కరోనాపై కదనం - ఏప్రిల్‌, 23 పోటీ ఫలితాలు

  • 2268 Views
  • 68Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
దూదిపువ్వు
పత్తిమడిలో విరబూసిన దూదిపువ్వుని!
కొమ్మల్లేని నింగి చెట్టు
చిటారున పూసిన చందమామలా
నా తెల్లని కోటు.. చల్లని నవ్వు..
ఇప్పుడు.. అడవి దారిలో
పులిజాడలు వెదుకుతూ
చీకటి గుహలో దూరిన వేటగాడిని!
పొడిదగ్గుల నాడి పట్టుకోవడానికి
పాదరసంలా కదులుతున్న ఉష్ణమాపకాన్ని
కళ్లముందే జీవహంసలు
టపటపా ఎగిరిపోతుంటే
తెగిపడిన జటాయువు రెక్కనై
విలవిల్లాడే ప్రాణదుర్గాన్ని!
కరోనాపై కదనంలో
దయామయ ధన్వంతరిని
సేవాపునీత చరకుడిని
అపర వైద్యభిషక్కు శుశ్రుతుణ్ని!
వయసుడిగి నూకలు చెల్లిపోయాయంటే సరే..!
అర్ధంతరంగా ప్రాణపుష్పాలు
ఇలా నేలపాలవకూడదు గదా!
అందుకే.. ఏ ప్రాణదివ్వె ఆరిపోకుండా
నా కనుపాపల్ని అడ్డుపెడుతున్నాను
ప్రాణస్పర్శ పిసరంత మిగిలి ఉన్నా
కాపాడేందుకు నా ప్రాణాలను పణం పెడుతున్నాను
దుర్గమారణ్యాల చిక్కని చీకటిలో..
క్రిముల చీదర దాటి నిత్యం ఉదయిస్తున్నాను
ఇంట్లో.. నాకోసం ఎదురుచూపులయ్యే
జన్మబంధాలకీ, ప్రాణబంధానికీ దూరంగా
శరీరాన్ని గాజువస్త్రాల వలయంలో
దాచి వెళ్లి చూసి వస్తున్నాను కానీ..
నా వెన్నెల తునకల్ని ఒడి చేర్చుకోలేక
గుండె కనురెప్పల వెనుక
ఒకటే సలపరింత..!
ప్రాణాలకు హామీలేని పులిజూదంలో
నేనైనా మా సిబ్బందైనా బలైపోతే మాత్రం
శ్మశానాల ఆమోదం కోసం మా శవాన్ని
ఊరూరూ తిప్పకండి!
ప్రభుత్వ లాంఛనాలు, గౌరవ వందనాలు
ప్రకటించక్కర్లేదుగానీ
తెల్లని పువ్వులాంటి మనసుతో
ఒక తెల్లబట్ట కప్పండి చాలు!
- కంచరాన భుజంగరావు, బడగాం, శ్రీకాకుళం జిల్లా, 9441589602
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
వలస వేదన
సరిహద్దులు చెరిపేయమనడం 
నేతల ప్రసంగాలకే కాదు 
ఆకలి కడుపులకూ తెలుసు 
జానెడు పొట్టకోసం 
జాతీయ రహదారులు దాటివచ్చింది 
రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య 
కొలిచి గీసుకున్న విభజన రేఖల్ని 
ఆమె పాదముద్రలు ఏనాడో జయించాయి 
రాళ్లు కొట్టో, మేడ కట్టో 
పైరు మధ్య మొలిచిన 
కలుపు మొక్కల పనిపట్టో 
రూపాయి చూడాలన్న పాపాయి ఆశల మీద 
వైరస్‌ రాక్షసి, అగ్నివర్షం కురిపించింది
జీవన రణరంగంలో 
నిరుపేద జఠరాగ్నిది ఓడిన పక్షం 
ఆకలి అంచును దాటేందుకు మెతుకులేదు 
పరాయి పంచన సాగేందుకు బతుకు లేదు 
లాక్‌డౌన్‌ అన్నమాట 
జీవితానికి సంకెళ్లు తగిలించి
లాకప్‌లో వేసింది 
పట్టెడన్నం దొరకని పగళ్లు 
ఆదమరచిన నిద్రకు దూరమైన రాత్రిళ్లు 
ఎడారిలాంటి జీవితంలో 
పగలైనా, రేయి అయినా ఒక్కలాగే ఉంది 
ఎక్కడో సుదూరాన పుట్టిన ఉరు 
మిణుకుమనే ఆశాదీపంలా వెలుగుతోంది 
ఆత్మీయంగా చేతులు చాచి 
ఆహ్వానం పలుకుతోంది 
ఆకలి యుద్ధం గెలవలేని 
పన్నేండేళ్ల బాలిక 
అమాయక ఆశల కదలిక 
కరోనా కారుమబ్బులను 
చీల్చుకుంటూ కాలినడక 
పాదరక్షల రక్షణ కూడా లేని 
లేత పాదాలు, దూరాలను
కాళ్ల కిందనే తొక్కిపెట్టాయి 
ఎక్కడి తెలంగాణ మరెక్కడి ఛత్తీస్‌గడ్‌
ఎక్కడి కనాయ్‌గూడా ఎక్కడి బీజాపూర్‌ 
అదుపు చెప్పే అవధులను
కదిలే పాదాలు అధిగమిస్తూనే ఉన్నాయి 
పొట్టకూటి కోసం తరలి వెళ్లిన జీవితం 
పుట్టెడు ఆశతో తిరిగి వస్తోంది 
పుట్టిన ఊరు కనుచూపు మేరలోకి రానే వచ్చింది 
అలసిన పసిప్రాణం పైకిపోతోంది
మసకలు పోతున్న చిన్నారి చూపు 
కరుణించని కరోనాను శపిస్తోంది
వలసపిట్ట రాలిపోయింది 
నిశ్శబ్దాన్ని చుట్టుకున్న ఈ లోకం
ఏ మాత్రం పట్టనట్టే ఉంది 
(12 ఏళ్ల వలస బాలిక జమ్లో మక్దంకి నివాళి)
- మద్దాళి రఘురామ్, హైదరాబాద్, 9866057777
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
కలానికి కళ్లిద్దాం
కాలం రేపిన గాయమేదో జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుంటే 
గాయం మాటున హృదయాలలో 
నిండిపోయిన వేదనంతా ఓ నినాదమైంది..!!   
నిర్వచించలేని ఓ రూపం 
అనంత విశ్వాన్ని గ్రహణంలా పీడిస్తుంటే 
యుద్ధ ప్రాతిపదిక లేని తరుణం ఎదురైనప్పుడు
ఏ యుద్ధాన్ని ఆసరాగా మలచుకోవాలి?
జన జీవన చైతన్యపు దిశకి 
కళ్లు కాలాన్ని వెతుకుతుంటే 
కొన్ని కలాలు గళమై గొంతు విప్పాయి..
మౌనంగా రాసుకున్న నాలుగు అక్షరాలు 
సమరానికి సంసిద్ధమయ్యాయి
ఎలుగెత్తి పాడే స్వరం మూగబోయినప్పుడు 
వెలుగెత్తి చాటే అక్షరమే ఓ ఆయుధం కదా..!!
కలానికి కళ్లిద్దాం రండి ..
మూగబోయిన దేశానికి అక్షరాల బంధనం కడదాం 
భయం గుప్పిట్లో పొదిగిన బిడ్డలకి 
తల నిమిరి శాంతిని పెంచి భరోసా నింపి 
మేమంటూ నీడనిద్దాం..
గాలికి చెదిరిన విషపు జ్వాల అక్షరాలకి 
ఆహుతైపోతుందని గుడ్డి దీపపు బతుకుల్లో 
పురుడు పోసుకునే బతుకులకు 
నాలుగు అక్షరాలతో ఆజ్యం పోద్దాం..
కొమ్మ చాటు పిందెల్ని అదిమి పట్టుకున్నట్టు 
దేశాన్ని కంటి రెప్పల్లో చూసుకుందాం 
వాక్యాల చమురు పోసి వెలుగు రేఖలని నింపుదాం
మానవత్వాన్ని తట్టి లేపినప్పుడు మది మదిలో
దాగిన వేల భావాలకు అక్షరాలతో పునర్జన్మనిద్దాం..
అక్షరాలతో యుద్ధం చేస్తూ సమస్త ప్రపంచాన్ని జయిద్దాం 
రాతలతో చేతలతో మనసులని మమేకం చేసి 
కవన రాగాలను పలికిద్దాం 
సమైక్య నాదాన్నీ సృష్టిద్దాం 
ఇది అక్షరాల నీరాజనం 
ప్రపంచానికి ఇదొక శంఖరావం..
- స్వప్న మేకల, హైదరాబాదు, 9052221870
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
నన్ను మన్నించండి...!
ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించలేను
మీ సాంగత్యాన్ని ఆస్వాదించలేను...
తారకా సుమ శోభితమైన మీ దరహాసాల్నీ...
పరిమళార్ద్ర పులకితమైన మీ పలకరింపుల్నీ...
స్వాదు మకరంద జనిత విరాజిత 
సొబగులద్దిన మీ స్నేహపు సౌరభాల్ని...
యీ బంధాల్నీ... బాంధవ్యాల్నీ...
అన్నిటినీ ఆవల నెట్టి
మీకూ.. నాకూ మధ్య దూరాన్ని పరుస్తున్నాను
నన్ను మన్నించండి..! 
సెలవిక..! 
తొలిపొద్దు నడకకూ
మలిపొద్దు షికారుకూ..
ఇల్లు దాటి పల్లె దాటి యెటకేగుటలేదు
ఎడతెగని యాత్రల్లేవు..! 
నేను...
ఏకాంతంలో అనంతాన్ని ఆస్వాదిస్తాను..! 
నా నాలుగ్గోడల స్వర్గంలో...
ప్రపంచాన్ని ఆవాహన చేస్తాను..! 
నా గది గవాక్షానికీవల నిల్చుని 
విశ్వ సందర్శనం చేస్తాను..! 
అంతరాంతర కాంతి సీమల్లో 
విహంగమై విహరిస్తాను..! 
నాలో నేను....
నాకై నేను....
నన్ను మన్నించండి..? 
కరోనా కనుమరుగయ్యేదాకా..
నన్నేమీ అనకండి...! 
- జయశ్రీ అన్నమరాజు, హైదరాబాదు, 7331105487


ప్రోత్సాహక బహుమతి (2)
మహా క్రతువు
నువ్వనుకున్నట్లు
మేమేమీ మూడు పొద్దులు తిని పరుండటం లేదు
మట్టిని పువ్వుగా మార్చే
మహాక్రతువులో పాలుపంచుకుంటున్నం..!
నువ్వనుకున్నట్లు
మా కుంచేం ఆగిపోలేదు
నెర్రలిచ్చిన పాదాలను
ముద్రించే పనిలో నిమగ్నమై ఉంది..!
నువ్వనుకున్నట్లు
మేమేమీ చేతులు కట్టుకు కూర్చోవడం లేదు
రాయబడని చరిత్ర పుటలను
ఆపోసన పట్టడంలో తలమునకలై ఉన్నం..!
నువ్వనుకున్నట్లు
మా పేద గొంతుకలేం మూగపోలేదు
తెగిపోయిన తీగలను సవరించుకొని
కన్నీటి జాడలను వలపోయగ వస్తున్నాం..!
నువ్వనుకున్నట్లు
మేమేమీ గాలిలో మేడలు గట్టుకుంటూ
కూర్చోవడం లేదు
శూన్యాకాశం కింద శిథిలఫలకాలను శోధించి
అనంత దుఃఖసాగరాన్ని మధించే పనిలో ఉన్నాం..!
నువ్వనుకున్నట్లు
మేమేమీ కాళ్లకు సంకెళ్లేసుక్కూర్చోలేదు
విధి వంచితులంబడే
అలుపెరగని నీడై తిరుగాడుతున్నం..!
నువ్వనుకున్నట్లు
మేమేమీ వసంతరాగాలను కోకిల కూజితాలను
ఆస్వాదించడం లేదు
ఆకలి డొక్కల చప్పుళ్లను
తెగిపడ్డ పేగు బంధాలను
అతికించే పనిలో అహర్నిశలు శ్రమిస్తున్నాం..!
నువ్వనుకున్నట్లు
మా జుట్టేమీ పిడసగట్టి జడలు కట్టుకోలేదు
ప్రపంచ హంతకిని హతమార్చే మహా క్రతువులో
కాలనాగై పేనుకుంటోంది..!
- విఠలాపురం పుష్పలత, మహబూబ్‌నగర్, 9573162399


 ప్రోత్సాహక బహుమతి (3)
కరోనాయణం
బాధ్యతల తట్టను భుజానికెత్తుకొని
గూడు వీడుతున్న ప్రతిసారీ
లక్ష్మణరేఖను దాటుతున్నట్టే ఉంది.
బరువైన భయాన్ని మోసుకుంటూ
అనుమానాస్పద పరిసరాలన్నీ దాటుకుంటూ
గుండెల్ని చిక్కబట్టుకొని ముందుకు జరుగుతున్న కొద్దీ
శరీరమంతా అత్తిపత్తిలా ముడుచుకుపోతుంది.
కనిపించే దారులన్నీ నిర్మానుష్యంగానే ఉన్నా
అక్కడక్కడా ఉన్న ఎర్రటి మరకలు
ఉలిక్కిపడి ఉరికేటట్లు చేస్తున్నాయి.
పొరుగు గాలి తగిలిన ప్రతిసారీ
ముక్కోటి దేవతలకు ముడుపులు కడుతూనే
ముసుగు వెనుక దాచిన ముఖం
ఠక్కున పక్కకు తిరుగుతుంది.
ఆడబోయిన తీర్థాలు గుమ్మంలోకొచ్చినా
అడుగు పడితే పడవేమవుతుందోనని
తల్లడిల్లే గుహుడిలా కాళ్లు చేతులు
కడిగి కడిగి శల్యపరీక్ష చేసుకుంటున్నాయి.
కోరుకున్నవి కళ్లముందున్నా
అవసరమైనవి అందుబాటులో ఉన్నా
కళ్లు తరచి తరచి అగ్నిపరీక్షలు చేస్తున్నాయి.
ఆదమరచిన చెవుల్లో దూరి
గంట గంటకీ రాకాసి మైకు చెప్తున్న
ఆరోహణ, అవరోహణల లెక్క విన్నప్పుడల్లా
భయంతో గుండె లయ తప్పుతోంది.
ఆచితూచి అడుగులు వేస్తున్న బాటల్లో
ఆరిపోబోతున్న దీపాలకు చేతులడ్డుపెట్టి
చమురు పోస్తున్న ధన్వంతరుల్నీ,
అడుగడుగునా శోధించి
ఆకతాయిలను అదుపుచేస్తున్న ఖాకీల్నీ,
అణువణువునీ శుభ్రం చేసి ప్రాణవాయువుని
అందిస్తున్న తులసి మొక్కల్నీ
చూసినప్పుడల్లా సంజీవనీ వాసన తగిలి
మళ్లీ గుండె కొద్దిగా కొద్దిగా
కొట్టుకోవడం మొదలవుతుంది.
ఈ శరపరంపరల మధ్య
దేహ వైదేహిని రక్షించడానికి
ఔషధాల వారధిని రాముడెప్పుడు నిర్మిస్తాడోనని
క్షణాలు లెక్కపెడుతూ....!
ఏది ఏమైనా
తిరిగి స్వేచ్ఛా ఊపిరి పీల్చుకునేది మాత్రం
లంక నుంచి బయటపడ్డాకే!
- డా।। కె.కరుణశ్రీ, నెల్లూరు, 9441540317


ప్రోత్సాహక బహుమతి (4)
నడక
కాళ్లు నడుస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా..
అవ్వ అయ్య పూరిగుడిసె గుడ్డిదీపం వట్టిపోయిన గేదె- 
పల్లెన ప్రాణాలను దాపుకున్న దేహాలు నడుస్తూనే ఉన్నాయి..
ఉపాధి ఆత్మను కోల్పోయిన దేహాలు
ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నాయి..
కనికరించని దూరాన్ని కొలతలేస్తూనే ఉన్నాయి..
నడక ఆపమని చెప్పలేక రహదారి దుఃఖిస్తోనే వుంది
బొబ్బలెక్కుతున్న అరికాళ్లకు 
మట్టిరోడ్డు మలాము అద్దుతూనే ఉంది.....
తూర్పు పడమర ఉత్తరం దక్షిణం- 
కాళ్లు నడుస్తూనే ఉన్నాయి..
అవును...
దేశం అంచులదాక -
కాళ్లు నడుస్తూనే ఉన్నాయి...
ప్రభుత సాయం దాతల దాతృత్వం 
తాత్కాలిక ఉపశమనమవుతోంది
ఆహారపొట్లం అందుకోవాలని 
ఎండలో మగ్గుతున్న బాల్యం,
కన్నపేగుని మెలిపెడుతోంది
అన్నింటా తోడై నిలిచిన సహచరి, 
ఆకలి కడుపున కన్నీళ్లని దాస్తోంది...
పల్లెతల్లికి ప్రాణాలను ముడుపు కట్టి
పనికోసం పట్నమొచ్చిన దేహాలు 
ఇక ఆ ముడుపు విప్పాలనుకుంటున్నాయి...
ఎవరెన్ని చెప్పినా కన్న ఊరు చేరడమే
ఇప్పుడు జీవిత పరమార్థమైంది
పల్లెచెట్టు నీడన సేద తీరాలని
మనసు ఆతృత పడుతోంది
మనసు మాటే వింటున్న కాళ్లు
ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నాయి...
ఇప్పుడైతే కాళ్లకి ప్రాణం ఉందా?
లేదు అవిప్పుడు యంత్రాలయ్యాయి
ఉపాధి నీడ కనపడితేనే వాటికి విశ్రాంతి
కానీ, ఇప్పుడు...
జీవనాన్ని సూక్ష్మక్రిమి శాసిస్తోంది- 
ముఠాగా కలిసి వలసొచ్చిన పని చేతులు;
కష్టసుఖాల్లో ఆసరై ఒకరికొకరై నిలిచిన చేతులు;
ఒకరి కన్నీళ్లు మరొకరు తుడిచిన చేతులు;
ఇక ఎడంగా ఉండాల్సిందే......
నాలుక పిడచకట్టుక పోతావున్నా 
తప్పదు చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే...
అనుబంధాలన్నీ వలస వచ్చిన కాడ 
సామాజిక దూరం పాటించాల్సిందే...
మనసు తెరిపి చేసుకుని కాళ్లకి నచ్చజెెప్పాల్సిందే..
రేపటి వేకువ కోసం నేడు చీకటిని ఎదిరించాల్సిందే...
నడక ఆపిన కాళ్లతో ఆ సూక్ష్మక్రిమిని నలిపెయ్యాల్సిందే...
- అశోక్‌ గుంటుక, మెట్‌పల్లి, 9908144099


ప్రోత్సాహక బహుమతి (5)

రేపటి జీవితం..
మనసులోని భావసంచలనాలు
అర్ధ ముసుగేసుకున్న ముఖాల్లో స్పష్టంగా ప్రతిఫలించట్లేదు
జనారణ్యంలో నిత్య సంచారం నిషిద్ధమైనప్పుడు
నవరస మాస్కుల అవసరం ఏముందిలే?
పక్కింటి నుంచి చెంచాడు అవసరాన్ని ఆశించి..
కదలివచ్చే పాదముద్ర జాడలిప్పుడు తుడిచిపెట్టుకుపోయాయి
గోడల మీంచి తలలు తొంగి చూస్తున్నాయి..
పెదాలే విడివడటం లేదు.. 
భయానికి అంత దాసోహమవడమా?
విహారాలు, వినోదాలు, విందులు ప్రశ్నగా మారి 
రూకలు, రెక్కలు ముడుచుకుని.. 
చేతుల్లో ఒద్దికగా ఒదిగాయి
ఆకలి నోళ్లకు నూకలుగా మారినప్పుడు..
జన్మ సార్థకతనొంది మురిసిపోయాయి
కదిలే బొమ్మల్లా అదృశ్య పరదాల మధ్య సంచరించిన వాళ్లకు..
అతి దగ్గరగా..కనుపాపల్లో సజీవశిల్పాలు..మనసు తడీ..
అనుభవమౌతూంటే వింతగా ఉంది
గోడలకు చెవులుంటాయన్న సంగతేమోగాని..
నోళ్లుంటే ఎంత బాగుండును..
అప్పుడప్పుడూ మాటలిచ్చి పుచ్చుకునేవాళ్లం కదా!
చిట్టాపుస్తకాల్లోని లెక్కలకిప్పుడు విలువలేదు
అందరి కళ్లూ.. కరోనా కల్లోలానికి 
ఎగసిపడుతున్న సంఖ్యలకు అతుక్కుపోయాయి
దేవుళ్లు సైతం తలుపులేసుకునేసరికి..
ఆధ్యాత్మికతకు దిక్కుతోచక.. 
ఆత్మదర్శనంతో తన్మయత్వాన్నొంది..
నరనారాయణుల సేవలో పునీతమౌతోంది
పక్షులు, జంతువులు, మొక్కలు..మొత్తంగా ప్రకృతీ..
స్నేహానికి అనర్హం కావని తెలిసొచ్చింది.. 
మరో మనిషి తోడు లేనప్పుడు..
అవే కదా బంధుబలగాలు
మనసు ప్రిజం మీద కరోనా కిరణం పడి
కొత్త రంగులు ఆవిష్కృతమయ్యాయి.. అనుభవంలోకొచ్చాయి
బతుకు యంత్రం భాగాలుగా విడిపోయింది..
రేపటి జీవితం కచ్చితంగా కల్పవృక్షమే!
- పి.వి.సుబ్బారాయుడు, సికింద్రాబాదు, 9393981918


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష