కరోనాపై కదనం - ఏప్రిల్‌, 25 పోటీ ఫలితాలు

  • 1801 Views
  • 22Likes
  • Like
  • Article Share

ప్ర‌థ‌మ‌ బహుమతి

ఒయాసిస్సులు
కాలం దినసరి విధించే విషమ పరీక్షల్లో, 
అరకొర ఉత్తీర్ణులమైన మాముందు,
ఇప్పుడొక తప్పక చేయాల్సిన మహాయుద్ధం.
చీకట్లో పునుకులాటలా మా క్షణక్షణ పోరాటానికి, 
మిణుగురుల వెలుగులే మిన్నంటిన విజయాలు...
మేమిలా ముందుకెళ్తున్నకొద్దీ, 
గమ్యం అలా వెనక్కెళ్తున్నట్లు, 
నిరాశా చెదలు పీల్చి పిప్పిచేస్తున్నా 
ఆశ్రయమివ్వక తప్పని చెట్టసుంటి శరీరంతో,
మొండేన్ని మోస్తున్నామన్న స్పర్శ కోల్పోయిన అడుగులతో,
కూలబడుతూ సాగుతున్న వేళ, ఆపన్నహస్తమనే ఒక నేస్తం
మా పాదాలవెంట నడుస్తున్నది.. 
ఎండిన డొక్కల్లోని రక్కసిని, 
బుక్కెడు బువ్వతో నింపుతున్నది.
జన ప్రవాహం ఇప్పుడో ఎడారి.
మానవత్వమే మాకిక ఒయాసిస్సు.. 
ఇప్పుడు గుళ్లను విడిచిన దేవుళ్లు, 
తెల్లకోటేసుకొనో, ఖాకీ రూపంలోనో, 
శుభ్రతా సైనికుడిలోనో ఉన్నారట కదా! 
ఆ మాధవులే ఆర్తిని బాపే అక్షయపాత్రల్లా, 
అడుగడుగునా దర్శనమిస్తుంటే,
భారాల దూరాల్ని మోసిన హృదయ కాగితం,
తెల్లని పావురమై ఎగురుతోంది.. 
ఊరికి పోదామంటే నుయ్యి, 
ఊపిరి నిలుపుకుందామంటే గొయ్యిలా,
నిద్దురేపోని నిస్సహాయతలో చిక్కినవేళ,
తన సేవా రెక్కల గాలితో 
మా చెమటలు తుడుస్తున్నది..
తడారిన గొంతుకల్లో అమృతధారలు పోస్తున్నది..
మా జీవనయాత్ర ఇక శిశిరంలోకే అనుకున్నాం!
లేదు లేదు.. సహాయ వసంతాలెన్నో 
నేడు అడుగడుగునా ఆశ్రయమిస్తున్నాయ్‌.
కుక్షికి కూడు పెట్టి, కంటికి కాస్త కునుకునిస్తుంటే,
కలిసి రాని ఇలాంటి కాలాలనెన్నైనా 
ఎదుర్కొంటాం అనే ధైర్యాన్నిచ్చి, 
ఆశల వెలుగునందిస్తున్నయ్‌.. 
ఆకలే దిక్సూచిగా ఆగని వలస పడవ ప్రయాణం, 
ఎండ, వేడి, రాత్రి, భయం, అనే అలల తాకిడిని, 
కొంచెం కొంచెంగా ఇప్పుడు తట్టుకుంటోంది..
మా రెక్కల ముక్కలతో చెలిమి చేసే మానవత్వం మిగిలే ఉందని తెలిసి,
పుడమి తల్లి పురిటినొప్పులు పాలబుగ్గల నవ్వులై వికసిస్తున్నాయి.. 
ఎంత గొప్ప ప్రపంచమైనా చివరకు, 
పరిమళించే మానవత్వం నీడనే సేదతీరాలికదా! 
(వలస కూలీలు, పేదలకు సహాయం చేస్తున్న వారికి ప్రణమిల్లుతూ) 
- జగదీశ్వర్‌ మడుపతి, నారాయణ ఖేడ్, సంగారెడ్డి, 9494817919
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి

పచ్చనిచెట్టు
పదెకరాల మాగాణంలో
బండి మోయలేని బస్తాలు పండిస్తే కుదరదు
కల్లంకాడికి గంపపట్టుకొని
బీదోడు వస్తే
ఉత్త చేతులతో పంపని చెయ్యే
చరిత్రలో పచ్చని చెట్టులా మిగిలిపోతది.
ఇంట్ల పెరుగన్నం తింటవో
గంజి తాగి బత్కుతవో దేవుడెరుగు
ఇంటిముందరకొచ్చిన బిచ్చగాడికి ఓ పూట
కడుపు నింపే ఆత్మగల్ల మనుషులే
దేవునింట్ల దీపాంతలైతరు.
జేబులో పైసలుంటయో ఉండవో
నీ ఇకమతికే ఎరుక
ఆపతొచ్చినప్పుడు
పది రూపాయలు సేతిల పెట్టి పల్కరించినోడే
పది కాలాల పాటు పచ్చగుంటడు.
కుండల కారం మెతుకులో
మాడిపోయిన బువ్వనో సద్దసంకటో
యాదో ఒకటి
నువ్వు తినేటప్పుడు వాకిట్లవాలినోణ్ని
తిందురా అని ప్రేమగా పిలిచిన నోరే
ఊరంతటికీ ఉద్దిల నిలబడుతది.
ఆ కులమో ఈ కులమో కాదు
యా కులపోడైనా 
ఆపతిలో ఉన్నప్పుడు ఆదుకుంటే
ఊరికే మకుటంలేని మారాజువైతవు.
వలస బాటపట్టిన కార్మికుల 
కడుపుమంటను కండ్లచూసి
పిడికెడు అన్నదానం చేసిన చేతులే
ఆజన్మాంతం పట్టుకొమ్మలై 
నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టే
పందిరి గుంజలైతయి.
- అవనిశ్రీ, దాసరిపల్లి, గద్వాల్, 99854 19424
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి

శానిటరీ పాడ్స్‌ ఛాలెంజ్‌
ఛాలెంజ్‌లు విసురుకోవడాలు 
ఛేజ్‌లు, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌లు 
చూస్తున్నా... బానే ఉంది...
ఆటపాటలు, గదుల శుభ్రం
జ్యూస్‌ గ్లాస్‌ ఛాలెంజ్‌లు 
అట్లేయడాలు, అంట్లు తోమడాలు 
ముచ్చటగా ఉన్నాయ్‌...
మరి ఒక్కరైనా మా గురించి ఆలోచించారా.. 
ఒక్క ఛాలెంజ్‌ అయినా 
మాకోసం విసురుకున్నారా...
నెలయ్యింది లాక్‌ డౌన్‌ మొదలై
బయట గూడు లేక 
కూడు లేక మరుగు లేక 
పొత్తి కడుపుని పట్టుకుని 
ఎక్కడికెళ్లాలో తెలీని 
అమ్మల గురించి ఆలోచించారా...
షాపులు మూతబడ్డాయి 
కట్టు గుడ్డలు కూడా చివికిపోయాయి..
పనిలోంచి పంపేశారు.. 
ఈ నెలని ఎలా దాటాలో తెలీక 
ఆకలిని కూడా చంపుకుంటున్నాం...
ఏ చీకటి చాటున 
మూడు రోజులు గడపాలో 
తెలీక ఏడ్చుకుంటున్నాం...
మూడు అంకె చిన్నదే ఐనా 
ప్రతీ నెలా ఒక మోయలేని బరువే...
కడుపు కాలితే రక్తం నన్ను 
కరుణిస్తుందనుకున్నా... సాధ్యం కావట్లేదు....
మా కోసం ఆ నింగిలోని 
చంద్రుడు కూడా మూడు రోజులు 
చీకటి ఛాలెంజ్‌ విసిరితే బాగుండనిపిస్తుంది...
నీ తల్లి నెలసరిలో 
తడిసి మెరిసి మనిషై ఎదిగిన నువ్వు 
మరో తల్లి కోసం ఆలోచించే ఛాలెంజ్‌ని 
నీ జీవితంలో ఎప్పుడూ ఒక పేజీగా తెరచిపెట్టుకో...
తిండి, నిద్ర లాంటి మరో అవసరం కోసం 
సరికొత్త ఛాలెంజ్‌తో 
అందరికన్నా ముందు నిలబడు...
ఈ దేశం, ఆ అమ్మలు 
మిమ్మల్నెప్పటికీ మరచిపోరు...
ఎవరో ఒకరు... ఒక్క ఛాలెంజ్‌...
స్టే ఫ్రీ సెక్యూర్‌ ఛాలెంజ్‌తో
మనుషులుగా ఎదగండి...
- అమూల్యచందు కప్పగంతు, విజయవాడ, 90598 24800
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)

చెమటపూలు
వాళ్ల స్వేదవస్త్రంతో ముఖం తుడుచుకుని
నగరం అందంగా ముస్తాబవుతుంది
వాళ్ల పాదస్పర్శతో నడక మార్గాలు
విశాల రహదారులవుతాయి
నగరంలో వాళ్ల కష్టం ముద్రల్లేని వీధులుండవు
వాళ్ల కర్మజలంతో నిర్మించబడని ఆకాశహర్మ్యాలుండవు
వాళ్లు నగరానికి పునాది రాళ్లు!
అభివృద్ధి కావిళ్లను మోస్తున్న భుజాలు!
సొంతూరులో కాసింత పనిపుట్టక
పొట్ట చేత్తోపట్టుకుని
కాంక్రీటు వనాలకు ఎగిరొచ్చిన సీతాకోకచిలుకలు
మాళ్ల తళుకుల్లో వాళ్ల కన్నీటి ఆనవాళ్లుంటాయి
ఊపిరిపోసుకున్న ప్రతి పరిశ్రమలోనూ
వాళ్ల ఉచ్ఛ్వాసనిచ్ఛ్వాసలుంటాయి
నగరంలో ఏ మూల ఏ అద్దాల చెట్టుమీదైనా
వాళ్లు చెమటపూలై పూస్తుంటారు
వాళ్ల రెక్కల చప్పుళ్లతో నిద్రలేచే నగరమిప్పుడు
నిశ్శబ్దం ముసుగేసుకుంది
రాళ్లెత్తిన చేతులన్నీ తలకిందకు చేరి
మబ్బులు నిండిన ఆకాశాన్ని
నిస్సహాయంగా చూస్తున్నాయి
లేడిపిల్లల్లా దూకిన కాళ్లన్నీ
ఖాళీడొక్కల్లోకి మునగదీసుకుని
ఉసూరుమంటూ పడుకున్నాయి
ఒత్తులేసుకున్న కళ్లు ఎంతకీ మూతలుపడవు
మన్నుతిన్నపాముల్లా రోజులు ఎంతకీ కదలవు
వదిలివచ్చిన పండుటాకుల్నీ చిగురాకుల్నీ
తలచుకుని కన్నీరవ్వని పూటేలేదు
ఇప్పుడా పునాదిరాళ్లకింత ఆసరా కావాలి
నిశ్శబ్దం ముసుగుతీసి నగరం నవ్వుతూ పిలిచేదాకా
శ్రమ సీతాకోకల రెక్కలకింత సాయం కావాలి
దేశం తలుపులు తెరచుకునే వరకైనా
ఆకలి కొండచిలువ వాళ్లను మింగేయకుండా చూడాలి
గూడు విడిచి సుదూరాలకు తరలివచ్చిన
వలస పిట్టలకింత ధైర్యాన్ని వసపట్టాలి
శిశిరం మరలిపోయే వరకూ
నగరంలో పూసే చెమటపూలపై
కాసింత మానవత్వాన్ని చిలకరిస్తూ
వాడిపోకుండా చూసుకోవాలి!
- సాంబమూర్తి లండ, ఒంకులూరు, శ్రీకాకుళం, 96427 32008


ప్రోత్సాహక బహుమతి (2)

రేపటి నెత్తుటిగుడ్డు మనిషి..
ఏ టెక్టానిక్‌ పలకల సర్దుబాటో
ఊపిరిపై అనుమానంతో
ప్రతీ ఊరూ కొత్తగా సరిహద్దులు
దిద్దుకుంటూ, మెటామార్ఫిక్‌ దశలో 
ఒక్కో నూతన దేశం
చుట్టూ తిరుగాడే నీడలకు
మాత్రమే కాదు
సొంత నీడకు
కొత్త రంగులు అద్దాలని
మనిషి చేస్తున్న ఓ అనివార్య యుద్ధం 
పల్లెకూ అడవికీ ప్రవేశం నిషేధించి
ప్రాణవాయువుకై అల్లాడుతున్న
సామ్రాజ్యాలు నగరాలు
చిత్రకారుడెవరో ఆనవాలు లేదు
రహదారులన్నీ శ్మశానాలకు దారిమళ్లించి
విషాదచిత్రం గీస్తున్న దృశ్యం.
ఏమయిందో ఎవరికీ తెలియదు
అతని రంగుల సంచీ.
ఇంద్రజాలికుడెవరో
వేషంలో నిజరూపం కప్పుకున్నాడు
ఇళ్లన్నీ కదలికలు లేని
ఏ పిచ్చుకలూ వాలని
ఏ పచ్చదనం తాకని
పూవుల వాత్సల్యమే సోకని
నవ్వులు పూయని
సామూహిక సమాధులుగా
ఆధునాతన మయసభలను చేశాడు
గాయకుడెవరో తెలియదు
ఓ భయానక బీభత్సాన్ని
కరోనారాగంలో
మృత్యుగీతాలు ఆలపిస్తూ
ఉన్మాదై వీధుల్లో తిరుగుతున్నాడు
ఏ వ్యాపార మోహమో
భూమాత అవయవాలన్నీ
నరికి తునకలుజేసీ
ఆకాశంలో అదృశ్య తీగలకు
వేలాడదీసిన వాడెవ్వడో..
అడవి గుండెల మీద వాలి
లోహపు ముక్కులతో కుళ్లబొడుస్తున్న
ఆ వికృతాకారం ఎక్కడిదో..
శిలువలు, స్వస్తిక్‌లు, అర్ధచంద్రాకారాలు..
శిలాఫలకాలు, కిరీటాలు, జెండాలు...
ఆయుధాగారాలు, యుద్ధవిహంగాలు..
దిష్టి బొమ్మలై కాపాలా కాస్తున్న మృత్యుగుహ
ఇప్పుడు భూగోళం 
మనిషిని ఆల్చిప్పల్లోకి
పంపుతున్న నేలతల్లి
రేపు ఉషోదయంలో
నెత్తుటి గుడ్డుగా ఆవిష్కరిస్తుంది.
- గాజుల శ్రీధర్, నాగోల్‌న్యూ, హైదరాబాదు 9849719609


ప్రోత్సాహక బహుమతి (3)

మానవుడు - చిరంజీవి
ఎంత కాలమైంది 
ఇలా రాత్రుళ్లు డాబాపై 
కుటుంబమంతా కలిసి 
ఆరుబయట నక్షత్రాలేరుకొని.... 
డొంక దారిలో 
అంతుచిక్కని పాదముద్రలు 
విలుప్తజాతుల ఉనికిని తేల్చి 
పసివాళ్లయిన ప్రకృతి ప్రియులు 
క్వారంటైన్‌ భయాల దుమ్ముదులిపి 
బక్కరైతు బయల్దేరాడు 
ఆకలి తూరుపు మీద 
మెతుకుపొద్దు మొలిపించడానికి 
స్టెతస్కోప్‌ మెడను ధరించి....
లాఠీలు లాఘవంగా ఝుళిపిస్తూ... 
మురికిని నిలువునా కడిగేస్తూ 
డాక్టర్లు.. రక్షకభటులు.. పారిశుద్ధ్య కార్మికులు.. 
కరోనా మృత్యురథం ముందు నిలిచి 
యుద్ధభేరి మోగిస్తున్నారు 
హజ్‌ యాత్రకు పోగేసిన పైకం 
దేవుని పెళ్లికి దాచిన ధాన్యం 
పేదల కడుపునకు అమృతమయ్యెను 
ఖండాలంటూ.. దేశాలంటూ 
కులమతజాతి భేదాలంటూ 
మనసుల మధ్యన మొలచిన గోడలు 
వైరస్‌ దెబ్బకు నిలువునా కూలాయి 
ఎల్లలు మొత్తం చెరిపి
మృత్యువు సాక్షిగా ఎదిగి వచ్చింది 
విశ్వమానవ సోదరతత్వం 
ఊరకరావు ఉత్పాతాలు 
మొండి ప్రశ్నలకు జవాబులవుతూ 
మనిషికి నేర్పుతాయి మనుగడవేదం 
వందేళ్లకో.. వెయ్యేళ్లకో.. 
ఫ్లూనో..ప్లేగో, కలరా లేదా కరోనా 
వస్తుంటాయి.. పోతుంటాయి.. 
మనిషి మాత్రం ఆశాజీవి 
పడుతూ.. లేస్తూ.. పాఠాలవుతూ 
జ్ఞానపతాకం గుండెన మోస్తూ 
శ్రమాయుధంతో సాధన చేస్తూ 
సూర్యచంద్రులకు స్వాగతమిస్తూ.... 
విశ్వపథాన మానవుడు...
నిత్య చైతన్య శీలి.. చిరంజీవి.
- మహమ్మద్‌ రఫీ, పోరుమామిళ్ల, కడప జిల్లా, 7981446601


ప్రోత్సాహక బహుమతి (4)
కలాలు గళాలు విప్పుతున్నాయి 
కంటికి కనిపించని పురుగు 
కల్లోలం సృష్టిస్తుంటే 
గాయాలే వేదనా గేయాలై 
పురుడోసుకుంటున్నాయి
విశ్వమంతా నిరాశానిర్వేదాల 
వలలో చిక్కుకుంటే
కలాలే కవాతు చేస్తూ 
చైతన్య గళాలు విప్పుతున్నాయ్‌
అనంతమైన ఆకాశాన్ని 
నమ్మకమనే చిన్ని రెక్కలతో
ఈదిన బుజ్జి పిట్ట 
స్ఫూర్తి సిరా పోస్తోంది 
కాలి చెప్పుతో అణగదొక్కినా 
ప్రతికూల పరిస్థితులు భయపెట్టినా 
రాయి అయినా మట్టి అయినా 
రెక్కలు విప్పుకుని మొలకెత్తిన
అంకురం ఆత్మస్థైర్యం పాఠం చెబుతోంది
అవయవాలు పనిచేయని హాకింగ్స్‌ 
అంతర్జాతీయ ఖ్యాతి పొందినప్పుడు 
అన్నీ ఉండి స్వీయ సంకెళ్లు వేసుకుని 
సామాజిక దూరం కవచం కింద 
దేశ భక్తి చాటుకోవడం సమస్యేం కాదు
జగతి వెలుగు కోసం ఎడిసన్‌ 
పలుమార్లు ప్రయత్నించినప్పుడు
సమాజ క్షేమం కోసం సబ్బుతో 
పదే పదే కడుక్కోవడం కష్టం కాదిప్పుడు 
వేదనా గీతాలు వేకువ వెలుగులయ్యే సమయం వచ్చిందిప్పుడు 
- నామని సుజనాదేవి, కరీంనగర్, 7799305575


ప్రోత్సాహక బహుమతి (5)

అవలోకనం..
నెల గడుస్తోందప్పుడే, పెద్దాయనొచ్చి
రేపట్నుంచన్నీ బంద్‌ అని చెప్పెళ్లిపోయాడు
ఇంతకీ, నాకు తెలవకడుగుతున్నా
ఎందుకొచ్చింది బావా పాడురోగం మనూరికి 
సగం జీతంతో బతకటమెలాగో నేర్పటానికా
ఆకలికీ ఆశకీ అంతరమెంతో చూపించటానికా
సగం చచ్చిన రైతుని సంపెయ్యటానికా
ఆకలి నీకు తోబుట్టువని పేదోడికి గుర్తుచెయ్యటానికా 

అశలనీ, ఆశయాలనీ రెక్కలకి కట్టుకుని
ఎగిరెళ్లే చదువుల పావురాలని ఆపేస్తున్నట్టు
ఎటో తెలియకున్నా అదేపనిగా పరిగెడుతున్న దూడపిల్లల్ని
గుంజకి కట్టి అసలు నీ దారెటని గుంజేస్తున్నట్టు 
ముట్టంటూ మూలన కుర్చోపెడితే
నాకెలాగుంటుందో తెలుసా అని
మా అక్క నన్ను నిలదీసినట్టు
మైలంటూ దూరం పెడితే ఇలా ఉంటుందని
పైనింట్లో పుట్టిన నాకోసారి తెలియజెప్పినట్టు
చీకటి విలాసాల మత్తులో చిందులుతొక్కి సోయితప్పి పడున్న
ఈ దేశపు భవితని కాలర్‌ పట్టుకుని అడగడానికి
కారా కిళ్లీ మరకలతో, బీడీ పీకల అచ్చులతో
మందుసీసాల గబ్బు కంపుతో వెలిసిపోయిన మన వీధులకి
కాసిన్ని పాచినీళ్లు జల్లి, 
ముగ్గెట్టుకోండెహే అని గదమడానికొచ్చిందా
ఏలుకోమని ప్రకృతి కాంతని నీకిచ్చి పంపితే
అడవి పడుచు చీరకొంగుకి నిప్పెడతావా అని
భూమాత పంచాయితీ కోసం 
పిలుచుకొచ్చిన పెద్దమనిషిలాగా
నువ్వనుకోవాలే గానీ నిజాయతీగా పాలించడం
అంత నెప్పా అని ప్రభుత్వాన్ని నిలదియ్యటానికి
నువ్వచ్చేసుకున్న చిత్తుకాగితాల విలువెంతో
లెక్క సరిచూసుకోమని రెట్టించడానికొచ్చిందా
నాలాటి రాతిగుండెని కూడా కరిగించి
నాలుగు అక్షరపు చినుకులు కురిపించడానికా
ఎందుకొచ్చింది బావా పాడురోగం మనూరికి
ఇదిగో నేను చెబుతా విను...
చిమ్మ చీకట్ల వెనకాలే నువ్వు నమ్మకపోయినా సరే
వెలుగుల లాంతరు పట్టుకుని మరీ సూరీడు వస్తాడనీ
అజ్ఞానపు దుప్పటి కప్పుకుని ఆదమరిచి నేను నిద్దరోతున్నవేళ
అదిగో సరిగ్గా అప్పుడే, నా చెవిలో చెప్పెళ్లిపోయింది....
అది చెప్పటానికే వచ్చిందంట బావా!
- తంగెళ్ల రాజగోపాల్, అమలాపురం, 8639536092


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష