అమ్మభాషే ఆలంబన

  • 236 Views
  • 2Likes
  • Like
  • Article Share

‘‘యామ్‌ ఫియర్‌ ఎ చైల్లియస్‌ ఎ చనైన్‌ కైల్లిద్‌ ఇ ఎ షావుఘై’’.. ‘సొంత భాషను తద్వారా సొంత ప్రపంచాన్ని కోల్పోయిన వ్యక్తి అతను’ అని అర్థం ఈ స్కాటిష్‌ సూక్తికి! ‘‘మాతృభాషను ప్రేమించని వాడు జంతువు కంటే హీనం. భాషను మనం సంరక్షించుకుంటే... అది మన స్వేచ్ఛను కాపాడుతుంది’’ అన్నది ఫిలిప్పీన్స్‌ జాతీయోద్యమ నేత జోస్‌ రిజాల్‌ మాట. ఇలాంటి మంచి మాటలను ఆలకించేవారు తక్కువ. అందుకే.. యునెస్కో అధ్యయనం ప్రకారం.. ఈ ప్రపంచం నుంచి ప్రతి రెండు వారాలకూ ఓ భాష అంతర్థానమైపోతోంది. ‘అయితే ఏంటి? ఇతరులతో మాట్లాడటానికి ఉపయోగపడేదే భాష... ఒకవేళ అది అంతరిస్తే మరో భాషలో మాట్లాడుకుంటాం... దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిందేముంది’ అనేవాళ్లు తెలుగునాట పెరుగుతున్నారు. ఈ ఆలోచన తప్పని యునెస్కో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కొయిచిరో మత్సుర విస్పష్టంగా చెబుతారు. ‘‘ఒక భాష మరణం ఆ జాతి సాంస్కృతిక వారసత్వానికి చెందిన అనేక రూపాలను అదృశ్యం చేస్తుంది. ముఖ్యంగా వెలకట్టలేని ఆచార వ్యవహారాలను; సామెతలు, చమత్కారాల రూపంలో ఉండే ఆ జాతి మౌఖిక భావ వ్యక్తీకరణలను! ఆ జాతి నివాసిత ప్రాంతాలకు సంబంధించిన పర్యావరణ సమాచారం ఆ భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఏ భాష అంతరించినా మానవ మేధలో కొంత భాగం అంతర్ధానమైనట్లే’’నని అంటారాయన. 
      అతికీలకమైన తొమ్మిది ప్రమాణాల ఆధారంగా భాషలకు ఎదురవుతున్న ప్రమాదాలను యునెస్కో గుర్తిస్తోంది. ‘ఆ భాష మాట్లాడే ప్రజల సంఖ్య; మొత్తం ప్రాంత జనాభాలో ఆ భాషీయుల సంఖ్య; అక్షరాస్యత, మాతృభాషా మాధ్యమంలో చదువు, భాషను నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న వనరులు; పత్రికలు, ప్రసారమాధ్యమాలు, అంతర్జాలాల్లో ఆ భాష వినియోగం; మౌఖిక, లిఖిత సాహిత్యాలను పరిరక్షిస్తున్న విధానం, నిఘంటువుల నిర్మాణం, ఉచ్ఛరణ విధానాలను నమోదు చేసే పద్ధతులు - వీటిలో నాణ్యత; ప్రభుత్వ, వ్యవస్థాపరమైన భాషా విధానాలు, అధికార భాషగా గుర్తింపు, అది అమలవుతున్న తీరు; భాషా వినియోగంలో వచ్చే మార్పులు; సొంతభాషపై జాతిజనుల అభిప్రాయం, మాతృభాషపై ఆ జాతి చూపించే గౌరవం; ఒక తరం నుంచి మరో తరానికి భాష అందుతున్న తీరు’.. ఇవీ ఆ ప్రమాణాలు. వీటిలో 1, 2, 4 ప్రమాణాల్లో తప్ప మిగిలిన అన్నింట్లో తెలుగు వెనకబడే ఉంది. ముఖ్యంగా మాతృభాషా మాధ్యమంలో చదువు విషయంలో పూర్తిగా పక్కకి తొలగిపోతోంది. అమ్మభాషలో చదువుకోకపోతే నష్టమేంటని ప్రశ్నించే వితండ వాదనలూ ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ, బోధన మాధ్యమంగా ఉన్న పర భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడానికే చిన్నారులకు ఎక్కువ సమయం పడుతుంది. తరగతి గదిలో వాడే భాషను అర్థం చేసుకోలేని పిల్లలు... తాము ఏం నేర్చుకున్నామో తిరిగి చెప్పలేరు. ప్రశ్నలు వేయడం లాంటి విద్యార్జన కార్యకలాపాల్లో భాగస్వాములు కాలేరు. వర్ణన, వివరణ, విశ్లేషణ, ఆలోచనా సామర్థ్యాలను ఒంటబట్టించుకోలేరు. స్వీడన్‌లోని స్టాక్‌హోం విశ్వవిద్యాలయ ఆచార్యులు కరోల్‌ బెన్సన్‌ ఈ సంగతే  చెబుతూ...‘అమ్మభాషా మాధ్యమంలోని విద్యార్థులు పాఠాన్ని చదవగలరు. బట్టీ కొట్టగలరు. కానీ, దాన్ని సొంతగా అర్థం చేసుకోలేరు. ఉపాధ్యాయులు చెబితే తప్ప వారికి విషయం బుర్రకెక్కదు. అదే బోధనా మాధ్యమంగా మాతృభాషను వాడితే అర్థాన్ని ఊహించుకుంటూ చదువుతారు. నేర్చుకునే క్రమంలో ఇదే కీలకం’’ అంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం