కరోనాపై కదనం - ఏప్రిల్‌, 19 పోటీ ఫలితాలు

  • 2107 Views
  • 45Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
నునుపెక్కిన కొండలు
దిగులు మబ్బులు కమ్మిన
విదేశీ ఆకాశంలో
ఎప్పుడు ఉదయిస్తామో
తెలియని ఒంటరి సూర్యులం
పుట్టిననేల పొమ్మన లేదు
ప్రతిభారెక్కలు కట్టుకు వచ్చేశాం
కబళించే కరోనా పడగ నీడలో
పనులు చక్కబెడుతున్నాం
ఒకరి చూపులనొకరం
విశ్వాస దారాలుగా పేనుకుంటూ
విషాద వలయాల మధ్య
విధి లేక బతికేస్తున్నాం
తనువులు శిశిరాలై
ఆశలు రాలిపోతున్నా
మళ్లీ చిగురిస్తాయన్న భరోసాతో
మోడులా మిగిలిపోతున్నాం
గ్రహణాలు మాకు కొత్త కాకున్నా
మృత్యు చీకట్లు ముసిరిన వేళ
పిడికిట్లో శ్వాసలు పట్టుకుని
భయం ముంగిట బిక్కుబిక్కుమంటున్నాం
ఆప్తుల మేఘసందేశాలు
ధైర్యవచనాలు మోసుకొస్తున్నా
ఎడబాటు తీరాల మధ్య
కన్నీటి చుక్కై ఇంకిపోతున్నాం
బరువెక్కిన గుండె వీణపై
స్వదేశీ రాగాన్ని మీటుకుంటూ
నునుపెక్కిన దూరపుకొండల్లో
నిత్యం జారిపోతున్నాం
వేల మైళ్ల దూరంలో
సైనికులై పోరుతున్నాం
లాక్‌డౌన్‌ వేళలో
మీ పడవల లంగరులెత్తి
సమాజాన్ని సంద్రంలో ముంచొద్దు
ఒక్క స్వేచ్ఛా రెక్కనిస్తే
అసంతృప్తి సాగరాలు దాటి
తృప్తిగా తల్లి ఒడిలో
పిల్లలమై వాలిపోతాం
మేమిప్పుడు
మేధావులం కాదు
కాకి గూటిలో నక్కిన
కోయిలలకు వారసులం.
- నల్లు రమేష్, పోలిరెడ్డి పాళెం, నెల్లూరుజిల్లా, 99897 65095

ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
విజయ ప్రస్థానం
సూర్యుడు నిద్ర లేవకముందే
భూమి బాధ్యతను మోసే
అవతారపురుషుడిలా ఉదయించేవాణ్ని
చెట్ల మీద స్వప్నాల్ని కప్పుకుని
కునికిపాట్లు పడుతున్న పక్షుల్ని
ఆకాశంలోకి తరిమేవాణ్ని
రోడ్డు బద్దకంగా ఆవలిస్తుంటే
నా నడకతో మేల్కొల్పేవాణ్ని
ఎక్కడో తప్పటడుగులు వేశాను
ప్రకృతి హృదయం లోతుగా గాయపడింది
ఒక్కసారిగా కాలం నాలుగు గోడలుగా మారి
నన్ను నిర్బంధించింది.
అయినా అంతటి ఉద్గ్రంథ చారిత్రక మానవుణ్ని
ఇంట్లో బంధించగలరా?
సమస్యల ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుని
తెలియని ఒంటరితనాన్ని మోస్తున్నవాడికి
ఈ క్వారంటైన్‌ భారమవుతుందా?
జీవన వ్యాకులతలు చుట్టుముట్టి
సమూహంలో సంచరిస్తున్నా
మనసుగదిలోని ఏకాంతాన్ని ఎవరెత్తుకెళ్లగలిగారు!
ఈ ఐసోలేషన్‌ను అనుభవించలేనా? 
జీవనకాసారంలో తెరచాప లేకుండానే
పయనిస్తున్న సాహస నావికుణ్ని
మృత్యుసంద్రంలో ముంచేయగలవా?
పర్వత శిఖరాగ్రాలమీద
చిరునవ్వులు నాటినవాడిపై
దుఃఖపు రాళ్లవానను కురిపించగలవా?
శూన్యంలో పాదంమోపి
అస్తిత్వపతాకను ఎగురవేసినవాణ్ని
అదృశ్యం చేయగలవా?
ఎన్నెన్ని యుగాల ముళ్లదారుల గుండా
కదలి వచ్చాను!
కనిపించని క్రిమికి బలవుతానా?
ఇప్పుడు ఆత్మప్రక్షాళన గరళాన్ని
మింగుతున్నాను
లోకమా! నువ్వెన్ని తాత్విక పాఠాలను నేర్పావు
కాలమా! నువ్వెన్ని కఠిన పరీక్షలు పెట్టావు.
నేనెప్పుడైనా ఓడిపోయానా?
ఇప్పుడూ ఓడిపోతానా?
విజయం ఎన్ని అడుగుల దూరమో లెక్కిస్తున్నా..!
- డా.ఎస్‌.రఘు, హైదరాబాద్, 98482 08533

ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
భయం మేయని కంచె..
కంటికి కనిపించని క్రిమి కన్నా
అణువణువూ వ్యాపించే భయమే
నిబ్బరాన్ని నిర్వీర్యం చేస్తోంది!
గడియకో సంఖ్య మొత్తాలకు
మరో కూడికవుతున్నపుడు
మనసు పల్సు రేటు భయంగా తీసివేత లెక్కలేస్తోంది..
బతుకు పోరాటాల్లో ఎదురొడ్డి నిలిచిన
పిడికెడు గుండె
ఇప్పుడు భయంతో వెనక్కి పరిగెడుతోంది..
భయం మరణం కన్నా చెడ్డదేమో..!
అది నిన్నే కాక నిన్ను నమ్ముకున్న వాళ్లనీ..
చీకటి చెరల్లో బందీలను చేస్తుంది
ధైర్యం వహించు..
నిరాశ పేర్చిన చెదలను తొలగించి
మనసు ముంగిలి గడపకు కొత్త రంగులద్దించు..
అలసి సొలసి నీరసించి
నిర్లిప్తం చెందిన నీ మెదడుకింత
నిత్య చైతన్యపు కణికల ముద్ద తినిపించు..
దౌడు తీసే గుండెకు కౌన్సెలింగ్‌ కళ్లెం వెయ్యి..
నీలోకి నువ్వు వెళ్లు
నిశ్శబ్ద తరంగపు అలల్లో
నిశ్చలంగా తేలియాడి
బరువెక్కిన మనసుని తేలికపరచు
అణువణువునా ఆత్మస్థైర్యపు ఊపిరులూదు
స్ఫూర్తి నింపిన దిమ్మెలు పాతి నీ మనసు చుట్టూ
భయం మేయని కంచెను అల్లుకో..
ఆశల దారాల్ని ఒక్కొక్కటిగా పెనవేస్తూ
నిరాశా నిస్పృహల గొంతు బిగించు..
నీకోసం శ్రమించే,
నీకు చేయూతనందించే చేతులెన్నో ఉన్నాయని గుర్తించు
నీ మనోధైర్యమే
నీ కుటుంబానికి కట్టని రక్షరేకుగా
నిన్ను నువ్వు మలచుకో..
కరోనాని ఖతం చేసే
ఈ మహా క్రతువులో నిర్భయంగా పాలుపంచుకో..
- దుడుగు నాగలత, సిద్దిపేట, 96523 71742

ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
ఇంటివైపు...
ఏడ్చిన ప్రతిసారీ భుజాన ఎత్తుకుంది
నవ్విన ప్రతిసారీ గాలిలో ఎగరేసింది
బాల్యాన్ని భద్రపరుచుకున్న ఇల్లొక జ్ఞాపకాల నిధి!
తడబడే పాదాలను ఎదపై మోసింది
నిలబడేదాక సహనంతో ఎదురుచూసింది
పరిగెత్తడం నేర్చాక తృప్తిగా ఊపిరి పీల్చుకుంది!
గాయమైన ప్రతిసారీ మట్టితో మందు రాసింది
ఒంటరిగా ఉన్నప్పుడు నేలఒడిలో హత్తుకుంది
నలుగురితో ఉన్నప్పుడు నవ్వులా విరిసింది!
లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఉండటం నేర్పింది
ఉన్నప్పుడు నలుగురికీ పంచే గుణాన్ని నేర్పింది
తాళమేసి వలసెళ్లినప్పుడు ఒంటరిదై వేచిచూసింది!
వెన్నులేని ఇల్లు అచ్చంగా మా అమ్మ దేహమే
బీటలువారిన గోడలు స్వచ్ఛంగా నాన్న ఎముకలే
పగుళ్ల నుంచి మొలకెత్తిన గడ్డిపోచలు తీపిగురుతులే!
వర్షంలో పడవలా మారినా
ఎండకు ఎండుటాకులా రాలినా
పచ్చని చెట్టులా నిలబడుతుంది మా ఇల్లు
మూరెడు వాకిలైనా అల్లుకున్న ముగ్గుతో
విశాలమైన హృదయంతో స్వాగతం పలుకుతుంది!
అందుకే...
ఎంత దూరం వెళ్లినా ఇంట్లో పడితేనే తృప్తి
ఎన్ని దేశాలు తిరిగినా ఇల్లే అసలైన తడి,
చావైనా, బతుకైనా ఇంట్లోనే
అడ్డంకులెన్నైనా మా పాదాలు ఇంటిగుమ్మం వైపే,
ఇప్పుడిలా ఇంట్లో కదలకుండా ఉన్నామంటే
కరోనా కట్టడి కావచ్చు కానీ
ఇంటిగుండె నిండుకుండలా ఉంది!
- పుట్టి గిరిధర్, మహబూబ్‌ నగర్, 94914 93170


ప్రోత్సాహక బహుమతి (2)
జీవించడం నేర్చుకుందాం
ఉపద్రవం ఊపిరి తీయడం మొదలెట్టాక
జీవించడం కొత్తగా నేర్వాల్సిందే!
కాలిపోయిన కలలకై వగచడం మాని
కొత్త స్వప్నాల్ని గుండెకు తగిలించుకోవాల్సిందే
కాలం మాటున మరుగునపడిన
గతవైభవాన్ని ఒడిసిపట్టుకుని
కొత్తపాఠాల్ని అభ్యసించి
బతుకుకు ప్రేమరంగు పూయాలిప్పుడు!
ఒకరికొకరై మెలగడంలోని మాధుర్యాన్ని
ఆస్వాదించాల్సిందే!
మనిషితనానికి రెక్కలు తొడిగి
సాయం చెయ్యడంలో తృప్తిని
సొంతం చేసుకోవాలిక!
కల్మషమంటని మనసుతో
మానవత్వాన్ని చాటుకోవాల్సిన
సమయం కదా ఇది
నువ్వైనా నేనైనా స్వార్థాన్నొదిలి
మనిషిగా మారాల్సిన తరుణమిది
రండి సాటివారితో ప్రేమతాడుని 
ముడేసుకుందాం
లేమితనపు చీకట్లలో
వసివాడుతున్న బతుకుల్లో
కాస్తయినా వెలుగు నింపుదాం!
ఆకలితో అల్లాడుతున్న భిక్షువుల్ని
దిక్కుతోచని పరిస్థితులోకి
నెట్టెయ్యబడ్డ వలసదారుల్ని
కొంతైనా ప్రేమిద్దాం!
- కడెం లక్ష్మీ ప్రశాంతి, చర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 78933 99773


ప్రోత్సాహక బహుమతి (3)
మనిషెప్పుడూ అజేయుడే...!
భూగోళాన్ని కరోనాగ్రహణం పట్టినవేళ
చీకటిని చీల్చే వెలుతురు ఖడ్గం అక్షరాలు
బతుకులు భయం బందిఖానాలో బందీలైతే
మనిషిచేతిలో ధైర్యమనే ఆయుధం అక్షరాలు
కనపడని శత్రువు కత్తులు దూస్తున్నప్పుడు
లోకపు అస్తిత్వపోరులో రక్షణకవచం అక్షరాలు
ఒంటరి యుధ్ధభూమిలో గీతోపదేశం అక్షరాలు
స్వీయగృహ నిర్బంధంలో
ఒంటరితనంపై వాలిన సీతాకోకలు అక్షరాలు
ప్రపంచవీక్షణపు వార్తల రెక్కలు అక్షరాలు
మనిషిని మనిషి తాకలేని దుస్థితిలో
ఆత్మీయ కరచాలనం అక్షరాలు
ఇంటిపనిలో అమ్మ అలసినప్పుడు
ఓదార్పు అనురాగతెమ్మెర అక్షరాలు
ముఖాలకు మాస్కులు తగిలించే వేళ
లోపలి ముసుగులు తొలగించే అక్షరాలు
అరచేతులడ్డుపెట్టి ప్రాణదీపాలను కాపాడే
వైద్యుల చేతిలో స్టెతస్కోపు అక్షరాలు
బతుకుకూడలిలో సిగ్నల్‌ దీపాలై కట్టడిచేసే
పోలీసు చేతిలో లాఠీ అక్షరాలు
చెత్తవీధులకు శుభ్రత వెలుగులద్దే 
పారిశుద్ధ్య కార్మికుల చేతిచీపురు అక్షరాలు 
త్యాగాలపొద్దులో నిత్యం ఎగిరే
సేవాజెండాలకు సెల్యూట్‌ చేస్తూ అక్షరాలు
లాక్‌డౌన్‌ వేళ ఆకలితో అలమటించే పేదలకు
అక్షయపాత్ర అక్షరాలు
కాలానికి లోకానికి నడుమ ఛిద్రమయ్యే
అమాయకుల పక్షం పోరాడే అక్షరాలు
కరోనా కన్నీటిని తుడిచే అమ్మచేతులు అక్షరాలు
మట్టిఘోష అక్షరాలు! మనిషితనపు భాష అక్షరాలు!
అక్షరాల పక్షుల్ని ఎగరేస్తూ కవుల కలాలు
ప్రబోధాత్మక గీతాలై గాయకుల గళాలు
లోకాన్ని ఎన్ని విపత్తుల నుంచి
విజయతీరాలకు చేర్చలేదు
నేడు ‘కరోనాపై కదనం’లో కవాతుచేస్తున్న అక్షరాలు
ఊరూరా ఎగిరే చైతన్యకవిత్వ పతాకాలసాక్షిగా 
మనిషెప్పుడూ అజేయుడే
సరికొత్త లోకపు దారులు ఆవిష్కరిస్తూ...!!!
- సరికొండ నరసింహారాజు, నాగార్జునసాగర్, 93982 54545


ప్రోత్సాహక బహుమతి (4)
మనిషి తయారయితున్నడు
నరవాసన తగిలి
పావురాళ్ల గుంపు ఎగిరిపోయిన మైదానంలా
వీధులన్నీ నిశ్శబ్ద గీతం ఆలపిస్తున్నయి
రేసుగుర్రాలై అటూ ఇటూ పరుగెత్తే మనుషుల్ని
గంపకింద కమ్మినట్టు
ఇంట్లో పడేసి ఇంటిచుట్టూ కాపుగాస్తున్నయి
ఇవాళ ఇండ్లన్నీ గుట్టు దాచిపెట్టిన పిడికిళ్లు
సూర్యుడొదిలే సురుకు బాణాలు
గాలి మోసుకొచ్చే పూపరిమళం కూడా చొరబడని ఇంట్ల
నెలంత సెలవు దొరికిన ఆదివారం
పిల్లలు అల్లరి సంగీతం వాయిస్తున్నరు
అతడేమో ఆమె కడుగుతున్న అంటుపాత్రలల్ల
సబ్బునురగ అయితున్నడు
ఆమె వొండుతున్న గిన్నెడు వంటకవిత్వంల
చిటికెడు ఉప్పయి రాలుతున్నడు
భూమినొదిలి చంద్రమండలంపై అడుగుపెట్టిన వాడు
గ్రహరాశుల గమనం లెక్కపెట్టిన వాడు
తుపాను రాకపోకడ కనిపెట్టిన వాడు
శతకోటి దరిద్రాలకు
అనంతకోటి ఉపాయాలు తెలిసిన వాడు
సాటిమనిషికి సాయపడని
రెక్కలు కట్టుకుని ఎగిరిన వాడు
కాసేపు ఆగితే కాలాన్ని బంధించేవాడు
ఇప్పుడు
కాలం చేతిల బందీ అయ్యి మూలన కూర్చున్నడు
ప్రకృతి మీది మనిషి అధికారం భళ్లున పేలుతున్నది
ఎంతటోనికయినా ఎదురుదెబ్బ తప్పదని
రుజువయితున్నది
కాస్త ఉండు
లాక్‌డౌన్‌ తాళం కప్ప
మనిషిని తయారు చేస్తున్నది
ఇవాళ ప్రపంచమంతా
అమృతం చిలుకుతున్న సాగర మథనమయితున్నది
చూస్తూనే వుండు
కరోనా గర్వభంగం ముందున్నది.
- గజ్జెల రామకృష్ణ, భూదాన్‌ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా, 89774 12795


ప్రోత్సాహక బహుమతి (5)
దృశ్యం
పక్షులన్నీ గూట్లో ఒక్క చోట చేరి
ఉభయ కుశలోపరి మాట్లాడుకుంటున్నట్టు
గద్దను చూసి కోడిపిల్లలన్ని తల్లి పొదిగిట్లో దాక్కున్నట్టు
మరిచిపోయిన బంధాల మాటున
ఎప్పుడో జారవిడుచుకున్న మాటల మూటల్ని విప్పుకుని 
మనసుల్ని విప్పుకుంటున్న మరపురాని దృశ్యం.....
దూరాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవాలో
రక్షణ కవచాలని ఎలా సిద్ధం చేసుకోవాలో
యుద్ధ వ్యూహానికి సామూహిక ప్రణాళికలు రచిస్తున్నట్టు
వీపు చరుచుకుని మానవ పిట్టలన్నీ 
భయాన్ని పారదోలటానికి ధైర్యం గోడ మీద సమావేశమైనట్టు 
ప్రమాద విశ్లేషణకు నిరంతర ప్రయత్నం చేస్తున్నట్టు....
చాలా కాలం తర్వాత 
ఆర్దమ్రైన గుండె తడిని 
కంటికొలకులు ప్రతిబింబించటానికి 
ప్రయత్నిస్తున్న అపురూప దృశ్యం-
దొరక్క దొరక్క దొరికిన విశ్రాంతి గదుల్లో 
ఎన్నాళ్లకో కలిసి ఆడుకుంటున్న తండ్రీ కూతుళ్లు
బయటకెళ్లి ఆడుకుంటామని మారాం చేస్తున్న 
కొడుకుల్ని వారించే తల్లుల ప్రేమానురాగాలు
నిరంతర ప్రపంచ వార్తా జలపాత ప్రవాహాల్ని
ఇళ్లలోకి ఒంపుతున్న టీవీలు
కరోనా ఊసు వదిలేసి పచారీ లెక్కలేసుకుంటున్న ఇళ్లు
ఉప్పు పప్పుల రోజు వారీ లెక్కల్లో నారీమణులు
సగం జీతం సంచిలో ఇరుక్కున్న మారటోరియం 
కాగితాల్ని ఏరుకునే పనిలో సగటు జీతగాళ్లు
పగిలిన గుండె గది గోడల్ని
మాటల తాపడం చేసైనా తిరిగి కట్టాలనే పశ్చాత్తాపంలో
ఓ మారిన మనసు తాపత్రయం
భక్తో లేక భయమో దేవుడి పటం ముందు ఇంకొంచెం 
మోతాదు పెంచిన భక్తి దూపం....
పర్యావరణమే కాదు- 
ఇప్పుడు మనసావరణం కూడా శుద్ధి చర్యలు మొదలెట్టింది
గుండ్రని గీతల్లో కంచె లేసుకున్న దుకాణాలు
సామాజిక దూరంలోనే పిచ్చాపాటిలో జనాలు...
వీటన్నింటితో పాటు-
ఒంటరితనాన్ని విరబోసుకున్న నగరాన్ని 
కరోనా కాటు నుండి తప్పించటానికి
కంటికి రెప్పలా కాపు కాస్తూ భరోసా ఇస్తున్న 
రౌద్రం ఒకవైపైతే
ఊపిరి ఉనికికి ప్రాణదానం చేసే క్రమంలో
ప్రాణాలు కూడా ఖర్చు ఖాతాల్లో జమేస్తున్న 
వైద్యనారాయణులు మరోవైపు
ఇవేవీ పట్టని అమాయకత్వం స్వచ్ఛమైన బాల్యమై 
రోడ్లమైదానాలను క్రికెట్‌ పిచ్‌లు చేసేసి 
ఆనందాన్ని ఆటగా ఆడేస్తోంది.....
- దాకరపు బాబూరావు, తిరువూరు, కృష్ణా జిల్లా, 98489 93599


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష