కరోనాపై కదనం - ఏప్రిల్‌, 22 పోటీ ఫలితాలు

  • 1977 Views
  • 30Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
మనిషి ఒక్కడే అజేయుడు
ఈ నేల మీద
వైరస్‌తో పోరులో
మనిషెప్పుడూ గెలుస్తూనే ఉన్నాడు
అతి చిన్న, కంటికి కనిపించని నలుసు
విలయం సృష్టిస్తూ
ఎక్కడ అదృశ్య దాడి చేస్తుందోననే
భయంతో
పిడచకట్టుకుపోయిన నాలుకలు కొన్ని
మాటలపొదుగులో మౌనంగా
ఈదులాడుతూ
కనిపించని శత్రువును ఎదుర్కొంటున్నాయి...
సృష్టికి ప్రతిసృష్టి చేసిన మానవుడు సైతం
నలుసు పెత్తనం నిరాఘాటంగా
సాగిపోతున్నప్పుడు
తన వాకిలి ముందు జీ హుజూర్‌
అంటున్నాడు.
ఎన్నో తరాల భక్తి, విశ్వాసాలు పటాపంచలై
తెల్లకోటుకు దండాలు పెడుతున్న దేహాలు
ఇప్పుడిక.. ద్వేష గీతాలకు చరమగీతం పాడి
అంతా ఆరోగ్యంతో బతికుండాలని
ఆశీర్వదిస్తున్నాయి.
నలుసు పంజాదెబ్బకు
బృహస్పతి సలహాలూ
నిర్దయగా నిర్వీర్యమై పోతున్నప్పుడు
శుభ్రత, భద్రత, ఐక్యత,
భౌతిక దూరాలే ఆయుధాలుగా
మనుషుల శ్వాసకు
రక్షణ వలయాలవుతున్నాయి.
ఇప్పుడు.. యుద్ధమంటే కత్తులతో
మృత్యు విన్యాసం చేయడం కాదు
ఇప్పుడు.. యుద్ధమంటే
ఏ అర్ధరాత్రో బాంబులు 
నివాసాల మీద గుమ్మరించి
టీవీ ఛానళ్లలో చర్చలు చేయడం కాదు.
ఇప్పుడు యుద్ధమంటే
ఇంటిపట్టునే ఉండి
ఎవరిలోకి వాళ్లం నడుస్తూ ఉండటం..
దేహం దేహమే నిలువెల్లా రిక్కించి
దేహాణువుల్లోంచి చైతన్యపు నిప్పును
లావాలా ప్రవహించడం...
ఇప్పుడు యుద్ధమంటే
మానవ మేధస్సుదే అంతిమ విజయమని
ప్రకటించడం...
పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదని 
నమ్ముతున్న వాళ్లం కదా!
అందుకే మనిషి అజేయుడు!
మనిషి ఒక్కడే అజేయుడు!!
- విల్సన్‌రావు కొమ్మవరపు, హైదరాబాదు, 8985435515
ఈ కవితను వినాలనుకుంటే...

ద్వితీయ బహుమతి
లాక్‌డౌన్‌
భూమి సూర్యుని చుట్టూ 
తిరుగుతుందో లేదో కానీ 
గ్లోబ్‌ గ్లోబంతా మూతికి బట్ట కట్టుకుని 
కరోనా చుట్టూ తిరుగుతోంది 
భయం గుప్పిట్లో నిద్రపోతూ 
క్షణక్షణానికి ఉలిక్కిపడుతూ 
ఎవరు చేసిన పాపమో 
ఇప్పుడు మళ్లీ మళ్లీ కడుక్కుంటోంది 
ఇప్పుడు కాలం మాత్రం స్తంభించింది 
చీకటిని మోసుకొచ్చిన వసంతం 
ఇప్పుడు చిత్రమైన గాలులు వీస్తోంది 
మనల్ని మనకే అపరిచితుల్ని చేసి 
‘క్వారంటైన్‌’గా అవతరించింది 
మన నిఘంటువులో కొత్త ఆరోపం 
ఎన్ని సందర్భాలను చూడలేదూ 
ఎన్ని ఉప్పెనలను ఎదురీదలేదూ
మరెన్ని యుద్ధాలను దాటిరాలేదూ 
కలరా, గత్తర, ప్లేగూ, ఎబోలాలను 
గడప దాటించింది మనమే 
మలేరియా పోలియోలను బోర్డర్‌దాకా 
తరిమి తరిమి కొట్టిందీ మనమే 
ఇప్పుడు ఈ కొత్త యుద్ధంలో 
సైనికులై ఎదురు నిలుస్తున్నదీ మనమే 
అచ్చంగా ఇది అపూర్వ యుద్ధం 
నిఖార్సుగా ఇది కొత్త భాష 
ఐసోలేషన్‌ సామాజిక దూరం 
తెలిసిన భాషే అయినా 
అన్నీ కొత్త కొత్త అర్థాలు 
అంతటా లాక్‌డౌన్‌ పర్వాలు 
ఒక్క కలంపోటుతో 
అకస్మాత్తుగా ఉన్నట్టుండి 
ఊరు నడక ఆగిపోయింది 
ఉన్నపళంగా ఇప్పుడు 
మనిషికీ మనిషికీ మధ్య 
భయం గోడ పెరిగిపోయింది 
దేహపు నడకే కాదు 
దేశపు చలనమూ ఆగిపోయింది 
దేశానికి పర్యాయపదం 
దేశమంటే ఇప్పుడు 
సెల్ఫ్‌ క్వారంటైన్‌ గృహ సముదాయం.
- డా।। పత్తిపాక మోహన్, సిరిసిల్ల, 9966229548
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
జీవితాన్ని వెతుక్కుంటూ..!
నిశ్చలమైపోయిన 
బతుకులో ఇప్పుడు జీవితాన్ని వెతుక్కుంటున్నారు
నిశ్శబ్దం యింత నిర్వీర్యం చేస్తుందా
అనుకుంటూ రేపటిని అంచనా వేస్తున్నారు
ఎడారిని తలపిస్తున్న నగర వీధులన్నీ
ఒకప్పుడు జననదీ ప్రవాహాల్లా పారేవి
పచ్చని పొలం లాంటి పల్లెలు 
భయం గుప్పిట్లో నెర్రెలు బారిన నేలలా ఉన్నాయి
రేపటి వెలుగును ఆశిస్తూ జనం
కలత నిద్రలో కలవరపడుతున్నారు
కల్మషాలు లేని చిరునవ్వుల ప్రపంచం
ఇప్పుడు తాడుని చూసినా పామనుకుంటోంది
గాయాలని ప్రేమించిన మనిషి
అనుమానంతో అసహనం కుమ్మరిస్తున్నాడు
స్వార్థ నదిని ఈదీ ఈదీ
అలసి నిర్బంధంలో నింపాది అయ్యాక
ఇప్పుడు దానం, ధర్మం గుర్తుకొస్తున్నాయి
మనసులు విప్పారుకున్నాక మమతలు చిగురిస్తున్నాయి
క్రిమి భయమో, వ్యాధి భయమో 
నేడు గది కుటుంబాన్ని రెక్కల్లో పొదువుకుని
మూల కూర్చున్న దిగులుపక్షిలా ఉంది
బలవంతులయిన మనుషులు ఇప్పుడు
క్రిమిని బలహీన పరచడం ఎలాగో 
మేధామధనం చేస్తున్నారు..
ఎలాగోలా యుద్ధం ముగిశాక
ఆకలి కేకలతో అర్రులు చాచని ఆకాశం కోసం 
మార్గాలు అన్వేషించడంలో మునిగారు
కరోనా మనకిప్పుడు ఏ సమాధానాలూ బోధించలేదు
మనిషి పునరుజ్జీవనం కావడానికి 
అనేక ప్రశ్నలు మాత్రమే రేపింది..!!
- డా।। పెరుగు రామకృష్ణ, నెల్లూరు, 9849230443
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
నా అడుగు ప్రగతివైపు!!!
ఏదో తెలియని స్తబ్ధత లోకమంతా పరచుకుంది
భవిష్యత్తు ఏంటో తెలియని అమాయకత్వం
అప్పుడే పుట్టిన ఆడబిడ్డలా వెర్రిచూపులు చూస్తోంది.
మనిషిని మనిషి ఆత్మీయాలింగనం చేసుకుని
కోట్ల యుగాల క్షణాలయినట్టుంది.
మనసుతో మనసు కలబోసుకుని చెప్పుకునే ఊసులన్నీ
ఊరవతల ఈతచెట్టు కొమ్మ చివరన
పిచ్చికగూళ్ల కన్నాల్లో జోగుతున్నాయి.
స్వీయనిర్బంధం పేరుతో ఒకే ఇంట్లో ఉన్నా
అదేం విచిత్రమో! స్వేచ్ఛ హరించబడిన కాందిశీకుల్లా
న్యూస్‌ పేరుతో నాలుగు దిక్కులూ వీక్షిస్తున్నాం.
మనసును తాకే అనుభూతి కోసం వెతుకులాట.
తనువు పులకించే ఆత్మీయ స్పర్శ కోసం ఆరాటం.
లాక్‌డౌన్‌ నిర్బంధ పంజరంలోంచి
లాకవుట్‌ స్వేచ్ఛా ప్రపంచంలోకి
రెట్టించిన ఉత్సాహంతో ఎగిరిపోయే క్షణం కోసం
కుటుంబ పక్షుల అనంత నిరీక్షణ
అయితేమాత్రం?
ఎక్కడ వేసిన చేయి మహమ్మారి కరోనాకి ఆధారమవుతుందో.
ఎక్కడ పీల్చిన గాలి శరీర వాహకమవుతుందో.
ఎవరిని తాకిన స్పర్శ మనని ఆవహిస్తుందో..
భయం కొరకంచు నరనరాన్ని కాల్చుతున్న గాయాలు
ఇంకెంతో దూరం లేదన్న నిరాశపై నివురు కప్పుతూ.
ఈలోగా ఒక్క మంచిపనైనా చేయాలి.
దేవుని డాక్టర్‌ చేతికి ప్లాస్టిక్‌ తొడుగందించినా చాలు.
పారిశుద్ధ్య కార్మికుని చీపురందుకున్నా చాలు.
పోలీసు సేవకునికి గొడుగుపట్టినా చాలు.
రైతన్న పంటకు కాపునైనా చాలు.
అవును... నాకిప్పుడు కరోనా భయం లేదు.
మానవత్వపు కవచాన్ని కప్పుకుని
లోకైక సేవకై నిర్భయంగా 
నా అడుగు ప్రగతివైపు.
- కొత్తపల్లి ఉదయబాబు, సికింద్రాబాద్, 9441860161


ప్రోత్సాహక బహుమతి (2)
ఆశల ప్రయాణం
ఓ ప్రయాణం మొదలైంది
గమ్యం తెలియని పోరులో
గోరుముద్దలు కరువై గుండె బరువై
జోల పాటలు వెక్కిరించేలా
ఓ పసి హృదయం ప్రయాణం మళ్లీ మొదలైంది..
అమ్మ ఒడిలో నడిచే పాదాలు
నాన్న గుండెలపై సవ్వడులు
పాలబువ్వ తినే గారాలు
రహదారులపై దుఃఖిస్తున్నాయి
మట్టిని ముద్దాడే వయసులో
పండు వెన్నెల్లో పవళించే సమయంలో
చెమటగా పాలచుక్కలు చిందిస్తూ
ఓ పాల బుగ్గల పయనం మళ్లీ మొదలైంది..
చిన్నజీవి చేసిన విధి విచిత్ర పోరాటంలో
జీవితమనే మజిలీ ఆరాటంలో
బాల్యపు ఛాయల ఊసులను మోసుకుంటూ
చిగురించే చెలిమిని ఆర్ద్రతగా వదిలేసి
ఆటలు పాటలు మృగ్యమై
కన్నీటి బిందువులను చిలకరిస్తూ
ఓ వసివాడని కాలిబాట మళ్లీ మొదలైంది..
ఆనందాలను ఆవిరి చేసి
సంతోషాలను సంతకు అమ్మి
కనుపాపలపై మబ్బులు ఆవరించి
హుషారుతనానికి జడత్వం వచ్చి
పాదరసంలా కదిలే పచ్చి పాదాలకు
బెరుకుతనం పల్లేరుకాయల్లా గుచ్చి
ఎండమావులు ఎదురొచ్చేలా
ఓ నడక మళ్లీ మొదలైంది..
బోసి నవ్వులు మాయమై
కాలి బొబ్బలు ఖాయమై
ఆశల అలలపై ఊరేగి
కమ్మని కలలకై కనులారా
బతుకు చిగురు చిగురించేలా
ముళ్లబాటను ఎదుర్కొని
పూలబాటను పరచుకునేలా
ఓ ఆశయపు నడక మళ్లీ మొదలైంది..
కష్టాలను కౌగిలించుకుని
దుఃఖాలను చెలిమి చేసుకొని
కరోనా జ్ఞాపకాలను జీవిత పాఠంగా
భవిష్యత్తు నవ్వులను ఏరుకునేలా
ఓ ప్రయాణం మళ్లీ మొదలైంది..
- మల్క జనార్దన్, భీమ్‌గల్, నిజామాబాదు 9866159005


ప్రోత్సాహక బహుమతి (3)
మూడుతరాల పాఠం
పెద్దలు
ఇంట్లో ఖాళీగా ఉండే బదులుగా
రేపటి తరమైన మీ పిల్లలకు
మీ మూడు తరాల కథను
భాగాలు భాగాలుగా కత్తిరించి
వాక్యాల వారధి కట్టండి.
పుస్తకాల్లో లేని సిలబస్‌ను
టీచర్లు చెప్పలేని అనుభవాలను
ఏ ప్రయోగశాల నేర్పలేని పాఠాలను
ఏ సమాజం ఇవ్వలేని జ్ఞానాన్ని
మీ ఇండ్లలో మీరే
వంతులేసుకొని పాఠాలు పాఠాలుగా చెప్పండి.
మీ తాతవ్వల సుద్దులను సింతొక్కు
తిన్నంత కమ్మగా
మీ అమ్మానాన్నల పడబాట్లను
కలెంబలి తాగి బత్కిన బత్కులను
మీ జీవిత సాధకబాధలను
పూసగుచ్చినంత సుతారంగా అల్లి చెప్పండి.
అద్దరూపాయి కూలీకి
పొద్దుముక్కులు మట్టిమోసి కలుక్కుమన్న
పాత రోజులను నెమరేయండి
యాభై రూపాయలకు
యాడాదిపాటు గాసంచేసిన గడ్డుకాలాన్ని
పిల్లల వాకిండ్లముందు సాన్కెజల్లండి.
ఊరంతా పండగజేస్తుంటే
ఉగాదినాడు సెంబునీళ్లుతాగి
ఉపాసం పండుకున్న ముచ్చటేదైనా ఉంటే చెప్పండి.
బువ్వలేక గంజితాగి
పడుకున్న రాత్రులను గుర్తుచేయండి
రొట్టెదొరకని కాలంలో
ఈతపండ్లుతిని మోటగొట్టిన
మునుపటి దినాలను ఎరుకచేయండి.
కుంచెడు గింజలకు ఆరుఎకరాల మాగాణం
రాసిచ్చిన కాయిదాలను చూపించండి
రొట్టెదొరక్క కానిదేశం వలసబోయి
మూడొందల కిలోమీటర్లు నడిచిన బాటల
సంగతులను యాదిజేయండి.
ఆ ఊరు ఈ ఊరు తిరిగి
మూడు ఊర్లలో పొయ్యిబెట్టి
ముప్పుతిప్పలు పడిన యతలను కథలుగా రాయండి..
రోగమొస్తే సంకలున్న పిల్లల్ని సంపుకున్న
పొద్దులను గొత్తుచేయండి
పాసిన బువ్వకు పొద్దంత పనిజేసిన
కన్నీటి తలపోతలను తెల్పండి.
మీ పిల్లలకు
ఏ కథలొద్దు
మీ కథలే చెప్పండి
మీ కథలకు మించిన కథలు
ఈ ప్రపంచమంత వెతికినా దొరకవు.
- అవనిశ్రీ, దాసరిపల్లి, గద్వాల, 9985419424


ప్రోత్సాహక బహుమతి (4)
 రక్షాబంధనం
సిస్టర్‌ అంటూ పిలిచినప్పుడే ఆమె
తోడబుట్టని సహోదరి అయిపోయింది
చిరాకు పెడుతున్నా చిరునవ్వు రువ్వినప్పుడే
ఓడిపోని ఓర్పునకు ప్రతిరూపమయ్యింది
అవును నర్సమ్మ గురించి నాలుగు మాటలు చెప్పాలనుంది
సందర్భం వచ్చినప్పుడైనా మంచిమాటలు పంచుకోకపోతే
మానవత్వం మార్చురీ గదిలోనే మగ్గిపోతుంది
ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడైనప్పుడు..
వెంటుండి సాయమందించే వీళ్లంతా దేవదూతలు కారూ
అసహ్యం లేకుండా అసహాయులను ఆదుకునే ఔదార్యం..
ఆమెని ఆసుపత్రిలో అందరికీ ఆత్మబంధువుని చేసింది
ఏ సంబంధం లేకున్నా ప్రేమగా పలకరిస్తూ ...
గాయాల మీద దూది పూలు పూయిస్తూ హాయినిస్తుంది
ఒళ్లంతా జ్వరంతో కాలిపోతున్న రోగికి ..
తనని తాను తడిగుడ్డలా పిండుకుని
దేహాన్ని తుడిచే ఓదార్పు అవుతుంది
రాత్రంతా నిద్ర మేల్కొని కాపు కాసే ఆ చూపులు
సెలైన్‌ సీసాలో నీటిచుక్కలై నీరసాన్ని తరుముతాయి
ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరయ్యే ఉత్పాత క్షణాలలో ప్రాణవాయువై ప్రసరించి జీవన దీపాన్ని నిలబెడుతుంది
సమయ పాలనతో మందులందించి సాయం చేస్తూ
రోగాన్ని మాయం చేసే కరుణ తొడిగిన చేతులవి
కరోనాతో జరుగుతున్న యుద్ధంలో 
ఆమె లాంటి వాళ్లిప్పుడు
కవచకుండలాలు ధరించని కర్ణుడిలా..
కారుణ్యం నిండిన గుండెలతో.. కర్తవ్యం చేతపట్టి
కలబడుతున్నారు అడుగడుగునా
క్వారంటైన్‌ సెంటర్లలో కోవిడ్‌ ఆసుపత్రుల్లో ..
ప్రమాదముందని తెలిసినా ఆగని త్యాగమది
ఒత్తిడిని చిత్తుచేస్తూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన శక్తితో ..
నిలబెట్టిన జీవితాల విలువ తూచి చూసినప్పుడు..
ఆమెకి మనమిచ్చే జీతం ఎంత?
బంధువులెవరూ వెంట రాని ఒంటరి క్షణాలలో 
సైతం ఆత్మబంధువై ఆదుకునే ఆదిశక్తి ఆమె
జననం కంటే ముందే మొదలై.. 
మరణం తరువాత కూడా కొనసాగే 
ఆ సేవలకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం
ఆసుపత్రిలో అడుగు పెట్టినప్పుడే ఆమె తన గుండెని
రాఖీని చేసి లోకం మణికట్టు చుట్టూ కట్టేసిన సోదరి
ఆమెకీ మనకీ మధ్యన సాగేది రక్షా బంధనం..
ఆ పాదాలకి ప్రేమతో వందనం
- గరిమెళ్ల నాగేశ్వరరావు, విశాఖపట్టణం, 9381652097


ప్రోత్సాహక బహుమతి (5)
గుహ కవచం
కెమెరా రెటినా మీద పడుకున్నా.
సీసీ కెమెరాలో బంధించకున్నా.
కరోనా కడలి గర్భంలో దాగిందేమోనని,
కంటి వెలుగుల వల వేసి పట్టాలనుకున్నా.
ఎక్స్‌రేతో పరిశీలించి...
లేజర్‌ కిరణాలతో బుగ్గి చేయాలనుకున్నా. 
భానుడి కిరణ జాలంలో బొంద పెడదామనుకున్నా. 
చుక్కల్లో నక్కిందేమోనని,
నింగికెగసి నలిపేద్దామనుకున్నా. 
కుప్పలు తెప్పలుగా కరోనా బారినపడి మరణిస్తుంటే
చిక్కని ఈ అదృశ్య శత్రువు
బలంగా పుంజుకున్నప్పుడు...
దెబ్బగొట్టే దారి దొరకనప్పుడు. 
దూరం పాటించడమే శరణ్యం. 
చరిత్రలో రుజువు పేజీలు కరవా? 
ఎదురుపడి పోట్లాడితేనే సిపాయి కాదని...
సమయానుకూలంగా ప్రవర్తించిన వాడే...
జవాన్‌ అని. 
ఓడిన రాజులైనా అరణ్యాలలో దాక్కోలేదా...
మళ్లీ సైన్యాలను సమకూర్చుకుని
విజయలక్ష్మిని చేపట్టలేదా! 
అస్త్ర శస్త్రాలను అంటని శ్రీకృష్ణుడు
మంత్ర, తంత్ర, యంత్రాంగ యుక్తులతో... 
భారత యుద్ధంలో పాండవులను విజేతలను
చేయలేదా!
స్వీయ రక్షణకు సింహాలు దూరని గుహల్లో
కుందేళ్లు పారాడాయా...
నేను ఇల్లునే గుహ కవచంగా మలచుకున్నా.
మనోబలంతో కుందేలు
నూతిలో నీడను శత్రువుగా చూపించగా,
ప్రతీకారం కోసం సింహమే నీటిలోకి దూకి
పై లోకాలకు వెళ్లిన కథ వినలేదా? 
స్వీయ రక్షణ నీడలో దేశవాసులు
నూటముప్పైకోట్ల మంది జవానులే. 
ఈ విశ్వంలోని జీవకోటిలో
నరుడే నారాయణుడు. 
రేపో, ఎల్లుండో కరోనా నాశనం 
ఔషధ చక్రధారి కాకమానడు! 
- ఎన్నవెళ్లి రాజమౌళి, తడకపల్లి, సిద్దిపేట జిల్లా, 9848592331


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష