రైతో రక్షిత రక్షితః

  • 102 Views
  • 0Likes
  • Like
  • Article Share

    త్రినేత్రుడు

సాముద్రికంలో... పాదాల్లో హలరేఖలు ఉంటే చక్రవర్తి అవుతాడంటారు. కానీ, మా భుజాలమీద ఉన్న హలాలరేఖల వల్లనే చక్రవర్తులు అవుతారని రైతులు అనుకుంటున్నారని తెలుగు సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. అలాంటి రైతులు రుణాలు తీర్చలేక కష్టాల ‘హలాహలం’ మింగుతుండటం ఎంత దారుణం?
అన్నిదానాల్లోకి అన్నదానం
మిన్న అంటారు. ఒక్క కడుపు నింపితేనే అంత గొప్ప అయితే ప్రపంచ ప్రజలందరికీ నిత్యాన్నదానం చేస్తున్న రైతన్న ఇంకెంత గొప్పవాడు? అయినా రైతులు మృత్యుపరిష్వంగంలోకి వెళుతున్నారంటే అంతకన్నా దుస్థితి ఏముంటుంది?
      ‘ఆడది అర్ధరాత్రిపూట నిర్భయంగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ ఇప్పుడుంటే ‘రైతులు కడుపునిండా తిన్న రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు’ అనేవారేమో! ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నారు. ఇప్పుడు ‘రైతో రక్షతి రక్షితః’ అనాలి! (పండితులారా! ఆపత్కాలంలో వ్యాకరణం పట్టించుకోకూడదు) రైతుల్ని రక్షిస్తే మనల్ని మనం రక్షించుకున్నట్టు! అయినా 
పొలాలనన్నీ
హలాలదున్ని
ఇలాతలంలో

హేమం పిండిన రైతునోట మట్టిపడ్డ చరిత్ర ఇప్పటిది కాదు. అది సాహితీ ప్రబంధ యుగం ముందు యుగమైనా, నిజాం నిర్బంధ యుగమైనా, ప్రజా రాజకీయ యుగమైనా రైతుల కన్నీళ్లే కాల్వలుగా పారుతున్నాయి. తెలుగు సాహిత్యంలో వీటి ప్రస్తావనలు అన్నీ ఇన్నీ కావు.
      భాగవతం రాసిన బమ్మెర పోతనామాత్యుడు ‘సత్కవుల్‌ హాలికులైన నేమి, (మహాకవి శ్రీశ్రీ ఆల్కహాలికులైన నేమి? అన్నాడు. అది ఆయన అభిరుచి అనుకోండి) గహనాంతరసీమల కందమూల గాద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై’ అన్నాడు. రైతుల పరిస్థితి కనాకష్టంకాకపోతే ఆ పుణ్యకవి నోటిగుండా ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? విలాస కవి అనిపించుకున్న శ్రీనాథుడు కూడా రైతుగా చివరికి ఎన్ని కష్టాలు పడ్డాడు!
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము 
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు

      అని అంతటి మహాకవి వాపోయాడు. అన్నదాన కర్ణులు కూడా కర్ణుడు పడినన్ని కష్టాలు పడుతున్నారు. 
      వీటి గురించి నిప్పులు కురిపించిన ఆధునిక కవులూ బోలెడంతమంది ఉన్నారు. మహాకవి దాశరథి అయితే కవితా కరవాలంతో తిరుగుబాటు (ఎ)జెండా ఎగరేశారు.
ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్‌ పడగొట్టి, మంచి మా
గాణములన్‌ సృజించి ఎముకల్‌ నుసిజేసి పొలాల దున్ని భో
షాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలం
గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే 

అని తీర్పునిచ్చేశారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టిన నిజాంగారి జమానా కాలగర్భంలో కలిసినా ఆ తర్వాత వచ్చిన ఏలుబడిలోనూ రైతు సంక్షేమం మొక్కుబడిగానే మిగిలింది. అన్నదాతల ఆత్మహత్యల పరంపర అలా సాగుతూనే ఉంది. గిట్టుబాటు ధరలిచ్చినా, రైతులు గిట్టడం ఆగడం లేదు. మద్దతు ధరలు ఇచ్చినా అవి మృత్యువుకే ‘మద్దతు’ ధరలవుతున్నాయి. చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తిలేదు అని మహాకవి గుర్రం జాషువా ఎంత బాధపడ్డారు! 
      ఈ ప్రపంచంలో లోకకల్యాణ ప్రధానకారకుడు ఎవరంటే కర్షకజీవి కన్నా ఆకర్షక జీవి ఎవరూ ఉండడు. రైతు ఆశ ప్రపంచాన్ని బతికిస్తోంది. కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై, చెక్కిళ్ల మీద జాలిగా జారుతున్నా, మానవసంక్షేమ దీక్షను అతడు విడనాడడు. ఉత్తర చూసి ఎత్తరగంప అన్నా కాడిపారెయ్యడు! మూల వర్షం ముంచినా జ్యేష్ఠ వర్షం తేలుస్తుందనుకుని కాలం ఈడుస్తుంటారు.
      కర్షకుల కన్నీటిని గురించి ‘కలం’ కలం సమాజాన్ని మార్చడానికి ఎంతో ప్రయత్నించింది. 1937లో తెలంగాణ వాస్తవ్యుడయిన కవి గంగుల శాయిరెడ్డి కాపు బిడ్డ అనే కావ్యం రాశాడు. అందులో
పైరు పంటలు పండింపగా నేమి
యా ధాన్యములు గడ్డి యిప్పుపాలు
కడగండ్లుపడి నీవు గుడిసెగప్పిన నేమి
చూలు పిల్లలు దినమడవిపాలు
లేమిచే క్రుంగువానికి లేమిపాలు
కర్షకా నీకు ఇంకా మిగలదు వెరపు 

అని కళ్లకు కట్టినట్టు వర్ణించారు.
మరో సుప్రసిద్ధ కవి వానమామలై జగన్నాథాచార్యులు నిజాం నాటి రైతుల కష్టాల గురించి ఏకంగా రైతు రామాయణం అనే కావ్యమే రాశారు.
      గూడ అంజయ్య రాసిన ‘ఏటికేతం బట్టి’ గేయం కూడా రైతుల కష్టాలకు అద్దం పట్టింది.
ఏటికేతం బట్టి
ఎయి పుట్లు పండించి
ఎన్నడూ మెతుకెరుగనన్నా!
నేను గంజిలో మెతుకెరుగనన్నా
నాదేటి బతుకాయరన్నా
నాడె సావకపోతిరన్నా 

      ఇలా ఉంటే రైతుల దుస్థితి చూసి ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ప్రపంచీకరణ దెబ్బకు తల్లడిల్లుతున్న రైతును గురించి నందిని సిధారెడ్డి బహు(ళ) దాహం కవితలో చక్కగా వర్ణించారు!
ఇక్కడ విత్తనాలు వానిష్టమేనట
వాడిష్టంతోనే ఇక్కడ పంట పండాలట
భూమ్మనదే కష్టమ్మనదే
ఒచ్చే సర్వసంపద మాత్రం వాడిదట 

      అని ప్రపంచీకరణ మాయాజాలంలో పడి కొట్టుకుంటున్న రైతును గురించి ఆయన చెప్పారు.
      నీ దేశంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో చెబితే, నీ దేశ భవితవ్యం ఏమిటో నేను చెబుతాను అన్నట్టు ఉంటుంది వ్యవ(సాయ)హారం!
      కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్‌.గోపి అందించిన ‘అపరాధగీతం’ అందరినీ ఆలోచింపజేస్తుంది.  
తెలిసిందా పత్తి కూడా చంపుతుందని
పురుగే కాదు.. పూవు కూడా చంపుతుందని
చావు తోరణాలతో వేయి శిరస్సుల దళారీవ్యవస్థ ఊరేగుతుందని?
తెల్ల బంగారాన్ని కలగంటూ తెల్లారిపోయా
ఆకాశం మోసం చేసింది
విషంకాటు మోసం చేసింది
పత్తికాయ పటాలుమని పగిలింది
కనుగుడ్లు బైటపడ్డాయి!
చచ్చింది వాడుకాదు మనం
అపరాధ కల్లోల జలధిలో మునిగి
నిలువీత ఈదుతున్న నిర్జీవ మృతాత్మలం మనం
అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చారు.
      దువ్వూరి రామిరెడ్డి కృషీవలుడు కావ్యంలో కర్షకుడే కథానాయకుడు. ఈ కావ్యం పీఠికలో ముసలమ్మ మరణం కవి కట్టమంచి రామలింగారెడ్డి
‘‘శోకరసము వర్ణింప వలయునన్న అనుకూల సందర్భం మెయ్యది? క్రొవ్వుకాఱెడి నాయికా నాయకుల ఊహమాత్రమైన కష్టములా? ప్రజలు దినదినము కన్నీరు కార్చుటకైన నవకాశము లేక కుడుచుచుండు పరిపరివిధముల గోడులా? శాంతరసమునకు పోషకమెయ్యది తమకు కష్టము దేనట్టివైన రాజుల యొక్క యుదారచర్యలా? అకట మాడి, మలమల మాడుచు నింటికి వచ్చి వంటసిద్ధము కాకుండినను భార్యపై గోపింపక కన్నులు మూతపడుచుండ, విధిని ధ్యానించుచు ఒక మూల కూర్చుండు పొలము కాపుల యొక్క నడవడియా’’ అని సూటిగా, ధాటిగా ప్రశ్నించారు. విద్వాన్‌ విశ్వం రాసిన పెన్నేటి పాట రాయలసీమ కన్నీటి పాటగా పేరు సంపాదించుకుంది. పల్నాటి సోదర కవులు ‘పేద కాపు’ అనే కావ్యం రాశారు. రైతు కష్టాల గురించి రాసిన వీరిలో ఒకరైన కన్నెకంటి చినలింగాచార్యులు ఆయన కొక్కసెంటు పొలమైనను లేదట రుద్రభూమిలో కాయము సేయగాబడిన కాశ్యపు మూరల మేర తప్ప! అని తమ గురించి రాసుకున్నారు. ఒక కష్టజీవి శ్రమ ఇంకో కష్టజీవికి మాత్రమే అర్థమవుతుంది!
      రైతుల కష్టాలు తీరాయని నమ్మాలంటే ఎలా? వారికి మంచిరోజు ఎప్పుడో రాయప్రోలు సుబ్బారావు పద్యంలో తేలుతుంది!
చెరువు నిండిన దీ యేడు కరవు రాదు
మిరపతోటల కిందాక పరుగు లేదు
అతికినవి పైరులన్నియు నచ్చటచట
సుంకుపోయుచున్నది మొక్కజొన్న యపుడె
పడ్డది విశాఖ కార్తెలో పరిగెవిత్తు
రాలితే క్రొత్త పాతళ్ల త్రవ్వవలెను
ఎదిగినది పిల్ల పెళ్లికి ఎట్టులయిన
యెడ్ల కొట్టమీ యేడ నేయింపవలయు
అన్నారు ఆయన.
      మబ్బుల్ని చూసి బతుకుల్ని పొలాల మీద ఒలకబోసుకున్న రైతన్నల మీద సానుభూతి చూపించారు ఎందరో తెలుగు కవులు. వారందరూ మహానుభావులే. అందరికీ వందనాలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం