ఆగ్రాయాత్ర

  • 1842 Views
  • 6Likes
  • Like
  • Article Share

కళ్లతో నవరసాలొలికించే సావిత్రి.. చిత్రసీమలో ప్రత్యేకంగా పిలిపించుకునే కళాభినేత్రి.. కళ్లను కలంగా, చిత్రాన్ని పత్రంగా మార్చేసుకున్నారు! సావిత్రి ఓ రచయిత్రి అనిపించుకునేలా ఈ ‘ఆగ్రా యాత్ర’ రాసిపెట్టుకున్నారు. ఆహ్లాదకరంగా సాగే ఈ యాత్రాక్షర కథనంలో ఆమె పాత్ర నటిగా, రచయిత్రిగా ద్విపాత్రాభినయమే..! సినీతారల సుఖాల్లో ఉండే కష్టాలకు సునిశిత హాస్యం మేళవించడం చూస్తే.. సావిత్రి ఇంకేమైనా రాశారా అని అడుగుతారు!! జనవరి 13, 1960 నాటి ‘ఆంధ్ర- సచిత్ర వారపత్రిక’లో ప్రచురితమైన ఈ వ్యాసం ‘తెలుగువెలుగు’ పాఠకుల కోసం... 
      ‘‘సినిమాతార కావడం బాగానే ఉంటుంది. మన గురించి నలుగురూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన నటనను మెచ్చుకుంటూ ఉంటారు. కారుమీద తిరుగుతూ ఉంటాం. మంచి సూట్లూ, చీరలూ కట్టుకోవచ్చును. పుస్తకాలలో బొమ్మలు వేస్తారు. బీరువాకి పక్కలు చెక్కలయేలా రూపాయలు ఉంటాయి’’ అని అనుకోవడం సహజం. 
      అయితే, ఇవన్నీ, కనీసం వీటిలో చాలాభాగం ఉన్న సినిమా నటులు ఇలా అనుకోరు. ఇవన్నీ ఉన్నయి కాబట్టే వీటిగురించి బెంగలు పెట్టుకోవలసిన అవసరం లేదు. వాళ్లు కోరుకునే స్వేచ్ఛ హాయిగా అందరిమల్లేనే మనమూ బజారుకు వెళ్లి కులాసాగా తిరిగి కావలసిన చీరెలూ బొమ్మలు కొనుక్కోవాలని, బీచిలో బఠాణీలు కొనుక్కుతింటూ పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది. ఎందుకంటే, ఏ స్టారు అయినా సరే బజారుకువెళ్లి ఒకచోట షాపింగ్‌ చేస్తోంది అని తెలిస్తే అతని మీద లేక ఆమె మీద అభిమానం ఉన్న వారు చాలామంది అక్కడికి వచ్చేస్తారు. ఒకసారి చూద్దామని అంతమంది పోగయేసరికి ట్రాఫిక్‌కు ఆటంకం- ఆ తరవాత పోలీసులు రావడమూ- ఒక్కొక్కసారి గలభా- ఇవన్నీ జరుగుతాయి. అందుకనే చాలామంది ఎక్కడికీ వెళ్లరు.

* * *

      అందువల్ల ఒకరోజున ఒక తమిళ నిర్మాత వచ్చి ‘‘అమ్మా డిసెంబరు 2న ఆగ్రాలో ఔట్‌డోర్‌వర్కు ఉంది’’ అని చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. తాజ్‌మహల్‌ చూడవచ్చు. ఢిల్లీ బజారులలో హాయిగా షాపింగ్‌ చేయవచ్చు. చీరెలూ, మా పాప(చిరంజీవి చాముండేశ్వరి)కి కావలసినన్ని బొమ్మలు గాజులూ కొనవచ్చు. ఇక్కడే ఓ బుల్లి తమాషా జరిగింది సరిగ్గా నాకు వచ్చిన అయిడియానే నా ఫ్రెండ్స్‌ చాలామందికి వచ్చిందట- ఇలా నేను ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి నా చేత చీరలూ, గాజులూ, బొమ్మలూ తెప్పించుకోవచ్చునని. అలా ఢిల్లీ వెళ్లేలోపు టెలిఫోన్‌ ద్వారా, మనిషి ద్వారా వచ్చిన ఆర్డర్లన్నీ కలిపి ఒక చిన్నఫైలు తయారైంది. అందులో గుండుసూది అంత చిన్న సరుకుల దగ్గర్నించి, లైఫ్‌సైజ్‌ తాజ్‌మహల్‌ దాకా రకరకాల వస్తువులకు ఆర్డర్లు ఉన్నాయి. మా ఆయన మిత్రుడొకరు, ‘‘ఇంగెపార్‌ తంగే- లైలా మజ్నూ పడం పుడికలా మనికిదు- ఒణ్ణు రెండు అట్టహం వాంగిటివాయేం’’ అన్నాడు నవ్వుతూ. లైలామజ్నూ సినిమా తీస్తాట్ట ఆయన. అందుకోసం ఢిల్లీలో చవగ్గా దొరుకుతాయని ఒకటోరెండో లొట్టిపిట్టలు తెమ్మంటాడు! 

* * *

      వచ్చేటప్పుడు సామాను ఎలాగా ఎక్కువ ఉంటుందని వెళ్లేముందు ఆలోచించుకుని, కొద్దిలోనే తెమిల్చేశాను. విమానంలో కాబట్టి దాన్ని తిరిగి సెన్సారు చేసి మళ్లీ ఎడిట్‌ చేశాం.
ఉదయం 11-15కు విమానం అన్నారు. భోజనం చేసి కూర్చున్నాను. ఎప్పుడు వేళ అవుతుందా అని. ఈలోగా మరికొన్ని ఆర్డర్లు వచ్చాయి.
      ఏరోడ్రమ్‌కు మా పాప, వాళ్ల నాన్న; మరికొందరు మిత్రులూ సాగనంపడానికి వచ్చారు. కారు ఎక్కబోతూ వుండగా, అక్కా అక్కా అంటూ ఓ అమ్మాయి వచ్చి ఓ కాయితం గుప్పెట్లో పెట్టింది. లోపల కూర్చున్నాక తెరిచి చూస్తే మరొక ఆర్డరు.
      వై కౌంట్‌ విమానం ఏమో, ప్రయాణం చేసినట్లు తెలిసేలోగా హైదరాబాద్‌లో దింపింది. తేలిగ్గా ఫలహారం చేసి, విమానం మారాం. సాయంత్రం ఆరు గంటలకల్లా ఢిల్లీ వచ్చిందన్నారు. నిజమే ఢిల్లీయే వచ్చి వుండాలి. విమానం కదిలినట్లు నాకు తెలియలేదు...
      అక్కడ మమ్మల్ని తీసికెళ్తున్న ఫిలిం కంపెనీ ప్రతినిధి ఒకాయన రిసీవ్‌ చేసుకున్నాడు. ఆగ్రాకి 15 టాక్సీలు మాట్లాడానన్నాడు. సామాను 14 టాక్సీలలో సర్దేశాం.
      అంతా నాది కాదు సుమండీ! కంపెనీ వాళ్లది. మేకప్, కాస్ట్యూములూ అవీను. ప్రొడక్షన్‌ పనివాళ్లు వాటిలో బయల్దేరి వెళ్లిపోయారు.
చీకటిపడింది. చలి వేస్తోంది. ఆకలీ వేస్తోంది.
      ఐదుగురం మిగిలాం. రాత్రికి ఇక్కడే హోటలులో బసచేద్దాం అన్నారొకరు. ఉదయం బయలుదేరి వెళ్తే ఆగ్రా చేరి, షూటింగుకు తయారయేసరికి ఆలస్యం అవుతుంది. ఇంకోరోజు ఉండవలసి వస్తుంది. అప్పుడు మద్రాసులో కాల్‌షీట్‌లు వున్న కంపెనీలవాళ్లు ట్రంక్‌ ఫోన్‌లు గుప్పిస్తారు. అందుకని, ఇపుడే వెళ్ళిపోదాం అన్నాను. నేనూ మా దాక్షాయణీ, మేకప్‌ నాగేశ్వరరావు గారు, ఇంకో ప్రొడక్షన్‌ చీఫ్, డ్రైవరూను. 
      రాత్రి 7.30కు ఢిల్లీ నుంచి బయల్దేరాం. ఆగ్రా 120 మైళ్ళు. చలిగాలి రివ్వున వీస్తోంది. 
      30 మైళ్ళ పాటు కారు చాలా కుదురుగా నడిచింది. అంతలో ఠాప్‌మని చప్పుడైంది. ఇక్కడ మిలిటరీ కాంప్‌ ఉందా.. తుపాకులు పేల్తున్నాయి అనబోతున్నా.. కారు ఆగిపోయింది.
      టైరు పంక్చర్‌ అయిందట. నేను కూర్చున్న వేపుకాదు, ఎడమవేపు.
      ఇక్కడో గంట కూచోవాలి కాబోలు దేవుడా అని విసుక్కుంటూ కారు దిగాం. అంతలో చలిగాలి శూలాలతో పొడిచినట్లు తగిలింది. కెవ్వున కేకవేసి మళ్ళీ కార్లో ఎక్కిపోయాం. తలుపులు మూసుకు కూర్చున్నాం.
అచ్ఛీగాడీ
ఇంకో గంటకి, రెడీ అయింది. బయల్దేరాం. పావుగంట తరువాత కారు నడక మీదా, నడత మీదా నాకు అనుమానం కలిగింది. కొంచెం పొగరుమోతు కారులా వుందే అనుకున్నాను. అది డ్రైవరు మాట బొత్తిగా వినేట్టులేదు. కాసేపు అటూ కాసేపు ఇటూ సినిమాలో తాగుబోతు వేషంలా నడుస్తోంది.
      నేను డ్రైవరును హెచ్చరించాను.
      అతనూ దాన్ని వెనకేసుకొస్తున్నట్టున్నాడు. బడీ అచ్ఛీగాడీ అంటున్నాడు వాళ్ల భాషలో.
      అచ్ఛీగాడీ అయితే అయిందిగాని ఓసారి ఆపి చూడు నాయనా భయంగా ఉంది అన్నాను.
      అతడు హిందుస్థానీలో చాలాసేపు ఏమిటో ఉపన్యసించాడు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఏమనుకొన్నాడో ఏమో కారు ఆపి దిగివెళ్లి చూసి, ‘ఫిర్‌ పంచర్‌ హోగయి’ అన్నాడు చాలా ఆనందంగా.
      ఇందాక స్టెప్నీలోంచి తీసి అమర్చిన టైర్‌ కూడా ఇప్పుడు పంక్చరయిపోయింది.
      భగవంతుడిని తలచుకుంటూ కారుదిగాం. చలిగాలి చాలా కసిగా వీస్తోంది. ఓవర్‌కోటును తూట్లు పొడవాలని చూస్తోంది.
      డ్రైవరు మాకు నానావిధాలా ధైర్యం చెప్పాడు. వాళ్ల యజమాని చాలా గొప్పవాడట. మొత్తం 25 కార్లున్నాయట. అవన్నీ ఢిల్లీ ఆగ్రారోడ్‌ మీద తెరిపిలేకుండా తిరుగుతూ ఉంటాయట. అసలు ఢిల్లీ ఆగ్రారోడ్‌ వాళ్ల యజమాని పాతిక కారులూ పచార్లు చేయడానికే వేయించారట. అందుచేత పది నిమిషాలలో ఏదో ఓ బండి వస్తుందనీ రాగానే అందులో స్పేర్‌ టైర్‌ తీసుకుని దీనికి వేసుకు వెళ్ళిపోదామనీ ధైర్యం చెప్పాడు. అతనన్న ప్రకారం రెండు మూడు వచ్చాయి కానీ అవి హిందుస్థాన్, మారిస్‌మైనర్‌ బళ్ళు. మేము ఎక్కింది డాడ్జి బండి. అందుచేత వాటి టైర్లు దీనికి పనికిరావు.
అలానే కూర్చున్నాం. చలి దారుణంగా ఉంది. ఢిల్లీలో ఉండిపోతే ఎంత బాగుండేదో తెలిసివచ్చేలా వుంది. ఏం తోచక మా తోటి ప్రయాణికులు గానసభలు కూడా చేస్తున్నారు. 
తనకు మాలిన ధర్మం
దారినపోయే కార్ల వారు మమ్మల్ని చూసి ఆగి ‘మదద్‌ చాహియే’ అంటున్నారు- ఏ పెట్రోలో అయిపోయిందనుకుని; సంగతి తెలిశాక మాత్రం తప్పుకుంటున్నారు. మీరు ఇలా వెళ్ళగానే మా కారు టైరు పేలిపోతే మాకు మాత్రం ఎలాగ అని వెళ్ళిపోతున్నారు. ప్రాణం విసుగేస్తోంది. ఆశపడటం, ఉసూరుమనడం. మళ్లీ ఆశపడటం- ఇలాగ.
      చివరికి మా మీద జాలిదలచి ఒక హిందుస్థాన్‌ టూరర్‌ వచ్చింది. అందులో వున్నాయన ‘పాపం ఆడవాళ్ళు- ఇబ్బంది పడుతున్నారని’ ఆ కారు మాకు ఇచ్చాడు. సామానంతా అక్కడే వుంచి మనుషులం మటుకు అందులో సర్దుకున్నాం. ఆ పెద్దమనిషి అక్కడే ఉండిపోయాడు. డ్రైవరు చాలా నెమ్మదస్థుడిలా కనిపించాడు. కారును కూడా చాలా నెమ్మదిగా నడిపిస్తున్నాడు. ససేమిరా గంటకు పాతిక మైళ్ళమీద ఒక్కగజం కూడా స్పీడు హెచ్చించడానికి వీల్లేదన్నాడు.
      మధురలో కారు ఆగింది. ఏదైనా తిందామని హోటలు కోసం వెతికాం. అన్నీ మూసివున్నాయి. ఒక్క చిన్న దుకాణం మిణుకుమిణుకు మంటూంది- మా ఆశలా. తినేందుకు దూధ్‌పేడా తప్ప మరోటేం లేదన్నాడు. ఆకలి కడుపు మీద వట్టి స్వీటు తిని ఊరుకోడం మాకేం నచ్చలేదు. మేము అక్కడ మీమాంస చెయ్యడంతో అతనికి విసుగేసింది. ‘కావాలా వద్దా నిద్రపోవాలి’ అన్నాడు విసుగ్గా. తీసుకున్నాం. డబ్బులిచ్చి తినడం మొదలుపెట్టే లోపల వాడు తలుపు వేసుకున్నాడు. మేము దూధ్‌పేడా తింటూ బయల్దేరాం. దాహం. మంచినీళ్ళు అంది మా దాక్షాయణి. మిగతావాళ్లూ మంచినీళ్ళు కావాలన్నారు. నాకూ అంతే. కాని ఎక్కడా దొరకలేదు. ఎక్కిళ్లతో అవస్థపడి ఇంకో మూసేస్తున్న షాపులో మంచినీళ్ళు అడిగి లేవనిపించుకున్నాం.
      రాత్రి ఒంటిగంట వేళకి ఆగ్రా చేరాం. గోకుల్‌ హోటల్‌ అనేచోట మాకు బస ఏర్పరచారు. మేము వెళ్ళేసరికి అక్కడ మా యూనిట్‌లో వారు మా కోసం ఆతృతగా ఎదురుచూస్తూ గుమ్మంలో నిలబడి ఉన్నారు! తొమ్మిదికల్లా రావలసిన వాళ్ళేమయ్యారూ అని- అర్ధరాత్రివేళ అయినా భోజనాలు సిద్ధంగా ఉంచారు. ఇందుకోసం మద్రాసు నుంచి వంటవాళ్లను ముందే పంపి ఉంచారట. అఖిల భారత భోజనం చపాతీ మాత్రం తిని నిద్రపోయాం. 

* * *

      ఆగ్రాకు 29 మైళ్ళ దూరాన ఒకచోట మా చిత్రానికి షూటింగ్‌. ఉదయమే బయల్దేరి ఎనిమిదిన్నరకల్లా చేరుకున్నాం. అక్కడా, షాజహాన్‌ భవనంలోనూ, తాన్‌సేన్‌ సమాధి దగ్గర, ఆయన గానసభలు చేసినచోట పంచమహల్‌ వద్ద షూటింగ్‌కు లొకేషన్‌ ఏర్పాటుచేశారు. 
      పన్నెండు దాకా పని చురుకుగా సాగినా, పన్నెండుకు ఆకలి చుర్రుమనేసరికి పని మందగించింది. నెత్తిన ఎండ కూడా చుర్రుమంటూంది. కాని షూటింగ్‌ ఆపేసి విశ్రాంతికని ఆగ్రా వెళ్తే చిక్కు. 3.30 తరువాత ఎండ పోతుంది. వర్కు పూర్తి కాకపోతే ఇంకోరోజు ఉండాలి. కంటిన్యూ చేద్దాం అమ్మాయీ అన్నారు హీరో శివాజి (గణేశన్‌) గారు. ఆయన మా కన్న ముందే ఢిల్లీ వెళ్లి ఆగ్రాలో కలుసుకున్నారులెండి. సరే బ్రేక్‌ లేకుండా కాల్‌షీట్‌ పెంచాం. మూడున్నరదాకా డూయెట్‌ పాటకు అభినయం చేస్తూ ఆ ఎండలో ఒకళ్లనొకళ్లు తరుముకుంటూ పరుగులెత్తాం. అంతేగా.
స్పెషల్‌ డిన్నర్‌
సాయంత్రం ఆగ్రా చేరేసరికి ‘‘మీ కోసం స్పెషల్‌ విందు, నడిగవేల్‌ ఎం.ఆర్‌.రాధా (తమిళదేశంలో ప్రసిద్ధ కారెక్టరాక్టర్‌ ఆయన) స్వయంగా గరిట పుచ్చుకున్నా’’రన్నారు. చాలా సంతోషించాం కాని నెమ్మదిమీద తెలిసింది. రాధాగారికి వంట చేతనౌనుగాని చేసి చాలాకాలం అయిందిట. పాతకాలపు జ్ఞాపకాలు నెమరువేసుకు వండుతున్నారు.
      పూర్వం మా కాలంలో సాంబారులో ఉప్పు వేసేవారు మరి... కొంత చింతపండు, కొన్ని మిళగు, మొళగా (మిరియం, మిర్చి) కూడా వేస్తు ఉండటం ఆనాటి సంప్రదాయం... ఇలా ఒకొక్కటే గుర్తు చేసుకుంటూ వంట కానిచ్చారు.
      భోజనాలకు కూర్చున్నాక తీరా ముద్ద నోట్లో వేసుకోగానే నోరు భగ్గుమంది. కారం. కంట గిర్రున నీరు తిరిగింది మా అందరికీని. ఒగురుస్తూ తింటున్నాము. నడిగవేలు గారు వచ్చి ‘అమ్మా ఎప్పడి సంబ శిమియల్‌’ అన్నారు (వంట ఎలా ఉంది? అని).
      ‘ప్రమాదం’ అన్నాను నేను నవ్వు, ఏడుపూ ఆపుకుంటూ (ప్రమాదం అంటే అరవంలో చాలా బాగుందని అర్థం).
      ఆయన మురిసిపోతున్నారు.
      ఒక్కసారిగా నలుగురం పోట్లాడాం- ‘‘ఇదెక్కడి సాంబారు స్వామీ. స్టేజిమీద మీరు విలన్‌ వేషాలేస్తే వేశారుగాని, ఇలా కారం పెట్టడం న్యాయమా’’ అని. పున్నమి వెన్నెల చల్లదనం కూడా రాధాగారి వంటకాల కారాన్ని చల్లార్చలేకపోయింది.

* * *

      ఆ మర్నాడు తాజ్‌మహల్‌ను వెన్నెలలో చూశాం- జన్మ తరించిందనిపించింది. దీన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు నాలో తోచీ తోచకుండా, అందీ అందకుండా మెదలిన భావాలను ఇక్కడ రాయగలిగి ఉంటే, నేను బహుశా సినిమా ఆర్టిస్టునుకాక, రాయటంలోనో బొమ్మలు గీయటంలోనో ఆర్టిస్టును అవడానికి కృషి చేసేదాన్నేమో.

* * *

      అక్కడే చక్కని బజారు ఉంది. కళ్లు తిరిగిపోయేటన్ని సరుకులు ఉన్నాయి. మద్రాసులో నా స్నేహితురాళ్లు ఇచ్చిన ఆర్డర్ల ఫైలు తీసి చూసి, కాశ్మీరీ చీరెలు, బొమ్మలు, గాజులు, మా వారికి కాశ్మీరీ కుర్తా ఇవన్నీ కొన్నాను. మర్నాడు ఆగ్రా బజారులో షాపింగ్‌కు వెళ్లాం. మద్రాసులో చైనాబజారంత రద్దీగా, అంతకన్న ఇరుకుగా ఉంది. శివాజీ శ్రీమతి, నేనూ అన్ని షాపులూ చూచి చాలా బొమ్మలూ అవీ కొన్నాం. ఈ సందడిలో దారి తప్పిపోయాం. సినిమాలో పాత్రలలా ఆ బజారు సెట్‌మీదనే అందరం తిరుగుతున్నా మా డ్రైవరూ వాళ్లూ మా కోసం, మేమిద్దరం వాళ్లకోసం తిరగసాగాం. చివరికి డ్రైవరుకు విసుగేసి, తాను కారు ఆపిన చోట కూర్చున్నాడు అక్కడికి రాకపోతామా అని. మేము తిరగ్గా తిరగ్గా ఓచోట కారు కనబడింది. సాక్షాత్తు దేవుడే కనిపించినంత పనైంది ప్రాణానికి. సాయంత్రం నాలుగయింది భోజనాలు ముగిసేసరికి. ఒక్క పదినిమిషాలు విశ్రాంతి తీసుకుని లేచి దయాల్‌ బాగ్‌ భవనం సందర్శించాలనుకున్నాం. కాని- సాయంత్రం ఆరింటికి తెలివి వచ్చింది!
రెండు ‘తాజ్‌’లు
తాజ్‌మహల్‌ పగటివేళ కూడా చూడకపోతే జన్మ తరించదని ఎవరో చెప్పగా విని మర్నాడు ఉదయం భోజనాలు చేసి బయల్దేరాం. శివాజీ అందరికీ కిళ్ళీలు తెప్పించారు. స్పెషల్‌ కిళ్ళీలనీ చాలా బాగుంటాయట. ఇక్కడ ప్రత్యేకతట. వేసుకున్నాం. నిజమే మంచి పరిమళం. కానీ కారు తాజ్‌మహల్‌ చేరుకుని దిగేసరికి నాకు తల తిప్పడం ప్రారంభమైంది. తాజ్‌మహల్‌లు రెండెప్పుడు కట్టించారు బాబూ అనుకున్నాను. ఇంకో నిమిషానికి నాలుగు కనిపించాయి. ఆశ్చర్యంతో అడిగాను, నాలుగున్నట్లు ఎవరూ చెప్పనేలేదే అని.
      వాళ్లంతా నటన అనుకుని నవ్వుతున్నారు. తరువాత ఒక్కొక్కరూ ఇద్దరేసిగా కనిపిస్తున్నారు. తల తిరిగిపోతోంది చెమటలు పోశాయి. అక్కడే కూర్చోబడిపోయాను.
      పావుగంట తరువాత తెలిసింది. స్పెషల్‌ కిళ్ళీ మహత్యం అని. అందులో వాళ్లు ఏవో తలతిరిగే పదార్థాలు వేశారట.
      మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నాం. అక్కడే పెద్ద షాపింగ్‌. ఈసారి ఆర్డర్ల ఫైలంతా పట్టుకు బయల్దేరాం. ఆగ్రాలాగే ఇక్కడా ఎవరూ మన జోలికి రారు కాబట్టి హాయిగా తిరుగుతూ అన్ని చూస్తూ చూసుకొంటూ తింటూ నడవటం ఉత్సాహంగా ఉంది. చీరలు, గాజులు, చెప్పులు, చోళీగుడ్డలు, కర్చిఫ్‌లు బొమ్మలూ రకరకాలవి కొనుక్కున్నాం.
      ఒకచోట ఒక షాపు దగ్గర ఎవరో తెలుగు వాళ్లు కామోసు- సావిత్రిలా వుందే అంటున్నారొకరు. లాగేమిటి సావిత్రే అంటున్నాడు ఒకాయన.
      నాకు నవ్వొచ్చింది ఆ మాట వినగానే. వాళ్లు వచ్చి పలకరించారు. పది నిమిషాలు కబుర్లు చెప్పి, షాపింగ్‌లో మాకు కొంచెం సాయంచేసి వెళ్లిపోయారు. ఢిల్లీలో మేము పార్లమెంటు సభ్యుడు ఇ.వి.కె.సంపత్‌ గారింట్లో బసచేశాం. వారంతా చాలా మర్యాదలు చేసి ఆదరించారు. ఆ సాయంకాలం ఢిల్లీ తమిళ సంఘంవారు శివాజీ గణేశన్‌ గౌరవార్థం విందు చేశారు. అక్కడ నన్ను కూడా మాట్లాడమన్నారు.
      మర్నాడు పదిన్నరకి యాత్ర ముగించి విమానాశ్రయం చేరాం. అక్కడ నేను చేరవేయించిన సామాను చూసి శివాజీ హడలిపోయారు.
      ముందర ‘‘ఎవరో అమాయకులు ఎంత సామాను తెచ్చారో చూడు’’ అన్నాడు నవ్వుతూ.
      ‘‘అమాయకులేం కాదులే’’ అన్నాను.
      ‘‘ఇంత సామాను ఎలా తీసుకువెళ్తారో పాపం’’ అన్నాడు.
      ‘‘నిక్షేపంలా పట్టుకెళ్తారు. మరేమీ ఫరవాలేదు’’ అన్నాను.
      ఈసారి ఆయనకి ఉక్రోషం వచ్చింది. ఇదేం బస్సనుకున్నావా, రైలనుకున్నావా, మీ వూరి మాటువండి (రెండెడ్ల బండి) అనుకున్నావా? అన్నాడు. ఇందులో కొంత సామాను ఇక్కడ ‘మరందుపుడలాం’ (మర్చిపోదాం) అన్నాడు. బతిమాలుతున్నట్టు.
      నీకెందుకయ్యా వాళ్లు పట్టుకొస్తార్లే. నువ్వు ఈ గొడవ మర్చిపోదూ బాబూ అని బతిమాలాను. అయితే లొట్టిపిట్టలు కూడా తేలేకపోయావా అన్నాడాయన వేళాకోళంగా.
      తేలేదని నమ్మకమేమిటి, ఏ పెట్టెలోనో బెడ్డింగులోనో బంగీ కట్టించే ఉంటుంది. లగేజిబిల్లు చూస్తేగాని తెలీదు అన్నారు ఆయన మిత్రుడొకరు నవ్వుతూ.

* * *

      ఇంటికి చేరేసరికి టెలిఫోన్‌ కాల్స్‌ కుప్ప తెప్పలుగా వచ్చాయి. 
      ‘‘నేను చెప్పింది తెచ్చావా?- చీరెలు మర్చిపోలేదు గదా... అన్నట్లు నువ్వు కులాసాగా చేరావా?’’ అంటూను.
      తెచ్చిన సామానులో ఎవరివి వాళ్లకి కేటాయించి పంపించడానికి నేనూ మా సెక్రటరీగారూ ఒకరోజు పనిచేశాం.
      మా పాప చాముండేశ్వరి కూడా సాయం చేస్తానని పట్టుపట్టి ఉండకపోతే ఒక పూటలో అయిపోయేదనుకోండి. 

* * *

 


వెనక్కి ...

మీ అభిప్రాయం