విలక్షణ హాస్య సమీరం

  • 179 Views
  • 0Likes
  • Like
  • Article Share

హాస్య రచయితగా సినిమారంగంలో విశేష కృషిచేసిన ఆదివిష్ణు అసలు పేరు విఘ్నేశ్వరరావు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 1940 సెప్టెంబరు అయిదున జన్మించారు. హిందూ కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే ‘ఆదివిష్ణు’ కలంపేరుతో పత్రికలకు కథలు, నవలలు, నాటకాలే కాకుండా సినిమాలకు కూడా రచనలు పంపేవారు. మొదటి కథ ‘అగ్గిబరాటా’ ఆంధ్ర సచిత్రవార పత్రికలో బాపు బొమ్మతో అచ్చయ్యింది. ఆంధ్ర పత్రికలో ‘మనిషి-మిథ్య’ కథకి బహుమతి అందుకున్నారు. బాలమిత్రుల కథ, ఇదాలోకం, కన్నెవయసు తదితర నలభై చిత్రాలకు రచన చేశారు. దర్శకులు జంధ్యాలతో కలిసి కొన్ని జనరంజక చిత్రాలకు పనిచేశారు. అహ నాపెళ్లంట, వివాహ భోజనంబు’ లాంటి చిత్రాలు ఈయన సృజనాత్మకతకి గీటురాళ్లు. 1984లో సుందరీ సుబ్బారావు చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. ఆర్టీసీలో ప్రజా సంబంధాల శాఖ ప్రధాన అధికారిగా పనిచేసి 1998లో పదవీ విరమణ చేశారు. ఉషాకిరణ్‌ మూవీస్‌లో సినీకథా విభాగంలో రెండేళ్లపాటూ పనిచేశారు. ‘సరిగమలు’ పేరిట నిజజీవిత సంఘటనల ఆధారంగా హాస్యరచనలు వెలువరించారు. రేడియో నాటకాలతో ప్రయోగశీలిగా పేరుపొందారు. ‘‘చిన్నపిల్లలకి కథలు చెప్పడంలో గ్లామరుంది. కర్త కర్మ క్రియలకు మల్లే! స్టోరీ టెల్లింగ్‌ అనే విద్యక్కూడా వ్యాకరణముంది. నాకు తెలీకుండానే ఆ విద్యను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నాలో సృజనకు రెక్కలు తొడిగింది నాన్నే’’ అంటారాయన.. అరవై ఏళ్ల సాహితీ ప్రస్థానంలో తనదైన హాస్యంతో కొత్త ఒరవడికి నాంది పలికిన ఆదివిష్ణు.. జనవరి ఆరవ తేదీన హైదరాబాదులో కీర్తిశేషులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం