వెండితెర నజరానా.. వేవేల నవ్వుల వాన..

  • 846 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డి.కస్తూరి రంగనాథ్‌

  • షాద్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా
  • 8008573907
డి.కస్తూరి రంగనాథ్‌

‘వినవే బాలా.. నాప్రేమగోల’... అంటూ రేలంగి చేసిన గోల గుర్తుందా....
‘ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా’...అంటూ అల్లురామలింగయ్య చేసిన అల్లరి జ్ఞాపకముందా...
‘మంగమ్మా.. నువ్వు ఉతుకుతుంటె అందం.. అబ్బవేశావె బంధం’... అంటూ రాజబాబు వేసిన చిందులు, చేసిన విందులు.. ‘డివ్విడివ్వి డివ్విట్టం.. నువ్వంటేనే నాకిష్టం’.. అంటూ పద్మనాభం విసిరిన చమక్కులు తలచుకుంటే చాలు.. పెదవులపై విరబూస్తాయి వేవేల నవ్వుల పువ్వులు. నవరసాల్లో ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగపడే హాస్యరసాన్ని అందిస్తూ మన రచయితలు పండించిన నవ్వుల సుమాలు దశాబ్దాలు దాటినా సుగంధాలను అందిస్తూనే ఉన్నాయి... మన మోమున చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాయి.

      సత్యహరిశ్చంద్ర చూశారా... అంతటి విషాదంలోనూ నక్షత్రకుడి పాత్రలో నవ్వులు పండించడం కనిపిస్తుంది... ఎందుకంటే ప్రేక్షకుణ్ని చివరిదాకా కుర్చీలో కూర్చోబెట్టే శక్తి వినోదానికి మాత్రమే ఉంది. సందర్భానికి తగిన విధంగా రచయితలు అందించిన మాటలైనా, పాటలైనా మన నవ్వులను నేటికీ నడిపిస్తూనే ఉన్నాయి. నాటి, నేటి మన కవులు ఎన్నెన్నో హాస్యగీతాలకు ప్రాణం పోశారు. వాటిని ఉపయోగించుకుని మన సినీ హాస్యకశాకారులు హాస్యంతో లాస్యం చేశారు. ఒక్కసారి సినీహాస్యగీతాల పరంపరలోకి వెళ్తే...
నవ్వుల యుగం..
ఒక విధంగా చెప్పాలంటే 50వ దశకాన్ని హాస్యానికి సంబంధించి నవ్వులయుగంగా చెప్పవచ్చు. ఆనాటి రచయితలు, దర్శకులు సినిమాలో కథకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో నవ్వులకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. 1951లో వచ్చిన ‘పాతాళభైరవి’ కథానాయకుడుగా ఎన్టీఆర్‌ జీవితానికి ఎలా బాటలు వేసిందో, హాస్యనటుడిగా రేలంగి జీవితానికీ అలాంటి బాటలే వేసింది. ‘వినవేబాలా.. నాప్రేమగోల’ అంటూ కథానాయిక వెంటపడే పాత్రలో రేలంగి గుర్తుండిపోయారు. దీనికి కారణం రచయిత పింగళి నాగేంద్రరావు. ఈ పాట మాత్రమే కాదు... ఆ చిత్రంలో ఆయన ఉపయోగించిన డింగరి, సాహసం సేయరా డింభకా.. నరుడా ఏమినీ కోరిక.. తప్పుతప్పు రాణిగారి తమ్ముణ్ని.. వంటి మాటలూ చిరస్థాయిగా నిలిచిపోయాయి.  
      ఆయనదే మరో సినిమా అప్పుచేసి పప్పుకూడు. ‘ఆనందం పరమానందం’... అంటూ స్వామి వేషంలో ఎన్టీరామారావు, ‘సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా.. కొందరు పిచ్చను పడనేలా...’ అంటూ కథానాయిక కోసం ఇద్దరు కథానాయకుల పోటీ, కాశీకిపోయాను రామాహరి.. శివుని వీభూతి తెచ్చాను రామాహరి.. కాశీకి పోలేదు రామాహరి.. ఇది పాత్రలో బూడిదా రామాహరి.. అంటూ రేలంగి, గిరిజల సంవాదం.. ఒకటేమిటి.. ఈ చిత్రం నిండా నవ్వులే.. అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా.. పాటతోనే ఈ మాట పుట్టిందా.. అన్నంతగా ఈ పాట ప్రభావితం చేసింది.. 
అసమదీయులు, తసమదీయులు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మరో చిత్రం మాయాబజార్‌. ‘సుందరి నీవంటి దివ్యస్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా...’ అంటూ లక్ష్మణకుమారుడితో పలికించిన ప్రజ్ఞలు, ‘అహనా పెళ్లంట... ఓహనా..
నాపెళ్లంట.. నీకునాకు చెల్లంట.. లోకమెల్ల గోలంట.. టాంటాంటాం..’ అంటూ శశిరేఖ చూపిన హొయలు, ‘వివాహభోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. ఒహొహ్హో నాకె ముందు..’ అంటూ ఘటోత్కచుడు పంచిన నవ్వుల విందు నేటికీ రుచికరమే. ఔరౌర గారెలెల్లా.. అయ్యారెబూరెలిల్లా.. ఆ తేనె అరిసెలుల్లా... అంటూ కొత్తకొత్త పదాలకు ప్రాణం పోశారు.. అంతే కాకుండా ఈ చిత్రంలో వాడిన అసమదీయులు, తసమదీయులు, గిలక, వీరతాడు వంటి మాటలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.
నందామయ గురుడ నందామయా
ఇక ఇదే మార్గంలో ఆ తరుణంలో బోలెడన్ని నవ్వులు పూయించిన మరోరచయిత, మహారచయిత కొసరాజు. నవ్వుల పాటలెన్నింటికో చిరునామాగా నిలిచిన ఆయన 1954లో విడుదలైన పెద్దమనుషులు చిత్రంలో ‘శివశివమూర్తివి గణనాథా’.. అంటూ సాగే పాటలో ‘ఒక్కసారి మంత్రిచెయ్యి గణనాథా... నువ్వు ఓడకుంటె ఒట్టుపెట్టు గణనాథా.. పదవి ఊడకుంటె ఒట్టుపెట్టు గణనాథా’.. అంటూ నేతల తీరును ఛలోక్తులతో ఎండగట్టారు. ఇదే చిత్రంలో కొసరాజు రాసిన ‘నందామయ గురుడ నందామయా’.. పాటా మారుతున్న సమాజ ధోరణికి ప్రతిబింబం. ‘స్వాతంత్య్ర గౌరవము సంతలో తెగనమ్ము స్వార్థమూర్తులు అవతరించారయా.. అఆలు రానట్టి అన్నయ్యలందరికి అధికారయోగమ్ము పడుతుందయా’.. అంటూ హాస్య వేదాంతం చెబుతారు కొసరాజు. ఇక సరదాలు పంచే గీతాలు ఎన్నెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. ‘1964లో వచ్చిన మర్మయోగిలో మనిషిని, గాడిదని పోలుస్తూ లోకంలో ఉన్నవిలే రెండు రకాల గాడిదలు.. బుద్ధి ఉన్న గాడిదలు, బుద్ధిలేని గాడిదలు.. అంటూ సాగే పాట కూడా వినోదాలు పంచింది. ఇక 1962లో వచ్చిన కులగోత్రాలు చిత్రంలో పేకాట రాయుళ్లపై ఆయన రాసిన ‘అయయో చేతిలొ డబ్బులు పోయెనే .. అయయో.. జేబులు ఖాళీ ఆయెనే..’ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పాల్సిన పనిలేదు. ‘ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది.. పెశ్లాం మెడలో నగలతోసహా తిరుక్షవరమైపోయింది...’ అని తలబాదుకునే వైనం.. ‘నిలువుదోపిడీ దేవునికిచ్చినా ఫలితం దక్కేది.. ఎంతో పుణ్యం వచ్చేది.. చక్కెర పొంగలి చిక్కేది.. ఎలక్షన్లలో పోటీ పడితే ఎమ్మెల్యే గిరి దక్కేది.. మనకు అంతటి లక్కేది..’ అని పాడుకున్న తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. అతణ్ని బుజ్జగించే క్రమంలో మరోపాత్ర గెలుపు ఓటమి దైవాధీనం చెయ్యితిరగవచ్చు.. మళ్లీ ఆడి గెలవవచ్చు.. అంటుంది.. ఇంకా పెట్టుబడెవడిచ్చు.. అంటే ఇల్లు కుదవ పెట్టవచ్చు.. అని ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తుంది.. పోతే.. అంటే అనుభవమ్మ వచ్చు... చివరకు జోలె కట్టవచ్చు.. అని ముక్తాయింపును ఇస్తుంది. వ్యసనంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే హాస్యం పంచారు కొసరాజు. నవ్వులు చిందిస్తూనే అంతర్లీనంగా సందేశాన్ని అందించడం ఆయన ప్రత్యేకత.
      ఇక రుణానుబంధంలో సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్‌) అందించిన  
      ‘అందమైనబావా.. ఆవుపాలకోవా.. విందుగా పసందుగా ప్రేమనందుకోవా...’ లవకుశలో సదాశివబ్రహ్మం రాసిన ‘ఒల్లనోరిమామా నీ పిల్లని..’ వంటి పాటలు బాగా నవ్వుల వనంలో వికసింపజేశాయి. 
ఆగని నవ్వుల వాన..
60-70 ప్రాంతంలోనూ మన తెలుగు కవులు పూయించిన నవ్వులు హృదయాల్లో నిలిచిపోయాయి. ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా.. వాళ్ల ఆయన చేసే ముద్దూ ముచ్చట విన్నారా’.. అని గీతాంజలి, పద్మనాభంలు భార్యాభర్తలుగా చేసిన గొడవ ఏ కుటుంబమూ మరచిపోదు. 1970లో వచ్చిన సంబరాల రాంబాబు చిత్రంలోని ఈ పాట రాజశ్రీ కలం నుంచి జాలువారింది. ‘పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే.. వాడికి జీతం కంటే పీతం(లంచం) ఎక్కువ తెలుసుకోవే’.. నచ్చజెప్పే భర్త, ‘వగలను చూపిస్తారే గానీ నగలెపుడైనా తెచ్చారా.. ఓ ముత్యాల ముక్కెర పెట్టి ముక్కుకు అందం తెచ్చారా.. నా ముక్కుకు అందం తెచ్చారా’.. అని ప్రశ్నించే భార్య, ‘ఉద్యోగం ఒక మెట్టుదాటనీ కోరినదిస్తానీకూ’... అని బుజ్జగించే భర్త, ‘ఇష్టంలేదని చెప్పకూడదా ఎందుకులెండి సాకు’.. అని మూతివిరుపులు చూపే భార్య.. ఇలా ఇంటిపోరుకు హాస్యాన్ని జోడించి అందించిన తీరుకు నేటికీ తెలుగు ప్రేక్షకుడు జోహారు చెపుతూనే ఉన్నాడు. ఇక పెళ్లిరోజు చిత్రంలో పెళ్లివారమండీ.. అంటూ రాజశ్రీ రాసిన పాట మరో ఆణిముత్యం. అడిగిన కట్నం ఇవ్వాలి.. అడుగుల మడుగులు వత్తాలి.. నోటికి వచ్చిన కోరికలన్నీ నోరుమూసుకుని తీర్చాలి... అంటూ సాగే వియ్యాలవారి కయ్యాలకు హాస్యాన్ని అద్దిన తీరు అలరించింది.
      తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన పాటల్లో చెప్పుకోదగిన మరోపాట 1972లో వచ్చిన ఇల్లుఇల్లాలు చిత్రంలో ఉంది. ‘వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెపుతాను’.. అంటూ రాజబాబుతో రమాప్రభ చేసే అల్లరి చూసి నవ్వుకోని ప్రేక్షకుడు ఉండడు. అప్పలాచార్య అందించిన ఈ పాటలో ‘నల్లని వాడు.. గుంత కన్నులవాడు.. గుబురు మీసాల వాడు.. ఆరడుగుల పొడుగువాడు.. ముద్దులిమ్మని నన్ను అడిగినాడు.. తప్పనిసరియై వెశ్లాను.. దిక్కుతోచక ఉన్నాను.. గదిలో కెత్తుకు పోయాడు.. కథలు, కబుర్లు చెప్పాడు.. తన దుప్పటిలో చోటిచ్చాడు’.. అంటూ ఏడిపించిన తరుణంలో రాజబాబు అరుపులు.. చివరికి వచ్చింది తాతయ్య అని తేల్చేసరికి నవ్విన నవ్వులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రచయితగా అప్పలాచార్య అందించిన ఈ పాట ఓ వినూత్న హాస్యప్రయోగం. 
      60-70 దశకాల్లో ఆరుద్ర కలం నుంచి ఇంగ్లీషులోన మ్యారేజీ.. హిందీలో అర్థము షాదీ.. ఏభాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్లి..., ఆత్రేయ కలం నుంచి వినరాసూరమ్మ వీరగాథలు వీనుల విందుగా.. పిల్లికి బిచ్చం పెట్టని తల్లీ బుల్లెమ్మ..., సినారె కలం నుంచి నీతోనె ఉంటాను శేషగిరి బావా.. వంటి పాటలు నవ్వుల నదిలో పయనింపజేశాయి.
      1975లో వచ్చిన చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలో మాడా వెంకటేశ్వరరావు ‘చూడుపిన్నమా.. పాడుపిల్లోడు.. పైనపైన పడతనంటాడు’.. అంటూ అటూయిటూ కాని పాత్రలో నవ్వులు పండించాడు. బిందెతోటి నీళ్లకెళితే సందుకాసి సైగ చేస్తాడు.. ఒంటరిగా ఒంటరిగా వస్తవుంటే.. ఛీపాడు.. ఈలవేసి గోల చేస్తాడు.. అంటూ సాగే ఈ పాట, ఆ పాత్రతో ఎంతో పేరు తెచ్చుకుంది. దానం గోపాలకృష్ణ అందించిన ఈ పాట కొత్తకోణంలో నవ్వులను పంచింది. ఇదే దశలో ఆయన అందించిన మరోపాట ‘శివరంజని’లో ఉంది. ‘...నీ బాబూవాడు నాకోసం కని ఉంటాడు’ అంటూ అరవం కలిసిన తెలుగుతో నవ్వించాడు. ఇంచుమించు ఈ సమయంలోనే ఇంటింటి రామాయణంలో రామదాసు-దేవదాసు అనే ఇద్దరు దాసుల కథ చెప్పిన నూతన్‌ప్రసాద్‌ ‘భక్తిఅయినా బ్రాందీ అయినా లిమిటేషన్‌లో ఉంటే లిటిగేషన్‌ ఉండదు’.. అన్న కొత్త వేదాంతంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ హరికథ వేటూరి రచన. 
      ఎనభయ్యో దశకంలో హాస్యగీతాల జోరుతగ్గి కథానాయకుల పాటలకే ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి తరుణంలో హాస్యాన్ని నిలబెట్టే బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్న రచయిత, దర్శకుడు జంధ్యాల. శ్రీవారికి ప్రేమలేఖలో ‘శ్రీమన్‌మహారాజ.. మార్తాండ తేజ.. ప్రియానందభోజా.. నీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి.. నినువరించి.. నీగురించి ఎన్నో కలలు కన్న కన్నెబంగారు’.. అంటూ కథానాయిక రాసిన ఉత్తరాన్ని చూసి సుత్తివేలు చూపిన హావభావాలు, రెండుజళ్లసీతలో ‘కొబ్బరినీళ్ల జలకాలాడి.. కోనసీమా కోకాగట్టి..’ అంటూ పాడే అమ్మాయితో ‘మాగాయలోన పెరుగేసుకుంటా.. మాగాయ మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి’.. అంటూ అర్థం లేకుండా పాడే శుభలేఖ సుధాకర్‌ తలతిక్కవేషాలు.. ‘పీనాసి అయినా, సన్యాసి అయినా.. ఉన్నవాడే మనిషి.. డబ్బున్నవాడే మనిషి’.. అంటూ రాజేంద్రప్రసాద్‌ కోటకు చెప్పే వేదాంతం.. ఇలా దశాబ్దకాలం పాటు నవ్వులు పంచిన ఘనత జంధ్యాలకు దక్కుతుంది. అయితే సంభాషణల పరంగా జంధ్యాల నవ్వులు పుట్టిస్తే రచనా సహకారంలో వేటూరి సుందరరామమూర్తి నవ్వులు ఒలికించే పాటలను నజరానాగా ఇచ్చారు. 
      90వ దశకంలో వేటూరికి సీతారామశాస్త్రి జోడీ అయ్యారు. వారెవా ఏమిఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసూ.. అంటూ మనీ చిత్రంలో ఆయన పండించిన నవ్వులు ఇంకా ఎవరూ మరచిపోలేదు. ఇదే సినిమాలో బద్రం బీకేర్‌ ఫుల్‌ బ్రదరు.. భర్తగ మారకు బ్యాచిలరు.. షాదీమాటే వద్దుగురూ.. సోలో బతుకే సో బెటరు.. అంటూ కోటతో కొత్త వేదాంతం చెప్పించి నవ్వించారు. దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి యమధర్మరాజు చేత ‘షెహబాసులే నరనారీమణీ.. బహుబాగులే సుకుమారీమణీ..’ అంటూ బ్రేక్‌డాన్సు చేయిస్తే అందుకు సిరివెన్నెల తన కలం కలిపారు.. సరసాలు చవిచూడ ఇటురా దొరా.. నవమన్మథాకార నడుమందుకోరా.. అని అమ్మాయి యముడిని ఆహ్వానించడం.. రాకాసి కింకరుల రారాజునే స్వర్గాన నీవంటి సరుకెపుడు కనలే.. అని యముడు చెప్పడం సరదాలు పంచింది.
సరిలేరు మీకెవ్వరు..
ఒక పాట పుట్టాలంటే సందర్భానికి అనుగుణంగా కవి కలం కదలాలి.. సంగీతం మైమరిపించాలి.. గాత్రం ఆకట్టుకోవాలి.. చిత్రీకరణ నవ్వులు పూయించాలి.. ఇందులో తొలి అడుగు రచయితలదే.. తొలిదశలో పింగళి, సముద్రాలత్రయం, మల్లాది, సదాశివబ్రహ్మం, కొసరాజు వంటి రచయితలు ఈ బాధ్యతలు భుజాలకు ఎత్తుకున్నారు. వీరేకాదు.. ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, సినారె వంటి కవులు పూయించిన నవ్వుల పువ్వులూ ఇప్పటికీ ప్రేక్షకుల మోములపై విరబూస్తూనే ఉంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం