గ్రంథాలయాలకే గ్రంథాలయం

  • 1593 Views
  • 3Likes
  • Like
  • Article Share

    సన్నిధానం నరసింహశర్మ

  • హైదరాబాదు
  • 9292055531
సన్నిధానం నరసింహశర్మ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అపురూప వస్తు, కళాఖండాలకు నిలయం హైదరాబాదు సాలార్‌జంగ్‌ మ్యూజియం. ఇంచుమించు దానికి ఎదురుబొదురుగా- మూసీనదికి ఆవల అఫ్జల్‌గంజ్‌లో ఓ గ్రంథ కళాఖండాల నిలయం. అయిదు లక్షలకుపైగా పుస్తకాలతో అలరారుతోన్న ఆ నూటపాతికేళ్ల పొత్తపుగుడి... నవాబుల ఆస్థానపు ఉన్నతోద్యోగి అభిరుచితో అంకురించింది. నిజాం రాజు ఉదారత్వంతో వికసించింది. ఇప్పటి నవ యువతరానికీ సేవలందిస్తోంది. అదే తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం.
ఉస్మానియా,
కేంద్రీయ, తెలుగు విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలు, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, రాష్ట్ర అభిలేఖా గ్రంథాలయం, సుందరయ్య విజ్ఞానకేంద్రం, నగర కేంద్ర గ్రంథాలయం వంటివన్నీ హైదరాబాదులో వాటివాటి ప్రత్యేకతలతో స్వయం ప్రకాశకాలే! విజ్ఞానపు వెలుగులు పంచే ఈ పొత్తపుగుళ్ల పాలపుంతలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఓ ధ్రువనక్షత్రం. 
      చరిత్ర పుటలు తిలకిస్తే... నిజాం ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి అయిన మౌల్వీ సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గ్రామి (నవాబ్‌ ఇమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌) గొప్ప పండితుడు. ఆయన తన అభిరుచి మేరకు 1891లో అబిడ్స్‌లో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి నిజాం రాజుల వంశం ఆసఫ్‌జాహీ పేరుమీద ఆసఫియా గ్రంథాలయం అని పేరుపెట్టారు. దీనికి మొదటి గ్రంథపాలకుడిగా తూర్పుదేశాల భాషల పండితుడు సయ్యద్‌ తస్సాదుక్‌ హుస్సేన్‌ సేవలందించారు. అబిడ్స్‌లో అంకురించిన ఈ పుస్తకాల నిలయం అచిరకాలంలోనే అచ్చుపొత్తాలు, రాతప్రతుల సమీకరణలతో సుసంపన్నమైంది. ఇస్లాం, హిందూ సంస్కృతి, నాగరికతలకు చెందిన ప్రాచీన, అరుదైన పుస్తకాలను భద్రపరచాలన్నది ఈ గ్రంథాలయ నిర్మాతల ఆశయం.
అబిడ్స్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌కు
చరిత్ర సంఘటనలకు ఎన్నింటికో సాక్ష్యంగా నిలిచే మూసీనది తీరంలో... 1932లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ఓ కొత్త గ్రంథాలయ నిర్మాణానికి 72,247 చదరపు అడుగుల విశాల స్థలాన్ని కేటాయించి, శంకుస్థాపన చేశారు. నిర్మాణ పర్యవేక్షణను రాష్ట్ర శిల్పకల్పనా నిపుణాధికారి అజీజ్‌ ఆలీ తలకెత్తుకున్నారు. ఆయన సారథ్యంలో నాలుగేళ్లకు... అంటే 1936లో కొత్త భవనం రూపుదిద్దుకుంది. అది మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ రజతోత్సవ సంవత్సరం కావడం విశేషం. 1955లో హైదరాబాదు పౌర గ్రంథాలయాల చట్టం కింద ఈ ఆసఫియా గ్రంథాలయం ‘హైదరాబాదు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం’ అయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు, ఇప్పుడు తెలంగాణకు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా మారింది. 
      ఎత్తయిన వేదికమీద... మధ్యలో అర్ధగోళాకార ఛత్ర నిర్మాణంతో ఉన్నతంగా ఠీవిగా నిలిచిన గ్రంథాలయ భవనం ముందరి కుడ్యం... అటువైపు వెళ్లిన వాళ్లను సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. హిందూ మహమ్మదీయ వాస్తుశిల్పంతో ఎత్తయిన అలంకృత కుడ్యాలు, కళాత్మకమైన పైకప్పులతో ఒప్పుతోందీ కట్టడం. హైదరాబాదులో వారసత్వ సంపదగా రక్షించుకోవాల్సిన కట్టడాల్లో ఇదీ ఒకటి. మెట్టుమెట్టూ ఎక్కి ఆర్జించుకోవాల్సింది జ్ఞానం. అందుకు గుర్తులుగా ఎత్తయిన మెట్లెక్కి ఆ సమున్నత గ్రంథాలయంలోకి ప్రవేశించాలి. విశాలమైన గదులు, వరండాలతో అలరారే ఈ గ్రంథాలయాన్ని అప్పటివాళ్లు భవిష్యత్తు అవసరాలకు సరిపోయేలా నిర్మించారనిపిస్తుంది. 1961లో దీనికి అనుబంధంగా 9 లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక అవసరాలకు అనుగుణంగా మరో కట్టడం నిర్మించారు.
పుస్తకాలకో లిఫ్ట్‌
ఈ పొత్తపుగుడిలో ప్రత్యేక భాషా గ్రంథ విభాగాలు, సాంకేతిక విభాగాలు, పాలనా విభాగాలు, పఠన విభాగాలు అన్నీ కలిపి 18కి పైనే ఉన్నాయి. లోపలికి వెళ్లాక సంస్కృతం, ఉర్దూ, కన్నడం, హిందీ తదితర భాషల వివిధ జ్ఞానశాఖల గ్రంథాలు చూసి ఆనందానుభూతితో భారతీయులమైపోతాం. అంతేనా! ఆంగ్లం, ఫ్రెంచి, పర్షియన్, అరబిక్‌ భాషల గ్రంథాల విశేషాలు గ్రహించి విశ్వజనీన భావాలు పెరిగి ప్రపంచ పౌరులమనే దివ్య భావనా కలుగుతుంది. కళాశాలల, విశ్వవిద్యాలయాల జ్ఞానార్జన, డిగ్రీలు బతుకునిస్తాయి, ఉపాధి కల్పనలు చేస్తాయి. జీవితాల్ని నిలబెడతాయి. పాఠ్యగ్రంథ పఠనం అవసరం తీర్చే పళ్లెపు భోజనం వంటిది. జ్ఞానదాహంతో, నిత్య విద్యాలయమైన పెద్ద గ్రంథాలయంలో ఇష్టమైన విషయాల పుస్తక పఠనం మృష్టాన్న సంపూర్ణ భోజనమే. రెండూ ఉండే మనిషికి ఎప్పుడూ బోనాల పండగే!
      భవనాల్లో లిఫ్టులు ఉండటం సాధారణమే. కానీ ఈ గ్రంథాలయంలో కొన్ని దశాబ్దాల కిందటే కేవలం పుస్తకాలకు మాత్రమే లిఫ్ట్‌ ఏర్పాటుచేశారు. ఇందులో పక్కనుంచి కింద బైండు చేసిన పుస్తకాలు చేర్చేవారట. ఎవరి అంతస్తుకు చెందిన పుస్తకాలు వాళ్లు తీసుకునే వారట. కిందికి పంపే పుస్తకాలు పంపేవారట! ప్రస్తుతం అది ఉపయోగంలో లేకపోయినా దర్శనీయ వస్తువుగా మిగిలింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రాచ్య లిఖిత భాండాగారం, పరిశోధనా సంస్థ ఉంది. అందులోని తాళపత్ర రాతప్రతుల్లో 17,000 ఈ గ్రంథాలయం ఇచ్చినవే.
      పుస్తకాల రిజిస్ట్రారు కార్యాలయం, తెలంగాణా పౌర గ్రంథాలయ సంచాలకుల కార్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ పౌర గ్రంథాలయ సంచాలకుల తాత్కాలిక కార్యాలయం ఇందులోనే ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, హిందీ, ఉర్దూ విభాగాలు; పాఠ్యగ్రంథాలు, పత్రికా పఠనం, బైండింగు, స్కానింగు, డిజిటల్‌ గ్రంథాలయం, పుస్తకాలు సభ్యులకిచ్చే విభాగం ఇలా ఎన్నో విభాగాల సేవా కార్యక్రమాల కూడలి ఈ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం. ఆరుబయట పాఠకులైతేనేం, బహు విభాగాల పాఠకులైతేనేం, సభ్యులైతేనేం సుమారుగా రోజుకు వేయిమంది దాకా ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుంటుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ షిఫ్టు పద్ధతిలో గ్రంథాలయ సేవలు కొనసాగుతున్నాయి. ‘‘ఉపాధి ప్రధానంగా అధ్యయనం సాగించే యువ నవతరానికి అవసరమైన పుస్తకాలు అందిస్తున్నందుకు, రాత్రి 12 గంటలవరకూ చుట్టుపక్కల నుంచి విద్యార్థులు వచ్చి గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నందుకు మా సిబ్బంది అందరికీ ఎంతో సంతోషంగా ఉంది’’ అని సంతృప్తి వ్యక్తం చేస్తారు గెజిటెడ్‌ లైబ్రేరియన్‌ జి.హరిశంకర్‌. ఈ గ్రంథాలయానికి ముఖ్య గ్రంథ పాలకులు ఎం.అలివేలు. 
తెలుగు పుస్తకాలే ఎక్కువ
అన్ని రకాలవీ కలుపుకుని ఈ గ్రంథాలయంలో ఉన్న తెలుగు పుస్తకాల సంఖ్య 1,68,119. వీటిలో 1920- 1960 మధ్యకాలంలో అచ్చయిన గొప్ప పుస్తకాలున్నాయి. మూడు బీరువాల్లో ప్రాచీన గ్రంథాలు, ఒక బీరువాలో అరుదైన గ్రంథాలూ ఉన్నాయి. గ్రంథాలయ శాస్త్రీయ పద్ధతుల్లో వర్గీకరణం, తగిన అమరికలు ఉన్నాయి. అందరూ తాముగా తీసుకుని చదవడానికి ఏర్పాట్లుచేశారు. తెలుగు పరిశోధకులకు కావాల్సినన్ని పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. తక్కిన గ్రంథాలయాల్లో లభ్యంకాని వచన సాహిత్య గ్రంథాలూ ఎన్నో ఉన్నాయి.
తెలుగు పాత పత్రికలు చాలా ఉన్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన ప్రజామత సంచికలు, వారపత్రికలు, గోలకొండ పత్రిక సంపుటాలు, అనేక దినపత్రికల వార్షిక సంపుటాలు, భారతి, కృష్ణా పత్రికలు, ఆంధ్ర జనత ప్రతులు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికల పాత సంపుటాలు- ఇలా ఎన్నో లభ్యమవుతున్నాయి. ఆధునిక శుభ్ర సంస్కరణలకు నోచుకోవాల్సిన పత్రికా సంచికలూ, సంపుటాలూ బాగానే ఉన్నాయి.
విదేశీ భాషలవీ...
ఈ గ్రంథాలయంలో మిగిలిన భాషల గ్రంథాలూ ప్రయోజనకరమైనవే. ప్రత్యేకత సంతరించుకున్నవే. 1,64,140 ఆంగ్ల గ్రంథాలు ఉన్నాయి. కొన్ని ప్రాచీన ఫ్రెంచి గ్రంథాలూ కనిపిస్తాయి. 1837లో పారిస్‌లో అచ్చయిన ఈజిప్టు దేశపు అరుదైన గ్రంథం ఇక్కడ ఉంది. 1870నాటి అరబ్‌ వైద్యగ్రంథం, 1840నాటి ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ జాగ్రఫీ- కంప్లీట్‌ డిస్క్రిప్షన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ గ్రంథాలు ప్రత్యేక ఆకర్షణ. ఇలా 19వ శతాబ్దపు వివిధ వార్షిక గ్రంథాలు (ఇయర్‌ బుక్స్‌) ఇతర దేశాల్లో అచ్చయిన అపురూప అరుదైన పుస్తకరాజాలకు నెలవు ఈ గ్రంథాలయం. భారతదేశ తపాలా చరిత్రపై ఓ పెద్ద గ్రంథం, నిజాం కాలపు లావుపాటి గ్రంథాలు చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. ఇంకా... భారత పురావస్తు శాఖ రికార్డులు, విజ్ఞాన సర్వస్వాలు, వార్షిక గ్రంథాలు, జనగణన రికార్డులు, పాతకాలపు గెజిటీర్స్, వివిధ కులాల, మతాల, తెగల సంస్కృతి, నాగరికతల గ్రంథాలూ, యాత్రాచరిత్రలు... ఒకటేమిటి- సవాలక్ష పరిశోధనలు చేసుకోవడానికి అనువైన బహుజ్ఞాన శాఖల ప్రాచీన, అధునాతన గ్రంథాలు ఇక్కడ కొలువుదీరాయి. 
      నిజాం కాలం నుంచి ముస్లిం పెద్దలెందరో అపురూపమైన ఉర్దూ గ్రంథాలను సేకరించారు. వారి సేవలు మరవలేనివి. 1865లో అచ్చయిన అల్‌- ఖురాన్‌ పవిత్రగ్రంథం ఈ గ్రంథాలయం వారు కొన్న తొలి పుస్తకంగా ఇక్కడి గ్రంథ నమోదు పట్టికలో ఎక్సెషన్‌ నంబరు ఒకటితో ఇప్పటికీ భద్రపరచారు. 1776, 1777, 1857, 1886 సంవత్సరాల్లో అచ్చయిన అపురూప గ్రంథాలు కన్నులపండగ చేస్తాయి. కవిత్వ భాష అయిన ఉర్దూలో వివిధ శాఖల గ్రంథాలు... ముఖ్యంగా కవితల పుస్తకాలు ఈ విభాగ నిధులుగా ఉన్నాయి.
గ్రంథాలయ సభ్యుల సంఖ్య 30,100. అయితే సిబ్బంది, ఇతర వసతులు రోజురోజుకూ తగ్గిపోవడం శోచనీయం. 1990లలో 150 మంది గ్రంథాలయ సిబ్బంది ఉంటే, ఇప్పుడు యాభైకి మించి లేరు. ప్రభుత్వం దీనిమీద వెంటనే దృష్టిపెట్టాలి. 
విద్యార్థులకు భోజనాలు
చాలా చోట్లా ఉండే జిరాక్సు సౌకర్యం ఉంది. స్కానింగ్‌ సెంటర్‌ ఉంది. ఇంటర్నెట్‌ విభాగం, డిజిటల్‌ గ్రంథాలయం ఈ గ్రంథాలయ ప్రత్యేక ఆకర్షణలు. ఇవి ఇటలీ, అమెరికా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల పండితుల ప్రశంసలు సైతం పొందాయి. వందలమంది విద్యార్థులకు- హైదరాబాదు మహానగర పాలక సంస్థ సాయంతో ఇక్కడ ఇస్కాన్‌ సంస్థ అయిదు రూపాయలకే మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రణాళిక ప్రణాళికేతర బడ్జెట్ల జీతాలకు తగిన మొత్తమే కేటాయిస్తున్నారు. కానీ ఆన్‌ డిమాండ్‌ పద్ధతిలో విద్యార్థులకు వెంటనే అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి అరవై వేల రూపాయలే కేటాయిస్తున్నారు. దీన్ని రెండు లక్షలన్నా చేస్తే బాగుంటుంది. ఇక పాఠ్యగ్రంథ విభాగాల్లో గ్రంథాలు చదువుకోవడం సరే. విద్యార్థులు తమ సొంత పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేందుకు గ్రంథాలయం లోపల వసతులు ఏర్పాటుచేయడం విశేషం.
      బహుభాషల గ్రంథాలు పక్కపక్కనే ఉంటూ సౌభ్రాతృత్వ సహజీవన పరిమళాలు వెదజల్లే వైవిధ్యభరిత పుస్తక భాండాగారం ఈ తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం. దేశంలోని పెద్ద గ్రంథాలయాల్లో ఒకటైన ఈ పొత్తపుగుడి ఎందులోనూ తక్కువ కాదు. అవసరమైన నిధులు పొందడంలో తప్ప! 
మహా గ్రంథాలయ భవనం వెనుక, పక్కల్లో చెట్లపై పక్షుల కలరవాలు వినిపిస్తూంటాయి. ఆ చెట్ల కింద మొక్కవోని దీక్షతో విద్యార్థి జనం జ్ఞానార్జన చేస్తూన్న దృశ్యం చూస్తూంటే... ఈ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఒక విజ్ఞాన ప్ర‘శాంతి నికేతనం’ కదా అనిపిస్తుంది. పరమాన్నం తిన్నంత తృప్తి కలుగుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు