గోపికమ్మా చాలునులేమ్మా...

  • 97 Views
  • 1Likes
  • Like
  • Article Share

    మల్లు

  • గుంటూరు

తరతరాలుగా తెలుగు, తమిళ సంస్కృతుల మధ్య మధురబంధాన్ని పెంపొందించిన ద్రవిడ ప్రబంధం తిరుప్పావై. ఇది అక్షరాలా వేదమేనని, బీజాక్షరాలతో నిండిన మహత్తర మంత్రమని వైష్ణవుల విశ్వాసం. తిరుప్పావై పాశురాల భాష తమిళమైనా... వాటిని శ్రావ్యంగా గానం చేసే తెలుగువారు కోకొల్లలు. వేలవేల గోపెమ్మలకు మోక్షాన్ని ప్రసాదించిన కృష్ణభగవానుడికి అక్షరాలతో గోదాదేవి అలంకరించిన పూమాలే ఈ తిరుప్పావై.
తెలుగునాట
తిరుప్పావై ప్రభావం తెలుసుకోవాలంటే అన్నమయ్య కాలానికి వెళ్లాలి. పదకవితా పితామహుడు ‘చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ/ కూడున్నది పతి చూడుకుడిత నాంచారి’ సంకీర్తనలో వర్ణించింది గోదాదేవినే. వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వారులున్నారు. పదమూడో ఆళ్వారుగా ఆండాళ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆళ్వారుల వరసలో గోదాదేవి, ఆండాళ్‌ అనే పేరున్న ఈ అమ్మను శ్రీ అనే పేరుతోనూ వ్యవహరిస్తారు. గోదాదేవి శ్రీరంగనాథుణ్ని పెళ్లాడే ఇతివృత్తంతో కృష్ణదేవరాయలు రాసిన ప్రౌఢ ప్రబంధమే ‘ఆముక్తమాల్యద’. ఇంకా చెప్పుకోవాలంటే తెలుగువాళ్ల ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరుడి ఆలయాల్లో చాలావాటిలో స్వామి గోదా పద్మావతీ సమేతుడై దర్శనమిస్తాడు. ‘ఆముక్తమాల్యద’ వేంకటేశ్వరాంకితమే. ఇందులో గోదాదేవిని పరిచయం చేస్తూ... ఆమె యౌవనంలోకి అడుగుపెట్టినప్పుడు చేసిన వర్ణన అద్భుతం. మధురభక్తి రసభరితం. 
వాతెఱ తొంటికై వడి మాటలాడదు,
   కుటిలవృత్తి వహించె గుంతలములు
అక్షులు సిరులు రా నఱగంటఁ గనుఁగొనె,
   నాడించె బొమగొని యాననంబు,
సనుగొమల్నెగయ వక్ష ముపేక్షఁ గడకొత్తెఁ,
   బాణిపాదము లెఱ్ఱవాఱఁ దొడఁగ,
సారెకు మధ్యంబు దారిద్య్రముల చెప్పె,
   ఱొచ్చోర్వ కిటులోఁగఁ జొచ్చెమేను
వట్టి గాంభీర్యమొక్కఁడు వెట్టుకొనియె 
నాభి, నానాఁటి కీగతి నాఁటి ప్రియము
చవుక యైనట్టి యిచ్చటఁ జనదు నిలువ,
ననుచు జాఱిన కరణి బాల్యంబు జాఱె.

      ఆముక్తమాల్యద పంచమాశ్వాసంలోని పద్యమిది. ఇంతటి సుందరి ఆ అమ్మ. ఆమె సాక్షాత్తూ భూమాత. అన్నమాచార్యుల మనుమడు, తాళ్లపాక చిన్నన్నగా పేరుగాంచిన తిరువేంగళనాథుడు ‘పరమయోగి విలాసం’ ప్రబంధం; ఇదే పేరుతో సిద్ధరాజు తిమ్మరాజు ఓ చంపూ కావ్యాన్నీ రాశారు.  తిమ్మరాజు తన రచనను మంగళగిరి పానకాలస్వామికి అంకితమిచ్చాడు. ఈ రెండు పరమయోగి విలాసాలూ తమిళ గ్రంథాలకు అనుసరణలు. రెండింటిలోనూ గోదాదేవి కథ కనిపిస్తుంది. ఇద్దరూ 16వ శతాబ్ది వాళ్లే. తర్వాతకాలంలో కేశవాచార్యుల ‘ఆచార్య సూక్తి ముక్తావళి’లో ‘చూడికొడుత్త నాచియార్‌ ప్రభావం’ పేరుతో గోదాదేవి కథ 15 పద్యాల్లో ఉంది. గుదిమెళ్ల రామానుజాచార్యులు 200 పద్యాలలో, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి శ్రీతిరుప్పావై పేరుతో గోదాదేవిని తమ కవిత్వంలో వర్ణించారు. కావ్యాల్లోనే కాక యక్షగానం, బుర్రకథ, హరికథ, జానపద గేయకథా రూపాల్లో గోదాదేవి పుట్టుక నుంచి కల్యాణం దాకా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. గోదాకథ ఈనాటికీ ఏదో ఒక రూపంలో తెలుగునాట వ్యాప్తిలో ఉంటూనే ఉంది. ఇటీవలి ‘ముకుంద’ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదర...’ పాటలో గోదామాత స్ఫురిస్తుంది.
ఆముక్తమాల్యదైన గోదాదేవి
తిరుప్పావైను సృష్టించి భక్తజనానికి అందించిన గోదాదేవి క్రీ.శ.800 ప్రాంతంలో జీవించినట్లు చెబుతారు. ఆమె క్రీ.శ. 776లో అవతరించిందట. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వార్‌గా ప్రసిద్ధిచెందిన విష్ణుచిత్తుడు ఉండేవాడు. ఆయన పరమ భాగవతుడు. క్రమం తప్పకుండా పూలమాల అల్లి రోజూ విల్లిపుత్తూరులో కొలువైన వటపత్రశాయికి అలంకరించేవాడు. ఆయనకు ఓరోజు తులసివనంలో పాదులు తీస్తుండగా ఓ పాదులో బంగారు బొమ్మలాంటి ఆడశిశువు కనిపించింది. పాదులో దొరికింది కనుక ఆ శిశువును సాక్షాత్తూ భూమాతగానే భావించి ‘కోదై’ అని పేరుపెట్టాడు. ఈ కోదై అనంతర కాలంలో ‘గోదై/ గోదా’గా మారింది. ఆమె ముఖ కవళికలను చూసి ఆయనకు ఈమే అందరికీ రక్షకురాలనిపించింది. అందుకే ఆ అర్థంలో ఆండాళ్‌గానూ పిలుచుకున్నాడు విష్ణుచిత్తుడు.
      జనకుడికి సీత దొరికిన తీరులో విష్ణుచిత్తుడికి ఆండాళ్‌ దొరికింది. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమేమిన్న అన్నతీరులో ఆమెను పెంచాడాయన. చిన్నతనం నుంచే విష్ణుభక్తిని నూరిపోశాడు. అలా ఆమెకు శ్రీరంగనాథుడి మీద మనసు నిలిచింది. ఈడొచ్చాక విష్ణుచిత్తుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తాను శ్రీరంగనాథుణ్ని తప్ప వేరొకరిని పెళ్లాడనని చెప్పేది. అలా కాలం గడుస్తుండగా ఓరోజు విష్ణుచిత్తుడు స్వామికి అలంకరించేందుకు తీసుకెళ్తున్న పూలదండలో వెంట్రుక కనిపించింది. విషయం తెలుసుకున్నాడు. ఇన్నాళ్లూ తాను గోదా మెడలో వేసుకుని విడిచిన మాలను స్వామికి సమర్పించానని బాధపడ్డాడు. కానీ ఆ రాత్రి కలలో స్వామి కనిపించి తనకు గోదా ధరించి ఇచ్చిన మాలలే ఇష్టమన్నాడు. అలా తాను ధరించిన మాలల్ని రంగనాథుడికి అర్పించిన గోదాదేవి ఆముక్తమాల్యదగా ప్రసిద్ధిచెందింది. ఈ పేరునే తమిళంలో చూడికుడుత్త నాంచారి అంటారు.
తిరుప్పావై
‘ప్పావై’ అంటే ఒక రకం ఛందస్సు, గేయం, వ్రతం అన్న అర్థాలు తమిళంలో ఉన్నాయి. పాశురం అంటే ఎనిమిది పంక్తుల గేయం. ‘తిరు’ శబ్దానికి దివ్యం, పవిత్రం అని అర్థాలు. మొత్తానికి తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం. ఈ వ్రతాన్ని ముప్ఫై రోజులపాటు ఆచరించిన ఆండాళ్‌ రోజుకో పాశురం రాసి, స్వయంగా గానంచేసి శ్రీరంగేశుడికి అంకితమిచ్చింది. తిరుప్పావైలో భాగవతంలో కనిపించే కృష్ణ సంబంధ కథలు, విశేషాల ప్రధానం. ఇందులో కావ్య లక్షణాలతోపాటు ప్రబంధతత్వం కూడా ఉండటంతో ఇది గోదా ప్రబంధంగా వాసికెక్కింది. తిరుప్పావైలో ఆమె బీజాక్షరాలు నిక్షేపించిందని... అందుకే ఆ పాశురాలు సాక్షాత్తూ వేదాలనీ భావిస్తారు.
      పాశురంలో మొదటి సగం ఒకరు, రెండో సగం మరొకరు గానం చేయడం వీటి ప్రత్యేకత. దీన్ని మున్నుడి- పిన్నుడి అంటారు. ఓం నమో నారాయణాయ (అష్టాక్షరి), శ్రీమతే నారాయణాయ నమః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అన్న ద్వయమంత్రం, సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ- అన్ని ధర్మాలనూ వదిలిపెట్టి కేవలం నన్ను మాత్రమే శరణువేడుకో. మోక్షం లభిస్తుంది... అన్న గీతావాక్కును తిరుప్పావైలో అన్యాపదేశంగా చూపి వ్రతాచరణలో భక్తులకు మార్గదర్శనం చేసింది గోదాదేవి.
ధనుర్మాస వ్రతం
రంగనాథుణ్ని పెళ్లాడాలనుకున్న తన కుమార్తె కోరికను విన్న విష్ణుచిత్తుడు ఆమెను కాత్యాయనీ వ్రతం చేయమన్నాడట. దీన్నే తిరుప్పావై అనీ పిలుస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే శీఘ్రంగా సంపదలు ప్రాప్తిస్తాయట. అందుకే దీన్ని సంపత్కర వ్రతం అనీ అంటారు. ద్వాపరయుగంలో గోపికలు బృందావనంలో వర్షాలు కురిసి సస్యశ్యామలం అయ్యేందుకు, శ్రీకృష్ణుడి కరుణను పొందేందుకు ఈ వ్రతం చేశారట. మార్గశిర మాసంలో ఉషోదయాన్నే లేచి స్నానం చేసి తన సఖులతో కలిసి కృష్ణనామ సంకీర్తనం చేస్తూ హవిష్య భోజనం మాత్రమే స్వీకరిస్తూ నెలరోజులపాటు వ్రతం చేయాలని సూచించింది గోదాదేవి. గోపికలు కాత్యాయని సైకత ప్రతిమకు పూజచేయగా, ఆండాళ్‌ పూజ మాత్రం కృష్ణపరంగా కనిపిస్తుంది. దీనికి కారణం శ్రీకృష్ణుడి సహోదరి కాత్యాయని. ఆమెకు కృష్ణుడికి అభేదం పాటించి ఈ వ్రతం ఆచరించింది గోదాదేవి.
      భగవంతుడు కృష్ణావతారం సందర్భంగా యోగమాయను యశోదగర్భంలో ప్రవేశింపజేశాడు. యశోదను వసుదేవుడు గోకులం నుంచి తెచ్చాడు. కంసుడు ఆ శిశువును సంహరించబోయాడు. అప్పుడా శిశువు ఆకాశంలోకి ఎగిరి యోగమాయగా సాక్షాత్కరించింది. కాత్యాయనీ వ్రతానికి అధిష్ఠాత్రి ఆమే. గోదాదేవి శ్రీకృష్ణుణ్ని పాశురాలలో మాయన్, మామాయన్‌ అని సంబోధించటంలో అంతరార్థం కూడా యోగమాయకు, కృష్ణుడికి భేదం లేదని చెప్పడమే. మార్గశిరంలో వచ్చే వ్రతం, కృష్ణుడి కరుణను పొందేందుకు తగిన మార్గమన్న అర్థాల్లో దీనికి మార్గళి అనే పేరొచ్చింది. తొలి పాశురం ‘మార్గళిత్తింగళ్‌...’తో మొదలవుతుంది. సౌరమానం ప్రకారం ధనుర్మాసం ప్రారంభం నుంచి చివరిదాకా చేసే వ్రతం కనుక దీన్ని ధనుర్మాస వ్రతమని కూడా అంటారు.
      తిరుప్పావైని పండితులు నాలుగు భాగాలుగా విభజించి విశ్లేషిస్తుంటారు. ముప్ఫై పాశురాలలో మొదటి అయిదు పాశురాలు వ్రత స్వరూపాన్ని చెబుతాయి. కృష్ణుడి సన్నిధికి త్వరత్వరగా రమ్మని గోపికలను మేల్కొలిపేవి తర్వాతి పది పాశురాలు. 16 నుంచి 20వ పాశురందాకా ఉన్న భాగంలో పరమార్థానికి ఉపకారకులైన నందగోపుడి ఇంటివారి ప్రస్తావన ఉంది. వీరిలో ద్వారపాలకుడు మొదలుకొని నీళాదేవి వరకూ కృష్ణప్రాప్తికి గోపికలకు సహకరించాలన్న మనవి ఉంటుంది. చివరి పదింటిలో కృష్ణ ప్రార్థన, సంపూర్ణ శరణాగతి కనిపిస్తాయి.
      విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, తోటి సఖులను గోపికలుగా భావించుకొని రోజుకో గోపికను మేల్కొల్పుతూ ఈ వ్రతం ఆచరించింది గోదాదేవి. ధనుర్మాసం ముగిసి మకర సంక్రమణం ముందురోజు వ్రతం పూర్తయ్యాక ఆండాళ్‌కు శ్రీరంగంలోని శ్రీరంగనాథుడితో కల్యాణం జరిగింది. అందరూ చూస్తుండగా శ్రీరంగం ఆలయం అర్చామూర్తిలో గోదాదేవి లీనమైంది. అందుకే మకర సంక్రాంతి ముందురోజైన భోగినాడు గోదా రంగనాథులకు కల్యాణం నిర్వహిస్తారు. 
      పాశురాల్లో చివరగా ఏలో రెమ్బావాయ్‌ అంటారు. ఇందులో విశేషార్థముంది. ఈ మాటను గోదాదేవి పలికింది. తమిళంలో ఏల్‌ అంటే, ఆలోచించుకోండి (నా మాటల్లోని మంచిని జాగ్రత్తగా గమనించండి); ఓర్‌ అంటే, ఇది మీకు నచ్చితే; ఎమ్‌ అంటే, మేము చేస్తున్న; పావాయ్‌- నోములో పాల్గొనండి అని. భగవంతుణ్ని సులభంగా పొందడానికి తాను నిర్దేశిస్తున్న వ్రతంలోకి రమ్మని పాశురాల చివర గోదాదేవి ఇలా పిలుపునిచ్చింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం