భాగ్యనగరానికి అక్షర తోరణం

  • 116 Views
  • 18Likes
  • Like
  • Article Share

    అభిసాయి ఇట్ట

  • హైదరాబాదు.
  • 8008001640
అభిసాయి ఇట్ట

ఏటా సంక్రాంతికి ముందే భాగ్యనగర వాసులకు అక్షరాల పండగను తెచ్చే హైదరాబాదు జాతీయ పుస్తక మహోత్సవం ఈసారీ విజ్ఞాన కాంతులను ప్రజ్వలింపజేసింది. స్మార్ట్‌ఫోన్లతో సావాసం చేస్తున్న ఈ డిజిటల్‌ యుగంలోనూ పుస్తకం రారాజే అని అక్షరాభిమానులు మరోసారి రుజువు చేశారు. పదిరోజుల పాటు సాగిన ఈ పుస్తకోత్సవంలో దాదాపు 8.5 లక్షల మంది భాగస్వాములయ్యారు.
‘‘చిరిగిన
చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో’’ అన్నారు నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. పుస్తకానికున్న ప్రాధాన్యం అలాంటిది. చొక్కా ఒంటికి మాత్రమే అందాన్నిస్తుంది. కానీ పొత్తం జీవితంలో విజ్ఞానపు కాంతులు నింపుతుంది. బతుకుని అర్థవంతం చేస్తుంది. సమాజాన్ని సంస్కారవంతంగా మార్చుతుంది. అందుకే పొత్తానికి జై అని మరోసారి భాగ్యనగరం నినదించింది. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు కవాడిగూడలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరిగిన పుస్తక ప్రదర్శన లక్షలాది మంది పాఠకుల విజ్ఞాన దాహార్తిని తీర్చింది. 
బాలమేళా ప్రత్యేకం
తెలంగాణ పల్లె నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగిన పీవీ నరసింహారావు శతజయంతి నేపథ్యంలో ఈసారి పుస్తక ప్రదర్శన ప్రాంతానికి ‘పీవీ ప్రాంగణం’గా నామకరణం చేశారు. పీవీకి పుస్తకాలంటే అమితమైన ఇష్టమని, అదే ఆయన్ని మహోన్నత స్థానానికి చేర్చిందని, అందుకే పీవీని స్మరించుకుంటున్నట్లు నిర్వాహకులు వివరించారు. ప్రతి వ్యక్తికి గుర్తింపు అతని మాతృభాషే. ఒకవైపు పాశ్చాత్య సంస్కృతి పెచ్చుమీరుతున్న తరుణంలోనూ అమ్మభాషపై ఉన్న అభిమానాన్ని పుస్తకప్రియులు ఈసారి చాటుకున్నారు. తెలుగు సాహిత్యం పుస్తకాలు ఎక్కువగా కొని మాతృభాషకు పట్టం కట్టారు. గతంలో నగరం వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం ఈ ఏడాది పుస్తక ప్రదర్శన మీద స్పష్టంగా కనిపించింది. పీవీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోముల సత్యనారాయణ వేదిక మీద ప్రతిరోజూ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. సాహితీ దిగ్గజాలు రెంటాల గోపాలకృష్ణ, ధనికొండ హనుమంతరావుల శతజయంత్యుత్సవాలను ఈ పుస్తక మహోత్సవంలో నిర్వహించారు. ఎంతో మంది యువ రచయితలు పాఠకులకు పరిచయమయ్యారు.
      హైదరాబాదు పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచింది ‘బాలమేళా’. పిల్లల్లో అమ్మభాష, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికను వేలాదిమంది విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు విజ్ఞానయాత్ర కోసం ఇక్కడికి తరలి వచ్చారు. బాలమేళా వేదికగా ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు, పిల్లలకు తెలుగుపై ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. పలువురు ప్రముఖ కవులు రచించిన బాలసాహిత్య పుస్తకాలను పిల్లలకు అందజేశారు. పిల్లలకు ఆప్యాయంగా వాటిని అందుకుని మురిసిపోయారు.
330 స్టాళ్లు
ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పోలిస్తే ఈసారి కాల్పనిక సాహిత్యానికే పుస్తక ప్రియులు పట్టంకట్టినట్లు ఆయా స్టాళ్ల నిర్వాహకులు చెప్పారు. పుస్తక ప్రదర్శన తొలిరోజు నుంచి యువత, విద్యార్థుల సందడి బాగా కనిపించింది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల్లో సుమారు వందేళ్ల క్రితం వచ్చిన మొక్కపాటి నరసింహశాస్త్రి ‘బారిస్టర్‌ పార్వతీశం’ నవల ముందంజలో ఉండటం విశేషం. ఆ తర్వాత బండి నారాయణస్వామి ‘శప్తభూమి’, సినారె ‘విశ్వంభర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’, దాశరథి ‘చిల్లరదేవుళ్లు’, గోపీచంద్‌ ‘అసమర్థుని జీవనయాత్ర’,  సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’, అబ్దుల్‌ కలాం ‘ఒక విజేత ఆత్మకథ’, తెలంగాణ సాహిత్య అకాడమీ ‘అస్తిత్వ’ ప్రాతినిధ్య తెలంగాణ కథలు తదితర పొత్తాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి. కవిత్వంలో గోరటి వెంకన్న రచనలు, యాకూబ్‌ ‘తీగలచింత’, కె.శివారెడ్డి కవిత్వం, ఇతర యువకవుల పుస్తకాలను చదువరులు ఆసక్తిగా కొనుగోలుచేశారు. 
      పుస్తక ప్రియుల అభిరుచికి అనుగుణంగా హాచెట్, హార్పర్‌ కోలిన్స్‌ వంటి అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థల స్టాళ్లూ ఈ ఏడాది కొలువుదీరాయి. సైన్స్‌ మీద అవగాహన పెంచే ప్రత్యేక స్టాళ్లు ఆకట్టుకున్నాయి. తెలుగుతో పాటు ఆంగ్లం, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, సంస్కృతం తదితర భాషలకు చెందిన వేలాది పుస్తకాలను పరిచయం చేసిందీ పుస్తక ప్రదర్శన. నవతెలంగాణ, విశాలాంధ్ర, నవచేతన, ఎమెస్కో, అచ్చంగా తెలుగు, తెలుగు అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తదితర ప్రచురణ సంస్థలు తెలుగు సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాయి. మొత్తం 330 స్టాళ్లలో ఒక్కోదాన్లో దాదాపు 3 వేల నుంచి 5 వేలకు పైగా శీర్షికలతో ఈ ఏడాది పుస్తక ప్రదర్శన సంపద్వంతంగా కొనసాగింది.
      పుస్తక ప్రదర్శన జరిగిన పదిరోజుల్లో కల్లూరి భాస్కరం ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’, నల్ల నర్సింహులు ‘వీర తెలంగాణ సాయుధ పోరాటం’, సినారె ‘ప్రపంచ పదులు’, కోయ చంద్రమోహన్‌ సంపాదకత్వంలో ‘తెలంగాణ దర్శిని’ నాలుగో ప్రచురణ తదితర ౬౦ పుస్తకాలను ఆవిష్కరించారు. సాహిత్య సమాలోచనలూ పెద్ద ఎత్తున ఏర్పాటుచేశారు. బిపిన్‌ చంద్ర, రొమిల్లా థాపర్‌ వంటి చరిత్రకారుల రచనలు, అంతర్జాతీయ సంబంధాలపై వచ్చిన పొత్తాలతో పాటు భారత రాజ్యాంగంపై వచ్చిన గ్రంథాలూ ఈసారి భారీగానే అమ్ముడయ్యాయి. మహాత్మా గాంధీ ౧౫౦వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ పాఠకులను ఆకట్టుకుంది. యువ రచయితలతో ఏర్పాటు చేసిన ‘అన్వీక్షికి’ ప్రచురణ సంస్థ స్టాల్‌ యువతకు బాగా దగ్గరైంది. దీని ద్వారా యువ రచయితల ౨౫ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పొత్తాలు ప్రసరించే విజ్ఞానపు జల్లుల్లో తడవడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, కాలం ఎంత మారుతున్నా పుస్తకం తన ప్రాధాన్యాన్ని ఎప్పటికీ కోల్పోదని హైదరాబాదు పుస్తక ప్రదర్శన మరోసారి నిరూపించింది.  


వెనక్కి ...

మీ అభిప్రాయం