సంఘపు మసకలు చూపిన అద్దం

  • 252 Views
  • 0Likes
  • Like
  • Article Share

కవిత్వాన్ని పదునైన కొడవలిలా వాడి సమాజపు లోపలి పొరల్లో దాగిన కుళ్లును కోసి తీసి తెలుగు పాఠకులకు చూపినవారు దిగంబర కవులు. ఈ కవిత్వాన్ని కూర్చిన ఆరుగురు కవుల్లో భైరవయ్య ఒకరు. అసలుపేరు మరుకుట్ల మన్మోహన్‌ సహాయ్‌. డిసెంబర్‌ 8, 1942న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. నరసాపురం, విశాఖపట్నం, హైదరాబాదుల్లో విద్యాభ్యాసం చేశారు. ‘నవత’ అనే త్రైమాస పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. దిగంబర కవిగా, నిరసన కవిగా ప్రసిద్ధికెక్కారు.
భైరవయ్య కవిత్వంలో గాయాలు, అవమానాలు, నెత్తురు, కన్నీళ్లు, పాచిపోయిన శవాలు, ప్రాణం ఉన్న కళేబరాలు నడుస్తూ, ఘోషిస్తూ కనిపిస్తాయి. ఇంకా ఈ లోకం అసహ్యించుకునే ‘కుళ్లు, కంపు, పుచ్చులు’ విరివిగా ఉంటాయి. ఇవన్నీ ఈ సమాజంలో మన మధ్య తాండవిస్తున్న దారిద్య్రానికి ప్రతిబింబాలు. భైరవయ్య రాసిన ప్రతీ అక్షరం చితికిపోతున్న బతుకుల బాధలను కలుపుకుని కదులుతుంది. ప్రతీ కవితా నెత్తురు, కన్నీరు కలిపి ఓ బీద కళాకారుడు వేసిన చిత్రంలా ఉంటుంది.
స్వార్థపు కాంక్రీటు తొడల మధ్య/ నలిపివేయ 
బడ్డ రాగాన్ని/ కీర్తి రతి తీరని బాబాకారుల/ 
భయంకర/నఖక్షతాలకి దంత క్షతాలకి/ 
పుళ్లుపడి కుళ్లిపోయిన వక్షాన్ని
 
      ‘చెరచబడ్డ గీతాన్ని’ అంటూ రాసిన ఈ కవితలో స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజంలో దుర్మార్గులు తమ కోరికలు తీర్చుకునే క్రమంలో నలిగిపోతున్న బడుగు జీవుల గాథని నగ్నంగా చిత్రించారు భైరవయ్య. ఇందులో వాడిన ప్రతీ పదం పాఠకుడి మెదడును సుత్తితో కొట్టి, గుండెను గుద్ది కన్నీళ్ల గురించి కటువుగా చెబుతుంది.
మనిషిలో అట్టడుగున బురదగుంటలో
పడివున్న మనీషిని లేవదీయటం
ఎముకల లోతుల్లో ధ్వనించే
స్వచ్ఛమైన గీతాన్ని ప్రతిధ్వనించడం

      ‘దిగంబరి’ అనే కవితలో మనిషిలోని సహజత్వాన్ని, స్వచ్ఛతని వెలికి తీయాలంటూ భైరవయ్య ఇలా రాస్తారు. నిజతత్వాన్ని, కల్మషాల్లేని, ముసుగులు తొడగని మనషుల్ని చూడాలంటూ ఈ కవితలో కోరుకున్నారు. 
ఆడ కట్టు/ నిజం చెప్పినోడి రక్తం పోసేసి/
నిజమన్నోడి శవం పాతేసి/ అమ్మోరికి గుడి
కట్టు-  సమాజంలో భావస్వాతంత్య్రపు హక్కును, నిజం చెప్పే మనుషుల మీద దాడిని ఎండగడుతూనే మూఢనమ్మకాల మీద విరుచుకుపడ్డారు భైరవయ్య ‘హురే- హురే’ అనే కవితలో. దేవతలు, ఆచారాల పేర్లతో జరిగే దోపిడీ, దౌర్జన్యాలు ఈ కవితా పాదాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. 
గతంలో తలలు దూర్చి/ వెలిగే సూర్యుణ్ని చూడ నిరాకరించి/ భవిష్యత్తును శాసింపచూస్తున్న/ నిప్పుకోళ్ళు
మార్పును భరించలేని, నిజాన్ని, వెలుగును చూసే శక్తి సాహసం చేయ లేని మనషుల మీద ‘నరమాంసం రుచి మరిగి’ అనే కవితలో భైరవయ్య సంధిం చిన వ్యంగ్య బాణాలు ఈ పాదాలు. ఇప్పటికీ ఈ పరిస్థితి అలాగే ఉంది!  
తెలుగు సాహితీ యవనిక మీద తన కవిత్వంతో చెరిగిపోని సంతకాన్ని చేసిన భైరవయ్య పేదరికం విలువ తెలిసిన వారు. దారిద్య్రాన్ని దగ్గర నుంచి చూసినవారు. మండే నిప్పుకణికలా కవితా సృజన చేసిన ఈ దిగంబరుడు.. జీవిత చరమాంకంలో సాహితీ రంగానికి దూరమైపోయారు. 19 డిసెంబరు 2019న గగన వీధుల్లోకి కదిలిపోయారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం