సంభాషణకు జీవనాడి - భాషకు భావనాడి

  • 474 Views
  • 5Likes
  • Like
  • Article Share

    ఎలగందుల సత్యనారాయణ

  • తెలుగు అధ్యాపకులు ఎ. వి. కళాశాల
  • హైదరాబాదు
  • 9347225379
ఎలగందుల సత్యనారాయణ

సామెత మానవుని వివేకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజా వ్యవహారంలోకొచ్చిన తర్వాతనే నాణానికి విలువ హెచ్చినట్టుగా  జన బాహుళ్యంలోనే సామెత మనగలుగుతుంది. నేటి కాలంలో సామెతల ఉనికి ఎలాఉందీ! జానపదంలో ఇవి ఎంతవరకూ నిలిచి ఉన్నాయి! నేటి వ్యవహారంలో అవి పొందుతున్న మార్పులెలాంటివీ! అనే కీలకంశాలను ప్రాతిపదికలుగా చేసుకుని హైదరాబాదులోని ఏ.వి.ఆర్ట్స్, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల, యాద శంకర మెమోరియల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా రెండు రోజుల పాటూ జాతీయ సదస్సు నిర్వహించింది. ఫిబ్రవరి ఆరు, ఏడు తేదీలలో జరిగిన ఈ సదస్సుకు ఎ.వి.సి. ఫిజి సెంటర్‌ తెలుగుశాఖ, సహాయ ఆచార్యులు వై.సత్యనారాయణ సంచాలకులుగా వ్యవహరించారు. ప్రతీరోజూ రెండు సమావేశాలు చొప్పున ,నాల్గు సమావేశాలుగా పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలు సమర్పిస్తూ...సామెతలపై సమగ్ర సమాలోచన చేశారు
సామెత లేని మాట ఆమేత లేని ఇల్లు
‘తెలుగు సామెతలు- సమగ్ర సమాలోచన’ అనే అంశంపై సాగిన ఈ సదస్సుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి. రమణాచారి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘సామెత లేనిమాట ఆమేత(విందు భోజనం) లేని ఇల్లు లాంటిది. సంభాషిస్తూ సామెతలని ప్రస్తావించడమనేది ఒక కళ. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల సంభాషణల్లో సామెతలు దొర్లిపోయేవి. కులం కంటే గుణం మిన్న వంటి సామెతలు ఈ కాలానికి ఎంతో అవసరం. జలుబు చేస్తే ఏడు రోజులు ఉంటాది, మందు వేస్తే వారం రోజులు ఉంటాది ఇది జానపదులు తరచూవాడే సామెత. ఇలా వ్యవహారంలో సామెతలెన్నింటినో సందర్భానుసారంగా, ఆకర్షణీయంగా మాట్లాడవచ్చునన్నారు. ప్రతి సామెతలోనూ సందేశం ఉంటుంది. తరగతి గదిలో అధ్యాపకులు పాఠాలతో పాటు ఆయా సందర్భాలను దృష్టిలోపెట్టుకుని సామెతలు ప్రయోగించాలంటూ సామెత గొప్పతనాన్ని కొనియాడారు.
సదస్సు సంచాలకులు వై.సత్యనారాయణ మాట్లాడుతూ... భాషా సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం కోసం  సామెతలను ప్రయోగిస్తాం. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్లుగా అల్పాక్షరాలలో అనల్పార్థం సామెత లక్షణం. అడ్డగుడూరుకు పిల్ల నివ్వొద్దు, వర్ధమానుకోటకు ఎద్దును అమ్మోద్దు అనేవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారంలో ఉన్న సామెతల నేపథ్యాన్ని పరిచయం చేశారు.
సామెతపై తెలుగు పరిశోధన
ఏ.వి.కాలేజి, పి.జి. సెంటర్, తెలుగు శాఖ అధ్యక్షులు డా.కె.లక్మీ మాట్లాడుతూ.. ‘‘సామెతలను సంకలనం చేస్తూ భారతీయ భాషల్లో చాలా విలువైన గ్రంథాలు వెలువడ్డాయి. తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ తెలుగు సామెతలు, నేదునూరి గంగాధరం పసిడి పలుకులు, డా. జి.ఎస్‌. మోహన్‌ కన్నడ - తెలుగు సామెతలు చెప్పుకొదగిన గ్రంథాలు. కెప్టెన్‌ ఎం.డబ్ల్యు. కార్‌ 1868లో సంస్కృత లోకోక్తులు, ఆంధ్ర లోకోక్తి చంద్రిక వంటి సంకలన గ్రంథాలు వెలువడ్డాయి. చైతన్య ప్రసాద్‌ తెలంగాణ సామెతలు పేరిట ఒక పొత్తాన్ని తీసుకువచ్చారు. విశ్వవిద్యాలయాలలో సామెతలపై విశేష పరిశోధనలు జరిగాయి. కాని సామెతలపై ఎక్కడా సదస్సులు మాత్రం నిర్వహించలేదన్నారు.
తొలి సదస్సు ఇది!
 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ...  మంచన రాసిన కేయూరబాహు చరిత్రలో ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత ఉన్నట్టు తెలిపారు. తెలుగు భాష వ్యవహారంలోకి వచ్చినప్పుడే సామెతలు పుట్టాయనీ, సామెతలపై నిర్వహిస్తున్న మొట్ట
మొదటి సదస్సు ఇదేనన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సూర్య ధనంజయ్‌ మాట్లాడుతూ.. జాతి అస్తిత్వాన్ని నిలబెట్టేదే సంస్కృతి. అది సామెతలలో ప్రతిబింబిస్తుంది. సామెతలు సంప్రదాయాలను గుర్తు చేస్తాయి. మర్యాదలను మననం చేస్తాయి. ఆచార వ్యవహారాలను నిలబెడతాయి. మనసు మంచిగా ఉంటే పాత్రలోని నీరును గంగా జలంగా భావించవచ్చును అనే బంజార సంస్కృతిని ప్రతిబింబించే  సామెతలను ప్రస్తావించారు.
 హిందీ, మరాఠీ భాషలలో కూడా సామెతలున్నాయి. మాట మాటకూ సామెతను ప్రయోగిస్తే భాషా సౌందర్యం పెరుగుతుంది. భాష నిర్మాణం సామెతలపై ఆధారపడి ఉంటుంది. సామెతల్లో సరసం, విరసం, వెటకారం అనే మానసిక అవస్థలు కూడా ఉన్నాయన్నారు.
సదస్సు ప్రాయోజకులు యాదా శంకర మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, శ్రీ సంగిశెట్టి బాబు సదస్సు ముఖ్య లక్ష్యమేంటో తెలియచెప్తూ...తెలుగుభాషతో విద్యా పరంగా సంబంధం లేక పోయినా భాషపట్ల ఉన్న అభిమానంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలను విధిగా నిర్వహించాలనీ చెప్పారు.
నైతిక వర్తనకు నిలువుటద్దాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... సామీప్యత, సంక్షిప్తత వంటి మౌలిక లక్షణాలతో సూక్ష్మంలో మోక్షాన్ని కలిగించే అర్థవంతమైన పదబంధాలే సామెతలు. ఇవి నైతికతనూ, సామాజిక విలువలనూ పెంచుతాయి. నేడు తెలుగు ప్రాంతాల్లో వ్యవసాయ, గృహ సంబంధ సామెతలు అనేకం ప్రచారంలో ఉన్నాయన్నారు.
 ‘‘ఒక భాషలో జాతీయాలు.. పలుకుబడులు అనేవి వేరు వేరుగా ఉంటాయి. బావిలో నీళ్లు పడుట జాతీయం. బావి వేరు, నీళ్లు వేరు, పడుట వేరు. బావిలో నీళ్లు ఊరాయని దాని అర్థం. ‘నా వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉంది’ అని అన్నాననుకోండి. ఇందులో మూడు పూలు ఆరు కాయలు అనేది సామెత. ఇప్పుడు ‘మూడు గ్లాసులు ఆరు సీసాలుగా ఉంది’ అనే మాట ఒకటి జన వ్యవహారంలో వినిపిస్తోంది. సుత్తి మూల రూపం సూక్తి. సూక్తి ప్రకృతి, సుత్తి వికృతి. కాకి ముక్కు దొండ పండు కట్టినట్టు ఉంది, మసి గుడ్డలో మాణిక్యం కట్టినట్లు ఉంది అనేవి కూడా ఇటువంటివే. 
లయాత్మక అనేది సామెతకి ఉన్న మరో లక్షణం.. చక్కనమ్మ చిక్కినా అందమే! ఇలా మరికొన్ని ఉన్నాయి. అంతేకాదు సామెతల్లో మానవ జీవన చిత్రణ అంతర్లీనంగా ఉంటుందంటూ సామెతల వ్యాప్తి, ఉనికి గురించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.
సభాధ్యక్షులు, ఆంధ్ర విద్యాలయ విద్యాసంస్థల ఉపాధ్యక్షులు ఆచార్య కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘‘సామెతలు మనస్సుకు తాకేలాగా ఉంటాయి. తోచీ తోచనమ్మ తోడి కోడలి తల్లిగారింటికి పోయింది, జుట్టుకో బొట్టు నోటికో ఒట్టు వంటి సామెతలను ప్రస్తావించారు.
న్యాయాలూ సామెతలే!
మొదటి రోజు సమావేశానికి జానపద సాహిత్య పరిషత్‌ అధ్యక్షులు, డా.సి.వసుంధరారెడ్డి అధ్యక్షత వహించారు. సొమ్ము ఒకరిది సోకు ఒక్కరిది అన్నట్లుగా ఉందని చెప్తూ.. జానపద సాహిత్య పరిషత్‌ చేయవలసిన జాతీయ సదస్సును ఏ.వి.కళాశాల నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ‘‘సంస్కృత సామెతలు - తెలుగు ప్రభావం’’ అనే అంశంపై డా.పి.వారిజారాణి మాట్లాడుతూ సంస్కృతంలో న్యాయాలను కూడా సామెతలుగా వాడతారనీ, సంస్కృత శ్లోకాల్లోని వాక్యాలన్నీ సామెతలుగా వెలుగొందాయనీ, శిష్ట వ్యవహారంలోనూ అనేక సామెతలు ఉన్నాయనే సంగతిని ప్రస్తావించారు. డా.సాగి కమలాకర శర్మ. వ్యవసాయనికి సంబంధించిన వరదగూడు, ఇంద్రదనస్సు వంటి జనవ్యవహార సామెతలను స్మరణకి తెచ్చారు. అంతేకాకుండా శకునానికి సంబంధించినవీ, జ్యోతిష్య విషయాలని తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
సామెతలే ఆ పద్యపాదాలన్నీ..!
డా.ఎస్‌.రఘు ‘వేమన శతకం- సామెతలు’ అనే అంశంపై మాట్లాడారు. వేమన శతకంలోని మూడవ పాదం ఒక్కటే  సామెత కాదు. మిగిలిన మూడు పాదాలు కూడా సామెతలే అని సోదాహరణంగా వివరించారు. ‘సామెతలు- వస్తు వైవిధ్యం’ అనే అంశంపై డా.వెల్దండి శ్రీధర్‌ మాట్లాడుతూ సామెతలలోని వైవిధ్యాన్ని పలు రకాలుగా విభజించి వివరించారు. వక్తకూ శ్రోతకూ అనుసంధానంగా సామెతలు ఉన్నాయని చెప్తూ..అడిగినట్లు ఇస్తే కడిగినటు పోతాయి, అగ్గవ అమ్మనివ్వదు, పిరం కొననివ్వదు వంటి సామెతల సొగసుని తెలియజెప్పారు. భీంపల్లి శ్రీకాంత్‌ ‘సామెతలు- ప్రాదుర్భావ వికాసం’ గురించి మాట్లాడుతూ... మానవ జీవితానికి సంబంధించి ప్రతీ సందర్భంలోనూ సామెతలు అక్కరకొస్తాయి. సామెత అనే మాట వరాహపురాణంలో ఉందని పేర్కొన్నారు. సామెతలు జానపదుల నోళ్లలో నాని ప్రచారంలోకి వచ్చాయి. తేనె పూసిన కత్తి అనే సామెతని తీసుకుని ప్రతి వ్యక్తిలోనూ మాట ఒక రకంగా, చేత ఒక రకంగా ఉంటాయనే విషయాన్ని తేటపరిచారు. సామెతల్లో మానవ జీవిత నేపథ్యం, ఉక్తి వైచిత్రి, భాషా సౌందర్యం, భావ సౌందర్యం అనే అంశాలుంటాయన్నారు. డా.జి. భాస్కర్‌ ‘తెలుగులో వ్యవసాయ సామెతలు’ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు.
శ్రమైక సౌందర్యాన్ని చాటుతూ...
రెండో సమావేశానికి నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ కార్యక్రమాధికారి డా.పత్తిపాక మోహన్‌ అధ్యక్షత వహించారు. సామెతల్లో... లోకోక్తుల్లో భాషా సౌందర్యం ఉంటుంది. విరసం, సరసం, శృంగారం అనే మానసిక అవస్థల సంయోజనీయత ఉంటుంది. అన్ని భారతీయ భాషల్లోనూ సామెతలు ఉన్నాయన్నారు. డా.వి.త్రివేణి ‘వృత్తి సంబంధిత సామెతలు’ అనే అంశంపై ప్రసంగించారు. జీవితమే వృత్తి అయినప్పుడు ఆ వృత్తిని ప్రతిబించేవే సామెతలు. వృత్తిసంబంధిత సామెతల్లో వ్యవసాయ, చేనేత, గీత, కమ్మరి, కుమ్మరి వంటి వృత్తి ఆధారిత సామెతలు ఉన్నాయని చెప్తూ.. కందకు లేని దూల కత్తి పీటకు ఎందుకూ, ఈత చెట్టు ఇల్లుకాదు తాటి చెట్టు తల్లి కాదు ఇలాంటివి కుల వృత్తులను కించపరిచే సామెతలు ఉన్నాయన్నారు. డా.కోయి కోటేశ్వరరావు సంస్కృత లోకోక్తులు-బైబిల్‌ సూక్తులు తన పత్రంలో రెండింటినీ తులనాత్మక పరిశీలనచేస్తూ ప్రసంగించారు. వేదాల్లో సంస్కృత కావ్యాల్లో వాక్యాలు రూఢీ చెంది లోకోక్తులుగా మారాయి. ఎదుటివారు పరుషంగా మాట్లాడితే మనం పరుషంగా బదులు ఇవ్వరాదు. సందర్భోచితంగా మాట్లాడాలి. నోటిమాట సక్రమంగా ఉంటేనే బంధుత్వాలు కుదురుకోగల్గుతాయి. లేకపోతే జీవితం దుర్భరమవుతుందని సెలవిచ్చారు.
పురాణాలే సామెతలకి పుట్టినిల్లు
 సదస్సు సంచాలకులు వై.సత్యనారాయణ రామాయణ, భారత సంబంధమైన సామెతలను ఉదహరిస్తూ... హనుమంతుని ముందు కుప్పి గంతులా!, శల్యసారథ్యం వంటి సామెతలను, తెలుగులో పౌరాణిక సామెతలు వంటి అంశాలను ప్రస్తావించారు. మంత్రి శ్రీనివాస్‌ నిర్మల్‌ జిల్లా సామెతలు అనే అంశంపై మాట్లాడారు. నిర్మల్‌ జిల్లాలో తెలుగు మరాఠీ సామెతలు అనేకం ఉన్నాయన్నారు. జానపదుల చమత్కార చాతుర్యాన్ని నింపేవి సామెతలు. పోశవ్వ పోతం చేస్తే మారవ్వ మాయ చేసిందట అనే గ్రామీణజీవన సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సామెతలు కొన్నింటిని పేర్కొన్నారు. ఎల్‌. మోహన్‌ ప్రాథమిక విద్యా బోధనలో సామెతలు ఆవశ్యకతని విశధం చేశారు. అట్టె దత్తయ్య ‘తెలుగు సామెతలు- సామాజిక శాస్త్రీయ అంశాలపై మాట్లాడితే, సామెతలు-విశ్వాసాలు అనే అంశంపై టి. శైలజ పత్రసమర్పణ చేశారు.
రెండో రోజు సదస్సులో...
సదస్సు రెండో రోజు కార్యక్రమానికి (మూడవ సమావేశం) ప్రముఖ తెలంగాణ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. సామెతలపై సదస్సు నిర్వహించడం అంటే మన జీవితాలను మనం వెనక్కి వెళ్లి తడుముకోవడమే. లోతైన విషయాన్ని చెప్పడానికి సామెతలు పనికొస్తాయి. తెలంగాణ సామెతల్లాగా ఇతర ప్రాంతాల సామెతలు ఉండవు. సామెతలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సామెతను ప్రభావాన్ని బట్టి వాడాలి. పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథలలో సామెతల వాడుక ఎక్కువ. ఎగిరి దంచినామెకు అంతే కూలి, నిలబడి దంచినామెకు అంతే కూలి అనే సామెత రాజకీయంగా ప్రభావితం చేసింది. తెలంగాణ ప్రాంత కథకులు సామెతలను విరివిగా వాడారు. ఇంకా సామెతలను సేకరించాలని ప్రతిపాదించారు. సంగి రమేశ్‌ ‘తెలంగాణ సామెతలు- భాష అనే అంశం పై మాట్లాడుతూ...తరతరాల నుంచి యాసలో రాసుకున్నదే సామెత. సామెత ఎక్కడ పుట్టినా విస్తరణ అంతా ఉంటుంది. చెరువుల బర్లను తోలి కొమ్ములకు బేరం చేసినట్టు, దానధర్మాలు చేయకపోయినా ధర్మపురిని చూడాలి. వంటి తెలంగాణ ప్రాంత వ్యవహారంలోని సామెతలను గురించి వివరించారు.
వ్యక్తిత్వ వికాస దిశగా...
డా.పి.అనురాధ అత్త-కోడళ్ల సామెతలపై పత్ర సమర్పణ చేశారు. సామెత నాణెం వంటిది. అందరి నోళ్లలలో నాని చలామణి అవుతుంది. అత్త-కోడళ్ల సఖ్యతపై సామెతలు లేవు. విరోధంగా ఉన్న సామెతలే అధికంగా ఉన్నాయి. టీవి ధారావాహికల్లో అత్త-కోడళ్ల ప్రస్తావన ఉంటుంది. అత్తలేని కోడలు ఉత్తమ్మురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేవాటిని తన ప్రసంగంలో ప్రస్తావించారు. డా.ఎన్‌.సంధ్యారాణి సామెతలు-వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై మాట్లాడుతూ.. మనిషి అనుభవసారాన్ని అందించేవి సామెతలు. పగటి నిద్ర పనికి చేటు, రాసిన తప్పులు దిద్దుకోవచ్చు గానీ చేసిన తప్పులు దిద్దుకోలేము అనే సామెతలనేకం ప్రస్తావించారు. మదన్‌మోహన్‌ రెడ్డి సంఘటనాత్మకంగా, సందర్భానుసారంగా, జీవిత సారాన్ని చెప్పేది సామెత అనీ, నవ్వడం, మాట్లాడం అనే భావనలు మనిషికి మాత్రమే ఉంటాయనీ, చీ కుక్క అంటే ఏమి అక్క అని అన్నాడనే సామెతలను హాస్యధోరణిలో ప్రసంగించారు. డా.సి.యాదగిరి అన్నమయ్య- సూక్తులు అనే అంశంపై మాట్లాడారు. ఎం.నారాయణశర్మ సామెతలు-లక్షణాలు అనే పరిశోధనాపత్రంలో సామెతలు కొన్నింటిని సోదాహరణంగా వివరించారు. సామెత ఎన్ని రకాలుగా వ్యవహారంలో ఉందో చెలియజెప్పారు.
బ్రౌన్‌ కృషి ఎలాంటిదీ!
నాల్గో సమావేశానికి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య టి.గౌరీశంకర్‌ అధ్యక్షొపన్యాసం చేస్తూ...‘‘ సామెతలు భాషలో భాగమైనవి. ఆది మానవుని కాలం నుంచే సామెత పుట్టింది. సి.పి. బ్రౌన్‌ రూపొందించిన నిఘంటువు చివర్లో అనుబంధంగా సామెతలను కూడా చేర్చాడనే విషయాన్ని గుర్తుచేశారు.జానపదులు మనకందించిన అపూర్వమైన సంపద ఈ సామెతలు. సామెతలకు సంక్షిప్తత, ప్రయోగిత అర్హత ఉంటుంది. చిలుకూరి నారాయణరావు సేకరించిన 80వేల సామెతలతో సంకలనం వస్తుందనేవిషయాన్ని స్పష్టం చేశారు. డా.సిహెచ్‌. లక్ష్మణ చక్రవర్తి ప్రాచీన తెలుగు సాహిత్యంలో సామెతల ప్రస్తావన గురించి మాట్లాడుతూ ముద్దును, తేనెను, సామెతను అనుభవించాలన్నారు. ప్రాచీన సాహిత్యంలో ప్రయోగించబడిన సామెతలు జన వ్యవహారంలో ఎలా ఉన్నాయో వివరించారు. ప్రాచీన సాహిత్యంలోని సూక్తులు జన వ్యవహారంలోకి వచ్చి లోకోక్తులుగా మార్పుచెందాయన్నారు. అవే సామెతని చెప్తూ...ముంజేతి కంకణానికి అద్దమేల అనే ఒక్క సామెతనే 75శాతం కవులు ప్రయోగించానే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రాచీన సాహిత్యంలోని సామెతలు నీతిని తెలియజేస్తాయన్నారు..
సామెతలకి మాండలిక సొబగు
సామెతలు - మాండలిక భాష అనే అంశంపై డా.ఎం.సంపత్కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సామెత ఆరుద్ర పురుగంత అపురూపం. పొద్దటిది పొట్టకు మాపటిది బట్టకు, చూస్తే చుక్క లేస్తే కుక్క వంటి తెలంగాణ  సామెతలు కుప్ప పోసినట్లుగా జన వ్యవహారంలో నిలిచి ఉన్నాయని చెప్పారు. తెలుగు సినిమా పాట- సామెతలు
 అనే అంశం గురించి డా.బి. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఆనాటి సినిమా పాటల మొదలు ఈనాటి సినిమా పాటల వరకు ఉన్న సామెతల ప్రయోగాలను విశ్లేషించారు. శుభలగ్నం చిత్రంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందే అనే సామెత నేపథ్యాన్ని విశ్లేషించారు. కోడం కుమారస్వామి ‘సామెతలు -సంస్కృతి’ అనే పరిశోధనా పత్రంలో సామెతలు గ్రామీణుల వ్యవహారంలో ఒక భాగం. సాహిత్యానికీ సంస్కృతికీ సామెతలకూ దగ్గర సంబంధం ఉంది. వక్తలు తన  ఉపన్యాసంలో సామెతలు ప్రయోగించడం వలన ఉపన్యాసానికి ఊపు వస్తుంది. ఆహారం అనేది సంస్కృతిలో ఒక భాగం. మారు లేని తిండి మాదిగ తిండి, పుర్రె కొక్క బుద్ధి జిహ్వ కొక్క రుచి వంటి సామెతలను పేర్కొన్నారు. ఎస్‌. ధనలక్ష్మి ‘సామెతల్లో తిట్లు ఒట్లు’ పై ప్రసంగించారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు, ఎలుకలు ఉన్నయని ఇల్లంతా తగలబెట్టుకున్నట్లు, అంబలి తాగేవానికి మీసాలు ఎత్తేవాడు ఒక్కడు వంటి సామెతలను విశ్లేషించారు. పి.భాస్కర్‌ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లు వంటి సామెతలను వివరిస్తూ మాట్లా డారు. పొడుపు కథలు, సామెతలు× అంశంపై డా.కె.లక్ష్మీ విజయ పత్ర సమర్పణ చేశారు.
సమాపనోత్సవం
సమాపనోత్సవానికి విశిష్ట అతిథి హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం, మానవీయ శాస్తాల్ర పీఠాది పతి ఆచార్య శరత్‌ జ్యోత్స్నరాణి మాట్లాడుతూ జానపద శాఖకు చెందిన సామెతలను ఏ.వి.కళాశాల , యాద శంకర మెమోరియల్‌ ఫౌండేషన్‌ సదస్సు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. అనుభవం నేర్పిన పాఠాలే సామెతలు ఇవి ఎన్నో రకాలుగా ఉన్నాయి. సామెతలలో అనుభం, జీవితం, ఆనందం, ఉపదేశం ఉంది. సామెతలలో సాంఘిక జీవన చైతన్యం కనిపిస్తుంది. ‘అనంతయ్య చేతిమాత్ర అంతిమయాత్ర’ అనేది సామెత. కవిత కాదు, కథ కాదు, నవల కాదు, వ్యాసం కాదు, ఒక చిన్న వాక్యం సామెత. సామెత ఎంతో ప్రభావితం చేస్తుందని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో విరివిగా సామెతల మీద పరిశోధనలు జరగాలన్నారు. గౌరవ అతిథి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి  సామెతలు భాషకు సంభాషణలకు జీవనాడి వంటివని, స్త్రీలనూ కుల వృత్తులను   కించపరిచేటట్టుగా ఉండే సామెతలను పరిహరించాలని సూచించారు. సామెతల్లో జవసత్వాలు ఉంటాయి. సామెత పుట్టి గ్రామాలలో, పట్టణాలలో ప్రచారం అవుతుంది. ఒక జాతిని లోబర్చుకోవాలి అంటే ఆ సంస్కృతి మీద దెబ్బ కొట్టాలి. సామెత జాతి జీవ ఔషధమన్నారు
మరిన్ని సదస్సులు జరగాలి
ప్రత్యేక అతిథిగా  ఉస్మానియా విశ్వవిద్యాలయం, భూగోళశాస్త్రం  శాఖాధ్యక్షులు ఆచార్య అనుమల్ల బాలకిషన్‌ ప్రతి సందర్భానికి ఒక సామెతను ప్రయోగించవచ్చునన్నారు కొత్త అప్పు కోసం పోతే పాత అప్పు బయటపడ్డట్టు, ఊతంతా ఒక దారి ఉలిపి కట్టెది మరోదారి వంటి సామెతలను పేర్కొన్నారు. గ్రామాల్లో సామెత వాడకుంటే రోజు గడవదు. కాని సామెతలు నగరంలో అంతగా వ్యవహారంలో లేవన్నారు. సభాధ్యక్షులు ఆంధ్ర విద్యాలయ సంస్థల కార్యదర్శి శ్రీ కె.రఘువీర్‌ రెడ్డి చిన్నతనంలో ఏదైనా విషయం చెప్పడానికి పెద్దలు సామెతలు చెప్పేవారంటూ గతాన్ని స్మరణకు తెచ్చుకున్నారు. ఇంకా.. సామెతలపై భవిష్యత్తులో సదస్సు జరగాలి. తెలుగు భాషకు మంచి రోజుల రావాలనీ ఈ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలను ఒక సంకలనంగా తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనే విషయాన్ని తెలియజేశారు. సదస్సు ప్రాయోజకులు యాద శంకర మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, శ్రీ సంగిశెట్టి బాబు సదస్సు నిర్వహణను అభినందించారు. ఎ.వి.కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సిహెచ్‌.రాజలింగం తెలుగుశాఖ కృషిని అభినందించారు. పి.జి.సెంటర్, తెలుగు శాఖ అధ్యకులు, డా.కె.లక్మీ విజయ జాతీయ సదస్సు పట్ల తన స్పందన తెలియజేశారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం