పెళ్లెందుకు దండగ? ప్రేమించుకుంటే పండగ

  • 665 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

పెళ్లి పెళ్లి అని కుర్రకారు అంతా ఎందుకు అంత వెర్రిగా కలవరిస్తుంటారు? కల.. వరిస్తుంటారు. దాని కోసం ఎందుకంత తాపత్రయం? దానికి బదులుగా ప్రేమిస్తూ, ప్రేమిస్తూ ఉంటే ఎంచక్కగా ఏండ్లూ పూండ్లు గడిపేయవచ్చు. పెళ్లిచేసుకుని ఖాళీ అయ్యే బదులు ఇష్టమైన వాళ్లను, ఇష్టం లేనివాళ్లనూ ‘పడేసి’ ప్రేమగీతాలు ఆలపించవచ్చు. పెళ్లినీ, ప్రేమనీ బేరీజు వేస్తేసరి... కేవలం ప్రేమించడం వల్ల ఎన్ని లాభాలో ‘తాట’తెల్లం అవుతాయి. అవి ఎంతో వీనుల విందుగా, కన్నులకు పసందుగా ఉంటాయి!
      ముందు పెళ్లి సంగతే చూద్దాం.
కులగోత్రాలు మంచివా.. కానేకావు.
శాఖాతత్వం మంచిదా.. కానేకాదు.
మతతత్వం మంచిదా.. కానే కాదు.
కట్నకానుకలు నైతికంగా మంచివా.. కావు.
      కొన్నిసార్లు ప్రాంతీయ తత్వమూ ఉంటుంది. ఇదీ మంచిది కానే కాదుగా... నాడూ నేడూ ఇలాంటివి నవనాడుల్లో నిండిపోయాయి. పైగా ఈడుజోడు కుదరాలి. పెళ్లి చేసేది ఇవన్నీ చూసేగా. అలాంటప్పుడు వివాహం మంచిది ఎలా అవుతుంది?
      ‘‘వివాహం విద్యనాశాయ, సర్వనాశాయ శోభనం’’ అని కూడా పెద్దలు ఏనాడో చెప్పారు. అన్నీ తెలిసి కూడా పెళ్లిచేసుకో, పెళ్లిచేసుకో అని పిల్లల గొంతు మీద కూర్చొని పెద్దలు పెళ్లిళ్లు చేసుకొమ్మనడం ఎంత తప్పు! పెళ్లి అంటే స్వార్థం. పెళ్లి అంటే లంపటం. ‘పెళ్లంటే ఒక పీడకల’ అనే సినిమా పాట కూడా ఉంది. పెళ్లంటే పిల్లలు, కుటుంబం, బాదర బందీతో ఎగబాకడానికి మనిషి దిగజారిపోవడం. దానికోసమే పెళ్లి అవసరం. 
      పెళ్లికి తడిసి మోపెడయ్యేంత ఖర్చు! శుభలేఖలు వేయడం మొదలు కల్యాణ మంటపం ఖర్చుల వరకు అన్నీ ‘అంబపలుకు జగదంబ పలుకు’ అనిపించాలి. పెళ్లి అనేది పెద్దలతో ‘జేబులు ఖాళీ ఆయెనే... సర్వమంగళం పాడెనే’ అనిపిస్తుంది! ఇల్లు గుల్ల చేసుకుని పెళ్లిళ్లు చేస్తే కొన్నాళ్లకు పెటాకులు అయ్యేవి అందులో కొన్ని. ఇందువల్ల పచ్చని కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు.. పంతాలు, పట్టింపులు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయడం అవసరమా?
      ప్రేమ సంగతే చూడండి... ‘ఎంత హాయి ఈ రేయి’ అని ప్రతిరేయి గుండెల మీద చేయివేసుకుని మరీ పాడుకోవచ్చు. పెళ్లిలాగా ఈడూజోడూ కుదరనవసరం లేదు. కాటికి కాలు జాపిన 90 ఏళ్ల ముత్తాతగారు 85 ఏళ్ల ఏ పడుచుపిల్లనో ‘ఫస్ట్‌సైట్‌’లోనే ప్రేమించేసి ‘కాట్‌’కి కాలుచా పవచ్చు. కులుకుడు ప్రాయం, వణుకుడు ప్రాయం అర్థం కానే కావు. వయసుతో పని ఏముంది? మనసులోనే అంతా ఉంది అన్నది పెళ్లికి అవసరం కానీ ప్రేమకు అవసరం లేదని ‘విందు’మూ లముగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఏ కులం వాళ్లనైనా ప్రేమించొచ్చు. ఫలానా కులంవాళ్లనే, అందులోనూ ఫలానా ఫలానా తెగ వాళ్లనే, ఫలానా మతం వాళ్నే ప్రేమించాలి అనే సమస్యే ఉండదు.
      ప్రేమికులకు భార్యాభర్తల్లా కలిసి ఉండాల్సిన కర్మకూడా లేదు. ఇద్దరూ ఒక కప్పు కింద ఉండాల్సిన దుస్థితీ లేదు. ఫేసుబుక్కులు, ట్విట్టర్లు ఎన్నో ఉన్నాయి.. కలిసిమెలిసి ‘అనుభూతులు’ పంచుకోవ డానికి! కట్నకానుకలు అక్కరలేదు.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ ఉంటేచాలు. కల్యాణ మంటపాలు అక్కర్లేదు.. ఏ పార్కు అయినా ‘కల్యాణ మంటపమే’.. ఏ సినిమాహాలు అయినా ప్రేమవేదికే. ఏ హోటల్‌ అయినా ప్రేమ స్థావరమే. గొంతు సవరించి డ్యూయెట్లు పాడుకోవచ్చు. ఒకరికొకరు సినిమా చూపించుకోవచ్చు. కలసి ఉండటానికి ఓ ఇల్లు కూడా అక్కర్లేదు. ఎవరి ఇంట్లో వారు ఉండవచ్చు. గ్యాస్‌ స్టౌ కూడా అక్కర్లేదు. ‘గ్యాస్‌’ ఉంటే చాలు.
      ప్రేమకు పరిమితులు లేవు. పెళ్లికి లాగా ‘ఏకపత్నీవ్రతం’ లాంటి ‘సైనికనిర్బంధాలు’ లేవు. ఎవరు ఎంతమందినైనా ప్రేమించవచ్చు. ప్రేమించబడవచ్చు. సంతానం సమస్యే ఉండదు. ప్రాక్టికల్‌గా సన్యాస జీవితాన్ని అనుభవించవచ్చు. మేరేజీ మాదిరిగా రోజూ క్యారేజీ అవసరమేలేదు. ఒట్టి చేతులు ఊపుకుంటూ ఉండొచ్చు. పెళ్లిచేసుకునే వాళ్లది మామూలు కుటుంబమైతే, ప్రేమికులది వసుధైక కుటుంబం. పెళ్లి సంకుచితమైతే ప్రేమ సార్వత్రికం, సార్వజనీనకం.
      ‘ఆ రాణీ ప్రేమ పురాణం...’ అంటూ వరుసబెట్టి ‘ఇది కాదోయ్‌ చరితకర్ధం’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ప్రేమ గురించి ఎవరినైనా ఆరా తీస్తే ‘చెప్పింది విను.. చరిత్ర అడక్కు’ అని ఎంచక్కా చీదరించుకుంటారు. పెళ్లి బంధం వల్ల ఫాదర్‌ ఇన్‌లా, మదర్‌ ఇన్‌లా, బ్రదర్‌ ఇన్‌లా, సిస్టర్‌ ఇన్‌లా, సన్‌ ఇన్‌లా అని అ‘లా’ ఇ‘లా’ చెబుతారు. ప్రేమికులు ఎ‘లా’ అయినా చెప్పుకోవచ్చు. ఏ ‘లా’ వచ్చి అడ్డం పడదు. ఎవరినీ గడ్డం పట్టుకుని బతిమలాడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే పండగలప్పుడు అత్తగారింటికి వెళ్లి, వాళ్లను ఇబ్బంది పెట్టాల్సివస్తుంది. ప్రేమించుకుంటే ప్రతి రోజూ పండగే.
      పెళ్లికి రిజిస్ట్రేషన్లు అవసరం కానీ ప్రేమకు ఆ అవసరమే లేదు. ఎవరెవరు ఎప్పటి వరకు ప్రేమించుకున్నారో తారీఖులు, దస్తావేజులు, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లు గట్రా ఏవీ ఉండవు. ప్రైవసీకి, ప్రైవశీకరణకు ఇంతకన్నా మంచి మార్గం ఏముంటుంది.
      ‘వ్యక్తుల ప్రైవేట్‌ బతుకు వారి వారి సొంతం’ అన్నదీ శ్రీశ్రీనే. ప్రేమ ప్రైవేట్‌ అయితే పెళ్లి పబ్లిక్‌. అయితే ఈ ప్రపంచం మిశ్రమ ‘హార్దిక’ వ్యవస్థ. పెళ్లికి ముందు ‘ప్రేమ వ్యవహారాలు’ ఉన్నాయేమోనని వివాహితులు అనుమానపడుతుంటారు. సాక్షుల కోసం చూస్తుంటారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, పరోక్ష సాక్ష్యాలు ఏవి దొరికినా కొంప కొల్లేరే! ఎంత సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నా, సామాన్లు సర్దుకుని వెళ్లిపోతారు. పెళ్లికి ఇలాంటి సమస్యలు ఉంటాయి గానీ ప్రేమకు ఢోకా లేదు. ‘ఢోకా’ ఉన్నా ఇబ్బందేమీ లేదు.
      పెళ్లి శతవిధాలు. ప్రేమ మాత్రం ఒకటే విధం. పెళ్లి తంతు విషయంలో ఒక మతానికి ఇంకో మతానికి తేడాలు ఉంటాయి. ఒకో కులానికి ఇంకో కులానికి తేడాలు ఉంటాయి. తెగల తేడాలు, ప్రాంతాలను బట్టి తేడాలు కాలాన్నిబట్టే ఉంటాయి. సర్వకాల, సర్వ‘అవస్థల్లో’ ప్రేమ చెక్కు చెదరదు. తెల్లవాడు మొదలుకొని తెలుగువాడి వరకు ప్రేమ వెలుగులో తేడా కనిపించదు. వాత్సాయన మహర్షి మొదలుకొని వాలంటైన్‌ మహానుభావుడి వరకూ ఇచ్చే ప్రేమ సందేశం ఒక్కటే.. ‘మనసులు కలిస్తే సరి! మైమరచిపోతే సిరి’ అన్నదే. అందుకే మన కవులు పుట్ల కొద్దీ ప్రేమకవిత్వం రాశారు కానీ, మచ్చుకు పది మందైనా పెళ్లికవిత్వం చెప్పలేదు. 
      ప్రేమికులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతారు.. లైలా మజ్నూ, సలీం అనార్కలీల మాదిరిగా! వివాహితులైతే పక్క వీధి వాళ్లకి తెలిసే అవకాశం లేదు. ప్రేమికుల్లో ఎంత తేడా వచ్చినా ‘నీకూ నేను లేను, నేనూ నీకు లేను’ అని పాడుకోవచ్చు. విడాకుల కోర్టుకూ ఎక్కాల్సిన అవసరమే లేదు. డబ్బు వృథా కాదు. సమయమూ వృథా కాదు. కాబట్టి పెళ్లి ఎందుకు దండగ: ప్రేమించుకుంటేనే పండగ!!


వెనక్కి ...

మీ అభిప్రాయం