కరోనాపై కదనం - ఏప్రిల్‌, 24 పోటీ ఫలితాలు

  • 1489 Views
  • 13Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
ప్రకృతిని ప్రేమిస్తేనే
జీవితం అందమైన కవిత్వం ఆనంద సంగీతమని 
ఇంటిపట్టున నన్ను నేను 
నిర్బంధించుకున్న సమయం చెప్పింది 
రోజూ పండగైన విశ్రాంతి దినాల్ని 
కవిత్వంలోకి తర్జుమా చేసుకుంటున్నాను 
నన్ను నేను వ్యక్తీకరించుకోవడమే కాక 
ప్రపంచాన్ని అందంగా కలగనడం, 
ఆనందంగా జీవించాలనే ఆశను మొలకెత్తించడం 
ఒక భయం నాకు నేర్పింది 
నన్ను నన్నుగా నడిపించేందుకు 
నాలోకి నేను చేరుకునేందుకు 
ప్రపంచాన్ని ప్రేమించేందుకు 
నా ముందొక ధైర్యం భరోసాగా నిలబడింది 
చేతులెత్తి మొక్కుతాను 
మానవత్వం నిండిన మనసులకు 
దగ్గరగా ఉన్న జీవితం ఎంత దూరమయ్యిందో...
దూరం ఇప్పుడు ఎంత దగ్గరతనాల్ని 
గుర్తు చేస్తుందో పాఠం నేర్పుతోంది
అందరిలో మనిషితనాన్ని, కనిపించీ కనిపించని 
ఒక రహస్యం కొన్ని సత్యాల్ని వెలికితీసింది 
ఆకాశంవైపే నా పరుగైనా నేలపైనే నా అడుగుని, 
నేను మొదలైన చోటే 
నా చిరునామా అని మరీ చెప్పింది 
నిదానమే ప్రధానమన్న ఒక సంస్కృతి   
నన్నొక ప్రశ్నగానూ, 
మరో సమాధానంగానూ నిలిపింది
మతములన్నియు మాసిపోవును 
జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును 
ప్రతి ధ్వనంతరీ..
పదే పదే ఈ ప్రపంచాన్ని గెలుపు వైపు 
వేగుచుక్క అయ్యి నడిపిస్తున్నాడు 
మీలో ఏ పాపం చేయని వారూ ఎవరో చెప్పండంటూ 
ఒక మహా పశ్చాత్తాప వాక్యం ఆత్మప్రభోదం చేస్తోంది 
అనేకానేక తప్పిదాల నుంచి ఒక నూతన అన్వేషణగా 
మనిషి ఒక పరిశోధనగా... ప్రయోగంగా 
ప్రకృతి ప్రేమపాఠం నేర్పింది 
విశ్వమంత కుటుంబాన్ని గుర్తు చేసింది 
ప్రకృతిని ప్రేమిస్తేనే వికృతులన్నీ 
తొలగిపోతాయన్న ఆత్మవిశ్వాసమేదో మొలకెత్తింది 
ప్రయాణం అనేక గమ్యాల్ని పరిచయం చేస్తుంది 
ఒక సంకల్పం ఓటముల్ని జయించే 
మనిషిగా నన్ను పునర్నిర్మిస్తుంది. 
- శిఖా-ఆకాష్, నూజివీడు, 9381522247
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
ఇప్పుడు అన్నదాతలం కాము..
మేము గుండె పగుళ్ల నాగేటిచాళ్లపై
దిగులు సేద్యం జేస్తున్నవాళ్లం 
తడి తడి మడిభూమిపై 
ఎర్రటి అగ్గి గోళాలమై 
పచ్చటి మొలకలెత్తుతూనే ఉంటాం
మా తిండి గింజలన్నీ
నిరాహారదీక్ష జేస్తున్నాయి
దేశం ఆకలి సంగీతాలకు
ప్రేవుల వీణలు మీటేవార్ని కాచే
మానవత్వం కోసం 
మా అరటి పిలకలకన్యలు
దిగులు మారాకు తొడిగాయి
సుడివేసి పెరిగే కదళీఫలం
కన్నీటి సుడులుబికిస్తోంది
నిండుచూలాళ్లై 
మార్కెట్లో పురుడు బోసుకునే వేళ
పల్లకీ బోయీల్లేక
మగ్గీమగ్గీ మట్టి ఒడిలో ప్రసవిస్తున్నాయి
ఎన్ని రాత్రుల్ని కరిగించి కాపుగాశామో
ఎన్ని సూరీళ్ల నెదిరించి ప్రవహించామో
పెండ్లి తాంబూలంలో
గెలలుగెలలుగా తలలెగరేసి 
బాంధవ్యాలను కలిపిన
ఈ తియ్యటి బంధాలు
కరోనా కబంధహస్తాల్లో బందీయై
చౌకధరల పట్టికల్లో జారి
గెలలబిడ్డలన్నీ బేలగా
వెలలేక తలలు వాలుస్తున్నాయి
తుపాను గాలుల్నెదిరించినోళ్లమే
బూజు తెగుళ్లనోడించినోళ్లమే
ఈ వ్యథలకథలన్నీ 
అలవాటేనని సర్దుకుపోయాం 
కానీ ఫలింపునిచ్చిన కంటిపాపల్నే
మా కత్తివాదరలకు బలిజేస్తుంటే
మానవత్వపు లంకె తెగుతున్న చప్పుడు
ఇప్పుడు మేము అన్నదాతలం కాము
కౌలు పులులకు, దళారీ సింహాలకూ
ఎరలం..!
కనికరించండి..! మళ్లీ ఈ భూమిలోనే..
మట్టిపువ్వులమై పరిమళిస్తాం!
- అన్నం శివకృష్ణ ప్రసాద్, సౌత్‌ మోపూరు, నెల్లూరు జిల్లా, 9490325112
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
నీకు మాత్రమే సాధ్యం
కొంత లోపలికి కొంత బయటికి
కొలతేసినట్లు కొంచెం దూరం నిలబడి
నిన్ను నువ్వు ప్రేమించుకో!
గుప్పెడు భయాన్ని గుండెల్లో దాచుకొని
ధైర్యాన్ని మాత్రం భుజానికెత్తుకుని
బలమైన బాధ్యతలను చేజారకుండా
నీకోసం నిన్ను నువ్వు ప్రేమించుకో
మనిషి పేరాశకు దాహం వేస్తున్నప్పుడు
సాటి మనిషి ఓయాసిస్సులా కనిపిస్తుంటే
పక్కవాడి ప్రాణాలకు విలువేముంటుంది
అందుకే జాగ్రత్తగా నిన్ను నువ్వే ప్రేమించుకో
కొత్త రుతువు కోసం దుఃఖం అవసరం లేదు
నూతన వ్యాకరణం కనిపెట్టాల్సిన పని లేదు
నీ హృదయం లయ తప్పకుండా నిల్చున్న చోటే
నువ్వు కూర్చుని నిన్ను నువ్వే ప్రేమించుకో
కాలం గాయం చేయలేదు తప్పు తనది కాదు
మనిషి ఆధిక్యత కోసం అర్రులు చాచి
విషపు చేతులతో హోలీ ఆడుతుంటే
మృత్యువు కరోనా నృత్యానికి తాళం వేస్తున్నది
ఆ నృత్యానికి నువ్వు కొత్త భంగిమ నేర్పకుంటే
హోలీలో భాగస్వామివి కాకూడదనుకుంటే
ఆధిక్యత మానసిక దౌర్బల్యం అని నువ్వు తలిస్తే
నిన్ను నువ్వు నవ్వుతో మనసారా ప్రేమించుకో
ఈ సమయాన నువ్వు నీ ప్రేమలోకి జారుకుంటే
ప్రపంచ గీతాన్ని ఆలపించే మహా మనిషి నువ్వే
‘విశ్వంభరుడవు’ నువ్వే..!
- మూని వెంకటాచలపతి, తిరుపతి, 7396608221
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
బరిగీసి యుద్ధం చెయ్యి
బరిగీసి యుద్ధం చెయ్యి ఇంకోసారి
చైతన్యం నీ ఇంటి పేరు కదా
చుట్టు పక్కల పది ఊళ్లకు నీవే పెద్ద దిక్కు
గడప గడపలో సరస్వతి కొలువు దీరిన నెలవు కదా
ఎర్రని నీ నుదుటి బొట్టుతో నిత్య ప్రకాశినివి కదా
నీ వెలుగు పడమటి కొండలకు వాలుతుంటే 
ఈ కళ్లు చూడలేవు తల్లీ
స్నిగ్ధ స్వచ్ఛ కిరీటంతో ధగ ధగా మెరిసిపోతుంటే
అమ్మవారిని చూసినట్టే ఉండేది
స్వర్గంలో దేవతలు నిన్ను చూసి 
పూలవర్షం కురిపించారే
ఈ రోజు వాడిన పువ్వులా 
నువ్వు కనిపిస్తే హృదయం 
విలవిల్లాడుతున్న కొమ్మలా ఉంది
సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు
పొద్దు పొడవక ముందే జనసందోహంతో
పక్షులు వాలే మహావృక్షంలా భాసిల్లే దానివి
నేడు బారెడు పొద్దెక్కినా
నిన్ను చూడాలంటేనే లక్ష సందేహాలు
ఎన్నెన్ని పోరాటాల్లో పదును తేలావో 
ఇప్పుడు కనిపించని క్రిమి ముందు తేలిపోయావు
ఎత్తిన పోరు కొడవలి పదునేమాయే
రాశులు పోసిన కూరగాయలు రత్నపు రాశులు
ఆకు పచ్చని కూరలతో పచ్చని
పట్టు చీర కట్టినట్టు కనిపించే దానివి
నేడు కనిపించని క్రిమికి కంపించి పోతున్నావా 
మాతా.. బజార్లన్నీ జనం లేక
బోసి పోయిన మెడలాగున్నాయి
నీళ్లు లేని బావిలాగున్నాయి
ఏ ఊరు మీదంటే పది ఊళ్ల వాళ్లూ 
కాసింత పొగరుగా మాది పేట అనేవారే
ఇపుడు ఏ పెదాలు కూడా నీ పేరు పలకవు
మీసాలు మెలేసే రొయ్యల వీధెక్కడ
బొమ్మడి మచ్చీ బుట్టలెక్కడ
బొడ్రాయి బజారు బట్టల బజారు జాడెక్కడ
మిరప ఘాటు, కొత్త మామిడి పులుపు లెటుపోయే
భజన మందిరంలో 
బ్రోచేవారెవరురా పాట గుండెను పిండుతోంది
భానుపురీ.. నీ బాధను చూసి
బావురుమంటోంది మనసు
నా ప్రేమపురీ..
బిగించు పిడికిలి
కరోనాకు బరిగీసి 
యుద్ధం చెయ్యి మరోసారి
- సుంకర రమేశ్, సూర్యాపేట, 9492180764


ప్రోత్సాహక బహుమతి (2)
అవును.. సమయమొచ్చింది !
అవును...అంతరించిపోయిన 
కొన్ని మొక్కలకు తిరిగి
నారు పోయాల్సిన సమయమొచ్చింది 
మనసును మంచి తీరానికి తీసుకెళ్లి
ఎప్పుడో కాల గర్భంలో తొక్కేసిన 
ఆ వంగడాలను 
మళ్లీ సృష్టించుకోవాల్సిన
సమయమాసన్నమైంది
అభివృద్ధిని దట్టించిన 
నల్లని మేఘాల పొగను 
భూమాత ఊపిరితిత్తుల్లో నింపి 
జీవ జాతులకు మసి పూసి 
తను మాత్రం 
సుఖజీవన ధవళ వస్త్రంలో మెలిగే
కలుపు మొక్కలను పీకి
చల్లని శాంతి సమీరాన్నిచ్చే మొక్కేదో
మెులకెత్తించాల్సిన సమయమొచ్చింది
కుల మత ప్రాంత జాతి 
లింగ భాష దేశాల తేడాలు లేని
సమానత్వ సుత్రాన్ని మెడలో వేసుకుని
ప్రపంచాన్ని ఒకేలా చూస్తున్న 
ఓ చిన్న క్రిమి బాటలో ఎదిగే 
ఆదర్శ విత్తనానికి 
బీజం పడాల్సిన సమయమొచ్చింది
సంపాదన మోజులో పడి 
ఎడాపెడా ఎదిగే గంజాయి వనాలు
సృష్టించుకోవడం కాదు 
అసలు సిసలు
మానవత్వపు పరిమళాలు గల 
తులసివనం ఏర్పాటుకు 
విత్తనాలు సృష్టించుకోవాల్సిన
సమయమొచ్చింది
కొత్త చిగుళ్లు ప్రాణం పోసుకోవడానికి 
మెదడు వేళ్లలో కదలికలు తీసుకొచ్చి
ప్రాకృతిక నూతన శాఖలు 
విస్తరింపజేసే సందర్భం
అవును 
ఇప్పుడు కళ్ల ముందు కదలాడుతుంది
ఇక చేయాల్సిందల్లా విషవృక్షాలను తుంచి
నవ జీవన బీజాలను బలంగా నాటడమే !
- గుండేటి రమణ, బొమ్మెన, జగిత్యాల, 9949377287


ప్రోత్సాహక బహుమతి (3)
తథాగతుల సందేశం
ఒళ్లంతా పనితనాన్ని నింపుకొని
శిఖరాన్ని సైతం మధించగలరు వాళ్లు
నిత్యం పని దేవుణ్ని కొలిచే పేదపువ్వులు
కాళ్లు.. చేతులు కదిలితేనే నోరు ఆడుతుంది
పనంటే ఎక్కడికైనా రెక్కలు కట్టుకొని ఎగిరెళ్తారు
కరోనా దేశాన్ని కాటువేయక ముందే
రాష్ట్రాల సరిహద్దులను చెరుపుకుంటూ వచ్చినవాళ్లు
కష్టాల యుద్ధానికెప్పుడూ
ధైర్యపు అమ్ములపొదితో సిద్ధమే
ఇప్పుడు ఈ మహోత్సవానికి ఎదురీదాలి
ఇప్పుడు లక్ష్మణరేఖల్ని దాటారు కదా!
క్వారంటైన్‌ అశోకవనంలో ఉండాల్సిందే
సరస్వతి ఆలయం వారికి నిలయమైంది
పలక పట్టుకున్న దినాలు గుర్తొచ్చాయి
పెద్ద బడికి పోలేని కష్టాలు ఎరుకవచ్చాయి
ఖాళీగా ఉంటే వేళ్ల నొసళ్లు చిట్లిస్తున్నాయి
పనిలోనే పుట్టారు పనితోనే కలిసిపోయారు
పని స్నేహితుడు పక్కనుంటే 
వారి గడియారానికి బ్రేకులు ఉండవు
పెచ్చులూడిన బడిని చూడగానే 
మనసుతో పాటూ చేతులూ కదిలాయి
కడుపు నింపిన బడికి కొత్త అందాల్ని అద్దారు 
మనిషంటే మానవ కల్యాణానికి
నడుంకట్టడమే
మనసుతో ఆలోచించడమే
మనిషిగా ప్రేమించడమే
ఎంతటి విపత్తుకైనా
పనే రోగనిరోధకశక్తి అని ప్రకటించడమే
జాతికి తమ చేతులతో 
మౌనసందేశం ఇచ్చిన తథాగతులు వాళ్లు
(క్వారంటైన్లో భాగంగా తమను ఉంచిన బడిని బాగుచేసిన వలస కూలీల పనితీరు చూసి)
- శ్రీధర్‌బాబు అవ్వారు, నెల్లూరు, 8500130770


ప్రోత్సాహక బహుమతి (4)
నిషిద్ధ దారుల్లో...
వాళ్లిప్పుడు...
పులి తరుముతున్న లేడికూనలు.
అడుగడుగునా..
ఆకలితీగలు కాళ్లకు చిక్కుబడి
కూలబడుతున్న లేగదూడలు.
కర్ఫ్యూ దారుల్లో
పేదరికపు పతాకాన్ని చేతబట్టి
పయనిస్తున్న రెండు కాళ్ల రథాలు.
ఆకలి అడుసులో కూరుకుపోతున్న
బతుకు చక్రాన్ని
భుజాలతో నెట్టుకొస్తున్న నిత్య శాపగ్రస్థులు.
నీడనివ్వలేకపోతున్న పాలనాఛత్రాల కింద
పొక్కులెక్కిన పాదాల్ని లెక్కచేయని
నాటు దేహాల నడక యంత్రాలు.
వారి సంకల్పం చూసి
సముద్రం చిన్నబోతోంది.
పొత్తిళ్లలో చంటిబిడ్డలతో
పస్తుల పొద్దు దాటి వస్తుంటే
దిక్కులు విస్తుపోతున్నాయి.
ఆపద ఎక్కడ పొంచి ఉందో తెలియదు!
ఏ రూపంలో కబళిస్తుందో అంతుచిక్కదు!
కుబుసం విడిచిన కాలనాగులా
మెలికలు తిరిగిన మృత్యు మార్గంలో
క్రిమి మసలాడిన తోవలో
సమస్యల పరిమిముళ్లు గీసుకుపోతుంటే
నేల నెత్తిమీద కదలాడుతున్న
నెత్తురు నెలవంకలు వారు.
ఆకలి ప్రయాణాల ఆర్తనాదాలకు
ఆకాశహర్మ్యాలు మరుగుజ్జు గుహలుగా
కుంచించుకుపోతున్నాయి.
అవాంఛిత బాటసారుల బసకు సత్రం దొరకదు!
నిషేధిత ప్రాంతం నిలువ నీడనివ్వదు!
ఈ ప్రయాణమెంత ప్రమాదకరమో
వారి ఊహకు అందదు.
వారి ఆకలిబాధను చల్లార్చే ఔషధముంటే బాగుణ్ను!
పగిలిన పాదాలకు లేహ్యం పూసి
సిద్ధులెవరన్నా క్షేమంగా గమ్యం చేరిస్తే బాగుణ్ను!!
(ఉపాధి కోల్పోయి సొంత ఊరికి వందల కిలోమీటర్లు నడుస్తున్న శ్రమజీవుల్ని చూసి)
- చొక్కాపు లక్ష్ము నాయుడు, కొత్తరేగ, విజయనగరం, 9573250528


ప్రోత్సాహక బహుమతి (5)
గతం ఎప్పుడూ ఘనమే
గడచిన గతం
మరలా రాదు! నిజమేకదా!
గతమెప్పుడూ గతమేకదా!
పాతనీరు పోయి కొత్తనీరే కదా!
మరలారావలసింది!
గడ గడలాడుతున్నారెందుకు!
గతం పరికిస్తే, అనుభవమేకదా!
మహమ్మారి రోగాలెన్నో,
అణచివేసింది గతమే కదా!
కలరాను సమాధి చేసి!
మశూచిని మరుభూమికి పంపి!
ప్లేగును పారదోలి,
మీసం మెలిపెట్టి
చార్మినార్‌ నిలిచింది
మహానగర నడిబొడ్డునేగా!
పోలియోల జాడ, పీడ
జగతికి దరి రానీయకున్నది
ఈ గతమే కదా!
కొత్తేముంది అందులో!
హరికేన్లు, తుపాన్లు,
సునామీలు, వరదలు,
ఉప్పెనలు కొత్తేమీ కాదుగా
ఈ జగతికి! ఈ ధరిత్రికి!
విపణిలో విపత్తులయినా
విలయతాండవాలైనా 
గతం ముందు చిత్తేగా!
మరి ఇప్పుడెందుకీ వైరాగ్యం
అన్నీ కోల్పోయిన బేలతనం
కరోనా అంటే అంత భయమా?
కలసి పోరితే పారిపోదా
నేర్చిన పాఠం, పాటవంగా
ఎక్కుపెట్టు నిర్భీతిగా
పోరుసల్పు భయం పోయేటట్టు,
ప్రాణం నిలిచేటట్టు!
-  కె.యస్‌.జవహర్, కొవ్వూరు, 9951314101


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష