కరోనాపై కదనం - ఏప్రిల్‌, 26 పోటీ ఫలితాలు

  • 1576 Views
  • 28Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి

పచ్చని చెట్టొకటి కావాలి
కుళ్లి కంపు కొడుతున్న వాతావరణంలో
గుప్పెడు ప్రాణవాయువుల పూలు పూసే
పచ్చని చెట్టొకటి కావాలి
కరోనా క్రిమిని అమాంతం గొంతు నులిమి
మెలితిప్పి పట్టపగలే ఉరి తీసి
మనుషుల్ని స్వతంత్రులు చేసే
పచ్చని చెట్టొకటి కావాలి
నిజమే.. ఇదంతా మనిషి స్వయంకృతాపరాధమే
ప్రకృతిలో గతి తప్పిన
కల్మష రహిత వాయువులు
చేతులారా చెరుపుకున్న చక్కని పాడిపంటలు
సుఖాల మోజులో తుడిచేసిన
పరిసరాల ఆకుపచ్చని దృశ్యాలు
ఎడారి పర్రలుగా మారిన కీకారణ్యాల మధ్య
నాకు పచ్చని చెట్టొకటి కావాలి
సప్తనదీ సంగమంలా భాసించిన జీవ వైవిధ్యాన్ని
చినుకు చినుకుగా పీల్చేసుకున్న రాక్షసత్వాన్ని
అంతం చేసి వసుధలో కొత్త కాన్వాసుపైన
కొత్తకాంతులై భవ్య జీవనచిత్రం గీసి
సౌమ్యనస్య శాంతిగీతం రచించడానికి
పచ్చని చెట్టొకటి కావాలి
సాగుతున్న నరమేధం నుంచి
మానవజాతికి నూతన జవజీవాలు అందించే
పచ్చని చెట్టొకటి కావాలి
వలస కూలీల ఒంటికప్పు ఆకాశాన్ని
నిర్మలంగా నిత్య నూతనంగా ఉంచడానికి
పచ్చని చెట్టొకటి కావాలి
ఓజోన్‌ పొర తన చిరుగుల్ని
మళ్లీ కలిపి కుట్టుకోడానికి
నేలపొరల్లో ఇంకిపోయిన
ప్రాణాంతక రసాయనాలను పైకి తోడి
పైరు పంటల పచ్చదనాన్ని కాపాడే 
పచ్చని చెట్టొకటి కావాలి
శ్మశానాలు తిరస్కరించిన శవాల సాక్షిగా
కరోనా సమాధిపై దిట్టంగా నాటడానికి
పచ్చని చెట్టొకటి కావాలి
ఆరోగ్య సంజీవని లాంటి కల్పతరువుగా భాసిల్లే
పచ్చని చెట్టొకటి కావాలి
- ఈతకోట సుబ్బారావు, నెల్లూరు, 9440529785
ఈ కవితను వినాలనుకుంటే...ద్వితీయ బహుమతి

రైతు కష్టం..
ప్రసవానికి పుట్టింటికచ్చిన పెద్దబిడ్డ లెక్కనె
ఫాల్గుణమాసంలో పాల్వోసుకున్న వరికంకి..
ఉగాది పండగ ముందే అచ్చినట్లు
సూత్తెనె కడుపు నిండినట్టైతది 
బాయిలగుండు బైటవడ్డదాక పయిలంగుండాలని.. 
తుమ్మ కింది మష్షెమ్మకు ముడుపు దీసిగట్న 
గాలివానకు కరావ్‌ గాదాయె, రేటుగూడ నయంగనే వుండె 
పోరి లగ్గానికి సావ్కారి కాడ దెచ్చిన అప్పు 
కాయితం గీసారి ఎట్లైన కతమయిద్దనుకున్న 
పదినెలలు మోసి కన్నంక బాలింత రోగమచ్చినట్టు 
ఆర్నెల్ల సెమటకష్టం అమ్ముకునేలోపె
దాని కడుపుల మన్నువొయ్య, మాయదారి రోగంవంట
గొర్లమంద మీద తోడేల్లెక్క దున్కింది
బూతంలెక్కనె బయపెట్టవట్టింది 
అందరి బత్కులు ఆగంజేసింది
నెలరోజులపొద్దాయె
సూసి సూసి పానం ఇసికె 
కల్లంల గింజ కల్లంలనే వుండె
తిండి తిప్పల్లేక గావరగాబట్టె 
ఆనెప్పుడొత్తదో ఏమొ, టార్పెన్లు గూడ లేవాయె 
లారస్తె బస్తల్‌ రావాయె, బస్తలొస్తె లారీ రాదాయె 
నా వంతెప్పుడస్తదో తెల్వదాయె 
ఎర్రటెండకు పానం గాయిగాయి గాబట్టె
తీర మనంతు రాంగనె తాలు తరుగని, 
తేమ తరుగని రైతు గుండె కొయ్యబట్రి
ఎంతైనా చివరాకరికి రైతునే దొంగను జెయ్యబట్రి 
సర్కారు ఉదారంగనె సేస్తుండె,
కాని గీ మజ్జెలోల్ల దోపిడి బాగాయె
అప్పుల దెవులాటోపక్క,
గీ రోగం దెవులాటోపక్క
ఏదేమైనా ముందల పానం నిమ్మలం సేసుకోవాలె 
సర్కార్‌ జెప్పేది మన బతుకు కోసమేగ
మన జేగర్తలొ మనముండాలె 
మూతికి తువ్వాలు తప్పక గట్టుకోవల్నంట
మునుపటి లాగ ఉషిర్ల లెక్క 
ఒక్క తాన ముసురుకొని ముచ్చెట్లు పెట్టొద్దంట
రేకల్వారంగ మోటలు కట్టి పుట్లకు పుట్లు పండిచ్చినోల్లం
గీ కష్టం మనకో లెక్కా?
ముందు బతుకుదాం, బలుసాకు తర్వాతైనా తిందాం
కల్లంల గత్తరజేయక,
ఎన్క ముందైనా నిమ్మళంగ అమ్ముకుందాం 
పదో, పర్కోఅస్తె పక్కోడికీ గింత సాయపడుదాం
పరిస్తి ఎప్పుడు గిట్లనే వుండదుగా
మనుసులకు మనుసులేగ ఆదుకునేది
గీ గండంనుంచి అందరం సల్లగ బైటవడ్తే
నల్లపోశెమ్మకు బోనంబెడ్దాం
గా దయ్యంకంట్లె బడకుండా
దిష్టి తీసి దట్టికడ్దాం
- తుల శ్రీనివాస్, నకిరేకల్, నల్లగొండ, 9948525853
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి

గడప లోపల ఇంత బాగుంటుందా...
తులసికోటలో దీపం గుడి
పెరట్లోని ఆకుకూరల మడి
ఆరుబయట సన్నజాజుల సడి
నవ్వుతూ పలకరిస్తుంటే మెల్లగా తెలిసింది
నాతోపాటు ఇంట్లో ఇంతమంది ఉన్నారని!
మల్లెపూల మాలకు రెండేసి మొగ్గలందిస్తూ
ఆమె పక్క కూర్చునపుడు ఆ వేలి మెలికల్లోని సిగ్గు
తన ఎర్రటి చెక్కిలిపై పరిమళిస్తోంటే ప్రేమగా తెలిసింది
గడప లోపల ఇంత బాగుంటుందని.!
చదువు బరువుల్లేని భుజాల్ని
తనివితీరా నిమురుతుంటే తెలిసింది,
ఆటపాటలకు నోచుకోని పసిప్రాణాలు
అలసిమరీ దొర్లుతుంటే తెలిసింది,
అమ్మభాషకు దూరమైన నేటి చదువులు
బామ్మ చెప్పే రామాయణ, భారతాలకు పరవశిస్తోంటే తెలిసింది
ఈ మధురమైన బాల్యమంతా దూరం చేస్తున్నామని
కొత్తావకాయ ముద్దల్ని పేరుపేరున నోట్లో పెడుతుంటే
గమ్మత్తుగానే తెలిసింది
సగంపైన రోగాల్ని జయించే రోగనిరోధకశక్తిని
ఇంటి తిండే ఇచ్చిందని!
మరచిపోయిన గవ్వల చప్పుడు
ఈ గువ్వల చేతిలోంచి జారి
నాట్యం చేస్తుంటే మళ్లీ తెలిసింది
జీవితమే ఓ వైకుంఠపాళి అని!
లోకం తెలియని చిట్టితల్లుల మధ్య చిత్రంగానే తెలిసింది
దారంతా చిన్నపాములతోపాటు
కరోనాలాంటి పెద్దపాములూ వస్తుంటాయని!
మెలకువతో ఆడితే
గండం దాటించే నిచ్చెన్లూ వుంటాయని.!!
ఇంటిని మించిన యుద్ధక్షేత్రం ఇంకొకటేదీ లేదని
చాలా బాగా తెలిసింది
చూపుకు దొరకని ఈ క్రిమిని
సమూలంగా రూపుమాపడానికని.!!
దిక్కుతోచని పొట్టల్ని నింపడానికి లెక్కలేనన్ని చేతులు
పరిగెడుతుంటే గొప్పగా తెలిసింది
కనిపించే మనిషి చాటున ఇంకో మనిషి దాగున్నాడని
మానవత్వమే అతడి చిరునామా అని.!
ఈ ఉరుకులపరుగుల్లో జారవిడుచుకున్న
బతుకులోని ఇన్ని జీవన మాధుర్యాలను,
మరుగునపడ్డ ఆనవాళ్లను వెలికితీసి
గెలుస్తామన్న నమ్మకాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన
ఈ కాసిన్ని రోజుల్నీ
అపురూప కథలుగా మలచాలని ఉంది
అందమైన కథలుగా చెప్పాలని ఉంది
కచ్చితంగా కంచికి చేరే ఈ కరోనా కథ చుట్టూనే
ఈ కథలన్నీ పేర్చాలని ఉంది.
- శివాజీ సలాది, సీతానగరం, 9848989823
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)

జ్ఞానోదయం
పరుగులు తీసే అడుగులకు
ఇంటి చేనులో అనురాగపు విత్తులు
ప్రేమతో నాటడం నేర్పాం,
హద్దులు దాటే రెక్కలకు
ఇంటి పంటపై మమతల చినుకులుగా
చల్లగా రాలడం నేర్పాం,
ఆకాశంలో విహరించే
ఊహల మేఘాలను చెదరగొట్టి
వాస్తవాలను నట్టింట్లో పరచడం నేర్చాం,
మట్టిలో బందీయై మొలకెత్తడం మొదలుకొని
జీవితపంట చేతికొచ్చేవరకు
రైతులా ఓర్పుతో చూసుకోవడం నేర్చాం,
చెమటపాదాలు ఎలా నడుస్తాయో
ఆకలి మంట ఎలా కాలుతుందో
హృదయద్వారాలు తెరిచి చూశాం,
రహదారుల కొమ్ములు వంచేశాం
కాలుష్య కోరలు పీకేశాం
మిగిలింది ప్రకృతి గీసిన హద్దులు నేర్వడమే!
బతుకుయుద్ధంలో వెన్ను చూపక
ఉన్నోడు లేనోడు ఒక్కటై సైనికుల్లా కదంతొక్కాం,
సంసారసాగరంలో మనసు తెరచాపలు నేర్పుగా కట్టి
ఒడుపుగా ఒడ్డుకు చేరడం నేర్చుకున్నాం,
కులమతాలు ఎప్పటికైనా కొట్టుకుపోయేవేనని
ప్రాణం మీదికి వచ్చాక తెలుసుకున్నాం,
మనుషులే తోటి మనుషులను ఆదుకునేదని
మానవత్వం చూపి నిరూపించాం!
ఎంత జ్ఞానాన్ని పెంచుకున్నామో
అంతా లోకానికి తిరిగిచ్చెయ్యాలని,
జ్ఞానమే యుద్ధానికి ముగింపు పలుకుతుందని
జ్ఞానోదయమై ఎదురుచూస్తున్నాం!
- పుట్టి గిరిధర్, మహబూబ్‌నగర్, 9491493170


ప్రోత్సాహక బహుమతి (2)

ఆశ
ఆయన ఆశయాలు నా ఆశలను జయిస్తున్నా 
ఎప్పుడూ విజేతగా నేనే నిలుస్తుంటాను
ఆయన విజయం నా విజయం కదా..
సామాన్యునికి మంచివైద్యం అందించాలని
ఆయన ఆశయం
ఇంటి లాన్లో ఆయనతో కలిసి 
రోజూ సాయంత్రం కాఫీ తాగాలని నా చిన్ని ఆశ..
ఇప్పుడు ఆసుపత్రే ఆయనకు ఇల్లయ్యింది
దూరంగా ఆ గోడల వెనక ఆయన...
పీపీఈ కిట్‌లో వ్యోమగామిలా
కరోనా నుంచి రక్షణ కవచం..
కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం..
ఎన్నాళ్లయిందో ఇంట్లో అందరం దగ్గరగా కూర్చుని 
సంతోషాన్ని పంచుకుని..
అక్కడ,
అంతటా ఎగురుతున్న తెల్లపావురాలు
నిర్మల హృదయాలు నిండైన అభయాలు
సాగరమథనపు విషానికి వెరువని ధీరులు
అమృతం పంచుతున్న తెల్లకోటు దేవుళ్లు
ఆసుపత్రిలో కోవిడ్‌ పేషంట్‌ డిశ్చార్జ్‌-
మళ్లీ వినిపించాయి-
అందరం ఒక్కటై కొట్టిన ఆ చప్పట్లు
ఒకటే ధ్యేయం కసితీరా కరోనాపై విజయం
ఈ రోజు చిన్నారి పుట్టినరోజు-
వీడియో కాల్‌ శుభాకాంక్షలు...
పాపకి బర్త్‌ డే గిఫ్ట్‌లా.. కరోనాపై విజయాలు
నవతరం నవజీవనానికి చిగురిస్తున్న ఆశలు...
ఇల్లయిన ఆసుపత్రిలో ఆయన అందరికీ రక్షణ
మీకు లాగే, ఇప్పుడిల్లే మాకు రక్షణ
మావాడెలా ఉన్నాడో- 
అత్తగారి ఆరాటం
బానే ఉంటాడు లే-
మామయ్యగారి అనునయం
వీడియో కాల్‌ మాట్లాడతావా-
చిన్నారి ముద్దు మాటల ధైర్యం
వినవస్తోన్న వార్త...
ఎందుకో మనసంతా ఆందోళన
వైద్యులపై దాడి...
ప్రాణాలను సైతం లెక్కచేయని వైద్యసేవకులపై దాడి-
మీకూ తెలియాలి 
ఆ తెల్లకోటు వెనకాల ఓ హృదయముంది
ఆ హృదయానికి సేవ చేయాలనే ఓ తపన వుంది
మీకు లాగే- ఆయనకూ ఓ కుటుంబం ఉంది...
ఇప్పుడు చిన్ని ఆశ చిన్ని ఆశే
ఆసుపత్రి గేటు దాటి ఇంటిదారిన వినిపిస్తున్న ఆ చిరునవ్వే
బతుకు పట్ల చిగురిస్తున్న ఆశ-
చిన్నారి బంగారు భవిష్యత్తుకి భరోసా ఇస్తున్న ఆశ
ఇపుడు నాదైన ఆశ
నిజమే కదా -
ఎపుడూ విజేతగా నేనే నిలుస్తుంటాను
(వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు నమస్కారాలతో)
- అశోక్‌ గుంటుక, మెట్‌పల్లి, 9908144099


ప్రోత్సాహక బహుమతి (3)

తిరోగమన చక్రం
చక్రం కనిపెట్టి
చక్రం తిప్పిన చరిత్ర తిరోగమిస్తున్న వేళ
మూడు చక్రాలు ముందుకు దొర్లక
ముద్ద దిగని బతుకులు
ముసిరిన చీకట్లలో
మహా యుద్ధం చేస్తున్నాయి
పెనుసుకుంటున్న రుణ భారాలు
కన్నీరై ద్రవించి
ఆకలి పెనుంపై ఆవిరి పొగలవుతున్నాయ్‌
పొలానికి బరువెక్కిన పంటను
పదిలంగా పట్నం చేర్చి
పొట్టపోసుకునే ఆటో పిచ్చుకలు
కరోనా తరంగాల ధాటికి
దిగులు కుప్పలవుతున్నాయి
అందరి తల్లో నాలుక
తడియారి పిడచగడుతుంటే
దాహం తీరే దారి కోసం
దారులు వడకడుతుతున్నాయ్‌
కసిరి కొట్టే ఖాకీ మాటల్లో
కనిపించని లాలిత్యం
కలసిరాని కాలంలో
కదలొద్దని బుజ్జగిస్తున్నాయి
దూరాలను దగ్గర చేస్తే
ప్రేమించిన మనుషులు
దూరం దూరం అంటుంటే
నాలుగు వేళ్లు వెనక్కి పోతున్నాయ్‌
అందరి బరువులు దించిన చేతులు
సాయపు చినుకుల కోసం
ఆర్తిగా ఆకాశం చూస్తున్నాయి
దేశం గాని దేశం నుంచి
దాపురించిన పురుగు
రోడ్డును నమ్ముకున్న వాణ్ని
రోడ్డుపాలు చేస్తుంటే చేసేదేముంది
చెప్పినట్టు చేతుల్ని
ఖాళీ కంచాల్లా తళ తళలాడిస్తున్నాం
మూతికి మాస్కులేసి
ఆకలిని మభ్యపెడుతున్నాం
కానీ రోజులు రోడ్డు రోలరులై
మీదకొస్తుంటే
ఇల్లు పిగలక బిక్కరిస్తున్నాం.
- నల్లు రమేష్, పోలిరెడ్డి పాళెం, నెల్లూరుజిల్లా, 9989765095


ప్రోత్సాహక బహుమతి (4)

వాళ్లే లేకుంటే!
కరోనా, మబ్బులు కమ్మినప్పటి చీకటి... ఎన్నో రోజులుండదు
అయితే మనుషులను పోగొట్టుకుంటున్న సృష్టిదీ దురదృష్టమే
సృష్టి ధర్మాల్ని కాలరాస్తున్న మనిషికీ నష్టమే
ఎంతైనా మనిషికి మనిషే సాటి
అలాంటి మనుషుల్లో సాటిలేని మనుషులూ ఉంటారు
వాళ్లే లేకుంటే... పగలూ రాత్రి ఒకటైపోతుంది
ఇప్పటిలానే తారీఖులు నేలరాలిపోతాయి
మాస్కులున్నా ముక్కులు తెరుచుకోవు
జీవనాడుల్లాంటి వీధుల్లో పదఘట్టనలు వినిపించవు
మూత్రనాళాల్లాంటి మురికి కాలువలు మూసుకుపోతాయి
చివరికి ముసుగుదన్ని పడుంటుంది నగరం
వాళ్లు రహదార్లకు చేతులిస్తారు
మురికి కాలువలకు కాళ్లిస్తారు
కళ్లతో చెత్తను గురిచూసి కొడతారు
చెత్తా చెదారంపై చీపుర్లతో ధిక్కార స్వరం వినిపిస్తారు
అవి దుర్వాసనలతో కాయగాచిన గుండెలు
వాళ్లే పారిశుద్ధ్య కార్మికులు
వ్యాధి పుటమరించిన ఈ సంఘర్షణ సంక్షోభంలోనూ
భయాల్లాంటి క్షణాల్లోనూ
ప్రాణాల్ని పూచికపుల్లగా చేసి
ఊడ్చిన చోటును మనసారా చూసి ఊపిరిపీల్చుకుంటారు
దుమ్ము తుడిచేసిన కళ్లజోడులా ఉంటుంది నగరం
మనం సహకరిస్తే మరింత అందంగా ఉంటుంది
చేసే పని బతుకుతెరువుకైనా
చేసేది చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి
చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది
వాళ్లు కోరుకునేది కేవలం
మనం నడుస్తున్న దారిలో వాళ్లు కనిపించాలని
కాస్త గౌరవం గుర్తింపు దక్కాలని
దూరంగా ఉండి దాటాల్సిన ఈ కష్ట కాలంలో
మనమూ లాక్‌డౌన్‌ చెయ్యాల్సినవి కొన్నున్నాయి
మనసుల్ని బోన్సాయ్‌లుగా మార్చిన కులమతాల్ని
ప్రమాద హెచ్చరికలు దాటిపోతున్న కాలుష్యాన్ని
కాలుష్యాన్ని మించిపోతున్న అవినీతిని
క్వారంటైన్‌కు పంపాలి మనం
ఇవంటుకోకుండా మానవత్వమనే శానిటైజర్‌ పూసుకుని
మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవాలి.
- శాంతయోగి యోగానంద, తిరుపతి, 9110770545


ప్రోత్సాహక బహుమతి (5)

నల్లద్దాల తెరతీస్తే
కొన్ని జీవితాలు
గూడు లోపల
నీడను పట్టుకొని
గత కాలపు స్మృతుల
మకరందాన్ని ప్రీతితో తవ్వుకుంటూ
పారవశ్యంలో ఓలలాడుతుంటే
ఇంకొన్ని జీవితాలు
ఆటల కెరటాలపై గంతులు వేస్తూ
అంతులేని ఆనందపు లోతులను
అందుకునే పన్నీటి సంద్రంలో
మునుగుతుంటే
మరికొన్ని జీవితాలు
జిహ్వ చాపల్యాన్ని నెత్తినెట్టుకుని
గడ్డకట్టుకుపోయిన రుచుల సంగమాన్ని
కరగదీసుకుంటూ
కాలం కడవలో చల్లబడుతుంటే
ఇవేవి పట్టని మరెన్నో జీవితాలు
డొక్కను డోలుగా చేసి
కన్నీటిని కర్రగా మలిచి
ఆకలి వాయిద్యంతో
విలాపగీతాలు వినిపిస్తూ
మూరెడు అర్రలో మూలుగుతున్నాయి
ఈ జీవితాలు నేసిన రోడ్డే
తాళం వేయబడి
బతుకు దారిని మూసేస్తుంటే
మన కళ్లకు పెట్టుకున్న
నల్లద్దాల తెరను
పక్కకు జరిపితే
కనిపించేవి
ఉబికి వచ్చే కన్నీటి ఆర్తనాదాల ఊటబావులే
మనం చేయాల్సిందల్లా
కాసింత కరుణతో నిండిన
పిడికెడు గవ్వలను జల్లి
బడుగుల బతుకులను
అతలాకుతలం చేస్తున్న
ఉప్పెనను శాంతింపజేసి
మానవత్వపు
కేతనాన్ని ఎగరేయడమే !
- గుండేటి రమణ, బొమ్మెన, జగిత్యాల, 9949377287


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష