బలుసాకో తిని బత్కొచ్చని 
నయానో భయానో నచ్చజెప్పితె తల్కాయకెక్కదు. 
పుర్రెకో బుద్ధి. 
లోపల పురుగు తిరుగుతాంటె 
సంగడబింగడని కాల్జేతులు ఒక్కకాడ సక్కగుండయి. 
ముట్టుకుంటె అంటుకునే రోగమని 
ఎంతగనం సగజెప్పినా ఇనిపిచ్చుకోం. 
పెయి కాయగాశిన దెబ్బలమొండుకు 
మాటల్తోటి ఏం ఆన్తది. 
కావలిచ్చుకున్నట్టె మీదపడ్తాంటె 
కరోనా మాత్రం ఖాయిసు పడదా! 
కారటేశి కాటికి మతలబు పంపిత్తాంటె 
సుత కారెడ్డమనిపిత్తె ఏం జేత్తం? 
పోతేపోనీ.. ఎవల పాపాన వాళ్లే పోతరనుకునేటట్టు లేదాయె! 
పోతా పోతా జాతరబోయినట్టు సాయిత తోడ్కపోబట్టే.. 
అసుంట జరుగుమంటె 
అంటరానితనమనుకుని గుర్రున సూడకున్రి బాంచెన్‌. 
కట్టకాలమొచ్చినప్పుడే మనుషులు పురాగ సమజైతరు. 
ఏది ఏమైనా దీరగుండాలె. 
అయినోల్లు దూరంగున్నరని 
బీరిపోయి కూసోని రంది పడకున్రి. 
గీయింత ఎడబాటుకు పాశిపోయేటోల్లంగాదు. 
తురుంఖాన్‌ తాతముత్తాతలకే జడ్వనోల్లం. 
గిదెంత.. దీని బతుకెంత? 
అంటకుండ ముట్టకుండ సావగొడుదం. 
జర అసుంట జరుగున్రి.
- బండారి రాజ్‌ కుమార్, పాతమగ్ధుంపురం, వరంగల్‌ రూరల్, 89195 56560

ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి 
స్వీయ నిర్బంధం    
స్వీయ నిర్బంధం సాక్షిగా... 
మా ఇల్లొక అంటుమామిడి తోటలా మారిపోయింది 
అనుభూతుల పూతలేవో 
గుండె గోడల్ని ఆర్ద్రంగా తడుముతున్నాయి 
రోజూ చూసే ఉషోదయమే కొత్తగా కనబడి 
బండబారిన మనసులోకి కొత్త కాంతిని నింపుతోంది 
పిల్లలిద్దరూ రెండు చెవుల పిల్లులై 
కోల్పోయిన ఆనందాన్ని కళ్లముందు నిలుపుతున్నారు 
రెండు పెదాల మధ్యనున్న పొగలు కక్కే కాఫీ 
జీవితాన్ని సరికొత్తగా నిర్వచిస్తోంది 
ఇన్నాళ్లూ ఏ మూలో దాచిన అనురాగాల మాలికలేవో 
గట్టుతెగిన గోదారిలా ఇంటినిండా ప్రవహిస్తున్నాయి 
అరుపులతో కేకలతో దద్దరిల్లిన ఇల్లిప్పుడు 
ఆత్మీయతల గోపురంలా మారిపోయింది 
ఒకరికి ఒకరుగా ఆప్యాయతల చిగురుగా 
బంధం కొత్త వేర్లను భూమిలోకి నాటుతోంది 
పిచ్చిపట్టినట్లుగా ఇల్లంతా తిరుగుతున్నాను 
ఇంటిచుట్టూ విరబూసిన పూలతావి పరిమళాన్ని 
తనివితీరా ఆస్వాదిస్తున్నాను 
ఇన్నాళ్లూ యాంత్రికంగా ఎందుకున్నానని 
నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను 
ఇప్పుడు నాకే తెలియని 
కొత్త లోకంలోకి అడుగుపెడుతున్నాను 
పగిలిన బంధాలను 
కలిపి కుట్టాలని ఆశపడుతున్నాను 
స్వీయనిర్బంధం సాక్షిగా 
మా ఇల్లు 
అసలు సిసలు బంధానికి అర్థంలా మారిపోయింది 
అనునిత్యం వెంటనడిచే ఆత్మబంధువులా ఉరకలేస్తోంది.
- డా।। జడా సుబ్బారావు, నూజివీడు, కృష్ణా జిల్లా, 98490 31587
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
సంకల్పం    
దేశాల సరిహద్దులు చెదిరిపోయాయి 
మనం గీసుకున్న గీతలేవీ 
మనల్ని వేరుచేయలేక పోయాయి 
నిజమే 
ప్రపంచం కుగ్రామమంటే
నమ్మలేదు నేను
మన భవిష్యత్తిప్పుడు
సమస్యే కాదు
ఈ గండం గడవడమే ముఖ్యం 
గత యుద్ధాలన్నీ ప్రపంచాన్ని రెండుగా చీల్చి
ఒక వేడుక చూసినవే.. 
కరోనానే కాస్త నయం 
అన్ని దేశాలను కలుపుకుపోతోంది. 
ఎవరికి వారు విడివడి 
ఇప్పుడు చేయాల్సింది సమైక్య పోరాటం.. 
గెలవాలంటే సంకల్పం 
స్థిరంగా బలంగా ఉండాలంతే. 
నిన్ను నువ్వు నిర్భంధించుకుంటే.. 
కరోనాని దిగ్బంధించినట్టే 
- టి.కృష్ణాచారి, గుండ్లగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా, 99594 04989


ప్రోత్సాహక బహుమతి (2)
శోకనది    
మనిషి మనిషి కలుసుకోలేని చోట 
మనసు మనసు మాట్లాడుకోలేని చోట 
మౌనం రాజ్యమేలే చోట 
ఇప్పుడు మనిషి గురించి మాట్లాడుకుందాం 
కాలం కన్నా ముందు పరిగెత్తే కరోనా వైరస్‌ 
ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది 
ఆ వైరస్‌ ముందు మనిషి ఎందుకు బతికున్నాడని 
జనం తలలు పట్టుకుంటున్నారు 
కంటికి కనబడదు ముట్టుకుంటే అంటుకుంటుంది 
గుండెలో శోకనదులు మోస్తూ ఘడియ ఘడియకి 
దేహాన్ని తడిమి చూసుకుంటూ కళ్లు మూతలు పడుతున్నా 
కలత నిద్రలో కంటిరెప్పలు కాపలా పెడుతూ 
శూన్యపు రెక్కలు తొడుక్కుని 
గది నిండా జ్ఞాపకాల శకలాలు పరచి 
వాటి చుట్టూ మనసుని కప్పేసి 
మౌన మునిలా కాలానికి బందీయై 
మనిషిది ఇప్పుడొక అనిశ్చిత స్థితి 
కంటిముందు అందరూ ఉన్నా 
ఏక్షణం ఏవార్త వినాలో తెలీక 
దుఃఖాన్ని గుప్పిట్లో పెట్టుకుని 
గుండె చివర ఆగిపోయే 
శ్వాసచుట్టూ తిరుగుతున్నాం 
ఆశలన్నీ కొట్టుకుపోయి 
పైప్రాణాలు పైనే ఉన్నాయి 
చూపులన్నీ నేల మీదే ఉంచి 
అన్నీ వదిలేసిన అస్త్రసన్యాసివి 
నువ్వెవరో తెలియని చోట 
నీలో నిన్ను వెతుక్కోవాలి 
దేశం ఇప్పుడు ఒక దుఃఖసముద్రం 
ప్రతి మనిషి ఓ శోక నది 
కోట్లాది మానవదేహాలు భయంతో తల్లడిల్లుతున్నాయి 
అయినా మనిషి సంకల్పం ముందు ఈ కరోనా ఎంత 
బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన 
అల్లూరి పుట్టిన నేల ఇది 
ఒక మహమ్మారికి భయపడే నేల కాదిది 
స్వీయనియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ 
కరోనా కోరలు పీకేద్దాం 
మనకోసం చావు పక్కన పెట్టి ప్రాణంపోస్తున్న డాక్టర్లు 
మన రక్షణకోసం అహోరాత్రాలు గస్తీ కాస్తున్న పోలీసులు 
తమ దేహాలను వీధులకు అంకితం చేసిన పారిశుధ్య కార్మికులు 
వాళ్ల ముందు మనమెంత 
వాళ్లను చూసైనా ధైర్యంగా బతుకుదాం 
నలుగురికోసం బతుకుదాం.. 
దేశం కోసం బతుకుదాం 
బతుకంటే ఏమిటో తెలిపేందుకు బతుకుదాం     
- చొక్కర తాతారావు, విశాఖపట్నం, 63011 92215


ప్రోత్సాహక బహుమతి (3)
రండి కరోనాని కట్టడి చేద్దాం ఇలా...    
ఎందుకో! అంత దిగులు 
అంతేలే, ప్రతిరోజూ పనిచేసే నీవు 
ఆఫీసు బాయ్‌ అన్నా! అన్న పిలుపు లేదని 
కొలీగ్స్‌ నమస్కారాలు లేవని 
దైవంగా భావించే పనిలేదని
దిగులుగా ఉన్నవ్‌ అంతేనా? 
అదికాక ఇంకేమి ఉంటుందిలే 
నేస్తమా! రోజూ పులిసిన దేహనికి అలసిన మనసుకి 
ప్రేమతో నీ ఇంట్లోనే ఆహ్వానాలు పలుకుతున్నయి 
నువ్వు మరిచిపోయిన గురుతులు
నీ ఇల్లాలితో వంట గదిలో గరిటె తిప్పుతూ 
తన చెవిలో గుసగుసలు పోయిన ఊసులు
అటకపైన మొదటిసారి రాసిన ప్రేమలేఖ 
నన్ను మరిచావని బుంగమూతి పెడుతుంది 
ఇనుప పెట్టెలో పెట్టిన పెద్దోడి చిన్నోడి ఫొటోలు 
ఆప్యాయంగా హత్తుకుంటే మురిసిపోతమంటున్నయి
పదోతరగతిలో చదివిన వివేకానంద సూక్తుల పుస్తకం
మొదటిసారి చెడుగుడు ఆటలో నువ్వు గెలిచిన బహుమతి 
నీ పిలుపు కోసమే కలవరిస్తున్నయి 
నీ ఇంట్లో ప్రతి వస్తువు నీతో మాట్లాడుతూనే ఉంటుంది
కొన్నిసార్లు వాటిని ఆస్వాదించడం బాగుంటుంది 
ప్రేమించడం ఇంకా బాగుంటుంది
మానసిక ధైర్యం కోల్పోయి నిరాశ పడకుండా
నువ్వు మరచిపోయిన చిత్రలేఖనం, పుస్తక పఠనం
ఉత్తరాలు రాసుకునే కళ మళ్లీ మొదలుపెట్టు
అవి ఇంకా అప్పటి పరిమళాల్ని గుబాళిస్తూనే ఉన్నయి
సమూహంతో మహమ్మారిని వ్యాపించేలా చేసే కన్నా
ఒంటరిగా యుద్ధం చేయి 
కరోనాని కట్టడి చెయ్యాలి మరి!
- యడవల్లి శైలజ, ఖమ్మం, 93941 71299


ప్రోత్సాహక బహుమతి (4)
స్వీయ నిర్బంధం (ఒక స్త్రీ ఆత్మగీతం)
ఎలా ఉన్నావు? ఒంటరిగా? 
ప్రశ్నల బాణాలు ఎందరివో! 
చిరునవ్వుతో నేను! 
పనికొస్తానేమోనని 
పరిచయం పెంచుకొనే మనుషులకు 
పనికిరాననుకోగానే 
పారిపోయే మనుషులకు దూరంగా! 
మొహమాటపు పలకరింపులకు 
అతికించుకున్న నవ్వులకు 
ముసుగు తీయని మనసులకు దూరంగా! 
ఇన్నాళ్లకు నేనుగా నేను! 
ఇప్పుడు నేను కుక్కర్‌ విజిల్‌లోనే 
సంగీతాన్ని వినడం లేదు 
అసలైన సంగీతాన్ని వింటున్నాను 
అన్నమయ్య ఆర్తిని రామదాసు భక్తిని 
లత గానమాధుర్యాన్ని ముఖేష్‌ గొంతులోని 
విషాదాన్ని ఇప్పుడు కదా! నిజంగా ఆస్వాదిస్తున్నాను 
ఇంటి నిగనిగల మురిపెంలో 
మత్తుగా నిదురపోయిన మనసును 
ఇప్పుడే కదా! నిద్ర లేపాను 
రవీంద్రుని గీతాంజలి రమ్యతకు 
కృష్ణశాస్త్రి గీతాల భావుకతకు 
నిసర్గ ప్రకృతి సౌందర్యానికి 
పరవశిస్తున్నాను నిజంగా ఇప్పుడే! 
ముందెన్నడు ఎరుగని లోకాలను 
చుట్టి మెరుగుపడిన మనసు మెరుపులను 
చూసి మురిసిపోతున్నాను ఈ రోజే! 
దేహాన్ని దేహళి దాటనివ్వకుండా చేసే పోరాటంలో 
నన్ను నేను ప్రేమించుకుంటూ 
నాలోకి నేను ప్రవహించుకుంటూ 
సరికొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకుంటూ 
కనిపించే కఠిన శిలల మీద కంటే 
కనిపించని కరోనా మీద పోరాటం 
సులువని ప్రపంచానికి చాటుతూ 
ఒంటరిగా! చిరునవ్వుతో నేను!    
- నల్లపనేని విజయలక్ష్మి, గుంటూరు, 97016 67350


ప్రోత్సాహక బహుమతి (5)
మనిషనేవాడొకడున్నాడని    
ఇప్పుడేమైందని ఇలా వణుకుతున్నావ్‌ 
ఇంతకు ముందు నీవల్ల ఏం కాలేదని భయపడుతున్నావ్‌ 
చందమామ నిన్ను చూసి నవ్విందని 
అరచేత పట్టుకుని ఆడుకోలేదా 
గిరిశిఖరాలు గిరగిర తిరిగి నీ కాళ్లను ముద్దాడలేదా 
ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో ఎన్ని చూసుంటావు 
నాలుగడుగుల దూరానికి నలుదిక్కులు చూస్తావెందుకు 
ప్లేగు డొక్కచించి పేగులు మెడలో వేసుకున్న 
చార్మినార్‌ బురుజుల్ని అడుగు నువ్వేంటో నీకు చెబుతాయి 
మశూచి కళ్లు పీకి భుజంపై మొలిపించుకున్న టీకాలనడుగు 
నీ విజయాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి
గడియారమ్ముళ్ల అలికిడికి గాలి భయపడుతుందా..?! 
కరెంటుపోయిందని కంగారుపడి కాలం ఆగిపోతుందా..!? 
కరోనా అయినా మరే మరోనా అయినా 
దానికీ తెలుసు మిత్రమా 
ఆత్మస్థైర్యం ఆయుధం పట్టుకుని 
మనిషనేవాడొకడున్నాడనీ 
దానికి మరణశాసనం రాయగలిగేది వాడేననీ!
- బంగార్రాజు కంఠ, విజయవాడ, 85003 50464


 


వెనక్కి ...

మీ అభిప్రాయం