తెలుగు కోసం నినదిద్దాం!

  • 295 Views
  • 0Likes
  • Like
  • Article Share

అమ్మభాషకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన తన ముద్దు బిడ్డలను చూసుకుని తెలుగు తల్లి మురిసిపోయింది. ప్రతి పలుకులో, ప్రతి సదస్సులో తెలుగు భాష పరిరక్షణకు నినదించిన గళాలను విని ఆ అమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. విజయవాడలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆద్యంతం మాతృభాష పరిరక్షణ దిశగా రచయితలకు, భాషాభిమానులకు కొత్త దిశానిర్దేశం చేశాయి. అమ్మభాషను అలక్ష్యం చేస్తే కలాలు పెద్దపెట్టున నినదిస్తాయని రుజువుచేశాయి.
విజయవాడ 
అనగానే ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ గుర్తుకొస్తుంది. తెలుగువారి జీవవాణి కృష్ణవేణి గలగలలు చెవుల్లో మార్మోగుతాయి. ప్రాగ్దిశ వీణియను బాలభానుడు తన కిరణ తంత్రులతో సవరిస్తున్న సమయం నుంచే నది దగ్గర సందడి మొదలవుతుంది. ఆ అమ్మ సన్నిధిలో కోలాహలం హోరెత్తుతుంది. అయితే డిసెంబరు 27న విజయవాడలో ప్రత్యేకంగా మరో అమ్మకోసం ఉదయం నుంచే సందడి మొదలైంది. తెలుగు జాతి అస్తిత్వానికి మూలభూతమైన తెలుగు తల్లికి సంబంధించిన సందడి అది. ఆ రోజు పొద్దుటి నుంచే విజయవాడ మొగల్రాజపురంలోని పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలకు వెళ్లే రహదారులన్నీ తెలుగు భాషా దూతలతో నిండిపోయాయి. కళాశాల ప్రారంభ ద్వారానికి ఇరువైపులా తన పిల్లలకు స్వాగతం పలుకుతున్న తెలుగు తల్లి చిత్రాలను చూడగానే ప్రతి మదిలో అదో సంబరం. లోపలికి అడుగుపెట్టగానే అడుగడుగునా విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, బండారు అచ్చమాంబ, కనపర్తి వరలక్ష్మమ్మ, బుచ్చిబాబు, డి.రమేష్‌ నాయుడు, మహీధర రామమోహనరావు, మోహన్‌... ఇలా ఆయా రంగాల్లో ప్రసిద్ధులైన తెలుగు వారి చిత్రాలను వీక్షిస్తూ అలా ముందుకు నడుస్తుంటే ఆహా, ఎంతమంది గొప్ప వ్యక్తులను కన్న నేల మనది అనే అనిర్వచనీయమైన ఆనందం. ఆ దారిలోనే తెలుగునేల గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి సాహితీ సాంస్కృతిక వేదిక. అలా మరికొన్ని అడుగులు ముందుకు వేస్తే తెలుగువారి చరిత్ర, విజ్ఞాన సర్వస్వ సిరి కొమర్రాజు లక్ష్మణరావు సభా ప్రాంగణంలో వాడుక భాష కోసం అలుపెరుగని ఉద్యమం సాగించిన గిడుగు రామమూర్తి సాహితీ సాంస్కృతిక వేదిక... దాని మీద బంగారు వన్నెలో ధగధగలాడుతున్న నిలువెత్తు తెలుగు తల్లి విగ్రహం. ఆ అమ్మకు నమస్కారం చేసి ఆడిటోరియం నిండుగా ఆసీనులై ఉన్న మాతృభాషాభిమానులు, అక్షర హాలికులను చూసిన ప్రతి ఒక్కరి మనసు అమ్మఒడిలో సేదతీరుతున్న పసిపాపల్లా ఆనంద పారవశ్యంలో ఓలలాడింది. జై తెలుగు తల్లి అని నినదించింది.
      కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ 2019 డిసెంబరు 27, 28, 29 తేదీల్లో విజయవాడలోని పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలో జరిగాయి. ఈసారి ‘మాతృభాషను కాపాడుకుందాం! స్వాభిమానం చాటుకుందాం’ నినాదంతో వీటిని నిర్వహించారు. మహాసభల్లో భాగంగా రెండు వేదికల మీద 15కు పైగా సదస్సులు, కవి సమ్మేళనాలు జరిగాయి. 
లక్ష్యసాధకులుగా మారాలి
‘‘గిడుగు, గురజాడ లాంటి వారు ప్రారంభించిన వాడుక భాషా ఉద్యమాన్ని ప్రచారం చేసింది కవులూ, రచయితలే. తెలుగుకు ప్రాచీన హోదా విషయంలో వారి కృషి ఎనలేనిది. ఇప్పుడు రచయితలు దీక్షా కంకణధారులై భాషను ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది’’ అన్నారు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు, పూర్వ ఉపసభాపతి డా।।మండలి బుద్ధప్రసాద్‌. తొలిరోజు గిడుగు రామమూర్తి ప్రధాన వేదిక మీద నిర్వహించిన మహాసభల ప్రారంభ సభలో ఆయన అధ్యక్ష ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, మానవ, బాలల హక్కుల్ని విస్మరించి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారాయన. అంతకు ముందు ‘‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ..’’ ప్రార్థనా గీతంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ రచయిత బుచ్చిబాబు అర్ధాంగి శివరాజు సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణల సందేశాలను నిర్వాహకులు చదివి వినిపించారు.
      ‘‘ఇంగ్లీషు చదువులతో కేవలం మనం వినయాన్ని, గులాంగిరీని మాత్రమే నేర్చుకున్నాం’’ అని వ్యాఖ్యానించారు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార. ఈ మహాసభల ప్రారంభకులుగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... మాతృభాషల పరంగా మన స్వాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన సమయమిది అని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు స్వాగత ప్రసంగం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి డా।। జి.వి.పూర్ణచందు ఈ మహాసభల లక్ష్య ప్రస్తావన చేస్తూ 16 వందల మంది వీటిలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. ‘‘తెలుగు భాషోద్యమాన్ని బలసంపన్నం చేసి భాషానురక్తి కల్పిస్తూ ప్రజల గుండె తలుపులు తట్టే కార్యాచరణను రూపొందించడం ఈ మహాసభల లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. వీటికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ తెలుగు తల్లి ప్రత్యేక దూతలుగా భాషోద్యమ లక్ష్య సాధకులుగా మారాలి’’ అని పిలుపునిచ్చారు పూర్ణచందు. అజోవిభో కందాళం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అప్పాజోస్యుల సత్యనారాయణ, సినీగేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య డేనియల్‌ నెజర్స్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మారిషస్‌ నుంచి వచ్చిన సంజీవ నరసింహ అప్పడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహాసభల నేపథ్యంలో రూపొందించిన ‘ప్రపంచ తెలుగు’ పరిశోధనా గ్రంథాన్ని శాంతా బయోటెక్‌ అధినేత డా।। కె.ఐ.వరప్రసాద రెడ్డి, మహాసభల ప్రత్యేక సంచిక ‘తెలుగు ప్రపంచం’ను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సదస్సుకు విచ్చేసిన మరో అతిథి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో నిర్బంధ ఆంగ్లమాధ్యమం నిర్ణయం వల్ల పదేళ్ల తర్వాత రచయితలు రాసిన పుస్తకాలు చదివేవాళ్లు లేకుండా పోతారని హెచ్చరించారు. ప్రతి తెలుగు వ్యక్తి న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ అమ్మభాష కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఇదే వేదిక మీద ‘విదేశీ తెలుగు ప్రతినిధుల సదస్సు’కు ‘తానా’ పూర్వాధ్యక్షులు తోటకూర ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఇంగ్లండ్‌ నుంచి చెన్నుపాటి నగేష్, దక్షిణాఫ్రికా ప్రతినిధులు పోచిరాజు సౌమ్య, డా।। యడవల్లి శర్మ, సింగపూర్‌ ప్రతినిధి పేరి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. తమ ప్రాంతాల్లో తెలుగు వారికి అమ్మభాషని నేర్పుతున్న విధానాన్ని, అక్కడి తెలుగు సంఘాల భాషా కృషిని వారు వివరించారు.
వారి పరిస్థితి ఏంటి?
భాషా పరిశోధన అంటే సమాచార సేకరణ కాదు, సమాచారాన్ని సమన్వయపర్చడం అన్నారు ఆచార్య వెల్చేరు నారాయణరావు. మహాసభల్లో మొదటి రోజు సురవరం వేదిక మీద ‘భాషా పరిశోధన ప్రతినిధుల సదస్సు’ జరిగింది. ముఖ్య అతిథి నారాయణరావు మాట్లాడుతూ.. భాషా పరిశోధన ప్రాధాన్యతను ఇప్పటివారు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య ఎన్‌.భక్తవత్సలరెడ్డి తదితరులు ప్రసంగించారు. రాబోయే రోజుల్లో చాలా భాషలు అంతరించి పోతాయని యునెస్కో చెబుతోందంటే దానర్థం రాతలో, చదువులో అవి ఉండబోవని అన్నారు ప్రముఖ రచయిత విహారి. సాయంత్రం సురవరం వేదిక మీద ఆయన అధ్యక్షతన ‘సాహితీరంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. మాండలికాల్లో రచనలు విరివిగా రావాలని ఇందులో వక్తలు వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఉపేక్ష వల్ల భాషకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సదస్సులో ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు పెద్దింటి అశోక్‌కుమార్, సుధామ, డా।। వి.త్రివేణి, నారంశెట్టి తదితరులు ప్రసంగించారు. 
      ‘‘ఒక వ్యక్తి నిజమైన మనిషిగా ఎదగాలంటే మాతృ భాషలో విద్యాబోధన అత్యావశ్యకం’’ అని అన్నారు మినీ కవితా పితామహులు రావి రంగారావు. ఆయన అధ్యక్షతన తొలిరోజు రాత్రి సురవరం వేదిక మీద ‘తెలుగు బోధనా రంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. ఇంజనీరింగ్, వైద్యం లాంటి అన్ని స్థాయిల్లో తెలుగుని ఒక సబ్జెక్టుగా చేరిస్తే వాళ్లలో వ్యాపార దృష్టి పోతుందని రంగారావు విశ్లేషించారు. తెలుగు బోధన, పాఠ్యప్రణాళిక, మూల్యాంకనాలకి సంబంధించి వక్తలు ఇందులో విలువైన సూచనలు అందించారు. తెలుగు బోధించే వారికి వాగ్రూప, లిఖిత, సృజనాత్మక నైపుణ్యాలు ఉండాలని, వాటన్నింటిని పరిశీలించిన తర్వాతే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. తెలుగునాట అన్ని పోటీ పరీక్షల్లో తెలుగును ఒక పేపరుగా చేర్చాలని కోరారు. వెన్నా వల్లభరావు, బీరం సుందరరావు తదితరులు ప్రసంగించారు.
      ‘‘అధికారంలో ఉన్నవారు ప్రజల ఇష్టంతో సంబంధం లేకుండా చట్టాలు చేస్తున్నారు. నిర్బంధ ఆంగ్ల మాధ్యమం తెస్తే తెలుగులో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి?’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శాసనమండలి సభ్యులు ఏఎస్‌ రామకృష్ణ. మహాసభల్లో భాగంగా రెండోరోజు గిడుగు రామమూర్తి వేదిక మీద మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన ‘రాజకీయ రంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. ఇందులో సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, శాసనమండలి సభ్యులు మాధవ్, పర్చూరి అశోక్‌బాబు మాట్లాడారు. భాష ఉనికి కోసం మనమేం చేయాలో ఆలోచించాల్సిన సమయమిది అని నారాయణ అన్నారు. అనంతరం మధ్యాహ్నం ఇదే వేదిక మీద విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.ముక్తేశ్వర రావు అధ్యక్షతన ‘పాలనారంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. పాలన భాషగా తెలుగును అమలు చేయకపోవడం వల్ల పరాధీనులుగా మారిపోయాం అని ముక్తేశ్వరరావు అన్నారు విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ నూర్‌ భాషా రహంతుల్లా తదితరులు ఇందులో మాట్లాడారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా అమలు చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు.
కొని చదివే అలవాటు రావాలి
‘‘ప్రస్తుతం అన్ని భారతీయ భాషలు యూనికోడ్‌లోకి వచ్చాయి. అయితే కంప్యూటరీకరణలో భాషణ పరంగా కొంత ఇబ్బంది ఉంది. ఇది కూడా పూర్తిస్థాయిలో వస్తే ఇక మాధ్యమం అన్న వాదనలు ఉండవు’’ అన్నారు ప్రముఖ భాషావేత్త ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు. ఆయన అధ్యక్షతన రెండోరోజు ఉదయం సురవరం వేదిక మీద ‘సాంకేతిక తెలుగు రంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. సాంకేతిక నిపుణులు, భాషావేత్తలు వీవెన్, పెద్ది సాంబశివరావు, రహ్మానుద్దీన్‌ తదితరులు ప్రసంగించారు. రచయితలు కేవలం వాట్సప్, ఫేస్‌బుక్కుల్లో మాత్రమే కాకుండా సొంత బ్లాగులు, వెబ్‌సైట్లలో విరివిగా రాయాలని, గూగుల్‌ సెర్చ్‌ వాటిని ఉపయోగించుకుని కొత్త ఉపకరణాలు తయారు చేసుకుంటుందని వక్తలు చెప్పారు. అనంతరం అమ్మనుడి సంపాదకులు డా।। సామల రమేష్‌బాబు అధ్యక్షతన ‘తెలుగు భాషోద్యమ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇతర రాష్ట్రాల్లో తెలుగుకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇదే వేదిక మీద ‘చరిత్ర పరిశోధన రంగ ప్రతినిధుల సదస్సు’ ఆచార్య ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. డా।। రాపాక ఏకాంబరాచార్యులు, డా।। సవరం వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. చరిత్రకు సంబంధించి జరగాల్సిన కృషి మీద వక్తలు లోతైన విశ్లేషణలు చేశారు. 
      ‘‘ఒక జాతి సాహితీ ప్రయాణంలో సాహితీ సంస్థల పాత్ర ఎనలేనిది. అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక సాహితీ సంస్థలు బాగా ఉనికిలోకి వచ్చాయి’’ అన్నారు ప్రముఖ కవి, ‘కవిసంధ్య’ నిర్వాహకులు ఆచార్య శిఖామణి. రెండోరోజు సురవరం వేదిక మీద శిఖామణి అధ్యక్షతన ‘సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు’ జరిగింది. పలు సాహితీ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు అమ్మభాషలో చదువు కోసం తపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమాన్ని తీసేయడం ఏంటని ప్రశ్నించారు. ‘‘భాష చచ్చిపోయే ముందు అది మనకి మోటుగా కనిపిస్తుంది. ఆ భాషకి సంబంధించిన జానపద సాహిత్యం కనుమరుగవుతుంది. అందులో అభివృద్ధి చెందిన కళలు అంతరిస్తాయి’’ అన్నారు డా।। దీర్ఘాసి విజయభాస్కర్‌. ఆయన అధ్యక్షతన రెండోరోజు సాయంత్రం సురవరం వేదిక మీద ‘సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. సంగీత దర్శకులు వీణాపాణి, గాయకులు సోము ఉమాపతి, డా।। కందిమళ్ల సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. తెలుగు భాష పరిరక్షణలో సాంస్కృతిక రంగ ప్రతినిధులు కూడా భాగమవ్వాలని పిలుపునిచ్చారు. 
      అనంతరం ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డా।। రావి శారద అధ్యక్షతన ‘ప్రచురణ రంగ ప్రతినిధుల సదస్సు’ జరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఒక్క పుస్తకాన్ని కూడా కొనలేదని ఆమె అన్నారు. దీనికి సమన్వయకర్త డా।। కప్పగంతు రామకృష్ణ మాట్లాడుతూ.. పుస్తకాల డౌన్లోడ్లు తగ్గించి, కొని చదివే అలవాటు రావాలని పిలుపునిచ్చారు. రాఘవేంద్ర పబ్లిషర్స్‌ అధినేత దిట్టకవి రాఘవేంద్రరావు, పెద్దబాలశిక్ష ప్రచురణ కర్త గాజుల సత్యనారాయణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ నుంచి కె.లక్ష్మయ్య తదితరులు ప్రసం గిస్తూ... 20 ఏళ్లుగా జిల్లా గ్రంథాలయాలు ఒక్క పుస్తకాన్ని కూడా కొనలేదని, 20 ఏళ్లుగా తెలుగులో ఒక్క కొత్త ప్రచురణ కర్తా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు ప్రశ్నించరు? 
మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. రెండోరోజు మధ్యాహ్నం గిడుగు రామమూర్తి వేదిక మీద డా।। మీగడ రామలింగ స్వామి ‘సంగీత నవావధానం’ అందరినీ అలరించింది. పద్యాలను ఆయా రాగాల్లో ఆలపించడం దీని ప్రత్యేకత. అనంతరం ఇదే వేదిక మీద ప్రముఖ నృత్య దర్శకులు డా।। సప్పా దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ‘తెలుగు వారి ఆలయ నృత్యరీతులు’ మీద వ్యాఖ్యాన రూపకాన్ని ప్రదర్శించారు. అనంతరం ‘రంగం’ ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్‌ బృందం ఆధ్వర్యంలో ‘తెలుగు భాషోద్యమ గీతాలు’ కార్యక్రమం స్ఫూర్తిమంతంగా సాగింది. ఆ తర్వాత పాలగుమ్మి రాజగోపాల్‌ ‘కావ్యాలలో తెలుగు సొగసు’ కార్యక్రమంలో భాగవతంలో మానవీయ విలువలను ప్రతిబింబించే పద్యాలను రాగయుక్తంగా పాడి వినిపించారు. అనంతరం ‘‘వచ్చితిని విజయవాడకు/ చొచ్చితి మాధుర్యమొసగు సుందర సీమన్‌...’’ అంటూ ‘పలకరిస్తే పద్యం’ కార్యక్రమంలో డా।। రాధశ్రీ అడుగడుగునా పద్యాలతో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ‘పారిజాతాపహరణంలో సత్యాకృష్ణుల ప్రణయ ఘట్టం’ నృత్య ప్రదర్శన అందరినీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం తమ అద్భుత నృత్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. 
      మహాసభల్లో భాగంగా మూడోరోజు గిడుగు రామమూర్తి వేదిక మీద ‘రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు’ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మభాషాభిమానులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్బంధ ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తే తమ ప్రాంతాల్లో అమ్మభాష కోసం ఎలా గళం వినిపించగలమని ప్రశ్నించారు. అనంతరం ఇదే వేదిక మీద నిర్వహించిన ‘పత్రికా ప్రసారమాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సు’లో సీనియర్‌ పాత్రికేయులు శంకరనారాయణ, మీడియా విశ్లేషకులు తెలకపల్లి రవి, డా।। నాగసూరి వేణుగోపాల్, రామోజీ ఫౌండేషన్‌ సారథి జాస్తి విష్ణుచైతన్య, ఆంధ్రజ్యోతి నుంచి రెంటాల జయదేవ తదితరులు ప్రసంగించారు. తెలుగు బతకాలంటే మీడియా స్వేచ్ఛ ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలతో తప్పనిసరిగా దినపత్రికలు చదివించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈనాడు పత్రిక ఆంగ్లపదాలకు చక్కని తెలుగు పదాల్ని వాడుకలోకి తెస్తోందని ప్రశంసిస్తూ కళాకారులు, సినీ ప్రముఖులు, మేధావులు అమ్మ భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని జయదేవ అన్నారు. ఆ తర్వాత జరిగిన ‘మహిళా ప్రతినిధుల సదస్సు’కు విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఆస్తులు, అంతస్తులు, అధికారం అశాశ్వతం, అక్షరాలు శాశ్వతం. పదవులు అశాశ్వతం, పదములు శాశ్వతం అని అన్నారామె. ‘‘ప్రకృతి ఒడిలో పరవశమొందా/ పిల్లగాలితో పదములు కలిపా/ పరువం నిండిన పల్లె పడుచులో పండుగ చూశా/ ఈరోజు తెలుగు పండుగ చూశా’’ కవితతో అందరినీ అలరించారు రాజకుమారి. చివరగా జరిగిన మహాసభల ‘ముగింపు సభ’కు మండలి అధ్యక్షత వహించారు. జస్టిస్‌ గ్రంథి భవానీప్రసాద్, జస్టిస్‌ కేజీ శంకర్, ఆంధ్రభూమి పూర్వ సంపాదకులు ఎం.వి.ఆర్‌.శాస్త్రి, సామాజిక విశ్లేషకులు, వక్త పరకాల ప్రభాకర్, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ తదితరులు ప్రసంగించారు. తెలుగుకి ప్రమాదం వాటిల్లితే కలాలు, గళాలు ఏకం చేసి ఎదురు నిలుస్తామని రచయితలు ఈ సభల ద్వారా తెలియజెప్పారని మండలి అన్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా ఇంగ్లీషు మాధ్యమం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతం కాదని సీపీఎం నేత మధు వ్యాఖ్యానించారు. ఇవాళ మన జీవితాల్ని శాసించే వాళ్లు తెలుగు నేర్చుకుంటే పిల్లలు ఎందుకూ పనికిరారని అంటున్నారు. ఈ భావజాలం వల్ల భాషకి, సమాజానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు ప్రభాకర్‌. అనంతరం మహాసభల తీర్మానాలను పూర్ణచందు వినిపించారు. 
      మహాసభలు జరిగిన మూడు రోజులూ రెండు వేదికలు ప్రతినిధులతో కిక్కిరిసిపోయాయి. వక్తల ప్రసంగాలను అందరూ ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. ఆయా అంశాల మీద తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. నిర్వాహకులు అచ్చతెలుగు వంటకాలతో ప్రతినిధులకు కమ్మని రుచుల విందు అందించారు. మొత్తం మీద పాలకులు అమ్మభాషను అలక్ష్యం చేస్తే రచయితలు, భాషాభిమానులు చూస్తూ ఊరుకోబోరని, అందరూ ఒక్కటై భాష పరిరక్షణకు నినదిస్తారని ఈ సభలు చాటిచెప్పాయి. తెలుగు భాషాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదాని మీదా లోతైన సూచనలు అందించాయి.  


వెనక్కి ...

మీ అభిప్రాయం