నెలనెలా రంగస్థల వెన్నెల

  • 154 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సింగంశెట్టి వెంకన్న

  • ఖమ్మం
  • 8008990101
సింగంశెట్టి వెంకన్న

బతుకులోని పోరాటాల్ని, సంఘర్షణల్ని, సంక్లిష్టతల్ని ప్రభావవంతంగా కళ్లకుకడుతుంది నాటకం. ఒకప్పుడు వాడవాడలా ప్రజల నీరాజనాలందుకున్న ఈ కళ ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఖమ్మంలో ‘నెలనెలా వెన్నెల’ రంగస్థలానికి కొత్త బలాన్నిస్తోంది. కళాకారులను ప్రోత్సహిస్తూ, నేటితరానికి నాటకం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. వంద నెలల కళా చరిత్ర ఉన్న ఈ కార్యక్రమాన్ని మూడు సంస్థలు సంయుక్తంగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తున్నాయి.
ఒకప్పుడు
తెలుగునాట ప్రధాన విజ్ఞాన, వినోద సాధనం నాటకం. రంగస్థలం మీద ఆయా పాత్రల్లో నటులు ఒదిగిపోయి అద్భుత నటనతో అలరిస్తుంటే ప్రజలు మైమరచిపోయి చూసేవారు. చాలా విషయాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నాటకాలు ప్రధాన పాత్ర పోషించాయి. టీవీల రంగప్రవేశం తర్వాత నాటకం పూర్వ కళను కోల్పోయింది. ఇలాంటి సమయంలో రంగస్థలానికి అండగా మేమున్నామని భరోసా ఇస్తున్నాయి ఖమ్మంలోని ‘అమరజీవి’ అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ కళాసాంస్కృతిక సంస్థ, ప్రజానాట్యమండలి, ఖమ్మం కళాపరిషత్‌లు. ‘నెలనెలా వెన్నెల’ (అభ్యుదయ సాంస్కృతిక కదంబం) పేరుతో ఇవి ఖమ్మంలో నాలుగేళ్లుగా ఉచిత నాటక ప్రదర్శనలతో రంగస్థలానికి జోతలు పడుతున్నాయి. 
      ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమానికి మొదట 2007లో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో బీజంపడింది. అప్పటి ప్రజా నాట్యమండలి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కె.దేవేంద్ర, ప్రస్తుత అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ కళాసాంస్కృతిక సంస్థ కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్‌లు కలిసి దీనికి రూపకల్పన చేశారు. ప్రజల్లో అభ్యుదయ భావాలు నింపడమే ఈ నాటక ప్రదర్శనల ప్రధాన ఉద్దేశం. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పద్నాలుగు నెలల తర్వాత ఆ కార్యక్రమం నిలిచిపోయింది. మళ్లీ 2009లో ఖమ్మం కళాపరిషత్‌ ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొంది. నిర్వహణ భారం వల్ల 37 నెలల తర్వాత ఇది మరోసారి నిలిచిపోయింది. తిరిగి 2015 జూన్‌లో అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్‌.. తన సోదరుడు, తెలంగాణ తొలితరం పోరాట యోధుడు అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ పేరిట ఓ కళాసాంస్కృతిక సంస్థను స్థాపించి, ఈ కళాక్రతువుకు జవజీవాలు అందించారు. ప్రజానాట్యమండలి, ఖమ్మం కళాపరిషత్‌లు దానికి దన్నుగా నిలిచాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరోసారి వైఫల్యం దరిచేరకుండా నాటక ప్రదర్శనలను ముందుకు తీసుకెళ్తున్నారు.
రూ.లక్ష వరకు వ్యయం
‘‘నెలనెలా నాటక ప్రదర్శన అంటే ఒక ఆడపిల్ల పెళ్లంత భారాన్ని ప్రతిసారీ మోయటమే. అలాంటి మహా కార్యక్రమాన్ని నడపడమంటే తెలుగు నాటక రంగానికి మహాసేవ చేయడమే’’ అని కొనియాడారు తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.వి.రమణచారి. ప్రతి నెలా రెండు లేదా మూడో ఆదివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళా క్షేత్రంలో ‘నెలనెలా వెన్నెల’ నాటక ప్రదర్శన ఉంటుంది. ఆ సమయంలో కళాకారులు, కళాభిమానులతో నగరంలో కొత్త సందడి నెలకొంటుంది. గతంలో ‘నెలనెలా వెన్నెల’లో రెండు నాటకాలు ప్రదర్శించేవారు. సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి పదింటి వరకు అవి కొనసాగేవి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాలుగేళ్ల నుంచి ఒక్క నాటకాన్నే ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఇది మొదలవుతుంది. అయితే ప్రస్తుతం నాటకానికి ముందు ఒగ్గుకథ లాంటి జానపద కళారూపం ఒకదాన్ని ప్రదర్శింపజేస్తున్నారు. దీనివల్ల జానపద కళాకారులకూ ప్రోత్సాహం లభిస్తోంది. అలాగే పాటలు, జానపద గీతాలు, ధ్వన్యనుకరణ, హాస్యవల్లరి, పిల్లల శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు లాంటివి కూడా ఏర్పాటుచేసి ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. 
ప్రతి నెలా ఒక్కో ప్రదర్శనకు దాదాపు రూ.ఎనభై వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. మైకు, దీపాలంకరణ కోసం రూ.16 వేలు, భక్తరామదాసు కళాక్షేత్రం అద్దె, కరెంటు, జనరేటర్‌ డీజిల్‌ తదితర ఖర్చులకు రూ.15 వేలు వ్యయమవుతాయి. ప్రతి నాటకానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహక పారితోషికం అందిస్తారు. పాత్రధారుల సంఖ్యను బట్టి ఈ పారితోషికం ఉంటుంది. నిజానికి ఇది తక్కువ మొత్తమే అయినా కళ మీద మక్కువ, నిర్వాహకుల నిస్వార్థ నాటక సేవను చూసి కళాకారులు ఆనందంగా నాటక ప్రదర్శనకు ముందుకొస్తున్నారు. ఇంకా భోజనం, అలంకరణ, రవాణా, ప్రచార ఖర్చులూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న కళా సంస్థలన్నీ ‘నెలనెలా వెన్నెల’లో ప్రదర్శన ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటాయి. చాలా సంస్థలు ముందుగానే నాటక ఇతివృత్తాన్ని నిర్వాహకులకు తెలియజెప్పి అనుమతి తీసుకుంటూంటాయి. కొత్త సంస్థలైతే ఇతర ప్రాంతాల్లో వాటి ప్రదర్శనను స్వయంగా చూసి సంతృప్తి చెందిన తర్వాతే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల వైరాలోని ఓ సంస్థ నాటకాన్ని హైదరాబాదుకు వెళ్లి చూసి మరీ ‘నెలనెలా వెన్నెలలో’ అవకాశం కల్పించారు.
దాతల సాయం
సామాజిక చైతన్యం కలిగించే సందేశాత్మక నాటకాలనే ‘నెలనెలా వెన్నెల’లో ప్రధానంగా ప్రదర్శిస్తారు. సాంఘిక దురాచారాలు- వాటి దుష్పరిణామాలు, అనుబంధాలు- ఆప్యాయతలు, కుటుంబ సంబంధాలు, యువత చెడు మార్గాలు పట్టడం వల్ల జరిగే పర్యవసానాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వర్తమాన పరిస్థితులు తదితర ఇతివృత్తాలతో నాటకాలుంటాయి. ప్రతి నెలా నాటక ప్రదర్శనకి నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సుమారు మూడు వేల మందికి సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. మరో వెయ్యి మందికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానపత్రికలు వెళతాయి. ప్రధాన కూడళ్లు, జన సమ్మర్థ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్లు, భద్రాద్రి కొత్తగూడెం, కృష్ణా జిల్లాల నుంచి ప్రేక్షకులు తరలివస్తారు. ఒక్కో ప్రదర్శనకు కనీసం నాలుగు వందల మందికి పైగా హాజరవుతారు. ప్రేక్షకుల్లో యువత కూడా బాగానే కనిపిస్తుంది. నిర్వాహకులు కూడా యువతరానికి రంగస్థలాన్ని పరిచయం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గతంలో నగరంలోని ప్రియదర్శిని డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి నాటకాలు చూపించారు. రాబోయే రోజుల్లో యువ ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కళాకారులకు వసతి, భోజన సదుపాయాలు, ఆహ్వానాలను ప్రజా నాట్యమండలి చూస్తే, ఖమ్మం కళాపరిషత్‌ ఆర్థిక వ్యవహారాలను, దాతల సాయం, ఇతర పనులను అన్నాబత్తుల సంస్థ చూసుకుంటున్నాయి. 
      ప్రతి నెలా సీనియర్‌ కళాకారుడు, మేకప్‌మన్‌ ఇద్దరిని సత్కరించడం ‘నెలనెలా వెన్నెల’ మరో ప్రత్యేకత. రెండేళ్ల నుంచి ప్రతి నెలా జిల్లాకు చెందిన ఒక కవికి తెలంగాణ కవి రావెళ్ల వెంకటరామారావు స్మారక పురస్కారాన్ని కూడా ప్రదానం చేస్తున్నారు. దీని కింద రూ.అయిదు వేల నగదు అందిస్తారు. నగరంలోని వైద్యులు, రాజకీయ ప్రముఖులు, స్థిరాస్తి వ్యాపారులు, కళాభిమానులు ఈ కార్యక్రమ ఏర్పాట్లకు తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జమాఖర్చుల లెక్కలు రాసి, ఈ దాతలందరికీ తెలియజేస్తున్నారు. ఈ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు.  
అయిదో వసంతంలోకి
కె.వి.రమణచారిని సంప్రదించి నిర్వాహకులు నాటక ప్రదర్శనల గురించి వివరించినప్పుడు ఆయన వీరిని అభినందించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తానని మాటిచ్చారు. ఆయన చొరవతో ప్రభుత్వం నుంచి ఏటా రూ.రెండు లక్షలు అందుతున్నాయి. ఏటా ప్రదర్శనలకు దాదాపు రూ.పది లక్షల వరకు ఖర్చవుతోందని, అందులో ప్రభుత్వ సాయం పోగా మిగిలింది దాతల నుంచి సమకూర్చుకుంటున్నామని నిర్వాహకులు అంటున్నారు. అయినా ప్రతి సంవత్సరం దాదాపు రూ.రెండు లక్షల అప్పు ఉంటోందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ కూడా ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమానికి తనవంతు ప్రోత్సాహం అందిస్తున్నారు. కళాశాల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆయన ఎప్పుడూ సూచిస్తుంటారు. 
      తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు రాళ్లపల్లి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి సోదరులు, తనికెళ్ల భరణి, సుద్దాల అశోక్‌తేజ, జయప్రకాశ్‌రెడ్డి, సుబ్బరాయశర్మ, ఎల్‌.బి.శ్రీరాం, శ్రీనివాసరెడ్డి తదితరులు వివిధ సందర్భాల్లో ‘నెలనెలా వెన్నెల’కు ముఖ్య అతిథులుగా వచ్చారు. నాటకాలను తిలకించి నిర్వాహకులను అభినందించారు. మూడోసారి మొదలయ్యాక ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతూ ఈ ఏడాది ఆగస్టు 11కు నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా భక్తరామదాసు కళాక్షేత్రంలో అయిదో వసంత స్వాగత వేడుకలతో పాటు నాలుగో వార్షికోత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ... నాటకాలకు పూర్వవైభవం రావాలంటే కథ, కథనంలో నవ్యత, చక్కని సాధన ఉండాలని చెప్పారు. తన తొలి నాటకాన్ని ఎనభయ్యో దశకంలో ఖమ్మంలోనే ప్రదర్శించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల కిందట ‘నెలనెలా వెన్నెల’ పునఃప్రారంభమైనప్పుడు ‘దొంగలు’ నాటికను ప్రదర్శించిన కరీంనగర్‌ చైతన్య కళాభారతి ఈసారి ‘కెరటాలు’ నాటికను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ‘నెలనెలా వెన్నెల’ ద్వారా నాటక కళాకారులకు అందుతున్న ప్రోత్సాహం వెలకట్టలేనిది. తెలుగుగడ్డ మీద రంగస్థల దీపం కొడిగట్టిపోకూడదంటే ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. రెండు రాష్ట్రాల భాషా సాంస్కృతిక శాఖలే ఇందుకు చొరవ తీసుకోవాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం